
పెట్రోల్, కిరోసిన్ డబ్బాలతో ఖాతాదారుల ఆందోళన
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): మా ఖాతాల్లో డబ్బులు మాయమై సంవత్సరమవుతున్నా ఇంకా తిరిగి ఇవ్వారా.. అంటూ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు పెట్రోల్, కిరోసిన్ డబ్బాలు చేతబట్టి ఆందోళన చేశారు. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాదాపు 8.5 కోట్ల వరకు డిపాజిట్‌లు మాయమయ్యాయి. ఈ ఘటన జనవరిలో వెలుగుచూసింది. అప్పట్లో ఖాతాదారులు బ్యాంకు ఎదుట నిరసనలు, ఆందోళనలు చేశారు. దీంతో స్పందించిన బ్యాంకు ఉన్నతాధికారులు ఖాతాదారులకు డిపాజిట్లు త్వరలో ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కొంత మందికి డబ్బులు ఇచ్చారు. మిగతా డిపాజిట్ దారులకు ఇవ్వకపోవడంతో వారు ప్రతి రోజూ బ్యాంకు చుట్టు తిరుగుతున్నారు.
సహనం కోల్పోయి వారు శుక్రవారం బ్యాంకు తెరవకుండా అడ్డుకున్నారు. శనివారం ఏకంగా పెట్రోల్, కిరోసిన్ డబ్బాలు చేతబట్టి ఉదయం 9 గంటలకు బ్యాంకు వద్ద వచ్చారు. తమ డిపాజిట్లు వెంటనే ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానమి బ్యాంకును తెరవనీయకుండా బైఠాయించారు. మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడారు. సీఐ వెంకటేశ్వర్లు ఖాతాదారులకు నచ్చజెప్పి బ్యాంకును తెరిపించారు. కాగా, ఇప్పటి వరకు దాదాపు రూ. 6 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇచ్చామని, మిగతా వారికి త్వరలో ఇస్తామని బ్యాంకు మేనేజర్ రామ్మోహన్‌రావు చెప్పారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వడంతో కొందరికి ఆలస్యమవుతోందని ఆయన చెప్పారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు.

ఖాతాదారులతో మాట్లాడుతున్న పోలీసులు