రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలనే ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించడం ఇది ఆరోసారి. రెపో రేటు అనేది ఆర్‌బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు వచ్చే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి.
ఆర్బీఐ గవర్నర్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగిన ఈ మీటింగ్‌లో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు."మారుతున్న స్థూల ఆర్థిక పరిణామాలు, దృక్పథాలను వివరణాత్మకంగా అంచనా వేసిన తర్వాత ద్రవ్య విధాన కమిటీ ఐదుగురు సభ్యుల మెజారిటీతో పాలసీ రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది" అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
మళ్లీ జూన్‌లోనే...
ఆర్‌బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ముందుగానే అంచనా వేసింది. ఊహించినట్టుగానే ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. అయితే రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్‌లో ఉండవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment