న్యూఢిల్లీ: సహారా గ్రూప్ నాలుగు కోపరేటివ్‌ల పరిధిలో నాలుగు కోట్ల డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడం మొదలైంది. మొదటి విడత కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 112 మంది చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులను కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్‌షా శుక్రవారం ప్రారంభించారు.
సీఆర్‌సీఎస్ సహారా రిఫండ్ పోర్టల్‌పై ఇప్పటి వరకు 18 లక్షల మంది డిపాజిటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు షా చెప్పారు. సహారా డిపాజిటర్ల చెల్లింపులకు వీలుగా సీఆర్‌సీఎస్–సహారా పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ జూలై 18న ప్రారంభించడం గమనార్హం.
నమోదు చేసుకున్న ఇన్వెస్టర్లు అందరికీ తొలి విడతలో రూ.10వేల చొప్పున చెల్లించనున్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాత రెండో విడత నిధులను బదిలీ చేస్తామని అమిత్‌షా తెలిపారు. ‘‘రానున్న రోజుల్లో డిపాజిటర్లు అందరూ తమ నిధులను పొందుతారని మీకు భరోసా ఇస్తున్నా’’అని ప్రకటించారు. సహార వంటి ఘటనలు జరిగినప్పుడల్లా సహకార సంస్థల పట్ల నమ్మకం కుదేలవుతున్నట్టు పేర్కొన్నారు.
ఇన్వెస్టర్ల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని, వాటిని తిరిగి వారికి అందిస్తామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సహారా డిపాజిటర్లు గత 12–15 ఏళ్ల నుంచి తమ డబ్బులు పొందలేకపోయారని, ఇందుకు సహారా యాజమాన్యం విఫలం కావడం, కోర్టుల్లో వ్యాజ్యాలతో జాప్యం జరిగినట్టు చెప్పారు. సెబీ–సహారా ఫండ్ నుంచి రూ.5,000 కోట్లను సహకార శాఖ పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు అమిత్‌షా వివరించారు.
సీబీఐ, ఆదాయపన్ను శాఖ తదితర కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి.. నిధులపై ముందుగా చిన్న ఇన్వెస్టర్లకు తొలుత హక్కు ఉండాలంటూ సుప్రీంకోర్టును కోరినట్టు గుర్తు చేశారు. సహారా గ్రూపు నాలుగు కోపరేటివ్‌ల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు వచ్చే తొమ్మిది నెలల్లో వారి డబ్బులు తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది మార్చి 29న కేంద్రం ప్రకటించడం గమనార్హం.
ఇక సహారా డబ్బుల్ని ఎలా క్లయిమ్ చేసుకోవాలంటే?
♦ ముందుగా mocrefund.crcs.gov.in. పోర్టల్‌కి వెళ్లాలి
♦ ఆధార్ కార్డ్ నెంబర్ సాయంతో డిపాజిటర్ లాగిన్ అవ్వాలి
♦ అనంతరం మీ వద్ద ఉన్న సహారా బాండ్ పేపర్లని, ఇతర పత్రాలని అప్‌లోడ్ చేయాలి.
♦ అప్‌లోడ్ చేసిన పత్రాలని 30 రోజుల్లోగా ధృవీకరిస్తారు.
♦ అనంతరం 15 రోజుల్లో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారు
♦ తర్వాత ఎస్‌ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ పూర్తయినట్లు ఇన్వెస్టర్లకు సమాచారం అందిస్తారు.
♦ ఎస్‌ఎంఎస్ వచ్చిందంటే మీ ఆన్‌లైన్ క్లెయిమ్ ఆమోదం పొందినదని అర్థం.
♦ తర్వాత పెట్టుబడి మొత్తం ఖాతాకు బదిలీ అవుతుంది.
♦ క్లెయిమ్‌ని ధృవీకరించిన తేదీ నుంచి 45 రోజుల తర్వాత మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment