రుణగ్రహీతలకు శుభవార్త సిద్ధంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వడ్డీ రేట్లను కదిలించకుండా స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్న ఆర్బీఐ ఈసారి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గృహ రుణాలు, వ్యక్తిగత, కారు లోన్లు వంటి వాటికి ఈఎంఐలు (EMI) కడుతున్నవారు ఈసారి తమకు కాస్త ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కొత్తగా నియమితులైన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మొదటి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు చర్చించిన తర్వాత వడ్డీ రేటు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించనున్నారు.
మార్కెట్ లిక్విడిటీని మెరుగుపరచడంతో పాటు, వినియోగం ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆర్‌బీఐ కూడా రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే అంటే ఆర్‌బీఐ కంఫర్ట్ జోన్ 6 శాతంలోపే ఉంది. దీనివల్ల ధరల గురించి ఆందోళన చెందకుండా ఆర్బీఐ నిర్ణయం తీసుకునే వీలు ఏర్పడింది.
ఆర్బీఐ రెపో రేటు (స్వల్పకాలిక రుణ రేటు)ను ఎటువంటి మార్పు లేకుండా 2023 ఫిబ్రవరి నుండి 6.5 శాతంగా కొనసాగిస్తోంది. కోవిడ్ కాలంలో (2020 మే) ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును తగ్గించింది. ఆ తర్వాత దానిని క్రమంగా 6.5 శాతానికి పెంచింది. ఇప్పుడు వినియోగం ఇంకా మందగించడంతో రుణాలు చౌకగా చేయడం ద్వారా వృద్ధిని పెంచాలని ఆర్బీఐ చూస్తోంది. తద్వారా రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment