ముంబై: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధభయాల కారణంగా ఇన్వెస్టర్లు రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడకపోతుండటంతో రూపాయి (Rupee) మారకం విలువపై మరింతగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో దేశీ కరెన్సీ రోజురోజుకూ కొత్త కనిష్టాలకు జారిపోతోంది. తాజాగా బుధవారం డాలరుతో (US dollar) పోలిస్తే మరో 36 పైసలు క్షీణించి ఇంకో రికార్డు కనిష్ట స్థాయి 87.43కి పడిపోయింది.
ఒక దశలో 87.49 కనిష్ట స్థాయిని కూడా తాకింది. అమెరికా, చైనా టారిఫ్‌ల ప్రభావాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తుండటంతో రూపాయిపై ప్రభావం పడుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. భారత్‌లో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, విదేశీ మార్కెట్లలో డాలరు బలపడుతుండటం కూడా మదుపరుల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయని వివరించారు.
ద్రవ్యోల్బణం నిర్దిష్ట స్థాయికి పరిమితం కావడంతో ఆర్‌బీఐ ఈసారి పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గించవచ్చనే అంచనాలు ఉన్నాయి. మూడు రోజుల పాటు సాగే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 7న విధాన నిర్ణయాలను ఎంపీసీ ప్రకటించనుంది.
అమెరికా డాలరు బలోపేతం అవుతుండటంవల్లే దానితో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణీ తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ దేశం జపాన్ యువాన్‌తో కూడా రూపాయిని పోల్చి చూడాల్సిన అవసరం ఉందన్నారు. రూపాయిని నిర్దిష్ట స్థాయికి పరిమితం చేయడం ఆర్‌బీఐ విధానం కాదని, తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే అవసరమైతే జోక్యం చేసుకుంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment