ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టం 86.70ని చూసిన నేపథ్యంలో, దేశీయ కరెన్సీ ఒడిదుడుకుల నివారణ, స్థిరీకరణ లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చొరవలకు శ్రీకారం చుట్టింది. విదేశీ లావాదేవీల్లో రూపాయి (rupee) వినియోగం ప్రోత్సాహం లక్ష్యంగా కీలక చర్యలను ప్రకటించింది.
సరిహద్దు వాణిజ్య లావాదేవీల్లో భారత రూపాయి అలాగే స్థానిక, జాతీయ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సంబంధిత నిబంధనలను సరళీకృతం చేసింది. రూపాయిలో పలు దేశాలతో వాణిజ్య లావాదేవీలను నిర్వహించడం, తద్వారా డాలర్ల డిమాండ్‌ను తగ్గించడం, రూపాయి విలువ స్థిరీకరణ ఆర్‌బీఐ నిర్ణయాల ప్రధాన లక్ష్యాలు.
సెంట్రల్ బ్యాంకులతో ఎంఓయూలు..
భారతీయ రూపాయితో సహా స్థానిక కరెన్సీలలో సరిహద్దు లావాదేవీలను ప్రోత్సహించడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, మాల్దీవుల సెంట్రల్ బ్యాంకులతో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లపై సంతకం చేసింది. వాణిజ్య లావాదేవీల కోసం భారత రూపాయిని ప్రోత్సహించడానికి 2022 జూలైలో ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతా (ఎస్‌ఆర్‌వీఏ) సౌలభ్యాన్ని ఆర్‌బీఐ ఏర్పాటు చేసింది.
అనేక విదేశీ బ్యాంకులు భారతదేశంలోని బ్యాంకులతో ఎస్‌ఆర్‌వీఏలను ప్రారంభించాయి. ఎన్‌ఆర్‌ఐ ఖాతాల లావాదేవీల విషయంలో తాజాగా మరింత సరళతర నిబంధనలను ఆర్‌బీఐ తీసుకువచ్చింది. సరళీకృత ఫెమా నిబంధనల ప్రకారం, భారతదేశం వెలుపల నివసించే వ్యక్తులు ప్రత్యేక నాన్–రెసిడెంట్ రూపాయి ఖాతా, ఎస్‌ఆర్‌వీఏల్లోని బ్యాలెన్స్‌లను ఉపయోగించి ఇతర నాన్–రెసిడెంట్‌లతో విశ్వసనీయ లావాదేవీలను నిర్వహించడానికి వీలవుతుంది.
భారతీయ ఎగుమతిదారులు వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్ కోసం విదేశాలలో ఏదైనా విదేశీ కరెన్సీలో ఖాతాలను తెరవగలరని కూడా ఆర్‌బీఐ తెలిపింది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వీకరించడం, ఈ ఆదాయాన్ని దిగుమతుల కోసం చెల్లించడం వంటి కార్యకలాపాలను నిర్వహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment