ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఎందుకంటే పెట్టుబడి విషయంలో ఇది సౌకర్యవంతమైన సాధనం. బ్యాంకు శాఖకు వెళ్లి గంట వ్యవధిలో డిపాజిట్ చేయడం, అవసరమైనప్పుడు వెళ్లి గంటలో నగదుగా మార్చుకోగల సౌకర్యం ఇందులో ఉంది. ఇతరత్రా ఎటువంటి సమస్యలూ ఇందులో ఉండవు. భద్రత కూడా ఎక్కువే. రాబడి తక్కువే ఉన్నా ఎక్కువ మంది ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఇష్టపడడానికి కారణం ఈ అంశాలే. డిపాజిట్ చేయడమే కాదు.. డబ్బుకు అవసరం ఏర్పడినప్పుడు ఆ డిపాజిట్‌ను రద్దు చేసుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. కానీ, తాత్కాలిక అవసరానికి డిపాజిట్‌ను రద్దు చేసుకోవడం కంటే దానిపై రుణం తీసుకోవడమే మంచిది. ఎందుకంటే మళ్లీ డబ్బులు చేతికి అందగానే రుణాన్ని వెంటనే తీర్చేయవచ్చు. మీరు చేసిన డిపాజిట్‌పై యథావిధిగా రాబడులు కొనసాగుతాయి.
సానుకూలతలు ఇవే..
► ఆర్థిక అత్యవసర సమయాల్లో డిపాజిట్ల (ఎఫ్‌డీ)ను రద్దు చేసుకోవడానికి బదులు దానిపై రుణం తీసుకుంటే మీరు చెల్లించే వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది. గృహ రుణం తర్వాత అతి తక్కువ రుణ రేటు ఎఫ్‌డీపై తీసుకునే రుణంపైనేనని తెలుసుకోవాలి.
► ఎఫ్‌డీ రేటు(ఎఫ్‌డీఆర్)పై బ్యాంకులు సాధారణంగా 1–2.5 శాతం అధికంగా రుణ రేటును అమలు చేస్తుంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం మీ ఎఫ్‌డీపై బ్యాంకు రేటు 7 శాతంగా ఉందనుకోండి. అప్పుడు ఎఫ్‌డీపై తీసుకునే రుణానికి చెల్లించాల్సిన రేటు 8–9.5 శాతం మధ్యే ఉంటుంది.
► ఎఫ్‌డీపై రుణానికి మీకు ఇతరత్రా ఎటువంటి అర్హతలు అవసరం లేదు. బ్యాంకులు క్రెడిట్ స్కోరు కూడా చూడవు.
► ఎఫ్‌డీ విలువలో బ్యాంకులు గరిష్టంగా 75–95% వరకు రుణంగా ఇస్తాయి. ఇది సెక్యూర్డ్ రుణమే.
► రుణం కోసం ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించక్కర్లేదు. రుణం తీసుకుని మీరు వడ్డీ చెల్లిస్తున్న సమయంలోనూ.. బ్యాంకు ఎఫ్‌డీపై మీకు వడ్డీ రాబడి యథావిధిగా కొనసాగుతుంది.
► రుణ చెల్లింపునకు కాల వ్యవధి ఎఫ్‌డీకాల వ్యవధిగానే ఉంటుంది. మీకు డబ్బులు చేతికి అందగానే ఎఫ్‌డీపై రుణాన్ని క్లియర్ చేసేయవచ్చు. కొద్ది రోజుల అవసరాల కోసం దీర్ఘకాలిక ఎఫ్‌డీని రద్దు చేసుకోవడానికి బదులు.. రుణం తీసుకుని, ఎఫ్‌డీ కాల వ్యవధిలోనే దానిని చెల్లించేయడం మంచిది. ముందస్తు చెల్లింపు చార్జీలూ ఉండవు.
► ఒకవేళ డిపాజిట్‌ను నిర్ణీత కాలానికి ముందుగానే రద్దు చేసుకుంటే కొంత రాబడిని కోల్పోవాల్సి రావచ్చు. ఉదాహరణకు మీరు రెండేళ్ల కాలానికి డిపాజిట్ చేసి, మూడు నెలల తర్వాత వెళ్లి రద్దు చేసుకుంటే.. బ్యాంకు మూడు నెలల కాలానికి అమల్లో ఉన్న వడ్డీ రేటే చెల్లించొచ్చు. దీనికన్నా... డిపాజిట్‌పై రుణమే బెటర్.
రుణమే ముద్దు..!
Published Mon, Jan 6 2020 6:23 AM | Last Updated on Mon, Jan 6 2020 6:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment