Depositers
-
సహారా డిపాజిటర్లకు గుడ్‌న్యూస్: చెల్లింపుల ప్రక్రియ షురూ.. ఫస్ట్ వారికే..
న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌లో ఉందని, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
‘కొంప’ముంచిన ‘కార్తికేయ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సహకార చట్టాలను చట్టుబండలు చేస్తూ కొన్ని కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలు ఖాతాదారుల కొంప ముంచేస్తున్నాయి. కాకినాడ జయలక్ష్మి మ్యూచువల్లీ కోఆపరేటివ్ బ్యాంకు రూ.560 కోట్లకు బోర్డు తిప్పేసి, సుమారు 20 వేల మంది ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టిన వ్యవహారం మరచిపోకుండానే మరో సంస్థ అయిన కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ డిపాజిటర్ల సొమ్ములు తిరిగి ఇవ్వకుండా దాటవేస్తోంది. దీంతో వారందరూ లబోదిబోమంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ సొసైటీకి 300 మందికి పైగానే డిపాజిటర్లు ఉన్నారు. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఉన్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన సుమారు 100 మంది డిపాజిటర్లు తాము మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. నగరంతో పాటు కోనసీమలో నాలుగైదు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, మెట్ట ప్రాంతం, తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాలకు చెందిన వారు ఈ సొసైటీలో డిపాజిట్లు చేశారు. పదిహేనేళ్ల క్రితం కాకినాడ ప్రధాన కూడలి నూకాలమ్మ ఆలయానికి సమీపాన సహకార రంగంలో కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఏర్పాటైంది. ఇది డిపాజిట్ల రూపంలో రూ.12 కోట్లు సేకరించింది. రూ.5 కోట్ల వరకూ రుణాలూ ఇచ్చింది. మెచ్యూరిటీ గడువు తీరినా.. ఇక ఈ డిపాజిట్లలో రూ.10 కోట్ల డిపాజిట్ల గడువు తీరిపోయింది. డిపాజిటర్లను రేపు మాపు అని బ్యాంకు సిబ్బంది నాలుగైదు నెలలుగా తిప్పి పంపేస్తున్నారు. దీంతో బాధితులు జిల్లా సహకార అధికారులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్వీఎస్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యాన ప్రాథమిక విచారణ జరిగింది. సొసైటీ ఇచ్చిన రుణాల్లో రూ.4.50 కోట్లకు సంబంధించి తనఖా కింద ఎటువంటి డాక్యుమెంట్లూ లేవని తేలింది. సొసైటీ ఆడిట్ కూడా ప్రైవేటు ఆడిటర్లతో నిర్వహిస్తున్నారు. మరోవైపు.. డిపాజిటర్లు సహకార అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ, డిపాజిట్లు, రుణాలకు సంబంధించిన రికార్డుల కోసం సహకార శాఖ సమన్లు జారీచేసినా సొసైటీ నిర్వాహకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సహకార శాఖ విచారణకు ఆదేశించింది. డిపాజిట్లు సరిచూసుకోవాలి డిపాజిటర్లు తమ సొమ్ము సొసైటీ ఖాతాలో డిపాజిట్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. సొసైటీ వద్ద విచారణాధికారి అందుబాటులో ఉన్నారు. సొమ్ము డిపాజిటర్ల ఖాతాలో జమకాకుంటే చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, జిల్లా సహకార అధికారి, కాకినాడ రూ.7.80 లక్షలు డిపాజిట్ చేశాం కార్తికేయ సొసైటీలో నేను, నా భార్య కలిసి రూ.7.8 లక్షలు డిపాజిట్ చేశాం. నాలుగేళ్ల పాటు వడ్డీ ఇచ్చారు. ఏడాది నుంచి ఇవ్వడంలేదు. సమాధానం కూడా చెప్పడంలేదు. దీనిపై నగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. – సజ్జాద్ హుస్సేన్, బాధితుడు, నగరం రూ.44 లక్షలు డిపాజిట్ చేశాం ప్రలోభాలకు గురిచేసి మాతో ఈ బ్యాంకులో డిపాజిట్ చేయించారు. నగరం నుంచి సుమారు రూ.7 కోట్లు డిపాజిట్ చేశారు. మా కుటుంబ సభ్యులు రూ.44 లక్షలు డిపాజిట్ చేశాం. బాధ్యులపై చర్యలు తీసుకుని, మా సొమ్ములు మాకు ఇప్పించాలి. – అన్వర్ తాహిర్ హుస్సేన్, బాధితుడు, నగరం -
హైటెక్ దందా.. బోర్డు తిప్పేసిన సంకల్ప్ మార్ట్!
మోర్తాడ్(బాల్కొండ): నిత్యావసర సరుకులు, ఎర్రచందనం మొక్కల వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభాల్లో వాటా పొందవచ్చని, ఉన్నంతలో మనమూ కూడా ఆర్థికంగా ఎదగవచ్చని నమ్మించి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంకల్ప్ మార్ట్ సంస్థ బోర్డు తిప్పేసింది. రూ. వెయ్యి నుంచి ఎంత మొత్తమైనా పెట్టుబడి పెడితే రోజువారీగా కొంత ఆదాయం డిపాజిట్‌దారుల ఖాతాల్లో జమ చేస్తామని నమ్మించిన సంస్థ ప్రతినిధులు ఇప్పుడు ముఖం చాటేయడంతో సదరు సంస్థలో పెట్టుబడి పెట్టినవారు లబోదిబోమంటున్నారు. కాగా, విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న సంకల్ప్ మార్ట్ సంస్థకు మోర్తాడ్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రతినిధులుగా వ్యవహరించారు. దాదాపు నాలుగు వందల మందితో రూ. 50లక్షల వరకు డిపాజిట్ చేయించారు. సంస్థలో పెట్టుబడి పెట్టినవారికి ఆన్లైన్లో లాగిన్ కావడానికి ఐడీ, పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసి ఇచ్చారు. కొంత మందికి మొదట్లో రూ. వెయ్యి నుంచి రూ. 1,500ల వరకు లాభాలు వచ్చాయని నమ్మించి ఖాతాల్లో జమ చేయించారు. ఇలా లాభాలు పొందినవారి పేర్లు చెబుతూ తమ ఖాతాదారుల సంఖ్యను భారీగా పెంచుకున్నారు. కొన్ని రోజులపాటు సంస్థ ఆన్లైన్ లాగింగ్ పనిచేయగా గత నెలాఖరులో లాగిన్ పనిచేయడం స్తంభించింది. ఆన్లైన్లో లాగిన్ పనిచేయకపోవడంతో పెట్టుబడి పెట్టినవారికి అనుమానం వచ్చి సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. సంస్థ యజమానిగా చలామని అవుతున్న వ్యక్తి అరెస్టు అయ్యాడని అతను బైలుపై బయటకు రాగానే సంస్థ కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని ప్రతినిధులు నమ్మిస్తున్నారు. డిపాజిట్లు చేసిన వారు తమ సొమ్ము వాపసు చేయాలని సంస్థ ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయింది. ప్రశ్నించినవారు ‘రిమూవ్’.. సంస్థలో చేరిన వారితో ప్రతినిధులు ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. గ్రూపులో సంస్థ కార్యకలాపాలు ఎందుకు నిలిచిపోయాయి, తమ సొమ్మును ఎవరు వాపసు ఇస్తారు.. తమను చేర్పించిన ప్రతినిధులే బాధ్యత వహించాలని కొందరు సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఇలా ప్రశ్నిస్తున్న వ్యక్తులను వాట్సాప్ గ్రూప్ నుంచి సంస్థ ప్రతినిధులు తొలగిస్తున్నారని బాధితులు వాపోయారు. మరి కొందరు మాత్రం మున్ముందు ఏమైనా సమాచారం రావచ్చనే ఉద్దేశంతో వాట్సాప్ గ్రూప్‌లో ఉండిపోయారు. ఇదిలా ఉండగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన సంస్థ ఎలాంటిదో యజమానులు ఎలాంటివారో తమకు తెలియదని బాధితులు చెబుతున్నారు. తమకు సదరు సంస్థపై నమ్మకం కలిగించి తమతో పెట్టుబడి పెట్టించినవారే డబ్బులు వాపసు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ముద్ర అనే సంస్థ డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేయగా ఇప్పుడు సంకల్ప్ మార్ట్ సంస్థ అదే కోవలో బోర్డు తిప్పేయడంతో అమాయకులు మోసపోయారు. -
అగ్రిగోల్డ్‌లో ఉన్న డబ్బంతా కష్ట జీవులదే..: సీఎం జగన్
-
నిధుల సమస్య నో!!
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నేటి సాయంత్రం నుంచి అన్ని బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించనుంది. నిధులపరమైన సమస్యలేమీ లేవని, బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి సర్వీసులన్నీ అందుబాటులోకి వస్తాయని సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న ప్రశాంత్ కుమార్ తెలిపారు. ‘అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకున్నాం. మా ఏటీఎంలలో పుష్కలంగా నగదు నిల్వలు ఉంచాం. అలాగే, శాఖలన్నింటికీ తగినంత స్థాయిలో నగదు సరఫరా ఉంది. కనుక.. బ్యాంక్‌కు సంబంధించి నిధులపరంగా ఎలాంటి సమస్యా లేదు. ఇతరత్రా బైటి నుంచి సమీకరించాల్సిన అవసరమైతే లేదు. కానీ ఒకవేళ అవసరమైనా కూడా తక్షణం తగినంత స్థాయిలో నిధులను సమకూర్చుకోగలిగే మార్గాలు ఉన్నాయి‘ అని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం మారటోరియం ఎత్తివేశాక.. ఖాతాదారులు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సర్వీసులను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మారటోరియం వ్యవధిలో నిర్దిష్ట పరిమితి రూ. 50,000 స్థాయిలో విత్‌డ్రా చేసుకున్న వారి సంఖ్య.. మొత్తం ఖాతాదారుల్లో మూడో వంతు మాత్రమే ఉండవచ్చని కుమార్ చెప్పారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసిన ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ చీఫ్ అశుతోష్ ఖజూరియాతో పాటు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. 13 రోజుల్లోనే పరిష్కారం.. యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థల తోడ్పాటుతో 13 రోజుల్లోనే సంక్షోభం పరిష్కారమైనట్లు కుమార్ చెప్పారు. యస్ బ్యాంక్‌ను గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి 5న సుమారు నెల రోజుల పాటు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించింది. ఈ వ్యవధిలో రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేకుండా ఆంక్షలు విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటరుగా ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. మరోవైపు, బ్యాంకులోకి పెట్టుబడులు వచ్చేందుకు చర్యలు తీసుకుంది. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం ఎనిమిది బ్యాంకులు యస్ బ్యాంక్‌లో రూ. 10,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అత్యధికంగా రూ. 6,050 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రికవరీపై ఆశలు... ముందు జాగ్రత్త చర్యగా సందేహాస్పద ఖాతాలన్నింటినీ క్యూ3 ఆర్థిక ఫలితాల్లో పొందుపర్చినందున యస్ బ్యాంక్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కుమార్ చెప్పారు. మొండిబాకీలకు సంబంధించి ప్రొవిజనింగ్‌ను 42 శాతం నుంచి పెంచి.. 72 శాతం పైగా చేశామని, మార్చి త్రైమాసికంలో రూ. 8,500–10,000 కోట్ల దాకా రికవరీలు అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. డిపాజిట్లు, రుణాల్లో 60 శాతం వాటాను రిటైల్ విభాగం నుంచి రాబట్టాలంటూ తమ సిబ్బందికి సూచించినట్లు ప్రశాంత్ తెలిపారు. యస్ బ్యాంక్‌కు ప్రస్తుతమున్న మొండిబాకీల్లో 90 శాతం పైగా బాకీలు డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో జతయినవే కావడం గమనార్హం. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 36,764 కోట్ల మేర మొండిబాకీలు పెరిగాయి. డిసెంబర్ క్వార్టర్లో స్థూల మొండిబాకీలు రూ. 40,709 కోట్లకు, ప్రొవిజనింగ్ రూ. 29,594 కోట్లకు పెరిగాయి. మరోవైపు, షేర్లపై లాకిన్ విధించడాన్ని సవాలు చేస్తూ రిటైల్ ఇన్వెస్టర్లు యస్ బ్యాంకు, ఆర్బీఐలపై కోర్టుకు వెళ్లనున్నారన్న వార్తలపై రజనీష్, ప్రశాంత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అలాగే ఇకపైనా పొదుపు ఖాతాలపై అధిక స్థాయిలో వడ్డీ చెల్లిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమివ్వకుండా దాటవేశారు. మరోపక్క, యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో 7.97% వాటా కొనుగోలు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ 7.97%, యాక్సిస్ 4.78 %, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.98 శాతం, ఫెడరల్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్ చెరి 2.39%, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 1.99% వాటాలు కొనుగోలు చేశాయి. ఒక్క షేరూ విక్రయించం: రజనీష్ మూడేళ్ల లాకిన్ వ్యవధి పూర్తి కాకుండా యస్ బ్యాంకులో ఒక్క షేరు కూడా విక్రయించబోమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 42 శాతం వాటాలు తీసుకున్నామని, రెండో విడత ఫండింగ్‌లో దీన్ని 49 శాతానికి పెంచుకోనున్నామని ఆయన చెప్పారు. మూడో రోజూ షేరు జోరు... యస్ బ్యాంక్ షేర్ జోరు కొనసాగుతోంది. బ్యాంక్ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మూడీస్ అప్‌గ్రేడ్ చేయడంతో మంగళవారం యస్ బ్యాంక్ షేర్ 58% లాభంతో రూ.58.65కు చేరింది. ఇంట్రాడేలో 73% లాభంతో రూ.64కు ఎగసింది. 3 రోజుల్లో 134%లాభపడింది. -
డిపాజిట్లకు మరింత రక్షణ
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. త్వరలో ఇది మరింత భద్రంగా మారనుంది. ప్రస్తుతం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమాను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై చెల్లింపుల్లో విఫలమైతే... అప్పుడు ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు సంక్షోభం పాలవడంతో ఆ బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేసుకున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిపాజిటర్ల ఆగ్రహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై వెళ్లిన సందర్భంగా స్వయంగా చవి చూశారు కూడా. ఆర్బీఐ సైతం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని బలంగా చాటాయి. దీంతో కేంద్ర సర్కారు ఈ అవసరాన్ని గుర్తించడంతోపాటు అమలు దిశగా చర్యలు చేపట్టింది. ఈ శీతాకాల సమావేశాల్లో బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా పెంపునకు చట్టాన్ని తేనున్నట్లు మంత్రి సీతారామన్ రెండు రోజుల క్రితమే వెల్లడించారు. అయితే, ఎంత మొత్తానికి ఈ పెంపు అన్న విషయాన్ని ఆమె చెప్పలేదు. రెండు రకాలు..: బ్యాంకు డిపాజిట్లను రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. రిటైల్ డిపాజిట్ దారులకు రూ.లక్ష బీమాను రూ.5 లక్షలకు చేయనుండడం ఒకటి కాగా, హోల్‌సేల్ డిపాజిట్‌దారులకు ఈ మొత్తాన్ని రూ.25 లక్షలుగా చేయడం రెండోది. చివరిగా 1993 మే 1న డిపాజిట్లపై బీమాను సవరించారు. 1992లో జరిగిన సెక్యూరిటీస్ స్కామ్ దెబ్బకు బ్యాంక్ ఆఫ్ కరద్ మూతపడటం నాడు డిపాజిట్లపై గరిష్ట బీమాగా ఉన్న రూ.30,000 మొత్తాన్ని రూ.లక్షకు పెంచడానికి కారణమైంది. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం మరో విడత సవరణ అవసరాన్ని గుర్తు చేసింది. అయితే, డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచితే బ్యాంకులు చెల్లిస్తున్న ప్రీమియం కూడా పెరుగుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మరో రెండు రకాల ప్రతిపాదనలను కూడా పరిశీలించొచ్చని విశ్వసనీయ సమాచారం. పెంచిన మేరకు డిపాజిట్లపై బీమా మొత్తాన్ని బ్యాంకులు సహజంగానే చెల్లించాలి. దీన్ని డిపాజిట్‌దారుల నుంచే వసూలు చేయొచ్చన్నది మరో ప్రతిపాదన. ఆర్బీఐ అనుబంధ విభాగమైన డీఐసీజీసీ విడిగా ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, పీఎంసీ బ్యాంకు తరహా సంక్షోభాల్లో చెల్లింపులకు వినియోగించడం మరొక ప్రతిపాదన. వీటిల్లో ఏది ఆచరణ రూపం దాల్చనుందనేది అతిత్వరలోనే తెలిసే అవకాశం ఉంది. రూ.10 లక్షలు చేయాలి.. బ్యాంకు డిపాజిట్లపై బీమాను రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ఆర్బీఐ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ‘‘డిపాజిట్లపై బీమాను కనీసం రూ.10 లక్షలు చేయాలని గతంలో సూచించాం. మరోసారి దీన్ని పరిశీలించాలని కోరుతున్నాం’’ అని అఖిల భారత రిజర్వ్ బ్యాంకు ఉద్యోగుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. డాలర్ మారకంలో చూసుకుంటే రూ.10 లక్షల బీమా 14,000 డాలర్లకు సమానమని, చాలా దేశాల్లో ఉన్న బీమా కంటే ఇది ఎంతో తక్కువ మొత్తమని సంఘం పేర్కొంది. -
కష్టాల కడలిలో ఎదురొచ్చిన నావలా...
సాక్షి, గరుగుబిల్లి (విజయనగరం): బిడ్డల చదువులు.. పిల్లల పెళ్లిళ్లు..తదితర అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఉన్నంతలో రూపాయి, రూపాయి కూడబెట్టి ..కాస్త ఎక్కువ రాబడి వస్తుందన్న ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడి పెట్టిన ఎంతోమంది నిలువునా మునిగిపోయారు. లాభాలు ఇస్తుందనుకున్న ఆ సంస్థ అర్ధంతరంగా బోర్డు తిప్పేయడంతో వేలాదిమంది డిపాజిటర్లు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అపారంగా ఆస్తులున్నా పొదుపరులకు ఆ సంస్థ ఒక్క పైసాకూడా విదల్చలేదు. ఆదుకుంటామని చెప్పిన గత టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆ సంస్థకు చెందిన విలువైన ఆస్తులను కబళించేందుకు కుయుక్తులు పన్నారే తప్ప... బాధితుల గోడు పట్టించుకోలేదు. చివరకు కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఒక దశలో న్యాయం జరుగుతుందని ఆశించి, నాటి పాలకులు ఏదో చేస్తారనే భ్రమపడిన బాధితులు వారు చెప్పిన విధంగా గత ఏడాది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ వివరాలు అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేయించిన ఎంతోమంది ఏజెంట్లు బాధితుల వేదనలు వింటూ, వారి ఛీత్కారాలు భరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కొంతమంది బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. నేనున్నానంటూ... కష్టాల కడలిలో చిక్కుకుపోయినవారికి గట్టున చేర్చే నావ ఎదురొచ్చినట్లుగా.. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నాంటూ కనిపించారు. రాష్ట్రంలో ప్రజాసంకల్పయాత్ర చేసిన సమయంలో ఆయనకు అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము మోసపోయిన తీరును వివరించారు. వారి ఆవేదనను అర్ధం చేసుకున్న జగన్ మోహన్‌రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే మేలు చేస్తారనిని హమీ ఇచ్చారు. ఈ మేరకు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కోసం రూ.1,150 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా రూ.20వేల లోపు డిపాజిట్లు వేసిన వారందరికీ ప్రభుత్వ పక్షాన చెల్లింపులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అఖండమైన ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ఆయన పాదయాత్రలోను, ఎన్నికల సమయంలోను ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్లను చెల్లించేందుకు వైఎస్సార్సీపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేయలేని పనిని సీఎంగా పదవి చేపట్టిన కొద్ది రోజులలోనే జగన్ మోహన్‌రెడ్డి చేయడంపై బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముప్పతిప్పలు పెట్టారు.. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం చేయమని కోర్టు చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సరికదా బాధితులను పోలీస్స్టేషన్లకు, కోర్టులకు రమ్మంటూ ముప్పతిప్పలు పెట్టారు. ఆఖరికి ఎన్నికల సమయంలోనైనా చేస్తారనుకుంటే అగ్రిగోల్డ్ ఆస్తులను కబళించే ప్రయత్నం చేశారే తప్ప బాధితుల గోడు వినలేదు. ఆ సమయంలో పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల వేదన విన్న జగన్మోహన్రెడ్డి ..ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా రూ.20 వేల లోపు డిపాజిట్లు వేసిన వారందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేయడం అభినందనీయం. - ఉరిటి రామారావు, వైఎఆర్సీపీ మండల కన్వీనర్,గరుగుబిల్లి. న్యాయం జరగలేదు పిల్లల చదువులు,పెళ్లిళ్లి కోసం అగ్రిగోల్డ్ సంస్థలో దాచుకొన్న సొమ్ములను తిరిగి ఇప్పించడంలో కోర్టులు కూడా ఏమీ చేయలేకపోయాయి. ఆ సంస్థకున్న ఆస్తులు ఏమయ్యాయో కానీ బాధితులు మాత్రం బాధల్లోనే ఉన్నారు. సీఎం జగన్ రూ.20 వేల లోపున్న డిపాజిట్లను చెల్లిస్తానని చెప్పడం బాగుంది. – మండల శంకరరావు, ఎంపీటీసీ సభ్యుడు, తోటపల్లి -
మా డబ్బులు ఇస్తారా.. ఆత్మహత్య చేసుకోవాలా..?
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): మా ఖాతాల్లో డబ్బులు మాయమై సంవత్సరమవుతున్నా ఇంకా తిరిగి ఇవ్వారా.. అంటూ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు పెట్రోల్, కిరోసిన్ డబ్బాలు చేతబట్టి ఆందోళన చేశారు. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాదాపు 8.5 కోట్ల వరకు డిపాజిట్లు మాయమయ్యాయి. ఈ ఘటన జనవరిలో వెలుగుచూసింది. అప్పట్లో ఖాతాదారులు బ్యాంకు ఎదుట నిరసనలు, ఆందోళనలు చేశారు. దీంతో స్పందించిన బ్యాంకు ఉన్నతాధికారులు ఖాతాదారులకు డిపాజిట్లు త్వరలో ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కొంత మందికి డబ్బులు ఇచ్చారు. మిగతా డిపాజిట్ దారులకు ఇవ్వకపోవడంతో వారు ప్రతి రోజూ బ్యాంకు చుట్టు తిరుగుతున్నారు. సహనం కోల్పోయి వారు శుక్రవారం బ్యాంకు తెరవకుండా అడ్డుకున్నారు. శనివారం ఏకంగా పెట్రోల్, కిరోసిన్ డబ్బాలు చేతబట్టి ఉదయం 9 గంటలకు బ్యాంకు వద్ద వచ్చారు. తమ డిపాజిట్లు వెంటనే ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానమి బ్యాంకును తెరవనీయకుండా బైఠాయించారు. మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడారు. సీఐ వెంకటేశ్వర్లు ఖాతాదారులకు నచ్చజెప్పి బ్యాంకును తెరిపించారు. కాగా, ఇప్పటి వరకు దాదాపు రూ. 6 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇచ్చామని, మిగతా వారికి త్వరలో ఇస్తామని బ్యాంకు మేనేజర్ రామ్మోహన్రావు చెప్పారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వడంతో కొందరికి ఆలస్యమవుతోందని ఆయన చెప్పారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు. -
హీరా గోల్డ్ ఛైర్మన్ నౌరాహ్ షేక్ అరెస్ట్
-
హీరా గోల్డ్ ఛైర్మన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హీరా గోల్డ్ ఛైర్మన్ షేక్ నౌహీరా భేగం మంగళవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కువ శాతం వడ్డీ చెల్లిస్తామని వినియోగదారులకు ఎర వేస్తూ హీరా గోల్డ్ దేశవ్యాప్తంగా వందల కోట్లు డిపాజిట్లు సేకరించింది. హైదరాబాద్, తిరుపతి బెంగళూరు, ముంబైలతో పాటు పలు రాష్ట్రాల్లో హీరాగోల్డ్ పై కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 16 కంపెనీల పేరుతో భారీ మోసం జరిగిందని గుర్తించిన పోలీసులు 160 బ్యాంకుల్లోని అకౌంట్స్‌తో ఈ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. నౌరా షేక్ అరెస్ట్ తో లక్షలాది మంది డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హీరా..మరో అగ్రిగోల్డ్ కానుందా? -
హీరా..మరో అగ్రిగోల్డ్ కానుందా?
చిత్తూరు, మదనపల్లె టౌన్: ఆర్థిక లావాలదేవీల పేరిట ఆశ చూపించడం.. ఆ తర్వాత ఖాతాదారులు ముంచి బోర్డు తిప్పేయడం అక్రమార్కులకు పరిపాటిగా మారింది. రాష్ట్రంలో ఇలాంటి తరహా మోసాన్ని అగ్రీగోల్డ్ బాధితులు ఇప్పటికే చవిచూశారు. తాజాగా హీరా గ్రూప్ సంస్థ తన డిపాజిట్ దారులను నిలువునా ముంచేసింది. జనం ఆశనే.. పెట్టుబడిగా పెట్టి ఏకంగా 600 కోట్లు కొల్లగొట్టిన వైనం బట్టబయలైంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు ఈ విషయంలో పెద్దఎత్తున నష్టపోయినట్లు తెలుస్తోంది.కలకడలో వెలుగు చూసిన కుంభకోణం.. కలకడ పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి చీటింగ్ కేసును నాలుగు రోజుల క్రితం ఆ సంస్థ అధినేత్రి షేక్ నౌహీరా భేగంపై నమోదు కావడంతో ఈ కుంభకోణం బయటపడింది. దీంతో ఖాతాదారులు ఆందోళనకు గురౌతున్నారు. అగ్రీగోల్డ్ తరహాలోనే.. హీరా సంస్థలో పెట్టుబడులు పెట్టిన ముస్లీం మైనార్టీల ధనాన్ని అప్పనంగా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. హీరాకు అనుబంధంగా అనేక సంస్థలు.. హీరా గ్రూప్‌నకు అనుబంధంగా అనేక విద్యాసంస్థలు, గోల్డ్ కంపెనీలు, వివిధ షోరూంలు నెలకొల్పినట్లు సమాచారం. హీరా గోల్డ్.. బ్యాంకు తరహాలో లావాదేవీలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ యజమానురాలు షేక్ నౌహీరా భేగం కూడా గుర్రంకొండకు చెందిన మహిళగా భావిస్తున్నారు. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణరాష్ట్రాల్లో ఇప్పటికే ఈమెపై కేసు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. హీరా గ్రూపులో అధికంగా కడప, చిత్తూరు వాసులు.. హీరా గ్రూపు బాధితుల్లో కడప, చిత్తూరు జిల్లావాసులు అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, కలకడ, మదనపల్లె, చిత్తూరు, గుర్రంకొండ, బి.కొత్తకోట, వాల్మీకిపురం, పీలేరులలో ముస్లిం మైనార్టీలు 40 వేలకు పైగా ఖాతాదారులుగా చేరినట్లు సమాచారం. వీరంతా తిరుపతి పట్టణంలోని గాంధీరోడ్, అశ్వర్థనగర్లలో ఉన్న హీరా గ్రూప్ కార్యాలయంలో రూ.5 లక్షల నుంచి రూ. 50 లక్షల దాకా డిపాజిట్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టినవారికి నెలకు 15 వేలు, రూ.10 లక్షలకు రూ.30 వేలు, రూ.15 లక్షలకు రూ.45 వేలు వడ్డీ రూపంలో అందుతున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలో వేలాది మంది సుమారు రూ.600 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. భారీ లాభానికి పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకున్నామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హీరా గ్రూప్ అధినేత షేక్ నౌహీరా భేగంను కర్ణాటక ఇంటిలిజెన్స్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపితే ఆమె సంస్థల్లోని వ్యాపారాలు, ఆర్థిక సంబంధ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతుందని బాధితులు వాపోతున్నారు. అయితే పరువుపోతుందేమోనని వారు బయట పడేందుకు సందేహిస్తుండడం గమనార్హం. నౌహీరాపై కేసు నమోదు చేశాం హీరా గ్రూప్స్ అధినేత్రి, హైదరాబాదుకు చెందిన షేక్ నౌహీరా భేగంపై స్థానికంగా ఉన్న ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తాం. మదనపల్లె డివిజన్లో బాధితులు ఉంటే తమకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాం. మాకు అందిన సమాచారం మేరకు మదనపల్లెలోనూ రూ. వందల కోట్లకు పైగా మోసపోయినట్లు తెలిసింది. బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే కేసులు నమోదు చేసి న్యాయం చేస్తాం.– ఎం. చిదానందరెడ్డి, డీఎస్పీ, మదనపల్లె -
రూ.1000 కోట్ల ఫండ్ ఇవ్వండి
అగ్రిగోల్డ్ ఖాతాదారుల డిమాండ్ జూన్ 15న హాయ్‌ల్యాండ్ వద్ద భారీ ప్రదర్శన విజయవాడ: అగ్రిగోల్డ్ ఖాతాదారుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే రూ. వెయ్యి కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమాన్‌పేటలో నిర్వహించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో తిరుపతిరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫండ్ ఏర్పాటు చేసి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు సర్దుబాటు చేయడం ద్వారా ఆత్మహత్యలు నివారించాలని కోరారు. సీఐడీ వద్ద ఉన్న ఖాతాదారుల జాబితాను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. విచారణను వేగవంతం చేయాలని కోరారు. ప్రతినెలా రూ. వెయ్యి నుంచి రెండువేల కోట్ల ఆస్తులు వేలం వేసిన సొమ్మును కొద్దిమొత్తాల్లో బాధితుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కేసు విచారణ, ఆస్తుల వేలం పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. అగ్రిగోల్డ్‌లో పనిచేసి ఉపాధి కోల్పోయిన అర్హత కలిగిన వారందరికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని డిమాండ్ చేశారు. జూన్14లోగా ప్రభుత్వం స్పందించి ఫండ్ ఏర్పాటు చేయకపోతే మరుసటి రోజే (జూన్ 15న) హ్యాయ్‌లాండ్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అసోసియేషన్ సహాయ కార్యదర్శి విశ్వనాథరెడ్డి,జిల్లాల నుంచి వచ్చిన ఖాతాదారులు పాల్గొన్నారు. -
మరి డిపాజిటర్ల సంగతేంటి?
⇒ వారికి చెల్లించాల్సింది కూడా చూడాలి కదా! ⇒ సహారా కేసులో సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ: మదుపరులకు సహారా గ్రూప్ చెల్లింపుల ప్రతిష్టంభనపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలన్న సంగతి అటుంచితే... డిపాజిట్‌దార్లకు చెల్లించాల్సిన మొత్తం నిధుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఈ సమస్య పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘‘ బెయిల్‌కు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను మేం అంగీకరిస్తాం. సరే... మరి డిపాజిట్ దార్లకు చెల్లించాల్సిన మిగిలిన మొత్తం సంగతేంటి? ఈ ప్రతిష్టంభన కూడా పరిష్కారం కావాలని మేం కోరుకుంటున్నాం’’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవే, ఏకే సిక్రీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. 2012 ఆగస్టు 31వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సహారా సంస్థ రూ.24,000 కోట్లను 15 శాతం వడ్డీతో సహా మూడు నెలల్లో చెల్లించాల్సి ఉంది. కానీ సహారా ఈ నిధులు చెల్లించలేకపోయింది. వాయిదాలు అడిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో 2014 మార్చి నుంచీ సుప్రీంకోర్టు ఆదేశాలతో సహారా చీఫ్, మరో ఇరువురు సహారా గ్రూప్ సంస్థల డెరైక్టర్లు తీహార్ జైలులో ఉన్నారు. రాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని, ఇందులో రూ.5,000 కోట్లు నగదుగా, మిగిలిన మొత్తం బ్యాంక్ గ్యారెంటీగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిధుల సమీకరణకు సహారా... ఆస్తుల అమ్మకం సహా పలు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అవి విజయవంతం కాలేదు. అంతకుముందు సహారా గ్రూప్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తమ క్లయింట్ తరఫు వాదనలు వినిపిస్తూ... బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించటంలో భాగంగా వచ్చే వారం రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కేసు తదుపరి విచారణ మే 14కు వాయిదా పడింది.