![NABARD crop loans have decreased](/styles/webp/s3/article_images/2025/02/16/farmer.jpg.webp?itok=Fy1RJrpc)
గత ఏడాది కన్నా లక్ష్యంలో రూ.3,645 కోట్లు తగ్గుదల
ఈసారి లక్ష్యంగా పెట్టుకున్న రుణాలు రూ. 87,149 కోట్లు
2021–22 నుంచి ఇదే తంతు.. లక్ష్యానికి, వాస్తవాలకు భారీ తేడా
స్టేట్ ఫోకస్ పేపర్‌లో వెల్లడించిన నాబార్డు
సాక్షి, హైదరాబాద్: రైతుకు రుణాల జారీలో రాష్ట్రస్థాయి బ్యాంకులే కాక... జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) కూడా చిన్నచూపే చూస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతుండగా, రైతుకు ఇచ్చే రుణాల విషయంలో మాత్రం బ్యాంకులు లక్ష్యాలకు దూరంగానే ఉంటున్నాయి. 2025–26 సంవత్సరానికి నాబార్డు విడుదల చేసిన ఫోకస్ పేపర్ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది.
2025–26 సంవత్సరానికి తెలంగాణలో రుణాల లక్ష్యం రూ.3.86 లక్షల కోట్లుగా పేర్కొన్నప్పటికీ... ఇందులో కేవలం పంటలకు సంబంధించి పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం కేటాయించిన నిధులు రూ. 87,149 కోట్లు మాత్రమే. ఈ మొత్తం 2024–25లో పెట్టుకున్న రూ.90,794 కోట్ల లక్ష్యం కంటే రూ.3,645 కోట్లు తక్కువ కావడం గమనార్హం.
ఐదేళ్లుగా లక్ష్యానికి దూరంగా రుణాలు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024–25 లక్ష్యానికన్నా రూ.3,645 కోట్లు తక్కువగా రుణ అంచనాను ప్రకటించిన నాబార్డ్ అంతకుముందు మూడేళ్లు కూడా పంటలకు ఇచ్చే రుణాల విషయంలో లక్ష్యాలను చేరుకోలేదు. 2021–22లో పంట రుణాల కింద రూ. 59,440 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకొని కేవలం రూ. 42,854 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది.
2022–23లో రూ.67,764 కోట్ల లక్ష్యాలకు గాను రూ. 59,060 కోట్ల వరకే ఇచ్చిoది. 2023–24లో అత్యధికంగా రూ.10వేల కోట్ల లోటు కనిపించింది. ఆ ఏడాది రూ. 73,437 కోట్ల లక్ష్యానికి గాను రూ. 64,940 కోట్లు మాత్రమే పంట రుణాలుగా ఇవ్వగలిగారు.
రుణాలు, పెట్టుబడి 1.39 లక్షల కోట్లు
పంటకు సంబంధించి రుణాలు 87,149 కోట్లు కా గా నీటి వనరులు, యాంత్రీకరణ, ప్లాంటేషన్, హార్టికల్చర్, అటవీ, బీడు భూముల వినియోగంతో పాటు పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖలకు సంబంధించి టర్మ్‌లోన్లు, పెట్టుబడి కలిపి 2025–26 సంవత్సరానికి నాబార్డ్ రూ.1.39 లక్షల కోట్ల రుణ అంచనా వేసింది.
ఇందులో యాంత్రీకరణకు రూ. 5,608 కోట్లు, నీటి వనరులకు రూ.2,613 కోట్లు, అటవీ, బీడు భూముల సాగుకు రూ. 793 కోట్లు కేటాయించింది. పశుసంవర్థక శాఖలో డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకానికి రూ.16వేల కోట్ల వరకు కేటాయించారు.
53 శాతం నిధులు ఎంఎస్‌ఎంఈలకే..
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు నాబార్డు అత్యధికంగా రూ. 2.03 లక్షల కోట్లు కేటాయించింది. ఇది రాష్ట్రానికి కేటాయించిన మొత్తం బడ్జెట్‌లో 53 శాతం. వ్యవసాయ టర్మ్ లోన్లు 12 శాతం కాగా, వ్యవసాయ మౌలిక వసతులకు కేవలం 2 శాతం కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment