telangana grameena bank
-
షట్టర్ పగలగొట్టి.. గ్యాస్ కట్టర్‌తో లాకర్ తెరిచి..
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు సినీ ఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు. మొహాలు కనపడకుండా బొమ్మ మాస్కులు.. వచ్చీ రాగానే సీసీ కెమెరాల ధ్వంసం, డీవీఆర్ రికార్డర్ తొలగింపు, అలారం మోగకుండా వైర్ల కటింగ్, బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ లోని లాకర్‌ను తెరిచేందుకు గ్యాస్ కట్టర్ వాడకం, పోలీసులకు చిక్కకుండా ఆనవాళ్ల చెరిపివేత వంటి చర్యలతో పక్కాగా ప్లాన్ చేశారు. లాకర్‌ను తెరిచే క్రమంలో మంటలు చెలరేగి నగదు కాలిపోవడంతో చివరకు అందులోని రూ. 4.15 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించారు. పక్క భవనం ద్వారా...: బస్సాపూర్ మీదుగా వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారికి 20 మీటర్ల దూరంలో ఉన్న ఓ భవనం మొదటి అంతస్తులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉంది. మొదట దొంగలు బ్యాంకు పక్కనే ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించారు. ఎవరికీ కనిపించకుండా బీఎస్ఎన్ఎల్ ప్రహరీకి ట్రాక్టర్ కేజ్వీల్ను తీసుకెళ్లి అడ్డం పెట్టారు. ప్రహరీకి రంధ్రాలు కొట్టి కార్యాలయ ఆవణలోకి ప్రవేశించిన దొంగలు... అక్కడి నుంచి కుర్చీ వేసుకొని బ్యాంకు మొదటి అంతస్తు మెట్లపైకి ఎక్కారు. ముందుగా సీసీ కెమెరాలను, తర్వాత షట్టర్ తాళాలను పగలగొట్టి షట్టర్‌ను ఒక అడుగు మేర పైకెత్తి లోపలకు ప్రవేశించారు. బ్యాంకులోని అలారం మోగాకుండా వైర్లు తెంపారు. సీసీ కెమెరాల డీవీఆర్‌ను తొలగించాక గ్యాస్ కట్టర్‌తో లాకర్‌ను ముక్కలుగా కట్ చేశారు. అయితే ఈ క్రమంలో మంటలు రావడంతో లాకర్లో ఉన్న రూ. 7.30 లక్షల (బ్యాంకు అధికారుల లెక్క ప్రకారం) నగదు కాలి బూడిదైంది. కొన్ని పత్రాలు కూడా కాలిపోయాయి. కానీ లాకర్లో చిన్నచిన్న బాక్సుల్లో మొత్తం 8 కిలోల 30 తులాల బంగారం కనిపించడంతో దాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చోరీకి గురైన బంగారం విలువ రూ. 4.15 కోట్లు ఉంటుందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. చోరీకి గురైన బంగారం రుణాల కోసం కుదువ పెట్టిందేనని చెప్పారు. బ్యాంకులోని చిన్న లాకర్‌ను కట్ చేసిన దొంగలు పక్కనే ఉన్న పెద్ద లాకర్‌ను మాత్రం ముట్టుకోకపోవడం గమనార్హం. సిలిండర్‌లో గ్యాస్ అయిపోవడం వల్లో లేక మంటలు ఎక్కువగా చెలరేగడంతో వదిలేసి వెళ్లారో తెలియరాలేదు. ఒకవేళ పెద్ద లాకర్‌ను కట్ చేసి ఉంటే అందులో వినియోగదారులు దాచుకున్న సుమారు రూ. 6 కోట్ల విలువైన బంగారం పోయేదని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నారు. ఆనవాళ్లు చెరిపేసి.. : చోరీ అనంతరం దొంగలు తమ ఆనవాళ్లు చిక్కకుండా వెంట తెచ్చుకున్న పాతగుడ్డలతో పాదముద్రలను చెరిపేసి వెళ్లినట్లు క్లూస్ టీం పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలాలు బ్యాంకు నుంచి జాతీయ రహదారి వెంట ఉన్న సోన్‌పేట్ రోడ్డు వరకు కిలోమీటర్ దూరం వరకు వెళ్లి తిరిగి బ్యాంకు వైపే వచ్చాయి. ఘటనాస్థలంలో కోతి బొమ్మ మాస్కు, హ్యాక్సా బ్లేడ్తోపాటు గ్యాస్ సిలిండర్, ఇతర పరికరాలు, ఒక హిందీ న్యూస్ పేపర్ (బరేలీ) లభించాయి. దీంతో దొంగలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకును పరిశీలించిన సీపీ..: సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది షట్టర్ పగులగొట్టి ఉండటాన్ని గమనించి మెండోరా ఎస్సై శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసు కమిషనర్ నాగరాజు అలర్ట్ బెల్ ఎందుకు మోగలేదని బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్‌గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. అలర్ట్ అలారం పనిచేస్తోందా లేదా అని టెక్నీషియన్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దొంగలు జాతీయ రహదారుల వెంబడి ఉన్న బ్యాంకుల్లో చోరీలు చేసే అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. -
రుణం ఇవ్వాలని అడిగిన పాపానికి..
సాక్షి, భీమిని(ఆదిలాబాద్) : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శుక్రవారం స్వయం సహాయక సంఘం మహిళలతో బ్యాంకు మేనేజర్ దిలీప్‌కుమార్ దురుసుగా ప్రవర్తించి ఒక సభ్యురాలిపై చేయి చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని చెన్నాపూర్ గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం మహిళలు గత రెండు వారాల నుంచి బ్యాంకుకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో మహిళా సంఘం సభ్యులు శుక్రవారం బ్యాంకుకు వెళ్లి రుణాలు త్వరగా మంజూరు చేయాలని బ్యాంకు మేనేజర్ దిలీప్‌కుమార్‌ను కోరారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపు జమ చేస్తున్నప్పటికీ రుణాలు ఇవ్వకుండా ఎందుకు తిప్పుతున్నారని ప్రశ్నించారు. దీంతో బ్యాంకు మేనేజర్‌కు, మహిళా సంఘాల సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది) బ్యాంకు మేనేజర్ దిలీప్‌కుమార్ అసభ్యపదజాలం వాడుతూ మహిళా సంఘ సభ్యురాలిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆవేదనకు గురైన మహిళలు సిబ్బందిని బ్యాంకు లోపల ఉంచి తాళం వేసి రెండు గంటల పాటు ఆందోళన చేశారు. ఏఎస్సై మజారోద్దీన్ సంఘటన స్థలానికి వెళ్లి మహిళలను సముదాయించారు. సంఘ సభ్యురాళ్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘం సభ్యులు ఏదుల సుగుణ, వీవోఏ జాడి ధర్మయ్యలపై బ్యాంకు మేనేజర్ దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై కొమురయ్య తెలిపారు. -
3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి
హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు లక్షలకుపైగా జన్‌ధన్ ఖాతాల్లో కేంద్ర సాయం కింద జమ చేసిన నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ) వెనక్కి తీసుకుంది. పొరపాటు వల్ల అనర్హుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడంతో టీజీబీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మూడు లక్షలపైగా అకౌంట్ల నుంచి రూ. 16 కోట్ల నగదును తిరిగి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్డౌన్ వేళ పేద మహిళలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద కేంద్రం మూడు నెలల పాటు రూ. 500 చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీజీబీ అధికారులు ఏప్రిల్ మొదటివారంలో జన్‌ధన్ అకౌంట్లలో మొదటి నెల నగదును జమ చేశారు. అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో 9 లక్షలకు పైగా జన్‌ధన్ ఖాతాలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది మాత్రమే రూ. 500 సాయం పొందడానికి అర్హుత కలిగి ఉన్నాయి. ఆ తర్వాత తప్పిదాన్ని గుర్తించిన బ్యాంక్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. దాదాపు మూడు లక్షలకు పైగా అకౌంట్ల నుంచి రూ. 16 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే ఇప్పటికే లక్ష మందికి పైగా అనర్హులు కూడా ఈ డబ్బును విత్ డ్రా చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసేందుకు బ్యాంక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ పొరపాటు ఎక్కడ జరిగిందనే దానిపై అంతర్గత విచారణ కూడా చేపట్టారు. ‘నిబంధనల ప్రకారం 2014 ఆగస్టు 1 తర్వాత తెరిచిన జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. కానీ పొరపాటు వల్ల అన్ని జీరో అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఈ తప్పిదాన్ని గుర్తించి రూ. 16 కోట్లు వెనక్కి తీసుకున్నాం’ అని టీజీబీ జనరల్ మేనేజర్ మహేష్ తెలిపారు. చదవండి : అన్నపూర్ణ మన తెలంగాణ : కేసీఆర్ కేసుల్లో దాపరికం లేదు: ఈటల -
మా డబ్బులు ఇస్తారా.. ఆత్మహత్య చేసుకోవాలా..?
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): మా ఖాతాల్లో డబ్బులు మాయమై సంవత్సరమవుతున్నా ఇంకా తిరిగి ఇవ్వారా.. అంటూ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు పెట్రోల్, కిరోసిన్ డబ్బాలు చేతబట్టి ఆందోళన చేశారు. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాదాపు 8.5 కోట్ల వరకు డిపాజిట్లు మాయమయ్యాయి. ఈ ఘటన జనవరిలో వెలుగుచూసింది. అప్పట్లో ఖాతాదారులు బ్యాంకు ఎదుట నిరసనలు, ఆందోళనలు చేశారు. దీంతో స్పందించిన బ్యాంకు ఉన్నతాధికారులు ఖాతాదారులకు డిపాజిట్లు త్వరలో ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కొంత మందికి డబ్బులు ఇచ్చారు. మిగతా డిపాజిట్ దారులకు ఇవ్వకపోవడంతో వారు ప్రతి రోజూ బ్యాంకు చుట్టు తిరుగుతున్నారు. సహనం కోల్పోయి వారు శుక్రవారం బ్యాంకు తెరవకుండా అడ్డుకున్నారు. శనివారం ఏకంగా పెట్రోల్, కిరోసిన్ డబ్బాలు చేతబట్టి ఉదయం 9 గంటలకు బ్యాంకు వద్ద వచ్చారు. తమ డిపాజిట్లు వెంటనే ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానమి బ్యాంకును తెరవనీయకుండా బైఠాయించారు. మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడారు. సీఐ వెంకటేశ్వర్లు ఖాతాదారులకు నచ్చజెప్పి బ్యాంకును తెరిపించారు. కాగా, ఇప్పటి వరకు దాదాపు రూ. 6 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇచ్చామని, మిగతా వారికి త్వరలో ఇస్తామని బ్యాంకు మేనేజర్ రామ్మోహన్రావు చెప్పారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వడంతో కొందరికి ఆలస్యమవుతోందని ఆయన చెప్పారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు. -
బాధితులందరికీ న్యాయం చేస్తాం
మొయినాబాద్‌రూరల్ (చేవెళ్ల): అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాచుకున్న డబ్బును బాధితులందరికీ 20 రోజుల్లో అందజేసేందుకు కృషి చేస్తానని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ మురళీమోహన్ హామీ ఇచ్చారు. బ్యాంకులో దాచుకున్న డబ్బును ఇవ్వకుండా తిప్పుకుంటున్న అధికారులకు బాధలు తెలియజేసేలా చేపట్టిన బాధితుల ధర్నా మూడు రోజుల పాటు కొనసాగింది. బుధవారం మూడవరోజు బాధితులు అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి భోజనాలు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న బ్యాంకు జనరల్ మేనేజర్ మరళీమోహన్ అజీజ్‌నగర్ గ్రామీణ బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాండులున్న వారందరికీ డబ్బులు తప్పనిసరిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరికీ అన్యాయం చేయకుండా 20 రోజుల్లో డబ్బులు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. బాధితులు, గ్రామస్తులు బ్యాంకు సేవలను యథావిధిగా కొనసాగించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో బాధితులు ధర్నాను విరమించుకున్నారు. కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ విజిలెన్స్ అధికారి కేవీఎస్ రాజు, బ్యాంకు మేనేజర్ రాంమోహన్‌రావ్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి భూపాల్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జంగయ్య, మండల కార్యదర్శి రత్నం, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, అజీజ్‌నగర్ వార్డు మెంబర్ నర్సింగ్, బాధితులు మాడి శ్రీనివాస్‌రెడ్డి, మాల్లారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, తూర్పు చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఖాతాదారులందరికీ న్యాయం చేస్తాం
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ఖాతాదారులందరికీ న్యాయం చేసేందుకే విజిలెన్స్ అధికారులతో పాటు సీబీఐ అధికారులు, బ్యాంకు అధికారులు కృషి చేస్తున్నారని.. ఎలాంటి భయాయందోళనలకు గురికావొద్దని విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అజీజ్ నగర్లో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేసేంత వరకు బ్యాంకును తెరవొద్దంటూ ఆందోళన నిర్వహించారు. 30 రోజులు గడిచినా బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు మేనేజర్ రాంమోహన్ రావును బ్యాంకు తెరవకుండా అడ్డుకున్నారు. దీంతో ఈ విషయాన్ని మేనేజర్.. ఆర్ఎం రవీందర్ రెడ్డికి తెలపడంతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్ఎంతో పాటు విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు విచ్చేసి ఆందోళన చేస్తున్న ఖాతాదారులతో మాట్లాడి నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో బ్యాంకును తెరిచి సిబ్బంది యథావిధిగా పనులను కొనసాగించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు మాట్లాడుతూ బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎక్కడికీ పోవని.. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ బ్యాంకులో 126 మంది ఖాతాదారుల నుంచి డబ్బులు రూ. 8.94 కోట్లు మాయమైనట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సోమవారం నుంచి నెల రోజుల్లో ఖాతాదారులందరి ఖాతాలను పూర్తిగా పరిశీలించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. 13 చోట్ల దాడులు నిర్వహించారని.. అజీజ్ నగర్లో రెండు చోట్ల దాడులు చేయడం జరిగిందన్నారు. మొయినాబాద్ పోలీసులు సీఐ సునీతా, ఎస్సై నయిమోద్దీన్‌లు, సిబ్బందితో భద్రత నిర్వహించారు. -
బ్యాంకులో డబ్బుల మాయంపై సీబీఐ విచారణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డబ్బులు మాయమైన కేసు సీబీఐ చేతికి చేరింది. గత నెల 30న బయటకు వచ్చిన ఈ కుంభకోణం సంచలనం సృష్టించింది. దీనిపై సీబీఐ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. డిపాజిట్ దారుల ఖాతాల్లో నుంచి బ్యాంకు అధికారులే డబ్బులు స్వాహా చేసినట్లు తేల్చారు. గత 11 సంవత్సరాలుగా బ్యాంకులో పనిచేసిన పలువురు మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది కలిసి మొత్తం పది మందిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రూ.9 కోట్ల వరకు దోపిడీ చేసినట్లు తేల్చారు. 10 మందిపై కేసు నమోదు... తెలంగాణ గ్రామీణ బ్యాంకు కుంభకోణంలో సీబీఐ అధికారులు పది మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుత బ్యాంకు మేనేజర్ మండల రవీందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ అధికారులు ప్రధాన నిందితుడు క్యాషియర్ మాడి జైపాల్‌రెడ్డితోపాటు ఇక్కడ గతంలో బ్యాంకు మేనేజర్లుగా పనిచేసిన జే.మోజస్, కె.లక్ష్మినర్సయ్య, కె.చంద్రయ్య, జి.శ్రీనివాసరావు, రాజన్న, వీవీజే రామారావు, ప్రస్తుత అకౌంటెంట్ సి.గురుప్రసాద్, తాత్కాలిక ప్రాతిపధికన స్వీపర్‌గా పనిచేస్తున్న మాడి శ్రీనివాస్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. వీరితోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంత మంది ప్రైవేటు వ్యక్తులపై సైతం కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం, బుధవారం సీబీఐ అధికారులు బ్యాంకును సందర్శించి పలు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వేర్వేరుగా విచారించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన సూత్రదారి క్యాషియర్... అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు కుంభకోణంలో బ్యాంకు క్యాషియర్ జైపాల్‌రెడ్డి ప్రధాన సూత్రదారి అని తేలింది. 2010 నుంచి 2018 జనవరి వరకు బ్యాంకు క్యాషియర్‌గా జైపాల్‌రెడ్డి పనిచేశాడు. అయితే మొదట్లో ఖాతాదారులు బ్యాంకులో డబ్బులు జమచేస్తే వారికి సరైన రశీదు ఇచ్చేవాడు. కానీ డబ్బులు మాత్రం ఖాతాలో వేయకుండా తన అవసరాలకు వాడుకునే వాడు. ఇలా మొదలైన ఈ వ్యవహారం ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ మొదలు పెట్టాడు. బ్యాంకులో డిపాజిట్ చేసిన కోట్ల రూపాయలకు నకిలీ రశీదులు, బాండ్లు ఇచ్చేవాడు. డిపాజిట్‌దారులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని వస్తే తానే ఇచ్చావేడు. ఇలా ఖాతాదారుల సొమ్మును అడ్డగోలుగా తన అవసరాలకు వాడుకునేవాడు. ఈ వ్యవహారానికి బ్యాంకు మేనేజర్, ఇతర సిబ్బంది సహకరించారు. -
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీ యత్నం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఆదివారం అర్థరాత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుక గోడకు రంధ్రం వేసి దుండగులు లోనికి ప్రవేశించారు. లాకర్ తెరిచేందుకు ప్రయత్నించగా అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో దుండగులు పరారయ్యారు. సోమవారం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది చోరీ యత్నాన్ని గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
బ్యాంక్ దోపిడీకి యత్నం.. గాల్లోకి కాల్పులు
బ్యాంక్ దోపిడీకి యత్నించిన దొంగలు స్థానికుల అప్రమత్తతతో అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటపడి తరమడంతో.. దుండగులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మొయినాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అజీజ్‌నగర్ బ్రాంచిలో కొందరు దుండగులు చోరీకి ప్రయత్నించారు. రాత్రి ఒంటి గంటల సమయంలో తాళాలు పగలగొడుతున్న సమయంలో ఇద్దరు యువకులు వారిని ప్రశ్నించగా.. అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా.. దుండగులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై విచారణకు రెండు బృందాలను నియమించారు. ఇది అంతర్రాష్ట్ర దొంగల పనా మరెవరైనానా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సాయంతో దొంగలు అసలు ఎటు పారిపోయారో తెలుసుకుంటున్నారు. -
బ్యాంక్ దోపిడీకి యత్నం.. గాల్లోకి కాల్పులు
-
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి యత్నం
రాయికల్: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించిన సంఘటన కరీంనగర్ జిల్లా రాయికల్ మండంలోని అల్లీపూర్లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. అల్లీపూర్లో ఉన్న బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి ప్రవేశించి చోరీకి యత్నించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. స్ధానికులు గుర్తించి బ్యాంకు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్యాంకులో చోరీకి యత్నం
సారంగపూర్ : కరీంనగర్ జిల్లా సారంగపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది. దొంగలు బ్యాంకు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. గొడ్డళ్లతో లాకర్లను పగలగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ అవి తెరుచుకోక పోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. బ్యాంకు తలుపులు పగలగొట్టి ఉండటం మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులు బ్యాంకులో ఏమైనా వస్తువులు, డబ్బు చోరీ చేశారా అనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు.