న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్‌సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు.
ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్‌సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌లో ఉందని, దాని ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు.
రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్‌సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment