కొత్త జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలాలు ఈరోజు మీ అందరి కళ్లెదుటే కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం 13 నూతన జిల్లాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, వినూత్న విధానాల గురించి వివరించారు.
గడప, గడపకూ పరిపాలన...
ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో ఇంకా చెప్పాలంటే ఇంటింటికీ, గడప గడపకూ పరిపాలన చేరువ కావటాన్ని ఈరోజు మనమంతా చూస్తున్నాం. గ్రామస్థాయి నుంచి పౌరసేవల్లో వేగం, పారదర్శకత పెరిగింది. అవినీతి, వివక్ష లాంటివి పూర్తిగా నిర్మూలించడంతో సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాలు అందుతున్నాయి.
మెరుగైన వైద్య సేవలు..
రాష్ట్రంలో వైద్య సేవలు చాలా చాలా మెరుగైన పరిస్థితిలో ఉన్నాయి. దాదాపు 1100 వాహనాలు 108, 104లు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఎవరికి బాగాలేకపోయిన 20 నిమిషాల లోపే చేరుకుని వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అక్క, చెల్లెమ్మలకు భద్రత...
అక్క చెల్లెమ్మల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ దిశ యాప్‌ను తెచ్చాం. దాదాపుగా 1.19 కోట్ల మంది ఫోన్లలో దిశ యాప్ ఉంది. ఆపద సమయంలో కేవలం 10 నుంచి 20 నిమిషాలలోపే పోలీసు సోదరులు వారిని ఆదుకుంటున్నారు.
దేశంలోనే తొలిసారిగా డోర్ డెలివరీ..
రేషన్ సరుకులను ఇంటికే తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తున్న మొట్ట మొదటి ప్రభుత్వం మనదే. మిగిలిన రాష్ట్రాలు కూడా మనల్ని అనుసరిస్తున్నాయి. బర్త్ సర్టిఫికెట్ దగ్గర నుంచి రేషన్ కార్డు, కులధ్రువీకరణ పత్రం, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు.. ఇలా ఏదైనా కూడా నిర్దేశిత సమయంలో ఇవ్వాలని గడువు విధించి మరీ అందజేస్తున్న సచివాలయాల వ్యవçస్థ మన కళ్లెదుటే కనిపిస్తోంది. ఒకటో తేదీన నిద్ర లేవకముందే, అది సెలవు రోజైనా సరే సూర్యోదయాన్నే గుడ్ మార్నింగ్ అంటూ పలకరించి మన ఇంటికే వచ్చి వలంటీర్లు సామాజిక íపింఛన్లు అందిస్తున్నారు.
గ్రామగ్రామాన సచివాలయాలు..
గ్రామ స్థాయిలో వికేంద్రీకరణ గురించి చెప్పాల్సి వస్తే ప్రతి 2వేల మందికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవçస్థ్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్, ఏకంగా 15,004 సచివాలయాల ద్వారా విజయవంతంగా సేవలందిస్తున్న తొలి ప్రభుత్వం మనదే అని సగర్వంగా చెబుతున్నాం. గ్రామగ్రామాన సచివాలయాలను నెలకొల్పాం.
రైతు భరోసా కేంద్రాలు...
గతంలో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు. మన ప్రభుత్వంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతన్నకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడే గొప్ప వ్యవస్థ రూపుదిద్దుకుంది.
విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు..
ఇవాళ ప్రభుత్వ స్కూళ్లను చూసినా, ప్రభుత్వ ఆస్పత్రులను చూసినా రూపురేఖలు పూర్తిగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తెస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులు మాత్రమే ఉండగా ఇప్పుడు మరో 16 యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తెస్తున్నాం.
మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే...
గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయిలో వచ్చిన మార్పులతో పాటు జిల్లా పరిపాలనకు సంబంధించిన మార్పులు కూడా అంతే అవసరం. గ్రామస్థాయి నుంచి చోటు చేసుకున్న మార్పులకు రెవెన్యూ, జిల్లా స్థాయిలో మార్పులు తోడైతేనే చిరస్థాయిగా ఉంటాయి. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటును ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాం. జిల్లా ముఖ్య పట్టణానికి ఆ జిల్లాలోని చివరి ప్రాంతం దూరంగా ఉండటం వల్ల అభివృద్ధిలో తేడాను, ప్రజల ఇబ్బందులను నా సుదీర్ఘ పాదయాత్రలో గమనించా. అలాంటి తారతమ్యాలను తొలగించాలనే గొప్ప ఆలోచనతోనే అడుగు ముందుకు వేశాం.
Comments
Please login to add a commentAdd a comment