Andhra Pradesh: సరికొత్త శకం | AP Government Releases Final Gazette Notification Of New Districts | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: సరికొత్త శకం

Published Sun, Apr 3 2022 4:42 AM | Last Updated on Sun, Apr 3 2022 6:49 PM

AP Government Releases Final Gazette Notification Of New Districts - Sakshi

సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలతో రాష్ట్రంలో సరికొత్త శకానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది.

రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇవ్వగా, ఉగాది పర్వదినాన శనివారం తుది నోటిఫికేషన్‌ ఇచ్చింది. 1974 ఏపీ డిస్ట్రిక్ట్‌ (ఫార్మేషన్‌) చట్టం ప్రకారం ఈ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. అంతకుముందు శనివారం సాయంత్రం తుది నోటిఫికేషన్‌లో కొద్దిపాటి మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం వర్చువల్‌గా ఆమోదముద్ర వేసింది.

విస్తృత అధ్యయనం, సుదీర్ఘ కసరత్తు ద్వారా పూర్తి శాస్త్రీయతతో ప్రభుత్వం జిల్లాల విభజనను పూర్తి చేసింది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంది. సీఎం జగన్‌ నిర్ణయం మేరకు ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభం కానుంది. 

ప్రజల అభిప్రాయం మేరకు స్వల్ప మార్పులు
కొత్త జిల్లాల ప్రతిపాదనలపై రాష్ట్ర వ్యాప్తంగా 284 అంశాలపై ప్రజల నుంచి 17,500కు పైగా సూచనలు వచ్చాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. సహేతుకంగా ఉన్న వాటిపై అధ్యయనం చేసి అందుకనుగుణంగా స్వల్ప మార్పులు చేసింది. దీనివల్ల కొత్త జిల్లాల్లో గతంలో ప్రతిపాదించిన కొన్ని మండలాలు అటు ఇటు మారాయి.

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లిన ద్వారకాతిరుమల మండలాన్ని అక్కడి ప్రజల అభీష్టం మేరకు ఏలూరు జిల్లాలోకి మార్చారు. అనకాపల్లి జిల్లాలోకి వెళ్లిన పెందుర్తిని స్థానికుల కోరిక మేరకు విశాఖ జిల్లాకు మార్చారు. ఇలా పలుచోట్ల మండలాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి జిల్లాలో 2011 లెక్కల ప్రకారం సగటున జిల్లాకు 18 నుంచి 20 లక్షల జనాభా ఉండేలా చూశారు. 

పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్‌ 
పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది. సాధ్యమైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఇబ్బందులు ఉన్నచోట ఆ మండలాలను మార్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. 10 జిల్లాల్లో రెండు, 12 జిల్లాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో 4 చొప్పున మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ల విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో ఉదారతతో వ్యవహరించారు.

ఈ కారణంగానే 51 డివిజన్లు 72కు చేరాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజవర్గం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయన కుప్పంను పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ జిల్లాల విభజన చేస్తున్న సమయంలో కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేయాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం కుప్పం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసింది. 

మన్యం అభివృద్ధికి రెండు జిల్లాలు
పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా చేశారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఒక్కటి మినహా జిల్లాల పేర్లు యథాతథం
ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రతిపాదించిన మేరకు కొత్త జిల్లాల పేర్లను ప్రభుత్వం దాదాపు అలాగే ఉంచింది. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లాను మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతి జిల్లాగా మార్చింది. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, అత్యంత ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు పలుచోట్ల అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలాంటి అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది.

అక్కడి స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను స్వయంగా ప్రభుత్వమే గుర్తించి కొత్త జిల్లాల్లో ప్రతిబింబించేలా చూసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం, ప్రాశస్త్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. దాన్ని ప్రభుత్వం ఇప్పుడు సాకారం చేసింది. పాడేరు కేంద్రంగా అరకు ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేసింది.

పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుతో గిరిపుత్రులకు గౌరవం ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి, అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బ తినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నర్సాపురం పార్లమెంటును భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది. ఈ జిల్లాలు గోదావరి తీర ప్రాంతాలు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు 
ఎన్టీఆర్‌ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఈ ప్రాంత వాసులు చాలా కాలం నుంచి కోరుతున్నా, ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తాము అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆ మాట నెరవేర్చుకుంటూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాగా ఏర్పాటు చేశారు.

దీనిపై సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. మరోవైపు మచిలీçపట్నాన్ని కృష్ణా జిల్లాగా కొనసాగిస్తూ దాని చారిత్రక ప్రాధాన్యతను ప్రభుత్వం నిలబెట్టింది. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది.

బాపట్లను జిల్లాగా చేయాలనే డిమాండ్‌ సుదీర్ఘ కాలంగా ఉన్న కల నెరవేరింది. పుట్టపర్తి ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన సత్య సాయిబాబాను స్మరిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసి ముందడుగు వేసింది. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన ప్రాంతాన్ని ఆయన పేరుతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement