
న్యూఢిల్లీ: అమ్మకాలు, ఉత్పత్తి ఒక మోస్తరుగానే పెరుగుతున్న నేపథ్యంలో జనవరిలో దేశీయంగా సేవల రంగం (Services sector) వృద్ధి నెమ్మదించింది. డిసెంబర్‌లో 59.3గా ఉన్న హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ 56.5కి పరిమితమైంది. రెండేళ్ళ తర్వాత వృద్ధి ఇంతగా నెమ్మదించడం ఇదే ప్రథమం.
పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పరిభాషలో సూచీ 50కి పైన ఉంటే వృద్ధిని, దానికన్నా తక్కువుంటే క్షీణతను సూచిస్తుంది. బిజినెస్ యాక్టివిటీ, కొత్త బిజినెస్ పీఎంఐ సూచీలు వరుసగా 2022 నవంబర్, 2023 నవంబర్ తర్వాత కనిష్ట స్థాయులకు తగ్గినట్లు హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు.
సిబ్బంది ఖర్చులు, ఆహార ధరలు పెరిగిపోతుండటంతో సర్వీస్ కంపెనీల వ్యయాలు కూడా మరింత పెరిగాయి. అయితే, రాబోయే 12 నెలల్లో వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయని దేశీయంగా సర్వీస్ ప్రొవైడర్లు ధీమాగా ఉన్నారు. ప్రకటనలు, పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగైన రేట్లు ఆఫర్ చేయడం, కొత్త క్లయింట్ల ఎంక్వైరీలు మొదలైన అంశాలు ఇందుకు కారణం. సర్వీస్ రంగానికి చెందిన 400 కంపెనీల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రూపొందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment