ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నేటి సాయంత్రం నుంచి అన్ని బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించనుంది. నిధులపరమైన సమస్యలేమీ లేవని, బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి సర్వీసులన్నీ అందుబాటులోకి వస్తాయని సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న ప్రశాంత్ కుమార్ తెలిపారు. ‘అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకున్నాం. మా ఏటీఎంలలో పుష్కలంగా నగదు నిల్వలు ఉంచాం. అలాగే, శాఖలన్నింటికీ తగినంత స్థాయిలో నగదు సరఫరా ఉంది. కనుక.. బ్యాంక్‌కు సంబంధించి నిధులపరంగా ఎలాంటి సమస్యా లేదు. ఇతరత్రా బైటి నుంచి సమీకరించాల్సిన అవసరమైతే లేదు.
కానీ ఒకవేళ అవసరమైనా కూడా తక్షణం తగినంత స్థాయిలో నిధులను సమకూర్చుకోగలిగే మార్గాలు ఉన్నాయి‘ అని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం మారటోరియం ఎత్తివేశాక.. ఖాతాదారులు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సర్వీసులను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మారటోరియం వ్యవధిలో నిర్దిష్ట పరిమితి రూ. 50,000 స్థాయిలో విత్‌డ్రా చేసుకున్న వారి సంఖ్య.. మొత్తం ఖాతాదారుల్లో మూడో వంతు మాత్రమే ఉండవచ్చని కుమార్ చెప్పారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసిన ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ చీఫ్ అశుతోష్ ఖజూరియాతో పాటు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
13 రోజుల్లోనే పరిష్కారం..
యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థల తోడ్పాటుతో 13 రోజుల్లోనే సంక్షోభం పరిష్కారమైనట్లు కుమార్ చెప్పారు. యస్ బ్యాంక్‌ను గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి 5న సుమారు నెల రోజుల పాటు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించింది. ఈ వ్యవధిలో రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేకుండా ఆంక్షలు విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటరుగా ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. మరోవైపు, బ్యాంకులోకి పెట్టుబడులు వచ్చేందుకు చర్యలు తీసుకుంది. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం ఎనిమిది బ్యాంకులు యస్ బ్యాంక్‌లో రూ. 10,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అత్యధికంగా రూ. 6,050 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.
రికవరీపై ఆశలు...
ముందు జాగ్రత్త చర్యగా సందేహాస్పద ఖాతాలన్నింటినీ క్యూ3 ఆర్థిక ఫలితాల్లో పొందుపర్చినందున యస్ బ్యాంక్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కుమార్ చెప్పారు. మొండిబాకీలకు సంబంధించి ప్రొవిజనింగ్‌ను 42 శాతం నుంచి పెంచి.. 72 శాతం పైగా చేశామని, మార్చి త్రైమాసికంలో రూ. 8,500–10,000 కోట్ల దాకా రికవరీలు అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. డిపాజిట్లు, రుణాల్లో 60 శాతం వాటాను రిటైల్ విభాగం నుంచి రాబట్టాలంటూ తమ సిబ్బందికి సూచించినట్లు ప్రశాంత్ తెలిపారు. యస్ బ్యాంక్‌కు ప్రస్తుతమున్న మొండిబాకీల్లో 90 శాతం పైగా బాకీలు డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో జతయినవే కావడం గమనార్హం. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 36,764 కోట్ల మేర మొండిబాకీలు పెరిగాయి. డిసెంబర్ క్వార్టర్‌లో స్థూల మొండిబాకీలు రూ. 40,709 కోట్లకు, ప్రొవిజనింగ్ రూ. 29,594 కోట్లకు పెరిగాయి.
మరోవైపు, షేర్లపై లాకిన్ విధించడాన్ని సవాలు చేస్తూ రిటైల్ ఇన్వెస్టర్లు యస్ బ్యాంకు, ఆర్‌బీఐలపై కోర్టుకు వెళ్లనున్నారన్న వార్తలపై రజనీష్, ప్రశాంత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అలాగే ఇకపైనా పొదుపు ఖాతాలపై అధిక స్థాయిలో వడ్డీ చెల్లిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమివ్వకుండా దాటవేశారు. మరోపక్క, యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో 7.97% వాటా కొనుగోలు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ 7.97%, యాక్సిస్ 4.78 %, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.98 శాతం, ఫెడరల్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్ చెరి 2.39%, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 1.99% వాటాలు కొనుగోలు చేశాయి.
ఒక్క షేరూ విక్రయించం: రజనీష్
మూడేళ్ల లాకిన్ వ్యవధి పూర్తి కాకుండా యస్ బ్యాంకులో ఒక్క షేరు కూడా విక్రయించబోమని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 42 శాతం వాటాలు తీసుకున్నామని, రెండో విడత ఫండింగ్‌లో దీన్ని 49 శాతానికి పెంచుకోనున్నామని ఆయన చెప్పారు.
మూడో రోజూ షేరు జోరు...
యస్ బ్యాంక్ షేర్ జోరు కొనసాగుతోంది. బ్యాంక్ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మూడీస్ అప్‌గ్రేడ్ చేయడంతో మంగళవారం యస్ బ్యాంక్ షేర్ 58% లాభంతో రూ.58.65కు చేరింది. ఇంట్రాడేలో 73% లాభంతో రూ.64కు ఎగసింది. 3 రోజుల్లో 134%లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment