హీరా గ్రూప్స్ అధినేత్రి షేక్ నౌహీరా
చిత్తూరు, మదనపల్లె టౌన్: ఆర్థిక లావాలదేవీల పేరిట ఆశ చూపించడం.. ఆ తర్వాత ఖాతాదారులు ముంచి బోర్డు తిప్పేయడం అక్రమార్కులకు పరిపాటిగా మారింది. రాష్ట్రంలో ఇలాంటి తరహా మోసాన్ని అగ్రీగోల్డ్ బాధితులు ఇప్పటికే చవిచూశారు. తాజాగా హీరా గ్రూప్ సంస్థ తన డిపాజిట్ దారులను నిలువునా ముంచేసింది. జనం ఆశనే.. పెట్టుబడిగా పెట్టి ఏకంగా 600 కోట్లు కొల్లగొట్టిన వైనం బట్టబయలైంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు ఈ విషయంలో పెద్దఎత్తున నష్టపోయినట్లు తెలుస్తోంది.కలకడలో వెలుగు చూసిన కుంభకోణం..
కలకడ పోలీస్ స్టేషన్‌లో మొట్టమొదటి చీటింగ్ కేసును నాలుగు రోజుల క్రితం ఆ సంస్థ అధినేత్రి షేక్ నౌహీరా భేగంపై నమోదు కావడంతో ఈ కుంభకోణం బయటపడింది. దీంతో ఖాతాదారులు ఆందోళనకు గురౌతున్నారు. అగ్రీగోల్డ్ తరహాలోనే.. హీరా సంస్థలో పెట్టుబడులు పెట్టిన ముస్లీం మైనార్టీల ధనాన్ని అప్పనంగా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది.
హీరాకు అనుబంధంగా అనేక సంస్థలు..
హీరా గ్రూప్‌నకు అనుబంధంగా అనేక విద్యాసంస్థలు, గోల్డ్ కంపెనీలు, వివిధ షోరూంలు నెలకొల్పినట్లు సమాచారం. హీరా గోల్డ్.. బ్యాంకు తరహాలో లావాదేవీలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ యజమానురాలు షేక్ నౌహీరా భేగం కూడా గుర్రంకొండకు చెందిన మహిళగా భావిస్తున్నారు. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణరాష్ట్రాల్లో ఇప్పటికే ఈమెపై కేసు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.
హీరా గ్రూపులో అధికంగా కడప, చిత్తూరు వాసులు..
హీరా గ్రూపు బాధితుల్లో కడప, చిత్తూరు జిల్లావాసులు అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, కలకడ, మదనపల్లె, చిత్తూరు, గుర్రంకొండ, బి.కొత్తకోట, వాల్మీకిపురం, పీలేరులలో ముస్లిం మైనార్టీలు 40 వేలకు పైగా ఖాతాదారులుగా చేరినట్లు సమాచారం. వీరంతా తిరుపతి పట్టణంలోని గాంధీరోడ్, అశ్వర్థనగర్‌లలో ఉన్న హీరా గ్రూప్ కార్యాలయంలో రూ.5 లక్షల నుంచి రూ. 50 లక్షల దాకా డిపాజిట్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టినవారికి నెలకు 15 వేలు, రూ.10 లక్షలకు రూ.30 వేలు, రూ.15 లక్షలకు రూ.45 వేలు వడ్డీ రూపంలో అందుతున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలో వేలాది మంది సుమారు రూ.600 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. భారీ లాభానికి పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకున్నామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హీరా గ్రూప్ అధినేత షేక్ నౌహీరా భేగంను కర్ణాటక ఇంటిలిజెన్స్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపితే ఆమె సంస్థల్లోని వ్యాపారాలు, ఆర్థిక సంబంధ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతుందని బాధితులు వాపోతున్నారు. అయితే పరువుపోతుందేమోనని వారు బయట పడేందుకు సందేహిస్తుండడం గమనార్హం.
నౌహీరాపై కేసు నమోదు చేశాం
హీరా గ్రూప్స్ అధినేత్రి, హైదరాబాదుకు చెందిన షేక్ నౌహీరా భేగంపై స్థానికంగా ఉన్న ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తాం. మదనపల్లె డివిజన్‌లో బాధితులు ఉంటే తమకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాం. మాకు అందిన సమాచారం మేరకు మదనపల్లెలోనూ రూ. వందల కోట్లకు పైగా మోసపోయినట్లు తెలిసింది. బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే కేసులు నమోదు చేసి న్యాయం చేస్తాం.– ఎం. చిదానందరెడ్డి, డీఎస్పీ, మదనపల్లె
Comments
Please login to add a commentAdd a comment