RBI MPC: రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ.. | RBI cuts repo rate by 25 bps to 6 25pc for the first time in nearly five years | Sakshi
Sakshi News home page

RBI MPC: రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ.. లోన్లు తీసుకున్నవారికి గుడ్‌ న్యూస్‌

Published Fri, Feb 7 2025 10:29 AM | Last Updated on Fri, Feb 7 2025 11:41 AM

RBI cuts repo rate by 25 bps to 6 25pc for the first time in nearly five years

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.  దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5న  మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది.  శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్‌ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచన వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుండి 6.25 శాతానికి తగ్గింది. 

జీడీపీ 6.7%  
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు నిర్ణయ ప్యానెల్ 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిని దాదాపు 6.7%గా అంచనా వేసిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.2% వద్ద కొనసాగుతుందని ఆర్బీఐ ప్యానెల్‌ అంచనా వేసింది. కొత్త పంటల రాక నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నట్లు ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.

ఆర్‌బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మునుపటి ఎంపీసీ సమావేశంలో  రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా యథతథంగా కొనసాగించారు. అయితే, నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. నగదు ప్రవాహాన్ని పెంచడానికి ఆర్‌బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 1 ట్రిలియన్లను చొప్పించింది. డిసెంబర్ పాలసీలో కీలకమైన చర్య నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించడం, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రెండు విడతలుగా రూ. 1.16 లక్షల కోట్లు ఇంజెక్ట్ చేయడం.

రెపో రేటు అంటే.. 
రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు.  రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి రుణాలు పొందుతాయి.

బ్యాంకులకు నిధులు తక్కువగా ఉన్నప్పుడు లేదా అస్థిర మార్కెట్ పరిస్థితులలో ద్రవ్యతను కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.

వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రీటైల్‌ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలిగే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement