
ఇన్‌కమ్ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఇయర్ 2025–26కు సంబంధించి 1, 4 ఆదాయ పన్ను రిటర్న్ ఫారంలను కేంద్రం నోటిఫై చేసింది. ఈక్విటీలపై రూ.1.25 లక్షల వరకు వచ్చే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌కి (ఎల్‌టీసీజీ) సంబంధించిన రిటర్నుల ఫైలింగ్‌ను సులభతరం చేసింది. వార్షికంగా రూ.50 లక్షల వరకు మొత్తం ఆదాయం ఉన్న వారు, సంస్థలు 1, 4 ఐటీఆర్ ఫారంలను దాఖలు చేయాలి.
ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల వరకు ఎల్‌టీసీజీ ఉన్న వేతన జీవులు, నిర్దిష్ట ట్యాక్సేషన్ స్కీము కింద ఉన్న సంస్థలు వరుసగా ఐటీఆర్–1, ఐటీఆర్–4 వేస్తే సరిపోతుంది. సాధారణంగా ఎల్‌టీజీసీకి మినహాయింపు ఉన్నా, ఆ వివరాలకు సంబంధించి విడిగా ఐటీఆర్–2 కూడా దాఖలు చేయాల్సి ఉంటోంది. ఇకపై పన్ను మినహాయింపు పరిధికి లోబడి ఉన్న ఎల్‌టీసీజీ వివరాలను సమర్పించేందుకు ఐటీఆర్–1లోనే చిన్న సెక్షన్‌ను పొందుపర్చారు. ఆ పరిధి దాటితే ఐటీఆర్–2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీ చట్టం కింద లిస్టెడ్ షేర్లు, మ్యుచువల్ ఫండ్స్‌పై రూ. 1.25 లక్షల వరకు ఎల్‌టీసీజీపై పన్ను మినహాయింపు ఉంటోంది. అది దాటితే 12.5 శాతం ట్యాక్స్ వర్తిస్తుంది. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి ట్యాక్స్‌పేయర్లు.. ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్)లను దాఖలు చేస్తుంటారు. ఇక 80సీ, 80జీజీ తదితర సెక్షన్ల కింద క్లెయిమ్ చేసే డిడక్షన్ల ఫారంలలో కొన్ని మార్పులు చేశారు. టీడీఎస్ డిడక్షన్ల విషయంలో సెక్షన్లవారీగా వివరాలను ఐటీఆర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ఇండస్‌ఇండ్‌లో ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు
ఐటీ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్లో ఈ ఐటీఆర్‌లు అందుబాటులో ఉంచాకా, 2024–25 ఆర్థిక సంవత్సర ఆదాయానికి సంబంధించిన రిటర్నులను అసెస్సీలు ఫైల్ చేయొచ్చు. వ్యక్తులు, ఖాతాలను ఆడిటింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండని వారు ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి జులై 31 ఆఖరు తేదీ. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఆఖర్లో ఫిబ్రవరి/మార్చి నాటికి ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేస్తారు. కానీ ఈసారి కొత్త ఆదాయ పన్ను బిల్లుపై రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నోటిఫై చేయడంలో జాప్యం జరిగింది.