రూ.50 వేలు ఫోన్‌పే చేస్తే వదిలేస్తామంటూ
సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
బొంరాస్‌పేట: ‘హలో..ఆప్ కా బేటా రేప్ కేస్ మే మిల్‌గయా. ఛోడ్‌దేనా బోలేతో పచాస్ హజార్ అర్జెంట్ పే కరో.. నైతో జైల్‌మే దాల్‌దేతే’.. (నీ కొడుకు అత్యాచార ఘటనలో దొరికాడు. అతడిని విడిచిపెట్టాలంటే వెంటనే రూ.50 వేలు ఫోన్ పే చేయండి. లేదంటే జైలులో వేస్తాం) అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌తో ఓ తండ్రి భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో తోచక పక్కనున్న తన సన్నిహితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకొని ఫోన్ కట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా రేగడిమైలారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్యామలయ్యగౌడ్ స్థానికంగా కిరాణదుకాణం నడిపిస్తున్నాడు. ఇతని చిన్న కొడుకు సత్యనారాయణగౌడ్ భార్యాపిల్లలతో హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 10.38 గంటలకు శ్యామలయ్యగౌడ్‌కు ఓ నంబరు నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. నీ కొడుకు ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో దొరికాడని చెప్పాడు.ఫోన్‌లో పోలీస్ వాహనాల సైరన్ వినిపిస్తూ సత్యనారాయణను అరెస్టు చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశాడు.
హడలిపోయిన శ్యామలయ్యగౌడ్ వెంటనే పక్కనున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. సైబర్ నేరగాళ్లుగా అనుమానించిన ఆయన పోలీస్‌స్టేషన్ వివరాలు అడగగా అవతలి వ్యక్తి పరుషపదజాలంతో తిట్టాడు. దీంతో ఫేక్ అని భావించి ఫోన్ కట్ చేశాడు. ఆ వెంటనే సత్యనారాయణకు ఫోన్ చేయగా, తాను ఆఫీసులో ఉన్నానని తండ్రికి చెప్పాడు. కొడుకుతో వీడియోకాల్ మాట్లాడిన తర్వాత తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫోన్‌కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment