ప్రాణాలతో బెట్టింగ్‌.. గేమింగ్‌ భూతానికి బతుకులు బలి | Online bettings by Gaming Apps, Loan Apps Harassment Taking Life of People | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో బెట్టింగ్‌.. గేమింగ్‌ భూతానికి బతుకులు బలి

Published Sun, Mar 2 2025 1:08 AM | Last Updated on Sun, Mar 2 2025 1:08 AM

Online bettings by Gaming Apps, Loan Apps Harassment Taking Life of People

ఆన్‌లైన్‌ బెట్టింగ్, గేమింగ్‌ భూతానికి బతుకులు బలి

మొదట్లో లాభం చూపి.. ఊబిలోకి లాగుతున్న జూదం

ఈజీ మనీ ఆశతో చిక్కుకుపోతున్న యువత.. రిటైరైనవారు, పెద్దవారూ అదే బాటలో..

నష్టం పూడ్చుకోవచ్చని, అప్పులు తీర్చవచ్చని భావిస్తూ మరింతగా కూరుకుపోతున్న తీరు

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లతో సులభంగా రుణాలు రావడంతో పెరుగుతున్న సమస్య 

అప్పుల వాళ్లు, లోన్‌ యాప్‌ కంపెనీల వేధింపులతో తీవ్ర ఒత్తిడి 

చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి

‘ఆన్‌లైన్‌ రమ్మీ’ చంపే వరకు వదల్లేదు
కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన బూస శంకరయ్య, స్వరూప దంపతుల కుమారుడు కార్తీక్‌ ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటు పడ్డాడు. సంపాదన అంతా పోగొట్టుకుని, అప్పుల పాలయ్యాడు. రైలుపట్టాలపై పడుకుని, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తల్లిదండ్రులు అప్పుడు కార్తీక్‌ను కాపాడుకోగలిగారు. రెండెకరాల భూమి అమ్మి మరీ అప్పులు తీర్చారు. అయినా కార్తీక్‌ను ఆన్‌లైన్‌ రమ్మీ భూతం వదల్లేదు. కార్తీక్‌ మళ్లీ అప్పులు చేసి, ఆవేదనతో గత నెలలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు సంపాదించేందుకు ఎంచుకునే మార్గాలు చాలా ముఖ్యం. కష్టార్జితం కొంతే అయినా జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ కూర్చున్నచోటే శ్రమ లేకుండానే భారీగా డబ్బుకావాలని వెంపర్లాడితే జీవితం గాడి తప్పుతుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. 

సులభంగా డబ్బు వస్తుందని ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమ్‌లు, పేకాట, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌కు అలవాటు పడి.. సంపాదన అంతా పోయి, అప్పుల పాలవుతున్నవారు ఎందరో. తెలిసినవారి దగ్గరే కాకుండా.. క్రెడిట్‌ కార్డులు, లోన్‌ డబ్బు తీసుకుంటున్నారు. చివరికి అది యమపాశమై ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. జీవితాలను తలకిందులు చేస్తోంది. రోజురోజుకు జడలు విప్పి కరాళ నృత్యం చేస్తున్న ఈ జాడ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు.. మానలేని వ్యసనం.. 
ఒకసారి కొంత మొత్తంలో డబ్బులు రాగానే ఆన్‌లైన్‌ బెట్టింగ్, రమ్మీ వంటి ఆటలు మంచి ఆదాయ మార్గమని యువత భావిస్తున్నారు. కూర్చున్న చోటే రోజూ వేలకువేలు సంపాదించవచ్చనుకుంటూ ఉచ్చులో పడుతున్నారు. కొద్దిపాటి లాభాలు చూసిన తర్వాత అసలు ‘ఆట’ మొదలవుతుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమ్స్‌ కొద్దిపాటి లాభాలు ఇస్తూ.. వీలైనంత దోచుకునేలా ప్రోగ్రామింగ్‌ చేసి ఉంటాయి. దీనిపై అవగాహన లేక బానిస అవుతారు. 

డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ డబ్బులు వచ్చే వరకు మళ్లీ బెట్టింగ్‌లు చేద్దాం, తర్వాత మానేద్దాం అనుకుంటూ... పూర్తిగా ఈ ఊబిలో కూరుకుపోతారు. యువత మాత్రమేకాదు.. రిటైరైన ఉద్యోగులు, పెద్దవాళ్లు కూడా ఆన్‌లైన్‌ జూదం, గేమ్స్‌ బారినపడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయామని గుర్తించే సరికే.. అప్పులు ఇచి్చన వాళ్ల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు పెరిగి, తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

వేలం వెర్రిగా పుట్టుకొస్తున్న ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లతో.. 
మనకు అవసరమున్నా, లేకున్నా నిమిషాల్లోనే అప్పులు ఇస్తామంటూ వస్తున్న ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌లతో సమస్య మరింత పెరుగుతోంది. అందులో లోన్‌ పేరిట మోసగించేవి కొన్నయితే.. నిజంగానే లోన్‌ ఇచ్చి అడ్డగోలు వడ్డీలు, జరిమానాలతో, బలవంతపు వసూళ్ల ప్రయత్నాలతో వేధించేవి మరికొన్ని. సులువుగా సొమ్ము చేతికి వస్తుండటంతో.. ఇలాంటి యాప్‌ల నుంచి అప్పులు చేసి ఆన్‌లైన్‌ జూదంలో పోగొట్టుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. 

నిజానికి రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం లోన్‌ యాప్‌లు వినియోగదారుడి ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్‌ నంబర్ల లిస్ట్‌ తీసుకోకూడదు. కేవలం రుణమిచ్చే సమయంలో కేవైసీ కోసం ఒక్కసారి మాత్రమే కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్‌ యాకెŠస్‌స్‌ చేయాలి. కానీ ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌ కంపెనీలు అప్పులు తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించి, వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. 

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వెనుక భయపెట్టే నిజాలు.. 
మన దేశంలో అక్రమ బెట్టింగ్‌ మార్కెట్‌ విలువ రూ.8.7 లక్షల కోట్లు అని అంచనా. ఇది ఏటా 30 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 
⇒ విదేశాల్లో, ప్రధానంగా చైనా కేంద్రంగా ఉండే ఆన్‌లైన్‌ బెట్టింగ్, లోన్‌ యాప్‌ కంపెనీలు.. ఇక్కడి మనవారి కష్టార్జితాన్ని దోచుకుని దేశవ్యతిరేక కార్యకలాపాలకు ఫండింగ్‌ చేస్తున్నాయి. 
⇒ గేమింగ్, బెట్టింగ్‌.. యాప్‌ ఏదైనా సరే. వాటి వెనుక సూత్రధారులు మాత్రం చైనీయులే ఉంటున్నారు. 
⇒ మనీలాండరింగ్, ఉగ్రమూకలకు నిధులు కూడా ఈ బెట్టింగ్‌ యాప్‌లు సమకూర్చుతున్నట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి. 
⇒ ‘ఫైవిన్‌’ అనే బెట్టింగ్‌ యాప్‌ మన దేశంలో రూ.400 కోట్ల మేర దోపిడీకి పాల్పడింది. ఆ సొమ్మంతా చైనా కంపెనీలకు చేరవేసిన కేసులో నలుగురు వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇటీవలే అరెస్టు చేసింది. 

మన దగ్గర నిషేధం ఉన్నా.. 
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ సాధారణంగా రెండు రకాలు. మన దేశంలో ఆపరేట్‌ అయ్యేవి. చైనా కంపెనీలకు చెందినవి. అయితే ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్, డబ్బులు పెట్టి ఆడే గేమింగ్‌లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో నిషేధం ఉంది. అందువల్ల మన దేశానికి చెందిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు ఈ రాష్ట్రాల్లో పనిచేయవు. ఫోన్లు ఈ రాష్ట్రాల్లోని లొకేషన్‌లో ఉంటే.. ఇక్కడ అందుబాటులో ఉండవని మెసేజీ చూపిస్తాయి. అందుకే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ చేయడం కోసం నకిలీ జీపీఎస్‌ యాప్‌లతో తప్పుడు లొకేషన్స్‌ చూపేలా చేస్తుంటారు. అదే చైనా యాప్స్‌ ఏ నిబంధనలు పాటించవు కాబట్టి యథేచ్ఛగా వాటిలో ఆడుతున్నారు. 

మీ వాళ్లను ఇలా గమనించండి! 
ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు, రమ్మీ వంటి జూదానికి అలవాటుపడే వారిని జాగ్రత్తగా గమనించడం ద్వారా గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనల మేరకు.. ఎవరైనా స్థాయికి మించి అప్పులు చేస్తున్నా, తరచూ ఏదో కారణాలతో డబ్బులు అడుగుతున్నా ఓ కన్నేసి ఉంచాలి. ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులను, స్నేహితులను పక్కనపెట్టి అదేపనిగా మొబైల్‌ ఫోన్‌లో గడుపుతున్నా.. ఫోన్‌లో ఏం చేస్తున్నారన్నది ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నా అనుమానించాలి. నష్టపోయినప్పుడు చిరాకు, ఆగ్రహం, ఆందోళన వంటివాటికి లోనవుతుంటారు. ఒంటరిగా గడుపుతుంటారు. ఇలాంటి లక్షణాలను గమనించాలి. 
 
ఆత్మహత్యలు వద్దు.. మీ బాధ పంచుకోండి.. 
⇒ మీ సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. ప్రతిదానికీ పరిష్కారం ఉంటుందన్నది మర్చిపోవద్దు. ఆత్మహత్యలకు పాల్పడకుండా మీ బాధలను ఈ హెల్ప్‌లైన్‌ సెంటర్లతో పంచుకోవాలని, మీకు సమాధానం దొరకవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
⇒ రోష్నీ సూసైడ్‌ ప్రివెన్షన్‌ హెల్ప్‌లైన్‌: 040–66202000 
⇒ హైదరాబాద్‌కు చెందిన వన్‌లైఫ్‌ ఎన్జీఓ: 7893078930 
⇒ ఎయిమ్స్‌ (బీబీనగర్‌): 9493238208 
⇒ నేరుగా పోలీస్‌ సహాయం కోసం..: డయల్‌ 100 

బెట్టింగ్, గేమింగ్‌ యాడ్స్‌ను పూర్తిగా నిషేధించాలి 
సులభంగా డబ్బు సంపాదన, అదీ పెద్ద మొత్తంలో ఆర్జించాలనే కోరిక కొందరిని ఆవహిస్తుంది. దీనిని ‘ఇన్‌పల్స్‌ కంట్రోల్‌ డిజార్డర్‌’అంటారు. క్రెడిట్‌ కార్డులు, లోన్‌యాప్‌ల ద్వారా సులభంగా డబ్బు సమకూరుతోంది. బెట్టింగ్, గేమింగ్‌లో కొంత కోల్పోయినా... మరోసారి ప్రయతి్నస్తే డబ్బు రావొచ్చన్న ఆశ వారిని నిలవనీయదు. లక్షల్లో అప్పుల్లో పడిపోతే దానిని తీర్చేయాలని మళ్లీ అప్పులు చేసి బెట్టింగ్‌ చేస్తున్నారు. 

ఈ విష వలయం నుంచి బయటికి రాలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్మోకింగ్‌కు సంబంధించిన ప్రకటనలను ఎలా నిషేధించారో అలా అన్ని ప్రచార, ప్రసార సాధనాల్లో బెట్టింగ్‌ కంపెనీల యాడ్లు, యాప్‌ల ప్రచారాన్ని నిషేధించాలి. వెచి్చంచే వ్యయంపై పరిమితి పెట్టడం, ఆధార్‌–పాన్‌ కార్డులతో అనుసంధానం చేయడం వంటివాటితో డబ్బు అతి వినియోగాన్ని నియంత్రించవచ్చు. ఎక్కువ మొత్తంలో అప్పులు చేయడం, రాత్రంతా ఫోన్‌లో గడుపుతూ ఆందోళనతో కనిపించడం వంటి వాటిని కుటుంబ సభ్యులు గుర్తించి వారిని నియంత్రించాలి. 
– డాక్టర్‌ నిషాంత్‌ వేమన, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, కేర్, చేతన హాస్పటల్స్‌ 

అత్యాశకు పోయి ఊబిలో చిక్కుకోవద్దు 
సులభంగా డబ్బు సంపాదించాలనే సంస్కృతి పెరగడంతో ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, గేమింగ్‌ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. గత 15, 20 ఏళ్లలో రియల్‌ ఎస్టేట్‌లో భారీగా డబ్బు సంపాదించిన వారు.. డాబుగా ఖర్చుచేయడం, విలాసవంతమైన కార్లు, భవనాలు కొనడంతో సంపాదన ప్రదర్శన జరుగుతోంది. మిగతావారు సైతం దీనిని ఓ మోడల్‌గా అనుకరించడం మొదలుపెట్టారు. 

కష్టపడి పనిచేయాలనే తత్వం మరుగున పడి, ఏదో ఒక విధంగా లక్షలు, కోట్లు సంపాదించాలనే ఆశలు పెరిగిపోతున్నాయి. సులభంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రయత్నాలు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయి. పర్సనల్‌ లోన్‌ యాప్స్‌ అధిక వడ్డీలతో సగటు జీవిని చిదిమేస్తున్నాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ ఊబిలో కూరుకుపోతున్నారు. 
– డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకుడు 

బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ యాప్‌లలో లాభాలు భ్రమే 
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మన రాష్ట్రంలో నిషిద్ధం. అలాంటి ఆన్‌లైన్‌ యాప్‌లు వాడితే చట్టప్రకారం శిక్ష తప్పదు. బాధితులపైనా కేసులు తప్పవన్నది గుర్తుంచుకోవాలి. బెట్టింగ్‌ యాప్‌లలో లాభాలు వస్తాయన్నది భ్రమ అని గుర్తించాలి. మొదట కొద్దిపాటి లాభాలు చూపి.. తర్వాత కచి్చతంగా మోసం చేస్తారు. దీనితో అప్పుల ఊబిలో కూరుకుపోవడంతోపాటు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్, ఆన్‌లైన్‌ రమ్మీ వంటి ఆటలకు దూరంగా ఉండడం మంచిది. 
– కవిత, డీసీపీ, సైబర్‌క్రైమ్స్, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement