fixed-price
-
రక్షణ ‘ఫిక్స్డ్’.. రాబడి కాదు!
ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతో సురక్షితం. ఎక్కువ మంది ఇలానే భావిస్తుంటారు. రాబడి తక్కువే అయినా, భద్రత పాళ్లు ఎక్కువ కదా అన్న భరోసా వారిది. అందుకే ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గతంలో మాదిరి ఇప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా తప్పింది. ఉన్నచోట నుంచే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ డిపాజిట్ చేసుకోవడం, ఆన్లైన్లోనే రద్దు చేసుకోవడం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎఫ్డీ మరింత సౌకర్యవంతంగా మారిందని చెప్పుకోవాలి. ఒకవేళ బ్యాంకు సంక్షోభం పాలైనా.. రూ.5 లక్షల వరకు తిరిగి చెల్లించే ఆర్బీఐ ‘డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’ ఉంది. కానీ, ఇవన్నీ నాణేనికి అనుకూల ముఖమే. రెండో వైపు తిప్పి చూస్తే.. అసలు ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడి వస్తుందా..? ద్రవ్యోల్బణం, పన్ను పోను మిగిలేది ఎంత? అసలు ఇది మెరుగైన పెట్టుబడి సాధనమేనా..? ఈ అంశాలన్నీ చర్చించే కథనమే ఇది. ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) నుంచి తమ పెట్టుబడులను ఇతర సాధనాల వైపు మళ్లిస్తుండడాన్ని పరిశీలించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ వైపు వారు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్లకు దూరంగా వెళ్లడానికి కారణాలను చూస్తే.. ఒకటి వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, రెండోది ఇన్వెస్టర్లలో వివిధ సాధనాలు, వాటిల్లోని రిస్క్, రాబడుల పట్ల పెరుగుతున్న అవగాహనే. ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్నో తరాల నుంచి నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉంటూ వస్తోంది. కానీ, టెక్నాలజీ అందుబాటు, పెట్టుబడులకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచుతున్నాయి. దీంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్ రాబడులతో పోల్చి చూసుకునే వారు పెరుగుతున్నారు. అందుకే ఇతర సాధనాలతో పోలిస్తే నేడు ఎఫ్డీలు అంత ఆకర్షణీయమైనవిగా ఇన్వెస్టర్లకు అనిపించడం లేదు. నికర రాబడి సున్నా.. ఏ రాబడికి అయినా ముందు చూడాల్సింది ద్రవ్యోల్బణమే. ఇది పోను మిగులు రాబడి ఎంత అన్నదే ఇన్వెస్టర్‌కు ప్రామాణికం అవుతుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వివిధ కాల వ్యవధుల ఆధారంగా 2.50 శాతం నుంచి గరిష్టంగా 7 శాతం వరకు ఉన్నాయి. కానీ, సెప్టెంబర్ నెలకు సంబంధించి వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్) 7.3 శాతంగా ఉంది. అంటే ఇంతకుమించి వడ్డీ రేటు ఉంటేనే అసలు రాబడి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. అంతెందుకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇలా చూసినా 7 శాతం వడ్డీనిచ్చే ఎఫ్డీపై నికర రాబడి 0.3 శాతమే అవుతుంది. మరింత వివరంగా చూస్తే.. ఏడాది ఎఫ్డీపై ఎస్బీఐ ఆఫర్ చేస్తున్న రేటు 5.65 శాతమే. అంటే ద్రవ్యోల్బణం కంటే ఒక శాతం తక్కువ. కెనరా బ్యాంకు, పీఎన్బీ బ్యాంకులు సైతం 5.5 శాతం రేటును ఇస్తున్నాయి. ప్రైవేటు రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులోనూ ఏడాది కాల ఎఫ్డీపై రేటు 5.75 శాతానికి మించి లేదు. రెండేళ్ల కాల వ్యవధికి చూసినా.. కెనరా బ్యాంకు 5.60 శాతం, యూనియన్ బ్యాంకు 5.45 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. మూడేళ్ల ఎఫ్డీలపై ఎస్బీఐ ఇస్తున్న రేటు 5.60 శాతం. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం, యాక్సిస్ బ్యాంకు 5.70 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఐదేళ్ల కాల ఎఫ్డీలపై ఎస్బీఐలో రేటు 5.65 శాతం ఉంటే, యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకులో 5.75 శాతం చొప్పున ఉంది. అంటే ఐదేళ్ల వరకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు, ఆర్బీఐ అంచనా వేస్తున్న ద్రవ్యోల్బణ రేటు 6.7 శాతం కంటే తక్కువే ఉన్నాయి. అంటే ఈ మేరకు ఎఫ్డీపై నష్టపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇక పన్ను పరిధిలో ఉన్న వారికి ఎఫ్డీలతో మరింత నష్టమే అని చెప్పుకోవాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే 7 శాతం ఎఫ్డీ రేటు రాబడి నుంచి పన్ను చెల్లించగా మిగిలే నికర రాబడి 4.9 శాతమే. ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉండడంతో నికరంగా 2 శాతం నష్టాన్ని ఎఫ్డీ రూపంలో తెచ్చుకున్నట్టు అవుతుంది. రక్షణ ఒక్కటే కాదు.. నిజానికి పెట్టుబడి ఏదైనా రక్షణ పాళ్లు ఎంతన్నది చూడాలి. కానీ, అదే సమయంలో రాబడి కూడా చూడాలి. అసలు రాబడి లేకుండా, రక్షణ ఉన్న సాధనం వల్ల ఒరిగేదేమి ఉంటుంది? ఎఫ్డీలు లిక్విడ్ సాధనం. అవసరమైనప్పుడు వేగంగా రద్దు చేసుకుని నగదుగా మార్చుకోవచ్చు. స్వల్పకాల అవసరం ఏర్పడితే అదే ఎఫ్డీపై రుణం (లోన్ ఎగైనెస్ట్ డిపాజిట్/ఓవర్‌డ్రాఫ్ట్) తీసుకోవచ్చు. అదే సమయంలో ఎఫ్డీలు ఒక్కటే లిక్విడ్ సాధనం అనుకోవడానికి లేదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లిక్విడ్ సాధనాలే. మూడు రోజుల వ్యవధిలో నగదుగా మార్చుకోవచ్చు. డెట్ సాధనా ల్లో ద్రవ్యోల్బణం మించి రాబడి అందుకోవచ్చు. మూడేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణ ప్రభావం పోను మిగిలిన రాబడిపైనే పన్ను పడుతుంది. ఫండ్స్‌లో వైవిధ్యానికి చోటు కల్పించుకోవచ్చు. లక్ష్యానికి అనుగుణంగానే.. కాల వ్యవధికి అనుకూలమైన సాధనం ఎంపిక చేసుకోవడం పెట్టుబడికి కీలకం అవుతుంది. వ్యవధి మూడేళ్లకు మించి లేనప్పుడు ఈక్విటీలను ఎంపిక చేసుకోకపోవడమే సరైనది. 3–5 ఏళ్ల కాలానికి హైబ్రిడ్ పథకాలు, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ పథకాలు అనుకూలం. 5–10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలు, ఈటీఎఫ్‌లు, ఈఎల్ఎస్ఎస్లు, 10 ఏళ్లకు మించిన దీర్ఘకాలం కోసం స్మాల్‌క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్లలోపు అయితే రాబడి పెద్దగా లేకపోయినా డెట్ సాధనాలకే పరిమితం కావాలి. ఇక అత్యవసర నిధి అయితే ఎఫ్డీలు, లిక్విడ్ ఫండ్స్, లో డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయాలు ఎఫ్డీలకు ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. దీనికంటే ముందు ఎఫ్‌డీల్లో పెడుతున్న మొత్తం దేనికి ఉద్దేశించినది? అని ప్రశ్నించుకోవాలి. అత్యవసర నిధి అయితే ఎఫ్డీలలో పెట్టుకోవడం సరైనదే అవుతుంది. అత్యవసరం చెప్పి రాదు. ఏ సమయంలో అయినా వెంటనే వెనక్కి తీసుకోవడానికి వెసులుబాటుతో ఉండాలి. ఇక్కడ రాబడి ప్రామాణికం కాదు. కనుక ఎమర్జెన్సీ ఫండ్‌ను ఎఫ్డీలలో పెట్టుకోవచ్చు. అలాగే, ఏడాది కాలం కోసం కూడా ఎఫ్డీలను పరిశీలించొచ్చు. ఏడాదికి మించిన కాలవ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు.. భిన్న కాలాలతో కూడిన వైవిధ్యమైన డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఈక్విటీ కలగలిసిన హైబ్రిడ్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఇవి ఏడాది నుంచి మూడేళ్ల కాల మనీ మార్కెట్, డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో సగటు వార్షిక రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుందని ఆశించొచ్చు. ఇంతకంటే మెరుగైన రాబడులు, తక్కువ రాబడులకు అవకాశం లేకపోలేదు. ఎంపిక చేసుకునే పథకాల పనితీరు ఆధారంగా రాబడి ఉంటుందని మర్చిపోవద్దు. రెండు నుంచి మూడేళ్ల కాలానికి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. మీడియం టు లాంగ్ డ్యురేషన్ నాలుగు నుంచి ఏడేళ్ల కాల వ్యవధి కలిగి సాధనాల్లో పెట్టుబడులు పెడతాయి. వీటిల్లోనూ రాబడులు ఇంచుమించుగా మీడియం డ్యురేషన్ ఫండ్స్ స్థాయిలోనే ఉంటాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ ఏడేళ్లకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. చారిత్రక రాబడులు 6 శాతం నుంచి 18 శాతం మధ్య ఉన్నాయి. ఇవి గుర్తు పెట్టుకోవాలి.. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి, రాబడికి గ్యారంటీ ఉండదు. దీన్నే క్రెడిట్ రిస్క్ అంటారు. అంటే ఫండ్స్ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయగా, ఆయా పత్రాలకు సంబంధించి తిరిగి చెల్లింపులు జరగకపోవడం. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, అస్థితరల్లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లిక్విడిటీ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. నాణ్యమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో లిక్విడిటీ రిస్క్ దాదాపుగా ఉండదనే చెప్పుకోవచ్చు. కానీ, రాబడి కోసం రిస్క్ తీసుకుని డెట్‌లో పెట్టుబడులు పెట్టడం కంటే.. ఈక్విటీలను ఆశ్రయించడం మెరుగైన మార్గం అవుతుంది. ఎందుకంటే ఎలానూ రిస్క్‌కు సిద్ధ పడ్డాం కనుక, ఈక్విటీల్లో మెరుగైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. ఆయా విషయాల్లో నిపుణుల సలహాలను తీసుకొని నడచుకోవడం వల్ల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కార్పొరేట్/ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు కార్పొరేట్, ఎన్బీఎఫ్సీ సంస్థల డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. వీటిపై 7.5–8.5% మధ్య రాబడులు ఆశించొచ్చు. ఏఏఏ రేటెడ్ కలిగిన బాండ్లనే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రాబడి మాటేమో కానీ, పెట్టుబడి కూడా సంక్షోభంలో పడిపోతుంది. మీడియం డ్యురేషన్ ఫండ్స్ ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధితో ఉండే డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఎంపిక చేసుకునే పథకాల ఆధారంగా ఈ విభాగంలో మూడేళ్ల కాలానికి వార్షిక సగటు కనిష్ట రాబడి 3 శాతంగాను, గరిష్ట రాబడి 17 శాతం వరకు ఉంది. కనుక ఎంపిక చేసుకునే పథకం ఇక్కడ ప్రామాణికం అవుతుంది. ఏడు శాతానికి పైనే రాబడి ఆశించొచ్చు. పీపీఎఫ్ అసంఘటిత రంగంలోని వారు, 15–20 ఏళ్ల కాల లక్ష్యాలకు పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో చేసే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చే రాబడులపైనా పన్ను ఉండదు. అన్ని విధాలుగా పన్ను ప్రయో జనం కలిగిన సాధనం. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%గా ఉంది. వీపీఎఫ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో కింద భవిష్యనిధి స్కీమ్ ఉంటుంది. దీనికి అదనంగా స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) పేరుతో అదనపు పెట్టుబడి చేసుకోవచ్చు. పీఎఫ్‌కు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్ పెట్టబడులకూ వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి పీపీఎఫ్ బ్యాలన్స్‌పై 8.10 శాతం వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. కాకపోతే వీపీఎఫ్‌లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాతే ఉపసంహరించుకోగలరు. ఒకవేళ ఉద్యోగానికి రాజీనామా చేసినా, రిటైర్ అయినా అటువంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌తోపాటు వీపీఎఫ్ కూడా తీసేసుకోవచ్చు. డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌తో ఒక సానుకూలత ఉంది. మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు డెట్ నుంచి ఈక్విటీకి, ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను బదలాయిస్తుంటాయి. తద్వారా రిస్క్ తగ్గించి, అధిక రాబడులను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. 9–18 శాతం మధ్య దీర్ఘకాలంలో వార్షిక రాబడులను వీటి నుంచి ఆశించొచ్చు. హైబ్రిడ్ ఫండ్స్ ఐదేళ్లు అంతకుమించిన కాలానికి హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవి. ద్రవ్యోల్బణం, పన్ను బాధ్యతలు తీసేసి చూసినా.. ఈక్విటీ ఫండ్స్‌లో రాబడి మెరుగ్గానే ఉంటుందని అందుబాటులోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కన్జర్వేటివ్ హబ్రిడ్ ఫండ్స్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అని రెండు రకాలు ఉన్నాయి. ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఇన్వెస్ట్ చేసేవి అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు. నూరు శాతం ఈక్విటీ రిస్క్ వద్దనుకునే వారు, ఈక్విటీ డెట్ కలయిక కోరుకునే వారికి ఇవి అనుకూలం. వీటిల్లో వార్షిక రాబడి దీర్ఘకాలంలో 12–18 శాతం మధ్య ఆశించొచ్చు. వీటికి ఈక్విటీ పథకాలకు మాదిరే పన్ను విధానం వర్తిస్తుంది. లాభాలు స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీలకు 10–25% మధ్య కేటాయింపులు చేస్తాయి. వీటిల్లో రాబడులకు డెట్ ఫండ్స్ పన్ను విధానం వర్తిస్తుంది. రిస్క్ తక్కువ తీసుకునే వారికి ఇవి అనుకూలం. కొంత భాగం ఈక్విటీలకు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో వార్షిక రాబడి 9–12% మధ్య ఉంటుంది. ఇక బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీలు, డెట్‌కు సమానంగా కేటాయింపులు చేస్తుంటాయి. లార్జ్‌క్యాప్/మిడ్‌క్యాప్/స్మాల్‌క్యాప్ లార్జ్‌క్యాప్ కంపెనీలు ఎలాంటి మార్కెట్ పరిస్థితులను అయినా, ఆర్థిక సంక్షోభాలను అయినా తట్టుకోగలవు. ఎందుకంటే ఆయా రంగాల్లో అవి పెద్ద స్థాయికి చేరినవి కనుక. రిస్క్ తక్కువగా ఉండాలని భావించే వారు ఐదేళ్లు అంతకుమించిన కాలానికి లార్జ్‌క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. సగటు వార్షిక రాబడులు 12–18 శాతం మధ్య ఉంటాయి. మోస్తరు రిస్క్ తీసుకునే వారు మిడ్‌క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో రాబడులు 12–22 శాతం మధ్య ఉంటాయి. స్మాల్‌క్యాప్ పథకాలను పదేళ్లు అంతకుమించిన కాలానికి, అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదు అధిక రాబడులు కోరుకునే వారు పరిశీలించొచ్చు. వీటిల్లో రాబడులను 18 శాతానికి పైన ఆశించొచ్చు. -
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో... డిపాజిట్ భద్రమేనా?
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్.. ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి విశ్వసనీయమైన సాధనం. సమీపంలోని బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకోవడం, అవసరం ఏర్పడినప్పుడు వెళ్లి తీసుకోవడం సౌకర్యాన్నిచ్చే అంశం. బ్యాంకులో డిపాజిట్ అయితే ఎక్కడికీ పోదు? అన్న నమ్మకం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఎఫ్డీలపై అధిక వడ్డీ రేటును కొన్ని బ్యాంకులు ఆఫర్ చేయడం గమనించే ఉంటారు. ఈ విషయంలో వాణిజ్య బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) కొంచెం అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. మరి అధిక రాబడి కోసం ఈ సాధనాలను ఎంపిక చేసుకోవడం ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్న రావచ్చు. అలాగని, అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయంటే ఏదో సందేహించాల్సిందే? అని భావించడం కూడా సరికాదు. ఎందుకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయన్నది ఇక్కడ గమనించాలి. ఆర్బీఐ నియంత్రణల పరిధిలో పనిచేసే బ్యాంకులు ఏవైనా, వాటిల్లో డిపాజిట్ చేసే విషయంలో సందేహించక్కర్లేదు. డిపాజిట్‌పై ఇన్సూరెన్స్ అమల్లో ఉందా? అన్నది విచారించుకోవాలి. అంతేకాదు, డిపాజిట్‌కు ముందు ముఖ్యమైన అంశాలు కొన్నింటిని విశ్లేషించుకోవాలి. అప్పుడే రాబడితోపాటు, భరోసా ఉండేలా చూసుకోవచ్చు. రిస్క్–రాబడి.. చాలా వరకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు) ఏడాది కాల ఎఫ్డీలపై 7–7.25% రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు కంటే కనీసం ఒక శాతం ఎక్కువ. వడ్డీ రేటు వ్యత్యాసం అన్నది ఎస్ఎఫ్బీలు, ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య 1.5–2% వరకు ఉంది. అందుకే కొందరు ఇన్వెస్టర్లకు ఎస్ఎఫ్బీలు ఆఫర్ చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ రేటు ఆకర్షణీయంగా అనిపించొచ్చు. రేటు ఆకర్షణీయంగానే ఉన్నా, భద్రత విషయంలో సందేహంతో వెనుకాడాల్సిన అవసరం లేదు. అన్ని ఇతర షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మాదిరే, ఎస్ఎఫ్బీలు సైతం ఆర్బీఐ నియంత్రణల పరిధిలోనే పనిచేస్తాయి. కనుక ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి కూడా.. రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కవరేజీ ఉంటుంది. పెద్ద వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఎస్‌ఎఫ్‌బీల వ్యాపార నమూనా అధిక రిస్క్ తో ఉంటుంది. అందుకనే అవి డిపాజిట్లపై కాస్తంత అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఎస్ఎఫ్బీలు తమ మొత్తం రుణాల్లో 75 శాతాన్ని ప్రాధాన్య రంగాలకు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయం, ఎస్ఎంఎంఈలు ప్రాధాన్య రంగాల కిందకు వస్తాయి. అలాగే, ఎస్‌ఎఫ్‌బీల రుణ పుస్తకంలో 50 శాతం రుణాలు.. ఒక్కోటీ రూ.25 లక్షలు, అంతకులోపే ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. దీని కారణంగా ఎస్‌ఎఫ్‌బీల రుణాల్లో అన్సెక్యూర్డ్ రుణాలు 50–75 శాతం వరకు ఉంటాయి. కానీ, పెద్ద వాణిజ్య బ్యాంకుల్లో అన్సెక్యూర్డ్ రుణాలు మొత్తం రుణాల్లో 30 శాతం కంటే తక్కువే ఉంటాయి. ఎటువంటి హామీ/తనఖా లేని రుణాలు అన్సెక్యూర్డ్ కిందకు వస్తాయి. అందుకనే ఎస్‌ఎఫ్‌బీల వ్యాపారంలో రిస్క్ ఎక్కువ. కనుక ఎస్ఎఫ్బీలు రుణాల రిస్క్‌ను బ్యాలన్స్ చేసుకునేందుకు.. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే 1.5–2.5% అధిక రేటుపై రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణ రేటు 6.9 % నుంచి మొదలవుతోంది. అదే ఎస్ఎఫ్బీల్లో ఈ రేటు 8.5% నుంచి ఉంటోంది. ఇలా రుణాలపై అధిక రేటును ఎస్ఎఫ్బీలు వసూలు చేస్తుంటాయి. డిపాజిట్లపై మెరుగైన రేటును ఆఫర్ చేయడానికి ఇది కూడా ఒక కారణమే. ఇక ఎస్ఎఫ్బీలు మొదలై 5–6 ఏళ్లే అవుతోంది. కనుక డిపాజిట్ల సమీకరణ దశలోనే అవి ఇంకా ఉన్నాయి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం, అధిక డిపాజిట్ బేస్ వచ్చే వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ రేటును ఆఫర్ చేయడం సహజంగానే చూడాలి. ఎంత వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు..? మీకు సమీపంలోని ఎస్ఎఫ్బీ శాఖకు వెళ్లి డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ సంస్థలు ఇంకా పూర్తి స్థాయి టెక్నాలజీ వనరులను సమకూర్చుకోలేదు. కనుక నేరుగా వెళ్లి ఎఫ్డీ చేసుకోవడం మంచిదే. అత్యవసరాల్లో తిరిగి డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవడం ఆలస్యం కాకుండా ఉంటుంది. ఇక ఎంత మొత్తం వరకు డిపాజిట్ చేసుకోవచ్చు? అన్న సందేహం రావచ్చు. ఒక వ్యక్తి తన పొదుపు నిధులు మొత్తాన్ని ఒకే బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకోవడం సూచనీయం కాదు. పైగా ఎస్ఎఫ్బీలో డిపాజిట్ చేసుకోవడానికి ముందు బ్యాంకు కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయో? ఒక అంచనాకు రావాలి. నమ్మకం ఏర్పడిన తర్వాతే డిపాజిట్‌కు వెళ్లాలి. అధిక రాబడుల కోసం మిగులు నిధుల వరకే డిపాజిట్‌కు పరిమితం కావాలి. డిపాజిట్ మొత్తానికి భద్రత కోరుకునేట్టు అయితే.. అప్పుడు ఒక బ్యాంకు పరిధిలోలో రూ.5 లక్షలకు మించి డిపాజిట్ చేయవద్దు. ఎందుకంటే డీఐసీజీసీ కింద బ్యాంకు సంక్షోభం పాలైతే ఒక బ్యాంకు పరిధిలో ఒక డిపాజిట్ దారుకు గరిష్టంగా వచ్చేది రూ.5 లక్షలకే పరిమితం. అందుకుని రూ.5 లక్షల చొప్పున వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్చేసుకోవాలి. దీర్ఘకాలానికి కాకుండా 1–3 ఏళ్ల వరకు డిపాజిట్ చేసుకుని, కాల వ్యవధి ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకోవడం మంచిది. ఆయా అంశాలపై ఒక నిర్ణయానికి ముందు వీటిపై సమగ్ర సమచారం పొందాలి. నిపుణులను సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకు ఎంపిక ఎలా? స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే వాటి అధికారిక వెబ్ సైట్ల నుంచి గణాంకాలు పొందొచ్చు. బ్యాంకు సామర్థ్యం ఏపాటిదో అవగాహన తెచ్చుకునేందుకు వాటి స్థూల మొండిబాకీలు (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్–ఎన్పీఏలు) ఏ స్థాయిలో ఉన్నాయి? బ్యాంకు రుణ పుస్తకం, డిపాజిట్ల బేస్ గత మూడేళ్ల కాలంతో పోలిస్తే, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉందన్నది చూడాలి. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు మెరుగుపడ్డాయా లేక క్షీణించాయా? గమనించాలి. ఎస్ఎఫ్బీలు చిన్న గా (పరిమాణం పరంగా) ఉన్నందున వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే అవి అధిక వృద్ధిని నమోదు చేయగలవు. రుణాలు, డిపాజిట్లలో 25–35% వరకు, నికర వడ్డీ ఆదాయంలో 20–25% వృద్ధి ఉందంటే సానుకూలంగా చూడొచ్చు. ఎస్‌ఎఫ్‌బీలలో ఏయూ ఎస్ఎఫ్బీ మినహా మిగిలినవి సూక్ష్మ రుణ కార్యకలాపాలనే ఎక్కు వగా నిర్వహిస్తున్నాయి. దీంతో కరోనా సమయంలో వీటికి ఎక్కువ షాక్‌లు తగిలాయి. వాటి ఎన్పీఏలు ఐదేళ్ల సగటును మించి పోయాయి. వ్యాపార కార్యకలాపాలు తిరిగి గాడిన పడిన తర్వాత ఇవి తగ్గుముఖం పట్టడం సహజం. ఎస్ఎఫ్బీలు అన్నీ కూడా తగినన్ని నిధులతో ఉన్నందున ఆందోళన అనవసరం. -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
సుల్తాన్‌బజార్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్లు తమకు కూడా రూ.10,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతూ ఆశ వర్కర్లు తలపెట్టిన ‘తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి’కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయానికి వస్తున్న ఆశ వర్కర్లను సుల్తాన్ బజార్ పోలీసులు కోఠి డీఎంహెచ్ఎస్ గేటు వద్ద అడ్డుకున్నారు. 865 మంది ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఘటనపై 8 కేసులను నమోదు చేశారు. తమ హక్కుల కోసం నిరసన తెలిపేందుకు వస్తున్న ఆశ వర్కర్లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారని తెలంగాణ ఆశ యూనియన్ అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ శుక్రవారం (13న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 19న కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని వెల్లడించారు. -
క్రమం తప్పకుండా ఆదాయం
పదవీ విరమణ చేసిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోసం కచ్చితంగా ఒక ఏర్పాటు అనేది ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలు ఉంటాయి. ప్రైవేటు రంగంలోని వారికి సైతం పదవీ విరమణ తర్వాత పెన్షన్ కోసం ఈపీఎఫ్‌వో అందించే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది. కానీ, దీనిపై వచ్చే పెన్షన్ చాలా తక్కువ. కనుక ప్రైవేటు రంగంలోని వారు, స్వయం ఉపాధిలో ఉన్న వారు పదవీ విరమణ అనంతరం క్రమం తప్పకుండా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. వీరికోసం అందుబాటులో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన ఫిక్స్డ్ డిపాజిట్‌తోపాటు.. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవడం (ఎస్‌డబ్ల్యూపీ) ఇలా ఎన్నో. అయితే, అందరికీ అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. కనుక ఈ సాధనాలు, వాటిల్లో రాబడులు, రిస్క్ ఏ మేరకు తదితర వివరాలను తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది.. తమ పెట్టుబడులు, రాబడులపై ఎటువంటి రిస్క్ వద్దనుకునే వారు పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాన్ని (పీవోఎంఐఎస్) పరిశీలించొచ్చు. అన్ని వయసుల వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి వయవందన యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటివి 60 ఏళ్లు నిండిన వారికి మాత్రమే. కానీ, ఇవన్నీ సురక్షిత సాధనాలు. మూడు నెలలకోసారి అయినా ఫర్వాలేదనుకుంటే అందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ మూడింటిలో అధిక రాబడులను ఇచ్చే సాధనం. పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో ప్రస్తుతం పెట్టుబడులపై 7.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షలు, అదే జాయింట్‌గా అయితే రూ.9 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది. దీని కాల వ్యవధి ఐదేళ్లు. ఏడాది పూర్తయిన తర్వాత ముందస్తుగా వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. కాకపోతే పెట్టుబడిలో 2 శాతాన్ని తపాలా శాఖ మినహాయించుకుంటుంది. అదే మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటే అప్పుడు ఒక్క శాతమే కోల్పోవాల్సి వస్తుంది. పీవోఎంఐఎస్ పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం ఆ వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఇతర ఆదాయ మార్గంలో దీన్ని చూపించి అవసరమైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వయవందన యోజన ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పెట్టుబడి సాధనం. ఇందులో ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. కాల వ్యవధి పదేళ్లు. కనీసం రూ.1.5 లక్షలు, గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీఎంవీవీవై ద్వారా వచ్చే వడ్డీ ఆదాయాన్ని కూడా వార్షిక ఆదాయ రిటర్నుల్లో ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పథకంలో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.6 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా రిటైర్మెంట్ సమయంలో వచ్చిన మొత్తాన్ని.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తారు. 60 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఇందులో పెట్టుబడులకు అర్హులు. అదే ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారు (55–60 ఏళ్ల మధ్య) ఒక నెల వ్యవధి మించకుండా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ప్రతీ త్రైమాసికం చివర్లో.. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెల చివరి తేదీన వడ్డీ చెల్లింపులు చేస్తారు. యాన్యుటీ ప్లాన్లు బీమా కంపెనీలు ఆఫర్ చేసే ఇమీడియట్ యాన్యుటీ పథకాలు కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనం. వీటిల్లోనూ రిస్క్ తక్కువే. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై, మరుసటి నెల నుంచే పెన్షన్ అందుకోవచ్చు. కాకపోతే వీటిల్లో పెట్టుబడులపై రాబడులు తక్కువగా ఉంటాయి. వీటిల్లో గరిష్ట రాబడి రేటు కేవలం 6 శాతమే. వీటిపై వచ్చే ఆదాయాన్ని ఇతర మార్గాల కింద వచ్చిన ఆదాయంగా ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటిలోకి రాబడులు ఎస్సీఎస్ఎస్లోనే ఎక్కువ అని చెప్పుకోవాలి. కాకపోతే గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలు. పైగా మూడు నెలలకోసారి మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. మొదటి మూడు నెలలకు సరిపడా నిధి మీ వద్ద ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, ఈ పథకంలో పెట్టుబడులు సౌకర్యంగా, రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఇది అనుకూలంగా లేదనుకున్న వారు వయవందన యోజనను పరిశీలించొచ్చు. అలాగే, ఒక పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితికి మించి ఇంకా నిధి మిగిలి ఉంటే అప్పుడు మరో పథకాన్ని ఎంచుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు రిస్క్ కొంచెం తక్కువ కోరుకునే వారి కోసం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. కాకపోతే జాతీయ బ్యాంకుల్లో అయితే దీర్ఘకాలానికి వడ్డీ రేటు 7 శాతం వరకే ఉంది. ఒకవేళ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తిగా ఉంటే 7–9 శాతం మధ్య వడ్డీ రాబడి పొందొచ్చు. సాధారణంగా బ్యాంకులు త్రైమాసికం వారీగా వడ్డీ చెల్లింపులు చేస్తాయి. అయితే, డిపాజిటర్ కోరితే నెలవారీగా చెల్లింపులు చేసే బ్యాంకులు కూడా ఉన్నాయి. కాకపోతే నెలవారీగా కోరుకుంటే వచ్చే ఆదాయం కాస్త తగ్గుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ అనే పథకాన్ని నిర్వహిస్తోంది. సాధారణ ఎఫ్‌డీతో పోలిస్తే ఇది భిన్నమైనది. ఇందులో పెట్టుబడి కాల వ్యవధి తర్వాత చెల్లింపుల కాలవ్యవధి ఆరంభమవుతుంది. అంటే 24 నెలల పాటు పెట్టుబడి కాల వ్యవధిని ఎంచుకున్నారనుకంటే... ఆ తర్వాత, తదుపరి 24 నెలల పాటు చెల్లింపులు జరుగుతాయి. వడ్డీ రేటు 7.25 శాతం. చెల్లింపుల సమయంలో ప్రతి నెలా చెల్లింపులు చేయగా మిగిలిన మొత్తంపై వడ్డీ కలుస్తూ ఉంటుంది. ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు అధిక రిస్క్ తీసుకునే వారు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించొచ్చు. కాకపోతే మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటినే పరిశీలించడం మంచిది. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు అధిక రేటును ఆఫర్ చేస్తాయి. అందుకే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏఏఏ రేటింగ్ కలిగిన బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతం 7.72 నుంచి 8.05 శాతం వరకు వార్షిక వడ్డీని నెలవారీగా చెల్లింపులపై ఆఫర్ చేస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయాన్ని ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు 60 ఏళ్లు నిండిన వారు మినహాయింపు పొందొచ్చు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను పరిశీలించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే సాధనం (సిప్)కు ఇది పూర్తి వ్యతిరేకం. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నుంచి క్రమం తప్పకుండా ఇంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేదానిని ఎస్డబ్ల్యూపీగా పేర్కొంటారు. తన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల నుంచి ప్రతీ నెలా ఇంత మొత్తం కావాలని ఏఎంసీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ మీ రిస్క్‌ను బట్టి, పూర్తిగా డెట్ లేదా ఈక్విటీ లేదా ఈక్విటీ డెట్ కలయికతో కూడిన ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్ చేసిన మరుసటి నెల నుంచే తీసుకుంటే మొదటి ఏడాది వరకు ఎగ్జిట్‌లోడ్‌ను భరించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది ఒక శాతంగా ఉండొచ్చు. పైగా ఎస్‌డబ్ల్యూపీపై ప్రతి నెలా వెనక్కి తీసుకునే మొత్తంపై లాభం ఆర్జిస్తే, అది మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. ఈక్విటీ పథకాలు అయితే స్వల్పకాల మూలధన లాభాలు (ఏడాదిలోపు)పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి మించిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం.. మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించి ఉంటే ఆ మొత్తంపైనే 10 శాతం పన్ను అమలవుతుంది. ఈక్విటీ కాకుండా ఇతర పథకాలు అయినా మూడేళ్లకు మించి కొనసాగించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 20 శాతం వర్తిస్తుంది. మూడేళ్ల లోపు కాలంలో వచ్చే లాభాలను వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. -
డిపాజిట్ క్యాన్సిలేషన్ వద్దు..!
ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఎందుకంటే పెట్టుబడి విషయంలో ఇది సౌకర్యవంతమైన సాధనం. బ్యాంకు శాఖకు వెళ్లి గంట వ్యవధిలో డిపాజిట్ చేయడం, అవసరమైనప్పుడు వెళ్లి గంటలో నగదుగా మార్చుకోగల సౌకర్యం ఇందులో ఉంది. ఇతరత్రా ఎటువంటి సమస్యలూ ఇందులో ఉండవు. భద్రత కూడా ఎక్కువే. రాబడి తక్కువే ఉన్నా ఎక్కువ మంది ఫిక్స్డ్ డిపాజిట్‌ను ఇష్టపడడానికి కారణం ఈ అంశాలే. డిపాజిట్ చేయడమే కాదు.. డబ్బుకు అవసరం ఏర్పడినప్పుడు ఆ డిపాజిట్‌ను రద్దు చేసుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. కానీ, తాత్కాలిక అవసరానికి డిపాజిట్‌ను రద్దు చేసుకోవడం కంటే దానిపై రుణం తీసుకోవడమే మంచిది. ఎందుకంటే మళ్లీ డబ్బులు చేతికి అందగానే రుణాన్ని వెంటనే తీర్చేయవచ్చు. మీరు చేసిన డిపాజిట్‌పై యథావిధిగా రాబడులు కొనసాగుతాయి. సానుకూలతలు ఇవే.. ► ఆర్థిక అత్యవసర సమయాల్లో డిపాజిట్ల (ఎఫ్డీ)ను రద్దు చేసుకోవడానికి బదులు దానిపై రుణం తీసుకుంటే మీరు చెల్లించే వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది. గృహ రుణం తర్వాత అతి తక్కువ రుణ రేటు ఎఫ్డీపై తీసుకునే రుణంపైనేనని తెలుసుకోవాలి. ► ఎఫ్డీ రేటు(ఎఫ్డీఆర్)పై బ్యాంకులు సాధారణంగా 1–2.5 శాతం అధికంగా రుణ రేటును అమలు చేస్తుంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం మీ ఎఫ్డీపై బ్యాంకు రేటు 7 శాతంగా ఉందనుకోండి. అప్పుడు ఎఫ్డీపై తీసుకునే రుణానికి చెల్లించాల్సిన రేటు 8–9.5 శాతం మధ్యే ఉంటుంది. ► ఎఫ్డీపై రుణానికి మీకు ఇతరత్రా ఎటువంటి అర్హతలు అవసరం లేదు. బ్యాంకులు క్రెడిట్ స్కోరు కూడా చూడవు. ► ఎఫ్డీ విలువలో బ్యాంకులు గరిష్టంగా 75–95% వరకు రుణంగా ఇస్తాయి. ఇది సెక్యూర్డ్ రుణమే. ► రుణం కోసం ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించక్కర్లేదు. రుణం తీసుకుని మీరు వడ్డీ చెల్లిస్తున్న సమయంలోనూ.. బ్యాంకు ఎఫ్డీపై మీకు వడ్డీ రాబడి యథావిధిగా కొనసాగుతుంది. ► రుణ చెల్లింపునకు కాల వ్యవధి ఎఫ్డీకాల వ్యవధిగానే ఉంటుంది. మీకు డబ్బులు చేతికి అందగానే ఎఫ్డీపై రుణాన్ని క్లియర్ చేసేయవచ్చు. కొద్ది రోజుల అవసరాల కోసం దీర్ఘకాలిక ఎఫ్డీని రద్దు చేసుకోవడానికి బదులు.. రుణం తీసుకుని, ఎఫ్డీ కాల వ్యవధిలోనే దానిని చెల్లించేయడం మంచిది. ముందస్తు చెల్లింపు చార్జీలూ ఉండవు. ► ఒకవేళ డిపాజిట్‌ను నిర్ణీత కాలానికి ముందుగానే రద్దు చేసుకుంటే కొంత రాబడిని కోల్పోవాల్సి రావచ్చు. ఉదాహరణకు మీరు రెండేళ్ల కాలానికి డిపాజిట్ చేసి, మూడు నెలల తర్వాత వెళ్లి రద్దు చేసుకుంటే.. బ్యాంకు మూడు నెలల కాలానికి అమల్లో ఉన్న వడ్డీ రేటే చెల్లించొచ్చు. దీనికన్నా... డిపాజిట్‌పై రుణమే బెటర్. -
డిపాజిట్లకు మరింత రక్షణ
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. త్వరలో ఇది మరింత భద్రంగా మారనుంది. ప్రస్తుతం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమాను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై చెల్లింపుల్లో విఫలమైతే... అప్పుడు ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు సంక్షోభం పాలవడంతో ఆ బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేసుకున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిపాజిటర్ల ఆగ్రహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై వెళ్లిన సందర్భంగా స్వయంగా చవి చూశారు కూడా. ఆర్బీఐ సైతం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని బలంగా చాటాయి. దీంతో కేంద్ర సర్కారు ఈ అవసరాన్ని గుర్తించడంతోపాటు అమలు దిశగా చర్యలు చేపట్టింది. ఈ శీతాకాల సమావేశాల్లో బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా పెంపునకు చట్టాన్ని తేనున్నట్లు మంత్రి సీతారామన్ రెండు రోజుల క్రితమే వెల్లడించారు. అయితే, ఎంత మొత్తానికి ఈ పెంపు అన్న విషయాన్ని ఆమె చెప్పలేదు. రెండు రకాలు..: బ్యాంకు డిపాజిట్లను రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. రిటైల్ డిపాజిట్ దారులకు రూ.లక్ష బీమాను రూ.5 లక్షలకు చేయనుండడం ఒకటి కాగా, హోల్‌సేల్ డిపాజిట్‌దారులకు ఈ మొత్తాన్ని రూ.25 లక్షలుగా చేయడం రెండోది. చివరిగా 1993 మే 1న డిపాజిట్లపై బీమాను సవరించారు. 1992లో జరిగిన సెక్యూరిటీస్ స్కామ్ దెబ్బకు బ్యాంక్ ఆఫ్ కరద్ మూతపడటం నాడు డిపాజిట్లపై గరిష్ట బీమాగా ఉన్న రూ.30,000 మొత్తాన్ని రూ.లక్షకు పెంచడానికి కారణమైంది. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం మరో విడత సవరణ అవసరాన్ని గుర్తు చేసింది. అయితే, డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచితే బ్యాంకులు చెల్లిస్తున్న ప్రీమియం కూడా పెరుగుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మరో రెండు రకాల ప్రతిపాదనలను కూడా పరిశీలించొచ్చని విశ్వసనీయ సమాచారం. పెంచిన మేరకు డిపాజిట్లపై బీమా మొత్తాన్ని బ్యాంకులు సహజంగానే చెల్లించాలి. దీన్ని డిపాజిట్‌దారుల నుంచే వసూలు చేయొచ్చన్నది మరో ప్రతిపాదన. ఆర్బీఐ అనుబంధ విభాగమైన డీఐసీజీసీ విడిగా ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, పీఎంసీ బ్యాంకు తరహా సంక్షోభాల్లో చెల్లింపులకు వినియోగించడం మరొక ప్రతిపాదన. వీటిల్లో ఏది ఆచరణ రూపం దాల్చనుందనేది అతిత్వరలోనే తెలిసే అవకాశం ఉంది. రూ.10 లక్షలు చేయాలి.. బ్యాంకు డిపాజిట్లపై బీమాను రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ఆర్బీఐ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ‘‘డిపాజిట్లపై బీమాను కనీసం రూ.10 లక్షలు చేయాలని గతంలో సూచించాం. మరోసారి దీన్ని పరిశీలించాలని కోరుతున్నాం’’ అని అఖిల భారత రిజర్వ్ బ్యాంకు ఉద్యోగుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. డాలర్ మారకంలో చూసుకుంటే రూ.10 లక్షల బీమా 14,000 డాలర్లకు సమానమని, చాలా దేశాల్లో ఉన్న బీమా కంటే ఇది ఎంతో తక్కువ మొత్తమని సంఘం పేర్కొంది. -
మీ ఫిక్స్డ్ డిపాజిట్ భద్రమేనా..?
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది రిటైల్ ఇన్వెస్టర్లకు ఎంతో విశ్వసనీయమైన, సౌకర్యమైన ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఎన్నో దశాబ్దాలుగా ఎక్కువ మంది అనుసరించే సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఎన్నో కాల పరీక్షలకు నిలిచింది. రిస్క్ లేని సాధనం కావడంతో రాబడి తక్కువైనా కానీ చిన్న ఇన్వెస్టర్లకు ఇది నమ్మతగ్గ ఆర్థిక సాధనంగా నిలబడింది. అయితే, ఇటీవలి సంవత్సరాల కాలంలో బ్యాంకుల్లోనూ సంక్షోభాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో మీ డిపాజిట్ సురక్షితంగా ఉన్నట్టేనా...? బ్యాంకుల్లో డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ (డీఐసీజీసీ) కింద బీమా ఉంటుంది. ఇందుకోసం డిపాజిట్ చేసిన వారు ఎటువంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. ఆ పని బ్యాంకే చేస్తుంది. అయితే, ప్రతీ ఒక్కరూ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకులో ఒక వ్యక్తికి కేవలం రూ.లక్ష డిపాజిట్ మొత్తానికే బీమా వర్తిస్తుంది. ఒకవేళ రూ.లక్షకు మించి డిపాజిట్ చేసి ఉంటే అప్పుడు కూడా రూ.లక్షకే బీమా కవరేజీ ఉన్నట్టు. ఒకవేళ బ్యాంకు డిపాజిట్ దారునికి చెల్లించలేని పరిస్థితిలోకి వెళితే ఒక డిపాజిట్ దారునికి గరిష్టంగా రూ.లక్ష మేర బీమా కింద చెల్లింపులు చేస్తారు. అందుకే ఈ విషయంలో తమ డిపాజిట్‌కు భద్రత ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కొన్ని నివేదికలను పరిశీలించినట్టయితే... మన బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లలో 30 శాతం డిపాజిట్లకే బీమా కవరేజీ ఉందని తెలుస్తోంది. పదేళ్ల క్రితం ఇది 60 శాతంతో పోలిస్తే సగానికి సగం తగ్గినట్టు భావించాలి. ఈ మధ్య కాలంలో రూ.లక్షకు మించి డిపాజిట్ చేసే వారి సంఖ్య బాగానే పెరుగుతోంది. రూ.లక్షకు మించి చేసే డిపాజిట్లకు రిస్క్ ఉందని అర్థం చేసుకోవాలి. ఊహించని పరిస్థితులు ఎదురై బ్యాంకు డిపాజిట్లు తిరిగి ఇవ్వలేని పరిస్థితి తలెత్తితే అప్పుడే రిస్క్‌లో పడతాం. కాకపోతే డిపాజిట్ దారులు తెలివిగా వ్యవహరించడం ద్వారా ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చు. స్థిరమైన బ్యాంకు పెద్దవైన, స్థిరమైన బ్యాంకులు అంత సులభంగా సంక్షోభాల్లోకి వెళ్లకపోవచ్చు. ఆస్తుల పరమైన సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యంతోనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ వంటి పెద్ద బ్యాంకులు రుణ ఆస్తుల విషయంలో ఎన్నో సమస్యలను చవిచూసినప్పటికీ, వాటిని అధిగమించే చర్యలతో మెరుగైన పనితీరునే చూపిస్తున్నాయి. పెద్ద బ్యాంకులు రుణాల విషయంలో కఠినమైన నిబంధనలనే అనుసరిస్తుంటాయి. అలాగే, యాజమాన్యం కూడా చురుగ్గానే వ్యవహరిస్తుందని భావించొచ్చు. మొత్తం రుణాల్లో... వసూలు కాని రుణాలు (ఎన్పీఏలు), ఎగవేసిన రుణాల పరిమాణం తక్కువగానే ఉంటుంది. మీరు చేసిన డిపాజిట్‌ను బ్యాంకు కొంత కాలం తర్వాత మీకు అవసరమైన సందర్భంలో తిరిగి చెల్లించగలదా..? అని తెలుసుకునేందుకు ఆ బ్యాంకు నికర వడ్డీ మార్జిన్‌ను పరిశీలించాలి. డిపాజిట్ దారులకు బ్యాంకు చెల్లించే వడ్డీ రేటు, రుణాలపై బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు.. వీటి మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్ అవుతుంది. బ్యాంకు మొత్తం రుణ ఆస్తులపై సగటున ఈ నికర వడ్డీ మార్జిన్ ఎంతుందనేది బ్యాంకు ప్రతీ త్రైమాసికం ఫలితాల్లోనూ ప్రకటిస్తుంటుంది. పరిశ్రమ సగటు కంటే బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ అధికంగా ఉంటే లేదా బెంచ్ మార్క్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నా సరే.. ఆ బ్యాంకు ఆర్థిక ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు. దాంతో డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకే చోట వద్దు ఆర్థిక ఆరోగ్యంతో ఉన్న పెద్ద బ్యాంకులో చేసే డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని భావించొచ్చు. అయితే, ఆ డిపాజిట్‌కు ఏమీ కాదులేనని గ్యారంటీగా చెప్పలేం. పెద్ద బ్యాంకులు తమ ఆస్తుల పరిమాణాన్ని పెంచుకునేందుకు భారీ ఎత్తుగడులనే అనుసరిస్తుంటాయి. కనుక రిస్క్ కూడా ఉంటుంది. అందుకని డిపాజిట్ చేసే సమయంలోనే మనమే కొన్ని చర్యలు అనుసరించడం లాభిస్తుంది. కనుక ఒకే బ్యాంకులో ఒకరి పేరిటే మొత్తం డిపాజిట్ చేయకపోవడం ఓ మంచి ఆలోచన. కుటుంబ సభ్యులు ఒక్కొకరి పేరిట గరిష్టంగా రూ.లక్ష వరకు డిపాజిట్ చేసుకోవడం వల్ల... భవిష్యత్తులో బ్యాంకు సంక్షోభంలోకి వెళ్లినా తమ డిపాజిట్లకు భద్రత ఉంటుంది. అయితే, డిపాజిట్‌పై ఆదాయానికి పన్ను వర్తిస్తుందని మర్చిపోవద్దు. ఇక కుటుంబ సభ్యుల పేరిట డిపాజిట్‌ను విభజించేందుకు ఇష్టం లేని వారు.. తమ పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.లక్ష చొప్పున డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకటే పెద్ద డిపాజిట్ కాకుండా దాన్ని పలు డిపాజిట్లుగా వేరు చేయడం వల్ల.. ఎప్పుడైనా డబ్బులతో పని పడితే అవసరమైనంత మేరకే డిపాజిట్లను రద్దు చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక్క డిపాజిట్‌గానే చేయడం వల్ల ఆ మొత్తాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే కొంత రాబడిని కోల్పోవాల్సి వస్తుంది. మరొకరితో కలసి రూ.2 లక్షలు జాయింట్‌గా డిపాజిట్ చేశారనుకోండి. అప్పుడు రూ.2 లక్షలకూ బీమా కవరేజీ వర్తించేలా చూసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.లక్ష డిపాజిట్‌పై బీమా అమలవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.. ► కేవలం బ్యాంకుల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల(రూ.లక్ష వరకు)కే కొంత భద్రత ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అన్నది ఆర్బీఐ సబ్సిడరీ. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే... బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లించి ఉండాలి. ► డిపాజిట్లను వివిధ బ్యాంకుల మధ్య వేరు చేయడం వల్ల రిస్క్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైగా ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటే డిపాజిట్‌ను దీర్ఘకాలానికి చేయడానికి బదులు... చిన్న డిపాజిట్లుగా వేర్వేరు కాలాలకు డిపాజిట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఉదాహరణకు రూ.4 లక్షలు డిపాజిట్ చేసుకోదలిస్తే.. రూ.లక్ష చొప్పున ఒక్కో డిపాజిట్‌గా చేసుకోవాలి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్ల కాలానికి ఒకటి కేటాయించుకోవాలి. ఏడాది డిపాజిట్ గడువు తీరిపోగానే తిరిగి నాలుగేళ్లకు డిపాజిట్ చేసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ రేట్ల పరంగా స్థిరత్వం ఉండేలా, లిక్విడిటీ ఉండేలా చూసుకోవచ్చు. ► ఎఫ్డీ చేసే సమయంలోనే కాలాన్ని ఆలోచించి నిర్ణయించుకోవాలి. దీర్ఘకాలానికి డిపాజిట్ చేసుకుని, ముందే రద్దు చేసుకుంటే తక్కువ రాబడులకే పరిమితం కావాల్సి వస్తుంది. ఎందుకంటే గడువుకు ముందే డిపాజిట్ రద్దు చేసుకుంటే బ్యాంకులు ఒక శాతాన్ని తగ్గించి ఇస్తాయి. ఏడాది కాలానికి 7 శాతం, 5 ఏళ్ల దీర్ఘకాలానికి 7.5 శాతం ఆఫర్ చేసినప్పుడు, వడ్డీ ఎక్కువగా వస్తుందన్న ఆలోచనతో దీర్ఘకాల డిపాజిట్‌కు వెళ్లడం కంటే అవసరమైన కాలానికే డిపాజిట్ చేసుకోవాలి. ► ఎఫ్డీపై వచ్చే డిపాజిట్ ఆదాయంపై పన్ను అమలవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే బ్యాంకులు వడ్డీ రాబడిపై 10.3 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయిస్తాయి. ఇంతటితో పన్ను బాధ్యత తీరినట్టు కూడా కాదు. అధిక పన్ను పరిధిలో ఉంటే తమ శ్లాబు ప్రకారం అదనపు పన్ను కూడా చెల్లించాలి. టీడీఎస్ మినహాయించకపోయినప్పటికీ, బ్యాంకు సేవింగ్స్ ఖాతా, డిపాజిట్, బాండ్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. క్యుములేటివ్ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే పన్నును ఏటా చెల్లించడం మరిచిపోవద్దు. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఉన్నప్పటికీ, మొత్తం వార్షికాదాయం బేసిక్ కనీస మిహాయింపు పరిధిలోనే ఉంటే అప్పుడు టీడీఎస్‌ను వెనక్కి పొందేందుకు పన్ను రిటర్నులు దాఖలు చేసి క్లెయిమ్ చేసుకోవాలి. తమ ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలోనే ఉందంటూ బ్యాంకులోనే ఫామ్ 15జీ ఇస్తే టీడీఎస్ మినహాయించరు. అదే సీనియర్ సిటిజన్లు అయితే ఫామ్ 15హెచ్ ఇవ్వాలి. ► మీ జీవిత భాగస్వామి, పిల్లల పేరిట డిపాజిట్ చేయడం ద్వారా పన్ను బాధ తప్పించుకోవచ్చు అనుకుంటే కుదరదు. మీ జీవిత భాగస్వామి, పిల్లలకు ఇచ్చే మొత్తంపై పన్ను చెల్లించనక్కర్లేదు. కానీ, అలా ఇచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన సందర్భాల్లో వచ్చే ఆదాయం, ఇచ్చిన వారి ఆదాయానికే కలుస్తుంది. ఇతర ఉత్పత్తులు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా రిస్క్ తక్కువగా ఉండే ఇతర పెట్టుబడి పథకాలను కూడా పరిశీలించొచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీలు లేదా జీసెక్‌లు అత్యధిక భద్రతతో ఉంటాయి. షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు ఎంచుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. జీసెక్‌లను వద్దనుకుంటే సెకండరీ మార్కెట్లోనూ విక్రయించుకోవచ్చు. రెపో మార్కెట్లో వీటిపై రుణాలను కూడా పొందొచ్చు. -
గ్రీన్హౌస్ కంపెనీల అత్యాశ
చదరపు మీటరుకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు రూ. 700 కంపెనీల బిడ్డింగ్‌లో కనిష్ట ధర రూ. 840, గరిష్టం రూ. 1260 సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక బిడ్ వివరాలు వెల్లడయ్యాయి. టెండర్లలో పాల్గొన్న కంపెనీలు ప్రభుత్వ నిర్ణీత ధరకు మించి కోట్ చేశాయి. దీంతో ఆయా కంపెనీ ప్రతినిధులతో ఐదో తేదీన చర్చలు జరిపి తుది నిర్ణయానికి రావాలని సాంకేతిక కమిటీ నిర్ణయించింది. కోట్ చేసిన ధరలను తగ్గించేలా రాజీ చేసుకుని సర్కారు మార్గదర్శకాల ప్రకారం అర్హత గల కంపెనీల జాబితాను కమిటీ తయారు చేయనుంది. తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. నిజానికి గ్రీన్హౌస్ నిర్మాణానికి ఒక్కో చదరపు మీటరుకు రూ. 700 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఎకరా స్థలంలో 4 వేల చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణాన్ని చేపడితే అందుక య్యే వ్యయం రూ. 28 లక్షలు. ఇందులో 75 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన ఖర్చును రైతు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విత్తనాలు, భూమి చదును, ఇతరత్రా నిర్వహణ కోసం చదరపు మీటరుకు రూ. 140 ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందులోనూ రైతుకు 75 శాతం సబ్సిడీ లభిస్తుంది. అయితే తాజాగా కంపెనీలు గ్రీన్‌హౌస్‌ల నిర్మాణానికి ఎక్కువ ధరను కోట్ చేశాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో చదరపు మీటరుకు ఇండియన్ గ్రీన్హౌస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 935, నోయిడాకు చెందిన జెస్తా డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ. 840, హైదరాబాద్‌కు చెందిన భానోదయం ఇండస్ట్రీస్ కంపెనీ రూ. 1044, శ్రీసాయి ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 1260, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ. 1244, హైతాసు కార్పొరేషన్ రూ. 991, తమిళనాడుకు చెందిన అగ్రిఫ్లాస్ట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 844, మహారాష్ట్రకు చెందిన సన్మార్గ్ ఆగ్రో సర్వీసెస్ రూ. 1035గా ధరలను కోట్ చేశాయి. తుది ధర ఎంతైనా సర్కారు మాత్రం ఒక్కో చదరపు మీటరుకు ఇప్పటికే నిర్దేశించిన మేరకు రూ. 700 ధర ప్రకారమే 75 శాతం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన సొమ్మును రైతులే భరించాలని చెబుతున్నారు. రైతులు తమకు ఇష్టమైన కంపెనీని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు.