సాక్షి, అమరావతి: సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974కు చేసిన సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆడేవాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా.. రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించాలని నిర్ణయించింది. వెలగడిపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు.
♦ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకానికి ఆమోదం.
♦ అక్టోబర్ 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించాలని మంత్రి వర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తదుపరి కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోనుంది.
♦ పంచాయితీరాజ్ శాఖలో మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ (డీడీవో) పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
♦ జాయింట్ కలెక్టర్లకు కింద ఎంపీడీవో (మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)లకు పైన డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో డీడీవో పోస్టుల ఏర్పాటు. ఎంపీడీవోలకు పదోన్నతుల ద్వారా డీడీవో పోస్టుల భర్తీ.
రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
♦ రహదారుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఒక రూపాయి చొప్పున రోడ్ సెస్ విధించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందుకు విధి విధానాలు రూపొందిం చాల్సిందిగా మంత్రివర్గం అధికారులను అదేశించింది.
♦ రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం గతంలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ పేరిట రూ.3,000 కోట్లు అప్పు చేసి ఇతర అవసరాలకు మళ్లించారు. దీంతో ఇప్పటి ప్రభుత్వ హయాంలో రహదారులు నిర్వహణకు నిధుల లభ్యత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక సెస్ విధించి ఆ మొత్తాన్ని ఖజానాకు మళ్లించకుండా కార్పొరేషన్ దగ్గరే ఉంచాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఏపీఎస్‌డీసీకి ఆమోదం
♦ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 80కి ఆమోదం. వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏపీఎస్‌డీసీ ఏర్పాటు.
♦ నాడు–నేడు (మనబడి), నాడు–నేడు (వైద్యం), అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా పథకాల అమలుకు ప్రణాళిక, ఫండింగ్ (నిధుల సమీరణ)తోపాటు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన ప్రణాళికను ఈ కార్పొరేషన్ రూపొందిస్తుంది.
వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు
♦ గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమి కేటాయింపు.
♦ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయింపు.
మావోయిస్టుపార్టీపై మరో ఏడాది నిషేధం
♦ మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాల మీద మరో ఏడాదిపాటు నిషేధం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
♦ రాడికల్ యూత్ లీగ్ (ఆర్‌వైఎల్), రైతు కూలీ సంఘం (ఆర్‌సీఎస్) లేదా గ్రామీణ పేదల సంఘం (జీపీఎస్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ), సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఆర్‌ఎస్‌ఎఫ్)లపై మరో ఏడాదిపాటు నిషేధం.
మత్స్య విశ్వవిద్యాలయానికి గ్రీన్ సిగ్నల్
♦ పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్–2020కి మంత్రివర్గం ఆమోదం.
♦ మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు. దీని ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయం.
♦ ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2,500 కోట్లు నష్టపోతున్నామని, వర్సిటీ ఏర్పాటు ద్వారా ఆ నష్టాన్ని నివారించవచ్చని అంచనా. తద్వారా సుమారు 90 వేల మంది ఆక్వా రైతులు, దీనిపై ఆధారపడ్డ మరో ఎనిమిది లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆంచనా.
కృష్ణాపై రూ.2,565 కోట్లతో మరో రెండు బ్యారేజీలు
♦ కృష్ణా డెల్టా చౌడు బారకుండా పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సముద్రపు నీరు ఎగదన్నదు. కృష్ణా డెల్టాను పరిక్షించవచ్చు. తాగునీటికి ఇబ్బందులకు పరిష్కారం. రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రూ.2,565 కోట్ల వ్యయం.
♦ ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య కృష్ణా నదిపై 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,215 కోట్ల వ్యయం.
♦ ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి ఎగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం మధ్య కృష్ణా నదిపై 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,350 కోట్ల వ్యయం.
♦ పల్నాడు తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కోసం వరికపూడిశెల ఎత్తిపోతల పథకం చేపట్టాలని నిర్ణయం. ఈ పథకం ద్వారా గుంటూరు జిల్లా వెల్ధుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఎత్తిపోతల పథకానికి రూ.1,273 కోట్ల వ్యయం.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్ సిగ్నల్
♦ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి, సస్యశ్యామలం చేయడానికి బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
♦ 63.2 టీఎంసీల నీటిని తరలించి.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల సాగునీటిని అందించాలని నిర్ణయం. ఈ పథకానికి రూ.15,389.80 కోట్ల వ్యయం అవుతుంది.
♦ దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం. రాయలసీమ కరవు నివారణ ప్రణాళికలో భాగంగా ఈ పనులు చేపట్టాలని నిర్ణయం. (మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం)
Comments
Please login to add a commentAdd a comment