
గడిచిన నెలలో ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో వచ్చాయి. ప్రభుత్వం మే 1న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూపంలో రూ.2.37 లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతకుముందు నెలలో అంటే మార్చిలో రూ.1.96 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
కాగా గతేడాది ఇదే నెలలో అంటే 2024 ఏప్రిల్‌లో ప్రభుత్వం రూ.2.1 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలు చేసింది. వార్షిక వసూళ్ల వేగం 12.6 శాతంగా ఉండటం కూడా 17 నెలల్లో ఇదే గరిష్టం. ఆర్థిక వ్యవస్థకు వినియోగం తోడ్పడటంతో త్రైమాసిక వసూళ్లు 2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ .5.75 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ ఆదాయం 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతి చేసుకున్న వస్తువుల ఆదాయం 20.8 శాతం పెరిగి రూ.46,913 కోట్లకు చేరింది. ఏప్రిల్‌లో రీఫండ్ల జారీ 48.3 శాతం పెరిగి రూ.27,341 కోట్లకు చేరింది.
ఇక అంతకుముందు నెలల్లో జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే ఫిబ్రవరిలో రూ.183,646 కోట్లు, జనవరిలో రూ.1.96 లక్షల కోట్లు, డిసెంబరులో రూ.1.77 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్లో ప్రభుత్వం ఈ సంవత్సరానికి జీఎస్టీ ఆదాయంలో 11% పెరుగుదలను అంచనా వేసింది. సెంట్రల్ జీఎస్టీ, పరిహార సెస్‌తో సహా వసూళ్లను రూ .11.78 లక్షల కోట్లుగా అంచనా వేసింది.