న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. త్వరలో ఇది మరింత భద్రంగా మారనుంది. ప్రస్తుతం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమాను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై చెల్లింపుల్లో విఫలమైతే... అప్పుడు ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు సంక్షోభం పాలవడంతో ఆ బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేసుకున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిపాజిటర్ల ఆగ్రహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై వెళ్లిన సందర్భంగా స్వయంగా చవి చూశారు కూడా. ఆర్‌బీఐ సైతం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని బలంగా చాటాయి. దీంతో కేంద్ర సర్కారు ఈ అవసరాన్ని గుర్తించడంతోపాటు అమలు దిశగా చర్యలు చేపట్టింది. ఈ శీతాకాల సమావేశాల్లో బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా పెంపునకు చట్టాన్ని తేనున్నట్లు మంత్రి సీతారామన్ రెండు రోజుల క్రితమే వెల్లడించారు. అయితే, ఎంత మొత్తానికి ఈ పెంపు అన్న విషయాన్ని ఆమె చెప్పలేదు.
రెండు రకాలు..: బ్యాంకు డిపాజిట్లను రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. రిటైల్ డిపాజిట్ దారులకు రూ.లక్ష బీమాను రూ.5 లక్షలకు చేయనుండడం ఒకటి కాగా, హోల్‌సేల్ డిపాజిట్‌దారులకు ఈ మొత్తాన్ని రూ.25 లక్షలుగా చేయడం రెండోది. చివరిగా 1993 మే 1న డిపాజిట్లపై బీమాను సవరించారు. 1992లో జరిగిన సెక్యూరిటీస్ స్కామ్ దెబ్బకు బ్యాంక్ ఆఫ్ కరద్ మూతపడటం నాడు డిపాజిట్లపై గరిష్ట బీమాగా ఉన్న రూ.30,000 మొత్తాన్ని రూ.లక్షకు పెంచడానికి కారణమైంది. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం మరో విడత సవరణ అవసరాన్ని గుర్తు చేసింది. అయితే, డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచితే బ్యాంకులు చెల్లిస్తున్న ప్రీమియం కూడా పెరుగుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మరో రెండు రకాల ప్రతిపాదనలను కూడా పరిశీలించొచ్చని విశ్వసనీయ సమాచారం. పెంచిన మేరకు డిపాజిట్లపై బీమా మొత్తాన్ని బ్యాంకులు సహజంగానే చెల్లించాలి. దీన్ని డిపాజిట్‌దారుల నుంచే వసూలు చేయొచ్చన్నది మరో ప్రతిపాదన. ఆర్‌బీఐ అనుబంధ విభాగమైన డీఐసీజీసీ విడిగా ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, పీఎంసీ బ్యాంకు తరహా సంక్షోభాల్లో చెల్లింపులకు వినియోగించడం మరొక ప్రతిపాదన. వీటిల్లో ఏది ఆచరణ రూపం దాల్చనుందనేది అతిత్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
రూ.10 లక్షలు చేయాలి..
బ్యాంకు డిపాజిట్లపై బీమాను రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ఆర్‌బీఐ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ‘‘డిపాజిట్లపై బీమాను కనీసం రూ.10 లక్షలు చేయాలని గతంలో సూచించాం. మరోసారి దీన్ని పరిశీలించాలని కోరుతున్నాం’’ అని అఖిల భారత రిజర్వ్ బ్యాంకు ఉద్యోగుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. డాలర్ మారకంలో చూసుకుంటే రూ.10 లక్షల బీమా 14,000 డాలర్లకు సమానమని, చాలా దేశాల్లో ఉన్న బీమా కంటే ఇది ఎంతో తక్కువ మొత్తమని సంఘం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment