ఏపీజీవీబీ బ్యాంకు 493 శాఖలు జనవరి 1 నుంచి టీజీబీలోకి
రూ.30 వేల కోట్ల నుంచి 70 వేల కోట్లకు చేరనున్న బ్యాంకు టర్నోవర్
928 శాఖలతో దేశంలో అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా టీజీబీ: చైర్‌పర్సన్ వై.శోభ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) శాఖలన్నీ జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ)లోకి విలీనం కాబోతున్నాయి. ‘ఒక రాష్ట్రం– ఒక గ్రామీణ బ్యాంకు’అనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న ఏపీజీవీబీ 493 శాఖలను విలీనం చేయనున్నారు. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన ఏపీజీవీబీ 771 శాఖలతో సేవలు అందిస్తోంది. అప్పటికే తెలంగాణలో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకును రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్పుచేసి శాఖలను విస్తరించారు. ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ బ్యాంకు 435 శాఖలతో 18 జిల్లాల్లో సేవలు అందిస్తోంది. ఏపీజీవీబీ తెలంగాణ శాఖల విలీనం తరువాత తెలంగాణలోని 33 జిల్లాల్లో 928 శాఖలుగా టీజీబీ రూపాంతరం చెందనుంది.
అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా..
ఏపీజీవీబీ తెలంగాణ శాఖల విలీనం తరువాత టీజీబీ దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా అవతరించనున్నదని బ్యాంక్ చైర్‌పర్సన్ వై.శోభ తెలిపారు. విలీన ప్రక్రియ తుదిదశకు చేరిన సందర్భంగా టీజీబీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రూ.30 వేల కోట్ల టర్నోవర్‌తో ఉన్న టీజీబీ... విలీనం తరువాత రూ.70 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుతుందన్నారు.
విలీన ప్రక్రియలో భాగంగా ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగుల ఆప్షన్ల ప్రక్రియ వంటివన్నీ కొలిక్కివచ్చినట్లు తెలిపారు. విలీనం నేపథ్యంలో ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకు సేవల్లో కొంతమేర అంతరాయం కలుగుతుందని, అయితే ఖాతాదారుల అత్యవసర సేవల కోసం 30, 31 తేదీల్లో వారి ఖాతాల నుంచి రూ.5 వేల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. జనవరి 1 నుంచి ఖాతాదారులకు సేవలన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇక ఏపీజీవీబీ శాఖలకు చెందిన ఖాతాదారులు వారి ఏటీఎం కార్డులు మార్చుకునేందుకు, యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను తిరిగి పొందేందుకు ఒకటో తేదీ నుంచి మారిన టీజీబీ శాఖల్లో సంప్రదించాలని కోరారు. అలాగే ఏపీజీవీబీ ఖాతాదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత చెక్కులు, డీడీలు వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు చెల్లింపులకు, క్లియరింగ్ సేవలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మీడియా సమావేశంలో బ్యాంకు జీఎంలు సుధాకర్, చంద్రశేఖర్, లక్ష్మి, భారతి, రమేష్, ఏజీఎం సుశాంత్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment