ఖాతాదారులతో మాట్లాడుతున్న పోలీసులు
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ఖాతాదారులందరికీ న్యాయం చేసేందుకే విజిలెన్స్ అధికారులతో పాటు సీబీఐ అధికారులు, బ్యాంకు అధికారులు కృషి చేస్తున్నారని.. ఎలాంటి భయాయందోళనలకు గురికావొద్దని విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అజీజ్ నగర్‌లో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేసేంత వరకు బ్యాంకును తెరవొద్దంటూ ఆందోళన నిర్వహించారు. 30 రోజులు గడిచినా బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు మేనేజర్ రాంమోహన్ రావును బ్యాంకు తెరవకుండా అడ్డుకున్నారు.
దీంతో ఈ విషయాన్ని మేనేజర్.. ఆర్‌ఎం రవీందర్ రెడ్డికి తెలపడంతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్‌ఎంతో పాటు విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు విచ్చేసి ఆందోళన చేస్తున్న ఖాతాదారులతో మాట్లాడి నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో బ్యాంకును తెరిచి సిబ్బంది యథావిధిగా పనులను కొనసాగించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు మాట్లాడుతూ బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎక్కడికీ పోవని.. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ బ్యాంకులో 126 మంది ఖాతాదారుల నుంచి డబ్బులు రూ. 8.94 కోట్లు మాయమైనట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సోమవారం నుంచి నెల రోజుల్లో ఖాతాదారులందరి ఖాతాలను పూర్తిగా పరిశీలించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. 13 చోట్ల దాడులు నిర్వహించారని.. అజీజ్ నగర్‌లో రెండు చోట్ల దాడులు చేయడం జరిగిందన్నారు. మొయినాబాద్ పోలీసులు సీఐ సునీతా, ఎస్సై నయిమోద్దీన్‌లు, సిబ్బందితో భద్రత నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment