Online Rummy
-
సీరియస్ మీటింగ్.. సైలెంట్‌గా రమ్మీ!
అనంతపురం అర్బన్: కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తరువాత రెవెన్యూ శాఖలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పోస్టు అత్యంత కీలమైనది. అలాంటి పోస్టులో ఉన్న అధికారి అందరికీ ఆదర్శంగా, జవాబుదారీగా ఉండాలి. అయితే జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కీలకమైన సమావేశం జరుగుతున్న సమయంలో.. అదేమీ తనకు పట్టనట్లు బాధ్యతలు విస్మరించి తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాలు.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 20న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్‌కుమార్, టి.ఎస్.చేతన్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సీ, ఇతర సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న డీఆర్ఓ మలోల అక్కడి వ్యవహారం తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తన పక్కన ఉన్నతాధికారులు ఉన్నారనే కనీస ఆలోచన లేకుండా మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వివరణ కోరిన కలెక్టర్ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో డీఆర్ఓ మలోల ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తీవ్రంగా పరిగణించారు. డీఆర్ఓను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో డీఆర్ఓ మలోల స్వయంగా కలెక్టర్ బంగ్లాకు వెళ్లి కలెక్టర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. -
ఏపీలో ఆన్లైన్ రమ్మీ నిషేధం.. హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఏపీలో ఆన్లైన్ రమ్మీ నిషేధం వద్దన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ రమ్మీ నిషేధం వద్దన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్ రమ్మీ గేమా.. లేక అదృష్టమా నిర్ధారణకు హైకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కమిటీ నివేదిక తర్వాత అన్ని విషయాలను పరిశీలించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు దీనిపై ప్రభావం చూపొద్దని ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర నిబంధనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం సూచించింది. హైకోర్టు తుది తీర్పు మూడు వారాల వరకు అమల్లోకి తీసుకురాకూడదని తెలిపింది. చదవండి: సీఎం జగన్ నగరి పర్యటన.. విద్యాదీవెన నిధుల విడుదల -
గెజిట్‌లో ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టం
ఆన్లైన్ రమ్మీ.. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఈ పదమే ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకుల నోట్లో ఎక్కువగా నలిగిందంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ఈ ఆటకు బానిసై అప్పులపాలైన వారు ఎందరో..! ఇక రుణఒత్తిడి భరించలేక బలవన్మరణాలకు పాల్పడిన వారూ పదుల సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక తర్జనభర్జనలు, విమర్శలు, ప్రతి విమర్శల తర్వాత ఎట్టకేలకూ ఆన్లైన్ రమ్మీ నిషేధం బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు.మంగళవారం ఈ మేరకు గెజిట్‌లో ప్రచురించడంతో ఇకపై ఆన్లైన్ పేకాట ఆడితే.. తాటతీస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి, చైన్నె: ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని ప్రభుత్వ గెజిట్‌లో మంగళవారం ప్రకటించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదంతో న్యాయశాఖ కార్యదర్శి గోపి రవికుమార్ సంతకంతో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ, సమగ్ర వివరాలను,శిక్షలు, కమిషన్ ఏర్పాటు గురించి గెజిట్‌లో వివరించారు. దీంతో కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక చేసేందుకు సీఎం ఎంకే స్టాలిన్ కార్యాచరమ ప్రారంభించారు. నేపథ్యం ఇదీ.. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీకి బానిసై, అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య తాజాగా 43కు చేరిన విషయం తెలిసిందే. ఈ గేమింగ్‌ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన చట్టాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. దీంతో గత నెల మరోసారి అసెంబ్లీ వేదికగా చట్టానికి మెరుగులు దిద్ది సభ ఆమోదంతో రాజ్‌భవన్‌కు పంపించారు. దీనిని కూడా ఆమోదించేందుకు గవర్నర్ కాలయాపన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం తీసుకురావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఈ చట్టాన్ని ఆమోదిస్తూ గవర్నర్ ఆర్ఎన్రవి నిర్ణయం తీసుకున్నారు. గెజిట్‌లో చట్టం వివరాలు.. ఈ చట్టంలోని సమగ్ర వివరాలను 13 పేజీలలో పొందు పరిచారు. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి బెట్టింగ్ గేమింగ్‌లపై రాష్ట్రంలో నిషేధించినట్లు వివరించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన పక్షంలో మూడు కేటగిరీలుగా విభజించి శిక్ష విధించనున్నారు. గేమ్ ఆడే వారు, ప్రకటనలు చేసే వారు, నిర్వాహకులుగా విభజించి అందరికీ వివిధ రకాల శిక్షలను, జరిమానాలను విధించనున్నారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు కానుంది. ఈ కమిషన్‌కు చైర్మన్, సభ్యులు ఉంటారు. అలాగే ఈ గేమింగ్ వ్యవహారలపై సైబర్ క్రైం నిఘా ఉంచనుంది. తమిళనాడులో ఈ గేమింగ్ నిషేధం వివరాలను సంబంఽధిత సంస్థలకు తొలుత నోటీసుల ద్వారా తెలియజేయనున్నారు. అప్పటికీ ఆ యా సంస్థలు గేమింగ్‌లు నిర్వహిస్తే తొలుత సైబర్ క్రైం కొరడా ఝుళిపిస్తుంది. అలాగే సమగ్ర వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్‌కు అందజేస్తుంది. ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలూ ఉంటాయి. తొలిసారిగా గేమ్ ఆడి పట్టుబడే వారికి 3 నెలలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తారు. ఫేస్బుక్ వంటి వ్యక్తిగత సామాజిక మాధ్యమాల పేజీల్లోకి ప్రకటనల రూపంలో నిషేధిత బెట్టింగ్ గేమింగ్ సమాచారం పంపిన పక్షంలో, ఆ ప్రకటనదారుకు, నిర్వహకులకు ఏడాది జైలు శిక్ష, రూ. 5 లక్ష వరకు జరిమానా విధించనున్నారు. మళ్లీ మళ్లీ పట్టుబడిన పక్షంలో ఐదేళ్లు వరకు జైలు, రూ. 20 లక్షల వరకు జరిమానా విధించే విధంగా కఠినంగా వ్యవహరించనున్నారు. కమిషన్ ఏర్పాటుకు కార్యాచరణ ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మంగళవారం సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు, చట్ట నిపుణులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలతో పదవీ విరమణ పొందిన సీనియర్ ఐఏఎస్, ఐజీ స్థాయి పోలీసు అధికారులు, ఆన్లైన్ రంగంలోని నిపుణులను ఈ కమిషన్‌లో సభ్యులుగా నియమించనున్నారు. ఈ జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కమిషన్ ఏర్పాటుతో ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్టే. గేమింగ్‌లను క్రమబద్ధీకరించే విధంగా ఈ కమిషన్ కొరడా ఝుళిపించనుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు ఆన్లైన్ రమ్మీ తదితర బెట్టింగ్ గేమింగ్ల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఆన్లైన్ రమ్మీకి మరొకరు బలి
సాక్షి, చైన్నె: ఆన్లైన్ రమ్మీకి బానిసైన ఓ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ గేమింగ్‌కు బానిసై, చివరికి అప్పుల్లో కూరుకుని ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య 42కు చేరింది. వివరాలు.. తిరుచ్చిలోని తుపాకీ తయారీ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న ఓ ఆసుపత్రిలో తూత్తుకుడికి చెందిన ఇసక్కి ముత్తుకుమారుడు రవిశంకర్(42) హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య రాజలక్ష్మి, కుమారుడు సంవర్థన్ ఉన్నారు. ఆ పరిశ్రమకు సంబంధించిన క్వార్టర్స్‌లోనే రవిశంకర్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆన్లైన్ రమ్మీకి బానిసైన ఇతగాడు తోటి ఉద్యోగుల వద్ద, బయటి వ్యక్తులు వద్ద భారీగా అప్పులు తీసుకున్నాడు. బయటి వ్యక్తుల వద్ద రూ. 6 లక్షల వరకు రుణం తీసుకుని ఆన్లైన్ రమ్మీ ఆడాడు. దీంతో రుణదాతల నుంచి అప్పు చెల్లించాలనే ఒత్తిడి పెరిగింది. ఆందోళనలో పడ్డ రవిశంకర్ గత రెండు రోజులుగా బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాడు. విధులకు సైతం సెలవు పెట్టేశాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన ఎంతకూ నిద్ర లేవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో పరిశ్రమ ఆవరణలోని ఆసుపత్రికి రాజలక్ష్మి తీసుకెళ్లింది. అప్పటికే రవిశంకర్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి గదిలో పరిశీలించారు. బెడ్ మీద అధిక సంఖ్యలో నిద్ర మాత్రల కవర్లు ఉండడంతో వాటిని మింగి బలవన్మర ణానికి పాల్పడి ఉండవచ్చు అన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఆన్లైన్ రమ్మీ కారణంగా అప్పుల పాలై రవిశంకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రవి శంకర్ మరణంతో ఆన్లైన్ రమ్మీకి బలైన వారి సంఖ్య 42కు చేరింది. చట్టంపై పరిశీలన.. ఆన్లైన్ రమ్మీ నిషేధం బిల్లును అసెంబ్లీలో రెండు రోజుల క్రితం ప్రభుత్వం మరోసారి ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిని శుక్రవారం రాజ్ భవన్‌కు పంపించారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించినట్లు తెలిసింది. ఈ పరిస్థితులలో శనివారం ఈ చట్టం గురించి రాజ్ భవన్లో న్యాయనిపుణులతో గవర్నర్ సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికై నా ఈ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా..? లేదా..? అనే చర్చ ప్రారంభమైంది. -
రమ్మీ నాలెడ్జ్ గేమ్!.. నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ఆన్లైన్ రమ్మీ.. నాలెడ్జ్ గేమ్ అని సమత్తువ మక్కల్ కట్చి నేత, సినీ నటుడు శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్ గేమ్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రాజ్ భవన్ వర్గాలు పట్టించుకోలేదు. ఈ చట్టాన్ని ఆమోదించాలని అన్ని వైపుల నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఒత్తిడి వస్తోంది. అయితే ఆన్లైన్ రమ్మీకి ప్రచారకర్తగా సినీ నటుడు శరత్‌కుమార్ వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ గేమ్‌ను ప్రోత్సహించే విధంగా శరత్ ప్రకటనలు సామాజిక మాధ్యమాలలో హోరెత్తుతున్నాయి. దీనిపై మీడియా మంగళవారం శరత్‌కుమార్‌ను ప్రశ్నించింది. ఇందుకు ఆయన సమాధానం ఇస్తూ రమ్మీ నాలెడ్జ్ గేమ్ అని వ్యాఖ్యనించారు. అయితే, తాను చెప్పినందు ఈ గేమ్‌లను ఆడే వాళ్లు రాష్ట్రంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. తాను నిజాయితీగా ఓట్లు వేయమని అడిగితేనే వేయని వాళ్లు, తాను చెప్పినట్లుగా వింటారా?.. అని అన్నారు. కాగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేందుకు రెండేళ్ల ముందుగానే ఈ ప్రకటన (యాడ్)ను చిత్రీకరించామని ఆయన వివరించారు. ప్రస్తుతం దీనిని ఆ సంస్థ ఇప్పుడు తెర మీదకు తెచ్చినట్లుందని పేర్కొన్నారు. అయితే, రమ్మీ మేథా సంపత్తిని పెంచుతుందంటూ శరత్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎక్కువయ్యాయి. sunnewstamil: #Watch | “2 வருஷத்துக்கு முன்பே, ரம்மி தடை சட்டம் வந்திருந்தால் விளம்பரத்தில் நடித்திருக்க மாட்டேன்” - சமத்துவ மக்கள் கட்சித் தலைவர் சரத்குமார் #SunNews | #Sarathkumar | #OnlineRummy | @realsarathkumar pic.twitter.com/BBrMpEyBG3 — Parundhu News (@Parundhu_News) December 13, 2022 -
రూ.28 లక్షలకు సొంతిల్లు అమ్మేసి.. భార్యను ప్లాస్టిక్ కవర్లో సీల్ చేసి..
సాక్షి, చెన్నై : కష్టపడి కట్టుకున్న సొంతింటిని రూ.28 లక్షలకు అమ్మేసి ఆన్లైన్ రమ్మీలో తగలపెట్టాడో భర్త. ప్రశ్నించిన భార్యను హతమార్చి ప్లాస్టిక్ బ్యాగ్‌లో పార్శిల్ చేసి ఇంట్లో పెట్టాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా కరోనా నాటకాన్ని రచించి ఉడాయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన నర్సింహరాజు(38) తిరుచ్చికి వచ్చి స్థిర పడ్డాడు. 11 ఏళ్ల క్రతం తిరుచ్చి తిరువానై కావల్‌కు చెందిన గోపినాథ్ కుమార్తె శివరంజనిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులకు సమయపురం శక్తి నగర్లో ఓ ఇల్లు ఉంది. కొన్ని నెలల క్రితం నర్సింహ రాజు ఈ ఇంటిని అమ్మేశాడు. తాలకుడి సాయినగర్‌లో అద్దె ఇంట్లో కుటుంబాన్ని ఉంచాడు. వీరితో నర్సింహ రాజు తల్లి వసంతకుమారి(52) కూడా ఉన్నారు. ఆన్లైన్ రమ్మీకి బానిసై.. గత ఏడాది నుంచి నర్సింహ రాజు ఆన్లైన్ రమ్మీకి బానిస అయ్యాడు. భార్య శివరంజని వారించినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో సమయపురంలోని ఇంటిని రూ. 28 లక్షలకు అమ్మి ఆటలో పోగొట్టాడు. విషయం తెలుసుకున్న శివరంజని ఈ నెల 4వ తేదీ రాత్రి భర్తను నిలదీసింది. ఆగ్రహించిన నర్సింహరాజు భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లో చుట్టి బెడ్రూంలో ఉంచాడు. మరుసటి రోజు తల్లి, పిల్లలను విజయవాడకు పంపించేశాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా తన భార్యకు కరోనా సోకిందని క్వారంటైన్లో ఉన్నట్లు నాటకం ఆడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తానూ ఉడాయించాడు. వెలుగులోకి.. రెండు రోజులుగా శివరంజని తన ఫోన్ తీయక పోవడంతో తండ్రి గోపినాథ్ ఆందోళన చెందాడు. నర్సింహరాజు ఫోన్ పనిచేయక పోవడంతో ఆందోళనకు లోనయ్యాడు. విజయవాడలోని అల్లుడి సోదరిని సంప్రదించాడు. శివరంజనికి కరోనా వచ్చినట్టు, ఇద్దరు పిల్లలు మాత్రం తన వద్ద ఉన్నట్టు ఆమె ఇచ్చిన సమాచారంతో ఆందోళన చెందిన గోపినాథ్ గురువారం రాత్రి బంధువులతో కలిసి తాలకుడి సాయినగర్‌కు వెళ్లారు. ఇంటి తలుపులు పగుల కొట్టి చూడగా దుర్వాసన రావడంతో కొల్లిడం పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గదిలో బెడ్ కింద ప్లాస్టిక్ కవర్లో కప్పి ఉన్న శివరంజని మృత దేహం బయట పడింది. మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు నర్సింహరాజు కోసం గాలిస్తున్నారు. -
జీవితంలో ఏదో సాధించాలనే తపన.. మధ్యలో ఆన్లైన్ రమ్మీకి బానిసై..
తిరువొత్తియూరు(చెన్నై): ఆన్లైన్లో రమ్మీ ఆడి రూ. 20 లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనలిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మనలి అరింజర్ అన్నా వీధికి చెందిన నాగరాజన్ (37) ఇళ్లకు పెయింటింగ్ పనులు చేయించే కాంట్రాక్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగరాజన్ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని తపించేవాడు, కానీ కొన్ని నెలలుగా నాగరాజన్ ఆన్లైన్ రమ్మికి బానిసయ్యాడు. భార్య, బంధువులు చెప్పినా వినేవాడుకాదు. ఈ క్రమంలో రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాడు. తీవ్ర మనస్తాపం చెందిన నాగరాజన్ గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటిలో ఉరి వేసుకున్నాడు. గమనించిన భార్య వరలక్ష్మి హుటాహుటిన చెన్నై స్టాన్లీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు అతని ఇంట్లో తనిఖీ చేయగా ఓ ఉత్తరం కనిపించింది. తాను రమ్మి ఆడి రూ. 20 లక్షలు పోగొట్టుకున్నానని.. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉంది. -
ఆన్లైన్లో దానికి బానిసై.. ఇంట్లో భర్త లేనప్పుడు..
సాక్షి, చెన్నై: ఆన్లైన్ రమ్మీకి బానిసైన ఓ వివాహిత అప్పుల పాలై బలవన్మరణానికి పాల్పడింది. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ బారిన పడి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. ఇందులో అత్యధిక శాతం మంది పురుషులే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ రమ్మీకి బానిసై ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అప్పు చేసి మరీ.. చెన్నై తిరువొత్తియూరు మనలి పుదునగర్ చెందిన భాగ్యరాజ్ కందన్ చావడిలోని ఓ హెల్త్ కేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం భవాని(29)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మెగ్రటిక్ (3), నోబల్ గ్రిస్(01) అనే పిల్లలున్నారు. ఏడాది కాలంగా భవాని ఆన్లైన్ రమ్మీకి ఆకర్షితురాలైంది. దీంతో భర్తకు తెలియకుండా ఇంట్లో ఉన్న నగదును బ్యాంక్‌లో జమ చేసి ఆ గేమ్‌లో మునిగింది. ఇంట్లో ఉన్న 20 సవర్ల నగలను విక్రయించి మరీ గేమ్ ఆడింది. చివరకు తన చెల్లెలు భారతి, కవిత వద్ద నుంచి రూ.3 లక్షల మేరకు అత్యవసరం పేరిట డబ్బు తీసుకుని రమ్మీపై దృష్టి పెట్టింది. ఈ వ్యవహారం భాగ్యరాజ్ దృష్టికి చేరింది. ఆయన మందలించినా ఫలితం శూన్యం. రెండు రోజులుగా తన సోదరికి ఫోన్ చేసి కొందరి వద్ద తాను అప్పలు చేసినట్టుగా భవాని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి తన గదిలో భవాని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారంతో పోలీసు లు రంగంలోకి దిగి విచారించారు. ఆమె బ్యాంక్ ఖాతా నుంచి ఏడాది కాలంలో రూ. 20 లక్షల మేర కు నగదు జమ కావడం, ఆ మొత్తం ఆన్లైన్ రమ్మీకి వాడి ఉండటం వెలుగు చూసింది. చదవండి: Amnesia Pub Case: రొమేనియా బాలిక వాంగ్మూలంతో వెలుగులోకి -
రమ్మీ విస్ఫోటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ల కిందటే నిషేధం విధించిన ఆన్లైన్ రమ్మీ మళ్లీ పడగ విప్పుతోంది. రాష్ట్రంలో నిషేధం ఉన్నా ముంబై ఆన్లైన్ రమ్మీ మాఫియా కొత్త యాప్‌లను తాజాగా రాష్ట్రంలోకి వదిలింది. నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో భారీగా ప్రకటనలు ఇస్తోంది. దీంతో లక్షలాది మంది యువత వీటిని ఇన్స్టాల్ చేసుకొని ఆడుతూ రూ. కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతంలో ఫేక్ లొకేషన్‌తో జూదరులు ఆట ఆడగా.. ఇప్పుడు నేరుగానే పేకాట ఆడేలా యాప్‌లను మాఫియా తీసుకొచ్చింది. గేమింగ్ యాక్ట్‌ను సవరిస్తూ, ఆన్లైన్ రమ్మీని బ్యాన్ చేస్తూ చట్టం తీసుకొచ్చినా బరితెగించి యాప్‌లు వదిలిన రమ్మీ మాఫియాపై ప్రభుత్వ యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా.. ముంబైకి చెందిన ప్రముఖ రమ్మీ సంస్థ డ్యాష్ రమ్మీ, రమ్ రమ్మీ, రోజ్ రమ్మీ యాప్‌లను రూపొం దించింది. డబ్బు లేకపోతే రమ్మీ ఆడి గెలుచు కోవచ్చని, సులభంగా సంపాదించు కోవచ్చని యూట్యూబ్, ఫేస్బుక్ తదితర మా«ధ్యమాల్లో ప్రకటనలిచ్చింది. గతంలో ఆన్లైన్ రమ్మీ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకున్నా రాష్ట్రం లొకేషన్ ఉండటం వల్ల ఆడేందుకు అనుమతి వచ్చేది కాదు. దీంతో ఫేక్ లొకేషన్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకొని నకిలీ లొకేషన్‌తో రమ్మీ ఆడేవారు. అయితే ఈ 3 యాప్స్‌లో ఇలాంటి ఆప్షన్ లేదు. ఈ–మెయిల్, మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకొని నేరుగా గేమ్‌లోకి వెళ్లేలా అవకాశం కల్పించారు. డబ్బులు జమ చేసి ఆడాలి ♦ ఓసారి రిజిస్టర్ అయ్యాక పేకాట ఆడేందుకు డబ్బులు జమ చేసుకోవాలి. ఇందుకోసం యూపీఐ (ఫోన్ ఫే, గూగుల్ పే) ద్వారా రూ.50 నుంచి 10వేల వరకు యాడ్ చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు. ♦ డబ్బు జమయ్యాక పాయింట్ రమ్మీ, పూల్ రమ్మీ, డీల్స్ అని మూడు రకాల పేకాట ఆప్షన్ వస్తుంది. వాటిలో ఎంపిక చేసుకొని డబ్బులు పెట్టి ఆడాలి. ♦ డబ్బులు వస్తే విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. ఇందుకు యాప్‌లో ప్రొఫైల్, కేవైసీ, అడ్రస్ ఫ్రూఫ్ అడుగుతున్నారు. ఆధార్, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, బ్యాంకు వివరాల్లాంటివి అప్లోడ్ చేశాక ప్రొఫైల్ అప్లోడ్ సక్సెస్ ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాతే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. బ్యాంకు లేదా యూపీఐ ద్వారా డబ్బు తీసుకోవాలని యాప్ సూచిస్తుంది. ♦ డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్.. పలు రాష్ట్రాల్లో బ్యాన్ ఉం దని యాప్‌లో పేర్కొంటున్నారు. అయినా ఆడేలా ఆప్షన్ కల్పించడం వివాదాస్పదమవుతోంది. బరితెగించినట్టా.. లేక డీల్ సెటిలైందా? ఆన్లైన్ రమ్మీ దందా చేస్తున్న మాఫియా గతంలో అనుమతి ఉన్న రాష్ట్రాల లొకేషన్స్తోనే గేమ్‌లోకి అనుమతించేవి. ఇప్పుడు కొత్త యాప్స్‌ను రాష్ట్రం లోకి వదలడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. 6 నెలల క్రితం ముంబైకి చెందిన ప్రముఖ ఆన్లైన్ రమ్మీ సంస్థ, ఆన్లైన్ రమ్మీకి చెందిన కీలక సూత్రధారి.. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీకి సడలింపులు లేదా దొంగచాటున అనుమతి ఇచ్చేలా ఓ నేతతో రూ.70 కోట్లకు డీల్ చేసుకు న్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించినా ఇప్పుడు ఈ ఆన్లైన్ రమ్మీ పగడ విప్పడంతో వెనుకున్నది ఎవరని చర్చ జరుగుతోంది. మొదట్లో వచ్చాయి.. తర్వాత పోయాయి జనవరి 14న ఆన్లైన్ రమ్మీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా. అడ్రస్‌తో సహా అన్ని సబ్మిట్ చేసి గేమ్ ఆడాను. ఇప్పుడూ ఆడుతున్నా. రెండ్రోజుల కిందట రూ.3 వేలు వచ్చాయి. డబ్బులు వస్తున్నాయని ఆడుతుంటే రూ.3 వేలతో పాటు మరో రూ.2 వేలు కూడా పోయాయి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఓ 50 మంది వరకు ఆడుతున్నాం. – వెంకటేశ్, హైదరాబాద్ అప్పుడు ఫేక్ లొకేషన్‌తో ఆడా.. గతంలో ఆన్లైన్ రమ్మీ రాష్ట్రంలో ఆడేందుకు ఫేక్ లొకేషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు డ్యాష్ రమ్మీలో ఆ ఇబ్బంది లేదు. కానీ ఆధార్ కార్డు, బ్యాంకు ఇతర వివరాలు అడగడం భయంగా ఉంది. డబ్బును విత్‌డ్రా సమయంలో రాష్ట్రంలో బ్యాన్ ఉందంటూనే ఇక్కడి లొకేషన్లోనే యాప్ ఓపెన్ అవడం ఆశ్చర్యం. – శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ -
ఆన్లైన్ రమ్మీ.. అంతా డమ్మీ.. ఆశకు పోతే ప్రాణాలుండవు!
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌కు చెందిన సీపతి అభిలాష్ (25) అనే సీఏ విద్యార్థి.. ఆన్లైన్ రమ్మీకి బానిసయ్యాడు. అప్పులు చేసి మరీ ఆడాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. గత ఏడాది డిసెంబర్ 29న విషం తాగి చనిపోయాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్ ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టాడు. మొదట్లో కొంత లాభం రావడంతో తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులు, అప్పులు చేసినవి కలిపి ఏడు లక్షలు పెట్టి ఆడాడు. సొమ్మంతా పోగొట్టుకున్నాడు. డబ్బు లన్నీ తిరిగి సాధించాలని మళ్లీ 8 లక్షలు అప్పులు చేశాడు. ఈ సొమ్ము కూడా పోవడంతో.. ఆందోళనకు గురై గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధాన్ని తొలగించుకునేందుకు ముంబై గేమ్ మాఫియా రంగంలోకి దిగింది. పేకాట, ఆన్లైన్ గేమింగ్‌లను బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో.. ఆన్లైన్ రమ్మీకి సడలింపు ఇచ్చేలా చేయాలని ఓ కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్‌తో సంప్రదింపులు జరిపింది. దీనికి ఆ ఇద్దరు కీలక వ్యక్తులు అంగీకరించారని.. కొన్నికోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని, అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేసిన సదరు ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారి.. అనుకున్న ‘పని’ సాధించలేకపోయారు. ఈలోగా విషయం పెద్దలకు తెలియడంతో.. చీవాట్లు పెట్టారని తెలిసింది. ఇప్పుడీ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలో పేకాట, ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం టీఆర్ఎస్ సర్కారు 2016లోనే రాష్ట్రంలో పేకాటను నిషేధించింది. దానితోపాటు ఇంటర్నెట్లో ఆడే ‘ఆన్లైన్ రమ్మీ’, ఇతర ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటలపైనా నిషేధం విధించింది. పేకాటతోపాటు యువతను వ్యసనాలకు గురిచేసే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నిర్ణయంపై మహిళలతోపాటు అన్నివర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆన్లైన్ పేకాట వందలు, వేల కోట్ల వ్యాపారం కావడంతో.. ముంబై వేదికగా ఆన్లైన్ వెబ్సైట్లు, యాప్‌లను నిర్వహిస్తున్న మాఫియా సంస్థలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటకు అనుమతి వచ్చేలా చేయాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను సంప్రదించాయి. రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నాలు ఆన్లైన్ రమ్మీ మాఫియా ‘ఆఫర్’కు లొంగిపోయిన ఒక కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్.. ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో సదరు సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఒప్పందం కుదుర్చుకున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అడ్వాన్స్‌గా కొన్నికోట్ల మొత్తాన్ని తీసుకున్నారని వెల్లడించాయి. ఇది జరిగి రెండు, మూడు నెలలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. దీనితో రమ్మీ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి రంగంలోకి దిగి సదరు ప్రజాప్రతినిధిని, సీనియర్ అధికారిని నిలదీశారని.. వారం, పది రోజుల్లో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారని సమాచారం. ఈ పది రోజుల గడువు తీరినా స్పందన లేకపోవడంతో అడ్వాన్స్ తిరిగివ్వాలని ఒత్తిడి పెంచారని.. ఈ క్రమంలో విషయం మరో కీలక ప్రజాప్రతినిధి ద్వారా ప్రభుత్వ పెద్దలకు చేరిపోయిందని తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని, మాఫియాకు డ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. సదరు వ్యక్తులు మధ్యవర్తుల ద్వారా అడ్వాన్స్ సొమ్ము తిరిగి ముంబై మాఫియాకు తిరిగి పంపారని తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా.. స్పందించలేదు. నిషేధమున్నా.. ఏటా వేల కోట్ల దందా రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటపై నిషేధం ఉండటంతో.. గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ స్టోర్ వంటివాటిలో సదరు యాప్స్ అందుబాటులో ఉండవు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్ల ద్వారా సదరు ఆన్లైన్ గేమింగ్ సంస్థలు ప్రచారం చేస్తూ.. లింకులు పెడతాయి. ఆ లింక్స్‌ను షేర్ చేస్తే పాయింట్లో, నగదో రివార్డు ఇస్తామని ఆశపెడ్తాయి. అలా ఒకరి నుంచి ఒకరికి లింకులు షేర్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇలా 12లక్షల మందికి పైగా సదరు యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్నట్టు కేంద్ర నిఘా సంస్థలు గతంలోనే కేంద్ర హోంశాఖకు నివేదికలు ఇచ్చాయి. వీటిద్వారా ఏటా రూ.2 వేల కోట్లకుగా దందా సాగుతోందని అంచనా వేశాయి. 2018లో తెలంగాణ నుంచి రూ.1,200 కోట్ల మేర ఆన్లైన్ యాప్స్‌లో దందా సాగిందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫేక్ లొకేషన్‌తో జిమ్మిక్కులు ఆన్లైన్ రమ్మీ యాప్‌లు మొబైల్ఫోన్ల లొకేషన్ డేటాను తీసుకుంటాయి. రాష్ట్రంలో అధికారికంగా నిషేధం ఉండటంతో ఇక్కడి మొబైల్ లొకేషన్ ఉంటే గేమ్ ఆడటానికి వీలుకాదని చూపిస్తాయి. అయితే ఆన్లైన్ గేమ్ మాఫియా సంస్థలు ఫోన్లలో ఫేక్ జీపీఎస్ లొకేషన్ చూపించే యాప్స్‌ను షేర్ చేస్తున్నాయి. వీటిసాయంతో ఆన్లైన్ రమ్మీ ఆడేవారు ఫోన్లో అసలు జీపీఎస్ లొకేషన్‌ను డిసేబుల్ చేసి.. ఫేక్ జీపీఎస్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నట్టు లొకేషన్ పెడుతూ.. ఆన్లైన్ పేకాట ఆడుతున్నారు. ఏమిటీ ఆన్లైన్ రమ్మీ వ్యవహారం? పేకాట క్లబ్బుల్లో, బయటా ‘మూడు ముక్కలాట, రమ్మీ’ ఆడినట్టుగానే.. ఆన్‌లైన్‌లోనూ డబ్బులు పెట్టి ఆడేందుకు కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొన్ని నియంత్రణలను పెట్టింది. అందుకు అనుగుణంగా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ప్రత్యేక యాప్‌లను రూపొందించి దందా చేస్తున్నాయి. ఆన్లైన్ పేకాట, గ్యాంబ్లింగ్‌ను తమ రాష్ట్రాల్లో అనుమతించాలా, నిషేధించాలా అన్ని నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ పేకాటను నిషేధించాయి. మొదట్లో ‘ఎర’ వేసి.. ఆన్లైన్ పేకాట ఆడేవారు సదరు వెబ్సైట్/యాప్‌లకు బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానించి.. డబ్బులను వాటిలోకి బదిలీ చేసుకుంటారు. ఆ డబ్బులతో పేకాడుతారు. గెలిచినవారికి డబ్బులు ఇవ్వడం, ఓడిపోతే కట్ చేయడం జరుగుతాయి. సర్వీస్చార్జీల పేరిట కొంత మొత్తాన్ని మినహాయించుకుంటాయి. అయితే ఈ ఆన్లైన్ గేమ్స్‌లో చాలా వరకు మోసమే. వీటిలో ఆడటం మొదలుపెట్టినవారికి కొద్దిరోజులు కావాలనే డబ్బులు గెలుచుకున్నట్టు చూపిస్తారని.. వారు ఆన్లైన్ పేకాటకు బానిసలయ్యాక ఉన్న డబ్బంతా ఊడ్చేస్తాయని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో చాలా మంది లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. అవన్నీ పోగొట్టుకుని అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు ఎన్నో నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా హాజిపూర్‌కు చెందిన చిందం పోశెట్టి.. ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డాడు. మొదట్లో కొంత డబ్బులు రావడంతో.. తర్వాత అప్పులు చేసి మరీ ఆడాడు. డబ్బులన్నీ పోవడంతో ఆవేదనలో మునిగిపోయాడు. ఈ ఏడాది జనవరి 27న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఆన్లైన్ రమ్మీకి బానిసై ఇంజినీర్ ఆత్మహత్య
సాక్షి, వేలూరు: ఆన్లైన్ రమ్మీకి బానిసై రూ. 10 లక్షల నగదును పోగొట్టకోవడంతో.. జీవితంపై విరక్తి చెంది చెన్నై ఐటీ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరుపత్తూరు జిల్లా వానియంబాడిలో చోటు చేసుకుంది. కాటుకొల్లై గ్రామానికి చెందిన ఆనందన్(31) చెన్నైలోని ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఆన్లైన్ ద్వారా సెల్ఫోన్లో రమ్మీకి బానిస అయ్యాడు. కుటుంబ సభ్యులు ఖండించారు. అయినప్పటికీ రమ్మీ ఆడేవాడు. గత వారంలో మాత్రం ఆన్లైన్ రమ్మీ ఆడి రూ. 10 లక్షల నగదు పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో స్నేహితుల వద్ద రూ. 6 లక్షల అప్పు కూడా ఉంది. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల ఓటు వేసేందుకు ఆనందన్ సొంత గ్రామమైన కాట్టుకొల్లై గ్రామానికి మూడు రోజుల క్రితం వచ్చాడు. శనివారం ఓటు హక్కు వినియోగించుకొని ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో ఆనందన్ ఆన్లైన్ రమ్మీ ద్వారా భారీగా నగదు పోగొట్టుకున్న విషయం తెలిసింది. దీంతో తల్లిదండ్రులు మందలించారు. మనోవేదనకు గురై ఆనందన్ ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఆనందన్ రూం నుంచి బయటకు రాక పోవడంతో కుటుంబ సభ్యులు కిటికీల ద్వారా చూడా ఆనందన్ మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. వానియంబాడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈమె జీతం గంటకు రూ.54 లక్షలు
గంటకు రూ.54 లక్షలు..! రోజుకు రూ.13 కోట్లు..!! ఏడాదికి 4వేల కోట్లు!!! ఏంటి ఈ లెక్కలు? 2019–20 ఆర్థిక సంవత్సరం ముగిసింది కాబట్టి ఏదైనా కంపెనీ ఆదాయం వివరాలు అనుకుంటున్నారా? మీరూహించిందాంట్లో సగమే నిజం.. ఇది కంపెనీ ఆదాయం కాదు డెనిస్ కొయెత్స్ అనే మహిళ వార్షిక వేతనం. ఆ.. !! అని నోరెళ్లబెడుతున్నారా? ఇంకా ఉంది ఆగండి. ఈమె పేరు చెప్పాం కదా.. ఉండేది లండన్‌లో.. వయసు 53 ఏళ్లు. ఆన్లైన్ జూదానికి కేరాఫ్ అడ్రస్ అయిన బెట్ 365 కంపెనీ గురించి మనలో చాలా మందికి తెలుసు కదా? దాని బాస్ ఈమే. మొన్నటితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణా ఈమెకు అందేది 469 మిలియన్ పౌండ్లు. ఇందులో వేతనం 421 మిలియన్ పౌండ్లతోపాటు, కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్ కింద మరో 48 మిలియన్ పౌండ్లు అదనం. అంటే ఈ రెండూ కలిపితే ఆరోజు నాటి పౌండుతో రూపాయి విలువ ప్రకారం దాదాపు 4742,59,83,500 కోట్లు!! అందుకే ఇది యూకే చరిత్రలోనే అత్యధిక వార్షిక వేతనంగా రికార్డు సృష్టించింది. ఇంకా చెప్పాలంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వార్షిక వేతనం కంటే సుమారు 2,360 రెట్లు డెనిస్ సొంతమైంది. అలాగే బ్రిటన్‌లోని 100 పెద్ద కంపెనీల సీవోల వార్షిక వేతనం కలిపినా అంతకంటే ఎక్కువే. కాగా, 2016తో పోలిస్తే డెనిస్ వార్షిక వేతనంలో పెరుగుదల 45శాతం అధికంగా నమోదైంది. అలాగే ఈ నాలుగేళ్లలో డెనిస్ మొత్తం ఆస్తి 1.3 బిలియన్ పౌండ్లకు చేరి, బ్రిటన్‌లోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఐదో స్థానం పొందింది. -
ఆన్లైన్ రమ్మీకి బానిసై..
నాగోలు: ఆన్లైన్ రమ్మీ ఆటలకు బానిసై పనిచేస్తున్న సంస్థను మోసం చేసి దాదాపు రూ.50 లక్షలు నగదు తీసుకెళ్లిన వ్యక్తితో పాటు మరో ఇద్దని హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి దాదాపు రూ.28 లక్షల నగదు, 3 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు తెలిపారు. హయత్‌నగర్ పెద్ద అంబర్‌పేట సమీపంలో ఉన్న జేబీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన నీలాపు నవీన్‌రెడ్డి(28) పెద్ద అంబర్‌పేటలోని జేబీ ఇన్ఫ్రాలో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్. ఆన్లైన్ రమ్మీ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. స్నేహితుల వద్ద అప్పలు చేశాడు. మార్చి 23వ తేదీన కంపెనీకి చెందిన రూ.50.57 లక్షల నగదును నవీన్‌రెడ్డి ఇచ్చి మరుసటి రోజు తీసుకుంటామని చెప్పారు. కంపెనీ వారు ఫోన్ చేయడంతో మామ అమిత్‌రెడ్డి, రామకృష్ణతో కలసి కోల్‌కతా, భువనేశ్వర్ వెళ్లి డబ్బులతో జల్సాలు చేశారు. కంపెనీ నిర్వాహకులు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి గురువారం ముగ్గురి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్ధలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్‌నగర్ సీఐ సురేందర్, ఎస్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు. ( చదవండి: యువతికి చుక్కలు చూపించిన ‘మైనర్’.. ) -
విషాదం: ప్రాణం తీసిన ఆన్లైన్ పేకాట
మంచిర్యాల రూరల్ (హాజీపూర్): ఇటీవల ఆన్లైన్ వాడకంతో చాలా విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ రుణాల యాప్‌లతో భారీగా నష్టపోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా.. మరికొందరు ఆన్లైన్ గేమ్‌లకు బానిసలై అవి లేకపోతే తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్లో పేకాట ఆడుతూ భారీగా నష్టపోయి తీవ్ర అప్పులపాలై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా పడ్తనపల్లిలో జరిగింది. హాజీపూర్ మండలం పడ్తనపల్లికి చెందిన చిందం పోశెట్టి (32) కి భార్య సుకన్య, కుమారుడు మన్విత్ (4) ఉన్నారు. పోశెట్టి ఆన్లైన్ రమ్మీ కల్చర్ తరచూ ఆడేవాడు. దీంట్లో బెట్టింగ్‌కు అలవాటుపడి పోశెట్టి అప్పుల పాలయ్యాడు. అయితే ఆన్లైన్ జూదం ఆడొద్దని తల్లిదండ్రులు, భార్య మందలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పేకాట ఆడుతూ అప్పులు పెరిగాయి. అప్పులు ఇచ్చిన వారు తీర్చాలని ఒత్తిడి పెంచడంతో పోశెట్టి మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం రాంపూర్ విద్యారణ్య ఆవాస విద్యాలయం వెనుక మైదానంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలిస్తుండగా మైదానంలో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఆలోపే అతడు మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హాజీపూర్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
విరాట్ కోహ్లీ, తమన్నాకు హైకోర్టు నోటీసులు
సాక్షి, తిరువనంతపురం : ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ వివాదంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, టాలీవుడ్ నటి తమన్నా భాటియాకు మరోసారిఎదురు దెబ్బ తగిలింది. వీరితోపాటు మాలీవుడ్ నటుడు అజు వర్గీస్‌కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వున్న వీరిని దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా బుధవారం నోటీసులు జారీ చేసింది. త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్ ఈ గేమ్స్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతో హైకోర్టును ఆశ్రయించారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ, వీటిని రద్దుచేయాలని కోరుతూ కోర్టు కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు తాజా నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా ఈ వివాదంలో పలువురు నటులుతోపాటు, క్రికెట్ సెలబ్రిటీలపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై కేరళ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, హీరోయిన్ తమన్నా, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌లకు గత ఏడాది మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వాటిని ఎందుకు ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు ఎందుకు వీటిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. Kerala HC sends notices to Virat Kohli and actors Tamannaah Bhatia & Aju Varghese, who are the brand ambassadors of Online Rummy games, in connection with a petition seeking legal prohibition on online rummy games. Court also asks for a reply from the State Govt on this. pic.twitter.com/TNYHdw2cF8 — ANI (@ANI) January 27, 2021 -
‘ఆన్లైన్ రమ్మీ’ కేసుల్లో పోలీసుల మీమాంస
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో ఆడి భారీ మొత్తం కోల్పోయినందుకు బాధితులా..? రాష్ట్రంలో నిషేధం ఉన్న ఈ గేమ్‌ను ‘అడ్డదారుల్లో’ ఆడుతున్నందుకు నిందితులా..? ఆన్లైన్ రమ్మీ గేమ్‌ల విషయంలో పోలీసుల మీమాంస ఇది. వివిధ రకాలైన యాప్‌లను వినియోగించి, జీపీఎస్ మార్చి ఆడుతూ... భారీ మొత్తాలు పోగొట్టుకుని తమ వద్దకు వస్తున్న వారి విషయంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. విషయం ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ వరకు వెళితే ఆ గేమ్స్ ఆడిన వారికి కొత్త ఇబ్బందులు వచ్చిపడతాయని స్పష్టం చేస్తున్నారు. అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈ ఆన్లైన్ రమ్మీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చదవండి: పాణాలు తీసిన జొన్నరొట్టె మూడేళ్ల క్రితం దీనిపై నిషేధం... రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం వరకు పేకాటపై నిషేధం ఉన్నప్పటికీ.. ఆన్లైన్లో ఉండే రమ్మీ గేమ్‌లపై ఉండేది కాదు. అయితే ఈ గేమ్ ఉచ్చులో యువత చిక్కుకుంటున్నారని, అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సైతం ఈ రకమైన చట్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆయా సంస్థ తమ కార్యకలాపాలను నిలిపి వేశాయి. ఇక్కడ ఉండే వాళ్లు ఎవరైనా ఆ సైట్లలోకి ఎంటర్ అయినా..సేవలు అందుబాటులో లేవనే సందేశమే కనిపిస్తుంది. ఐపీ అడ్రస్‌తో పాటు లోకేషన్‌కు సంబంధించి అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఆ ప్లేయర్ ఎక్కడి వారో గుర్తించే పరిజ్ఞానం వెబ్‌సైట్స్ నిర్వాహకుల వద్ద ఉంది. చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు ఇబ్బడిముబ్బడిగా యాప్స్ రావడంతో... రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధం ఉండటంతో దీనికి బానిసలైన వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. గతంలో పొరుగు రాష్ట్రాలతో పాటు గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి ఆడి వచ్చే వారు. ఇటీవల కాలంలో నకిలీ జీపీఎస్ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్స్‌లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుంటున్న పేకాట రాయుళ్ళు తాము ఉన్న ప్రాంతం జీపీఎస్ లోకేషన్ తప్పుగా, వేరే ప్రాంతంలో ఉన్నట్లు చూపించేలా చూస్తున్నారు. ఇలా ఆన్లైన్ రమ్మీ నిషేధం లేని రాష్ట్రాల లోకేషన్స్‌ను ఈ యాప్‌లలో సెట్ చేసి గేమ్ ఆడుతున్నారు. లోకేషన్ వేరే ప్రాంతంలో చూపిస్తుండటంతో ఆయా వెబ్సైట్లు గేమ్ ఆడేందుకు అవకాశం ఇస్తున్నాయి. కేసుల నమోదుకు అవకాశం లేక... ఇలా ఆన్లైన్ రమ్మీ గేమ్స్‌ను రెండేళ్ల నుంచి ఆడుతున్న వారు కూడా ఉంటున్నారు. వీరంతా భారీ మొత్తాలు కోల్పోయిన తర్వాత మేల్కొంటున్నారు. ఆన్లైన్లో ఆడి తాము భారీ మొత్తాలు కోల్పోయి బాధితులుగా మారామంటూ వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి అంశాల్లో ఆయా సంస్థలపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి నకిలీ జీపీఎస్ వినియోగించి, రమ్మీపై నిషేధం ఉన్న చోట ఆడినందుకు వీరినే నిందితులుగా పేర్కొనవచ్చని చెప్తున్నారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో అలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ గేమ్స్ ఆడుతూ అనేక మంది రూ.లక్షల్లో కోల్పోతున్నారు. వీరి లావాదేవీల విషయం ఆదాయపు పన్ను శాఖకు తెలిస్తే కొత్త కేసులు వచ్చిపడతాయని స్పçష్టం చేస్తున్నారు. ఈ తరహా పేకాటలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. -
ఆన్లైన్ రమ్మీ వ్యసనానికి బ్యాంకు ఉద్యోగి బలి
చెన్నై: ఆన్లైన్ రమ్మీ ఉచ్చులో చిక్కుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు లో ఘటన జరిగింది. కోయంబత్తూరులో నివసించే మదన్‌కుమార్ (28) బ్యాంకు ఉద్యోగి. ఆన్లైన్ రమ్మీకి బానిసగా మారాడు. తొలుత బాగా డబ్బులు సంపాదించినప్పటికీ తర్వాత నష్టాలు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఒత్తిడి తట్టుకోలేక మదన్ మద్యానికి అలవాటు పడ్డాడు. శనివారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఏపీ: రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం
సాక్షి, అమరావతి: సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974కు చేసిన సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆడేవాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా.. రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించాలని నిర్ణయించింది. వెలగడిపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. ♦ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకానికి ఆమోదం. ♦ అక్టోబర్ 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించాలని మంత్రి వర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తదుపరి కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోనుంది. ♦ పంచాయితీరాజ్ శాఖలో మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీడీవో) పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ♦ జాయింట్ కలెక్టర్లకు కింద ఎంపీడీవో (మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్)లకు పైన డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో డీడీవో పోస్టుల ఏర్పాటు. ఎంపీడీవోలకు పదోన్నతుల ద్వారా డీడీవో పోస్టుల భర్తీ. రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ♦ రహదారుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఒక రూపాయి చొప్పున రోడ్ సెస్ విధించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందుకు విధి విధానాలు రూపొందిం చాల్సిందిగా మంత్రివర్గం అధికారులను అదేశించింది. ♦ రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం గతంలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ పేరిట రూ.3,000 కోట్లు అప్పు చేసి ఇతర అవసరాలకు మళ్లించారు. దీంతో ఇప్పటి ప్రభుత్వ హయాంలో రహదారులు నిర్వహణకు నిధుల లభ్యత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక సెస్ విధించి ఆ మొత్తాన్ని ఖజానాకు మళ్లించకుండా కార్పొరేషన్ దగ్గరే ఉంచాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్డీసీకి ఆమోదం ♦ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 80కి ఆమోదం. వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏపీఎస్డీసీ ఏర్పాటు. ♦ నాడు–నేడు (మనబడి), నాడు–నేడు (వైద్యం), అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా పథకాల అమలుకు ప్రణాళిక, ఫండింగ్ (నిధుల సమీరణ)తోపాటు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన ప్రణాళికను ఈ కార్పొరేషన్ రూపొందిస్తుంది. వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు ♦ గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమి కేటాయింపు. ♦ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయింపు. మావోయిస్టుపార్టీపై మరో ఏడాది నిషేధం ♦ మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాల మీద మరో ఏడాదిపాటు నిషేధం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ♦ రాడికల్ యూత్ లీగ్ (ఆర్‌వైఎల్), రైతు కూలీ సంఘం (ఆర్సీఎస్) లేదా గ్రామీణ పేదల సంఘం (జీపీఎస్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ), సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎస్ఎఫ్)లపై మరో ఏడాదిపాటు నిషేధం. మత్స్య విశ్వవిద్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ♦ పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్–2020కి మంత్రివర్గం ఆమోదం. ♦ మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు. దీని ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయం. ♦ ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2,500 కోట్లు నష్టపోతున్నామని, వర్సిటీ ఏర్పాటు ద్వారా ఆ నష్టాన్ని నివారించవచ్చని అంచనా. తద్వారా సుమారు 90 వేల మంది ఆక్వా రైతులు, దీనిపై ఆధారపడ్డ మరో ఎనిమిది లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆంచనా. కృష్ణాపై రూ.2,565 కోట్లతో మరో రెండు బ్యారేజీలు ♦ కృష్ణా డెల్టా చౌడు బారకుండా పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సముద్రపు నీరు ఎగదన్నదు. కృష్ణా డెల్టాను పరిక్షించవచ్చు. తాగునీటికి ఇబ్బందులకు పరిష్కారం. రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రూ.2,565 కోట్ల వ్యయం. ♦ ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య కృష్ణా నదిపై 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,215 కోట్ల వ్యయం. ♦ ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి ఎగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం మధ్య కృష్ణా నదిపై 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,350 కోట్ల వ్యయం. ♦ పల్నాడు తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కోసం వరికపూడిశెల ఎత్తిపోతల పథకం చేపట్టాలని నిర్ణయం. ఈ పథకం ద్వారా గుంటూరు జిల్లా వెల్ధుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఎత్తిపోతల పథకానికి రూ.1,273 కోట్ల వ్యయం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్ సిగ్నల్ ♦ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి, సస్యశ్యామలం చేయడానికి బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ♦ 63.2 టీఎంసీల నీటిని తరలించి.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల సాగునీటిని అందించాలని నిర్ణయం. ఈ పథకానికి రూ.15,389.80 కోట్ల వ్యయం అవుతుంది. ♦ దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం. రాయలసీమ కరవు నివారణ ప్రణాళికలో భాగంగా ఈ పనులు చేపట్టాలని నిర్ణయం. (మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం) -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ
సాక్షి, అమరావతి : ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద ఆటలను నిషేంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర క్యాబినెట్‌కు అభినందనలు తెలిపారు. అనేక కుటుంబాలు, పిల్లలు ఈ వ్యసనానికి బానిసై ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం చట్టం చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడల నిషేధంతో యువతకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (రమ్మీ, పోకర్‌పై ఏపీ సర్కార్ నిషేధం) -
మాయాజూదం 'ఆన్లైన్ రమ్మీ'!
లాక్డౌన్ రోజుల్లో కృష్ణా జిల్లా నూజివీడులో ఓ బ్యాంకు ఉద్యోగి రూ.కోటికి పైగా మోసానికి పాల్పడ్డాడు. అంత పెద్ద మొత్తం ఆయన ఏం చేశారని ఆరా తీసిన పోలీసులు విస్తుపోయారు. ఆయన ఏకంగా రెండు నెలల్లో రూ.కోటికిపైగా ఆన్లైన్ రమ్మీ ఆడి ఓడిపోయారు. విజయనగరంలో ఓ వ్యాపారి పెద్ద ఎత్తున రుణాలు చేసి పరారయ్యాడు. ఆయన షాపు, ఇళ్లు అమ్మినా సరే అప్పులు తీరలేదు. ఆ వ్యాపారి అప్పులన్నీ కూడా ఆన్లైన్ రమ్మీ ఆడటానికే అని తెలిసి ఆ కుటుంబం లబోదిబోమంది. ఆన్లైన్ రమ్మీ మాయాజాలం అంటే అదే మరి. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. దేశంలో కోట్లాది మందిని ఆన్లైన్ రమ్మీ భూతం కమ్మేస్తోంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల చిన్ని తెరలపై ఆడే ఈ 13 ముక్కల పేకాట వ్యసనం ఎందరో బతుకులను పల్టీ కొట్టిస్తోంది. అటువైపు ఆడుతోంది ఎవరో తెలియని ఈ మాయాజూదంలో ఇటువైపు ఆటగాళ్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తాయి. ‘ఆన్లైన్ రమ్మీ ఆడండి... ఒక్క ఆటతో లక్షాధికారి కండి’ అన్న రీతిలో ప్రకటనలు ఇస్తున్నారు. ఓసారి ఆడి చూద్దాం.. అని పలువురు ఆకర్షితులవుతున్నారు. ముందే బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ► మొదట కొన్ని ఆటలు గెలిచినట్టే ఉంటుంది. ఆ తర్వాత నుంచి వరుసగా ఓడిపోతుంటారు. అవతల ఎవరో వ్యక్తి ఇంత గెలిచారు.. అంత గెలిచారు.. అని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. దాంతో తామెందుకు గెలవలేం అని భావిస్తూ ఉన్న డబ్బులతోపాటు అప్పటికప్పుడు అప్పులు చేసి మరీ ఆడి కుదేలవుతున్నారు. మళ్లీ చేరడంలోనే మాయాజాలం ప్రత్యక్షంగా ఆడే రమ్మీ ఆటలో ఒకరు అవుట్ అయిపోతే మళ్లీ పందెం కాసి ఆటలో కలవచ్చు. అలా ఎవరు కలుస్తారో ఆడేవాళ్లకు తెలుస్తుంది. కానీ ఆన్లైన్ రమ్మీలో అక్కడే మతలబు ఉంటోంది. ప్రతి ఆటలో ఒకరో ఇద్దరో త్వరగా అవుట్ అయిపోయి మళ్లీ కలుస్తారు. అక్కడ ఎవరు కలుస్తారో తెలీదు. చివరికి ఆలా కలిసిన వారే ఆట గెలుస్తుంటారు. ► కొన్ని సార్లు ఒకరే ఒకటి కంటే ఎక్కువ ఆటల్లో ఒకేసారి కలిసి ఆడుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయని కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► అసలు అటువైపు మనుషులే ఉండరని, కంప్యూటర్లే ఆడతాయని.. అంతా ఆన్లైన్లో మాయాజాలంతో బురిడీ కొటిస్తారని సైబర్ నిపుణులు చెబుతుండటం గమనార్హం. రాష్ట్రాల వారీగా నిషేధమే మార్గం ► ‘గేమ్ ఆఫ్ స్కిల్స్’ పేరిట ఆన్లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ముంబయి, బెంగళూరు తదతర కేంద్రాల నుంచి దేశమంతటా ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థలు జోరుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ► కావాలని ఆడి మోసపోతుండటంతో బాధితుల నుంచి అధికారికంగా ఫిర్యాదులు తక్కువగా ఉంటున్నాయి. సాంకేతికంగా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో మోసాలను పోలీసులు నిరూపించడం కష్టసాధ్యమవుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కానీ రాష్ట్రాలు తమ పరిధిలో ఆన్లైన్ రమ్మీని నిషేధించడానికి అవకాశం ఉంది. ► కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ రమ్మీని నిషేధించాయి. ఆన్లైన్ రమ్మీ నియంత్రణ విధివిధానాలను రూపొందించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. ► సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలు ఆన్లైన్ రమ్మీకి అధికారికంగా ఆనుమతి ఇచ్చాయి. మిగిలిన రాష్ట్రాలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. అంటే ఆ రాష్ట్రాల్లో అనుమతి ఉన్నట్టుగానే పరిగణిస్తున్నారు. నిషేధిస్తే కట్టడి ఇలా.. ► నిషేధించిన రాష్ట్రాల్లోని వారిని ఆన్లైన్ రమ్మీ సంస్థలు ఆడించకూడదు. ఆటగాళ్ల ఐపీ అడ్రస్ చూస్తే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో తెలుస్తుంది. నిషేధిత రాష్ట్రాల వారు ఉంటే వారిని ఆటకు ఆనుమతించకూడదు. ► నిషేధం లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మోసం చేశారని నిరూపించడం కష్టం. ► నిషేధం విధిస్తే ఆన్లైన్ సంస్థలు ఆ రాష్ట్రాల వారిని అసలు ఆడించనే కూడదు. ఆడించినట్టు తెలిస్తే కేసు నమోదు చేయవచ్చు. ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అక్కడికి వెళ్లి మరీ కేసు దర్యాప్తు చేసి దోషులను శిక్షించవచ్చు. ఏటా రూ.7,500 కోట్లు హుష్‌కాకీ ► ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ వివరాల ప్రకారం దేశంలో 20కి పైగా సంస్థలు ఆన్లైన్ రమ్మీ యాప్‌లు నిర్వహిస్తున్నాయి. 2020 జనవరి నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం దేశంలో ఆన్లైన్ రమ్మీలో ఏటా రూ.7,500 కోట్లు చేతులు మారుతున్నాయి. రమ్మీ సంస్థలు అధికారికంగా దాదాపు రూ.2,500 కోట్లు తమ ఆదాయంగా చూపిస్తున్నాయి. ► మరి మిగిలిన రూ.5 వేల కోట్లు ఎటు వెళ్తున్నాయని సైబర్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆ మొత్తం ఆన్లైన్ రమ్మీలో గెలిచిన వారికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న 30 కోట్ల మందిలో కనీసం ఒక శాతం మంది అధికారిక ఖాతాలు, ఆదాయ పన్ను వివరాల్లో అయినా ఆ మొత్తం కనిపించాలి కదా అన్నదే సైబర్ నిపుణుల సందేహం. ► తాము ఓడిపోయాం.. అవతల ఎవరో గెలిచారు అని ఆడిన వాళ్లు భావిస్తూ ఉంటారు. అవతల గెలిచిన వారు ఎవరూ ఉండరని, కొన్ని సంస్థలే కంప్యూటర్ల ద్వారానో.. తమ మనుషుల ద్వారానో ఆడిస్తూ మోసానికి పాల్పడుతూ ఆ రూ.5 వేల కోట్లు కొల్లగొడుతున్నాయన్నది సైబర్ నిపుణుల సందేహం. స్వీయ నియంత్రణ, పెద్దల పర్యవేక్షణే మార్గం ఆన్లైన్ రమ్మీ వ్యసనానికి బానిస కాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమ పరిష్కార మార్గం. ఒకసారి ఆ ఆటకు అలవాటు పడితే బయట పడటం చాలా కష్టం. కాబట్టి ఒక్కసారి కూడా ఆడాలని ప్రయత్నించకూడదు. ఆన్లైన్ ఆటల సందర్భంగా తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. ఈ దిశగా పిల్లలకు అవగాహన కల్పించాలి. వ్యసనపరులకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. – పీవీ సునీల్ కుమార్, సీఐడీ అదనపు డీజీ -
ఉసురుతీస్తున్న ఆన్లైన్ రమ్మీ
ఆన్లైన్ గేమ్ రమ్మీ ఎంతో భవిష్యత్ ఉన్న యువత ఉసురుతీస్తోంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రావడంతో సెల్‌ఫోన్, కంప్యూటర్ ల్యాప్‌టాప్ ఆధారంగా ఆన్లైన్ రమ్మీకి బానిసవుతున్నారు. కాలక్షేపం కోసం ఆడుదామని వెబ్సైట్ లింకును ఓపెన్ చేస్తున్న యువకులు, సాప్ట్వేర్ ఉద్యోగులు బానిసలుగా మారుతున్నారు. ఫలితంగా లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇందుకు ఇటీవల జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగి మృతి నిదర్శనం. జమ్మికుంటరూరల్(హుజూరాబాద్): ఆన్లైన్ రమ్మీ ప్రాణాలు తీస్తోంది. జమ్మికుంట పట్టణానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం వేలల్లో రావడంతో తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తున్నారు. అనుకోకుండా కుమారుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో కన్నీరుమున్నీరయ్యారు. యువకుడు లాక్డౌన్ నేపథ్యంలో జమ్మికుంటలో తల్లిదండ్రుల వద్దే ఉండగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్లి డ్యూటీలో చేరాడు. కొద్దికాలంగా ఆన్లైన్ రమ్మీకి బానిసయ్యాడు. స్నేహితుల వద్ద క్రెడిట్‌కార్డులు తీసుకొని అప్పులపాలయ్యాడు. ఆన్లైన్ రమ్మీ ఆట కారణంగా సుమారు రూ.30 లక్షల వరకు అప్పు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తన పేరు మీద ఉన్న ఇంటి విలువ సమారు రూ.50 లక్షల వరకు మార్కెట్లో ధర పలుకుతుండగా, కుటుంబసభ్యులకు తెలియకుండా విక్రయించినట్లు తెలుస్తోంది. అప్పులు పెరిగిపోయి హైదరాబాద్‌లోని అద్దె ఇంట్లో నాలుగురోజులక్రితం బలవన్మరణం చెందాడు. దీంతో జమ్మికుంట పరిసర ప్రాంతాల్లో ఆన్లైన్ రమ్మీ చర్చనీయాంశంగా మారింది. డేంజర్ ఆన్లైన్ జూదం తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేకాట క్లబ్బులను మూసివేయించడంతో పేకాటరాయుళ్లు ఆన్లైన్ వైపు మళ్లారు. దీంతో లక్షల రూపాయలు పోగొట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ జూదానికి బానిస అయి ఇంటిల్లి పాది రోడ్డునపడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈజీ మనికోసం వెంపర్లాడే యువత ఎక్కువగా ఈ ఆన్లైన్ రమ్మీలో పాల్గొంటూ సంపాదన, జీతం..జీవితం కోల్పోతున్నారు. రాత్రి, పగలు తేడా లేదు తెలంగాణలో ఆన్లైన్ రమ్మీకి అనుమతి లేనప్పటికీ జూదరులు సెల్‌ఫోన్, కంప్యూటర్ ల్యాప్‌టాప్‌ల్లో ఫేక్ జీపీఎస్ ద్వారా ఓపెన్ చేస్తూ పగలు, రాత్రి అని తేడా లేకుండా మునిగితేలుతూ లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఆర్థికంగా నష్టపోవడమేకాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని తెలిసి కూడా యువత ఈ ఆటలో నిమగ్నమవుతున్నారు. -
యువత రమ్మీ రాగం..!
సాక్షి, కందుకూరు రూరల్: స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే స్థాయిలో నష్టాలను కూడా కొనితెస్తోంది. స్మార్ట్ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉంటే ఏదైనా చేయవచ్చు. పిల్లలు వివిధ రకాల గేమ్స్ ఆడుతుంటారు. టైమ్ పాస్‌కి కొందరు పెద్దలు, విద్యార్థులు, యువకులు కూడా ఆడుతున్నారు. అవి కాస్తా వ్యసనంగా మారి అప్పులు పాలవుతున్నారు. ఆన్లైన్ మనీ గేమ్స్ పేకాటలో రమ్మీ అధికంగా ఆడుతున్నారు. యాప్స్ సాయంతో.. ఆన్లైన్ పేకాట యాప్స్ ఐదారు రకాలున్నాయి. దీంతోపాటు డ్రిమ్ 11 యాప్ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్ బాల్ ఆటలుంటాయి. వీటిల్లో ప్లేయర్స్‌ను ఎంచుకొని ఒక టోర్నమెంట్ పెట్టుకోవాలి. ఇందులో రూ. 10 వేల వరకు బెట్టింగ్ వేస్తారు. పాయింట్ల వారీగా నగదు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆన్లైన్ గేమ్స్‌కు విద్యార్థులు ఎక్కువగా ఆకర్షణకు గురవుతున్నారు. ఎవరికీ తెలియకుండా ఫోన్లో ఆడే ఆటలు కావడంతో ఏమి చేస్తున్నారే విషయం బయటకు రాదు. నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు ఏ ఆటైనా ఆడుకోవచ్చు. నగదు వస్తే సంతోష పడతారు. రాకపోతే పోయిన నగదు కూడా ఎలా రాబట్టాలనే ఆలోచనలో పడుతున్నారు. ఇలా ఎక్కువ శాతం విద్యార్థులు వీటికి బానిసై చదువుకు దూరవుతున్నారు. నష్టపోయిన నగదును చేకూర్చేందుకు ఇంట్లో తల్లిదండ్రులను మోసం చేయడం, తోటి విద్యార్థుల వద్ద అప్పులు చేయడం, తెలిసిన వారి దగ్గర అప్పులడగడం చేస్తున్నారు. అవీ చాలకపోతే దొంగతనాలకు పాల్పడుతూ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. ఒక్క సారిగా కష్టం లేకుండా నగదు సంపాదించాలనే ఆలోచనలతోపాటు ప్రస్తుతం పెరిగిపోయిన సరదాలు, వ్యక్తి గత ఖర్చుల కోసం డబ్బు సంపాదించాలనే ఆశతో ఇలా బానిసలవుతున్నారు. వీటిల్లో తక్కువ నగదు వెచ్చించి ఎక్కువ నగదు సంపాదించన వారు కూడా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ మనీ గేమ్స్‌ను బ్యాన్ చేశాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణలో ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఇలా.. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం లేదా నేరుగా లాగిన్ కావాలి. తర్వాత ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్లోకి నగదు బదిలీ చేసుకుంటారు. ఆ తర్వాత వారికి నచ్చిన నగదు పెట్టి గేమ్ ఆడతారు. ఇలా పేకాటలో రమ్మీ మొదటి స్థానంలో ఉంది. ఇది ముందుగా టైమ్ పాస్‌గా మొదలై చివరికి వేలకు వేలు నగదు వెచ్చించి బానిసలువుతున్నారు. ఒకరితో సంబంధం లేకుండా ఫోన్లో ఒంటిరిగా కూర్చొని రాత్రింబవళ్లు ఈ ఆట ఆడుతున్నారు. ఇలాంటి వారికి ఒక్కొక్క సారి నగదు వస్తుంది. దానికి ఆశ పడి.. ఇంకా వస్తాయనుకుని వేలకు వేలు వెచ్చించి ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఇలా లక్షల రూపాయిలు అప్పులైన వారు అనేక మంది ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లో ఐపీఎల్, వన్డే మ్యాచ్‌లు, ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లు జరిగేటప్పుడు మాత్రమే క్రికెట్ బెట్టింగ్ జోరుగా ఉంటుంది. కానీ ఆన్లైన్ రమ్మీకి సమయ పాలన ఉండదు. ఎప్పుడు ఆడాలనిపిస్తే అప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోవడమే. -
మహిళలు, విద్యార్థులు నాశనమవుతున్నారు
- ఆన్లైన్ రమ్మీపై హైకోర్టుకు నివేదించిన సర్కారు - గ్యాంబ్లింగ్‌తో కంపెనీలు - కోట్లు వెనకేసుకొంటున్నాయి సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ రమ్మీ నిర్వహిస్తున్న కంపెనీలు గ్యాంబ్లింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు వెనకేస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ గత ఏడాది రూ.623 కోట్లను తమ ఆదాయంగా చూపిందని వివరించింది. ఆన్లైన్ రమ్మీ ఓ వ్యసనంగా మారిందని, మహిళలు, విద్యార్థులు దీని బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపింది. అంతేకాక ఆత్మహత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయని, దీనికి సంబంధించి తమకు ఫిర్యాదులు కూడా అందాయంది. ఈ నేపథ్యంలోనే తాము ఆన్లైన్ రమ్మీని తెలంగాణలో నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామంది. రమ్మీ నైపుణ్య క్రీడ అయినప్పటికీ, నేర కోణంలో చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని నివేదించింది. తెలంగాణలో ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ పలు కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. కార్డులు కలపడంలో మోసాలు... ఈ వ్యాజ్యాల్లో సోమవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు ప్రారంభించారు. ఆన్లైన్ రమ్మీ కంపెనీలు తమ సంస్థకు చెందిన ఉద్యోగులనే ఓ బృందంలో సభ్యులుగా చేర్చి, వారి చేత ఆడిస్తాయని తెలిపారు. కార్టులు కలిపి, పంచే సమయంలో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మోసానికి పాల్పడుతున్నాయన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు ముడిపడి ఉంటుందని, అయితే ఈ సందర్భంగా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఎటువంటి యంత్రాంగం లేదని తెలిపారు. 24 గంటలూ ఆట అందుబాటులో ఉండటంతో మహిళలు, విద్యార్థులు ఆకర్షితులవుతున్నారన్నారు. వాదనల నిమిత్తం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. -
ఆన్లైన్ ‘ఆటలూ’ సాగవు!
∙ నెట్లో పేకాటపై సర్కారు కన్నెర్ర ∙ గేమింగ్ యాక్ట్‌కు సవరణలు తెస్తూ ఆర్డినెన్స్ ∙ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గడిచిన కొన్నేళ్లుగా పేకాటపై ఉక్కుపాదం మోపుతోంది. ఫలితంగా పేకాట క్లబ్బులు మూతపడ్డాయి. అక్కడక్కడా నిర్వహిస్తున్న పేకాట శిబిరాలనూ పోలీసులు వదిలిపెట్టట్లేదు. దీంతో ఇటీవల కాలంలో అనేక మంది ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడుతున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో గేమింగ్ యాక్ట్ సవరణకు సంబంధించి కీలక ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర పడింది. ఆకర్షణీయమైన ప్రకటనలతో ఆన్లైన్ రమ్మీని నిర్వహిస్తున్న వెబ్సైట్లు లెక్కకుమించి ఉంటున్నాయి. వీటికి బానిసలుగా మారిన వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. సర్వర్లను రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసుకుంటున్న ఈ వెబ్సైట్ నిర్వాహకులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరు కొత్తవారిని ఆకర్షించేందుకు తొలినాళ్లల్లో కొంత నగదు గెల్చుకునేలా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి పూర్తిగా బానిసయ్యాడని గుర్తించిన తర్వాత ప్రోగ్రామింగ్ మార్చడం ద్వారా తమకే లాభాలు వచ్చేలా మార్పుచేర్పులు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో అప్పటికే అమలులో ఉన్న గేమింగ్ యాక్ట్‌ను స్వీకరించింది. 1974 నాటి ‘ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్’ ఆధారంగానే ఇప్పటికీ పేకాటపై చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ విస్తరణ, మార్పుచేర్పుల నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ పేకాట విస్తరించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గేమింగ్ యాక్ట్‌కు సవరణలు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా ఆన్లైన్లో పేకాట ఆడుతూ చిక్కిన వారిపై నేరం నిరూపణైతే రూ.5 వేల జరిమానా, ఏడాది జైలు శిక్షకు ఆస్కారం ఉండేలా ఆర్డినెన్స్ తేనున్నారు. ఇది అమలులోకి వస్తే ఆన్లైన్ గాంబ్లింగ్ సర్వీసులను అందించే వెబ్సైట్లను నిషేధించే అధికారం పోలీసులకు వస్తుంది. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ఆయా వెబ్సైట్లు వినియోగిస్తున్న వారి వివరాలు తెలుసుకోవడానికి వాటితో లింక్ చేసి ఉన్న బ్యాంకు ఖాతాలు, క్రెడిట్/డెబిట్‌కార్డుల వివరాలు గుర్తించేందుకు ఆస్కారం ఏర్పడనుంది. వీటి ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండనుంది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆయా వెబ్సైట్లు రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమం కానుంది. ఇంటర్నెట్ సేవలను అందించే సంస్థలకు లేఖలు రాయడం ద్వారా పోలీసులు అధికారికంగా గాంబ్లింగ్ సైట్లు రాష్ట్రంలో ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఏర్పడనుంది. -
పగలు, రాత్రి తేడా లేకుండా నట్టింట్లో..
► రూ.వంద నుంచి వేల రూపాయల్లో బెట్టింగులు ►ట్రెండ్ మార్చిన పేకాటరాయుళ్లు ►పగలు, రాత్రి తేడా లేకుండా సెల్ఫోన్లో ఆట వీణవంక: పచ్చని సంసారాల్లో ‘ఆన్లైన్’ పేకాట చిచ్చురేపుతుంది. ఒకప్పుడు ఇంటి పరిసరాలు, పొలం గట్లు, చెరువులు, కుంటల వద్ద ఆట ఆడే పేకాటరాయుళ్లు.. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఆండ్రాయిడ్ మొబైల్ అందుబాటులోకి రావడంతో ‘ఆన్లైన్’ పేకాట మోజులో పడ్డారు. పగలు, రాత్రి తేడాలేకుండా నట్టింట్లో నుంచే పేకాట ఆడుతూ రెక్కల కష్టం పేకాటకే తగలేస్తున్నారు. జిల్లాలో ఆన్లైన్ పేకాటరాయుళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పొద్దంత పనిచేసి సంపాదించిన సొమ్మును కొంత మంది పేకాట ఆడి పోగుట్టుకుటుండగా, మరి కొందరు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆడుతున్నారు. పోలీసులు రోజుకో కేసు నమోదు చేస్తున్నా వారి ఆగడాలకు అడ్డకట్ట వేయలేకపోతున్నారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఆన్లైన్ పేకాటలో ఒకే రోజు రూ.30 వేలు పొగొట్టుకున్నాడు. ట్రెండ్ మారింది. పేకాటరాయుళ్లు తమ ట్రెండ్‌ను మార్చారు. బహిరంగంగా ఆడితే పోలీసులకు పట్టుబడుతున్నామని గ్రహించి ఆన్లైన్ పేకాటకు తెరలేపారు. గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో రూ.వంద నుంచి వేల రూపాయల్లో బెట్టింగ్‌లు పెట్టి ఆడుతున్నారు. వీణవంక మండలంలో ఈ ఆన్లైన్ వేగంగా విస్తరిస్తోంది. ఇంట్లోనే ఎవరికీ అనుమానం రాకుండ సెల్ఫోన్లోనే ఆడుతున్నారు. డబ్బులు అర్జించిన సంగతి దేవుడెరుగు ...డబ్బులు పొగుట్టుకున్న వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఆన్లైన్ పేకాటలో కూలీ పని చేసుకుని బతుకేవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. గ్రామాల్లో సాగుతున్న ఆన్లైన్ పేకాటతో మోసపోతున్న ప్రజలకు అవగాహన కల్పించి, పేకాటరాయుళ్లపై ఉక్కుపాదం మోపాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.