జనవరి నెలలో జీఎస్‌టీ (GST) వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 12.3% అధికంగా రూ.1.96 లక్షల కోట్లు వసూలైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేశీ వస్తు, సేవల ద్వారా 10.4% అధికంగా రూ.1.47 లక్షల కోట్లు వసూలైంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్‌టీ ఆదాయం 19.8% అధికంగా రూ.48,382 కోట్లు సమకూరింది. గతేడాది ఏప్రిల్ నుండి ఇవే అత్యధిక జీఎస్టీ వసూళ్లు కావడం విశేషం.
మొత్తం జీఎస్‌టీ ఆదాయం జనవరి నెలకు రూ.1,95,506 కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అదే నెలలో రూ.23,853 కోట్లు రిఫండ్‌లు జారీ చేసినట్టు, ఇది క్రితం ఏడాది ఇదే నెలలో పోల్చి చూసినప్పుడు 24% పెరిగినట్టు పేర్కొంది. రిఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత నికర ఆదాయం 1.72 లక్షల కోట్లు అని, ఇది 10.9% వృద్ధికి సమానమని వెల్లడించింది.
జీఎస్‌టీ వసూళ్లు స్థిరంగా పెరుగుతుండడం ఆర్థిక వృద్ధి పుంజుకోవడానికి, వ్యాపార సంస్థల నిబంధనల అమలుకు నిదర్శనమని కేపీఎంజీ పరోక్ష పన్నుల హెడ్ అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. రిఫండ్‌ల తర్వాత కూడా నికర వసూళ్లు అధికంగా ఉండడం ప్రశంసనీయమన్నారు.
రాష్ట్రాల వారీగా..
జనవరి నెలలో రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర ముందుంది. రూ. 32,335 కోట్ల వసూళ్లతో అగ్ర స్థానంలో నిలిచింది. గుజరాత్ తర్వాత రూ. 12,135 కోట్లు, కర్ణాటక రూ. 14,353 కోట్లు, తమిళనాడు రూ. 11,496 కోట్లు, హర్యానా రూ. 10,284 కోట్లతో ఆ తర్వాత స్థానాలలో నిలిచాయి. ఇక అత్యల్ప జీఎస్టీ వసూళ్లలో చూసుకుంటే రూ. 1 కోటి వసూళ్లతో లక్షద్వీప్ అట్టడుగు స్థానంలో ఉంది. మణిపూర్ (రూ. 56 కోట్లు), మిజోరాం (రూ. 35 కోట్లు), అండమాన్ నికోబార్ దీవులు (రూ. 43 కోట్లు), నాగాలాండ్ (రూ. 65 కోట్లు) చివరి నుంచి తర్వాతి స్థానాలలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment