AP CM YS Jagan Launched 13 New Districts In AP, Know Complete Details Inside - Sakshi
Sakshi News home page

AP New Districts: కొత్త కళ.. గడప వద్దకే పాలన

Published Tue, Apr 5 2022 4:12 AM | Last Updated on Tue, Apr 5 2022 9:56 AM

CM YS Jagan Launched 13 New Districts In Andhra Pradesh - Sakshi

కొత్త జిల్లాలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌

రాష్ట్రంలో నవశకం ఆవిష్కృతమయ్యింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యింది. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా 13 కొత్త జిల్లాలు అవతరించాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కారమయ్యింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రమంతటా సంబరాలు మిన్నంటాయి. ప్రతిచోటా పండుగ వాతావరణం నెలకొంది. కలెక్టర్లు సహా, జిల్లాల ఉన్నతాధికారులు బాధ్యతలు చేపట్టడంతో కలెక్టరేట్లు సందడిగా మారాయి. కొత్త జిల్లాల ఏర్పాటువల్ల ప్రజలకు కలగబోయే లాభాల గురించి ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.  

గ్రామం నుంచి రాజధానుల వరకు..పరిపాలనకు సంబంధించి డీ సెంట్రలైజేషన్‌ (వికేంద్రీకరణ) ప్రజలకు మంచి చేస్తుంది. అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా.

కుప్పం ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు..
కుప్పం స్థానిక ఎమ్మెల్యే (టీడీపీ అధినేత చంద్రబాబు) విజ్ఞప్తి మేరకు.. ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకుని రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు చేసుకోలేకపోగా ఇప్పుడు ఆయనే అక్కడ రెవెన్యూ డివిజన్‌ కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకే పాలన తీసుకువెళ్లామని, ఇందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నూతన జిల్లాల ద్వారా కార్యాలయాల ఏర్పాటుతో పాటు వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు. కొత్త జిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పథకాలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలను సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాతో ఆరంభించి వరుసగా మిగతా జిల్లాలను సీఎం ప్రారంభించారు. 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులనుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ..

గ్రామ స్థాయి నుంచి చూశాం..
పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని మనమంతా గ్రామస్థాయి నుంచి చూశాం. జిల్లా స్థ్ధాయిలో కూడా వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు నేటి నుంచి మరింత మేలు జరుగుతుంది. ఇవాళ్టి నుంచి 26 జిల్లాలతో మన రాష్ట్రం రూపు మారుతోంది. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

మహోన్నత వ్యక్తులు.. మనోభావాలు
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి... ఇవీ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల సెంటిమెంట్, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని వీటి పేర్లను నిర్ణయించాం.


కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి పేర్ని నాని, సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజేయ కల్లం, అధికారులు

కొత్తవి ఏర్పాటు కాకపోవడంతో..
గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం, రాజమహేంద్రవరం గత జిల్లాలకు ముఖ్య పట్టణాలుగా మారాయి. గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈరోజు నుంచి కొలువుదీరుతున్నాయి. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఆవిర్భవిస్తే చివరిగా 1979 జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. తరువాత కొత్త జిల్లాలు ఏర్పాటు కాకపోవడంతో పరిపాలన సంస్కరణలు, వికేంద్రీకరణ విషయంలో బాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయాం. జిల్లాల సంఖ్య, రెవెన్యూ డివిజన్లు పెరగడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగి సమర్థంగా అమలవుతాయి. 

అరుణాచల్‌లో 53 వేల మందికి జిల్లా
దేశంలో 727 జిల్లాలు ఉండగా యూపీలో అత్యధికంగా 75, అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమైన ఏపీలో మాత్రం నిన్నటివరకు 13 జిల్లాలే ఉన్నాయి. 1.38 కోట్ల జనాభా కలిగిన, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఏకంగా 25 జిల్లాలున్నాయి. 2011 లెక్కల ప్రకారం ఏపీలో 13 జిల్లాల్లో 4.90 కోట్ల మంది జనాభా ఉండగా ప్రతి జిల్లాలో సగటున 38 లక్షల మంది ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత జనాభా లేదు. మహారాష్ట్రలో ఒక్కో జిల్లాలో సగటున 31 లక్షలు, తెలంగాణాలో 10.06 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 6 లక్షల మందికి ఒక జిల్లా ఏర్పాటు కాగా మిజోరాంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53 వేల మందికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటయ్యాయి. కర్ణాటకలో 20 లక్షల మందికి, యూపీలో 26.64 లక్షల మందికి జిల్లాలు ఏర్పాటు చేశారు. 

అధికారంతో పాటు బాధ్యత
నూతన జిల్లాల ఏర్పాటుతో సగటున జిల్లాకు 19 లక్షల మంది జనాభాతో రూపురేఖలు మారుతున్నాయి. గిరిజన జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల 6 నుంచి 8 అసెంబ్లీ స్థానాలతో జిల్లాలు ఏర్పాటయ్యాయి. కనీసం 18 లక్షల నుంచి 23 లక్షల మధ్య జనాభా ఉండేలా పునర్‌వ్యవస్థీకరణ చేశాం. జిల్లాల ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో మరింత వివరంగా చెప్పాలంటే.. మన దేశ జనాభా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారు 100 కోట్లకుపైగా పెరిగింది. నాడు జనాభా దాదాపు 35 కోట్లు కాగా ఈ రోజు 138 కోట్లు అని లెక్కలు చెబుతున్నాయి. ఆ రోజు కలెక్టర్లుకు ఉన్నది అజమాయిషీ, అధికారం అయితే ఈ రోజు వారికి అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత ఎక్కువగా ఉంది. 

కలెక్టర్ల ఆధ్వర్యంలోనే...
గతంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రధానంగా రెవెన్యూ మాత్రమే ఉండేది. ఇప్పుడు శాంతి భద్రతలు, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రెజరీ, సోషల్‌ వెల్ఫేర్, వ్యవసాయం, పశుపాలన, ప్రా«థమిక విద్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్, సివిల్‌ సఫ్లైస్, కార్మిక చట్టాలు, విపత్తు నిర్వహణ, పంపిణీ విభాగం, ఎన్నికల నిర్వహణ కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఈ సేవలు, పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలనే సంస్కరణలు చేపట్టి గ్రామ స్థాయి నుంచి మార్పులు తెచ్చాం. 


అన్నమయ్య జిల్లా ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తూ రాయచోటిలో ర్యాలీ చేస్తున్న ప్రజలు

కనీసం 15 ఎకరాల్లో అన్ని కార్యాలయాలు...
కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, మిగిలినవి అన్నీ ఒకేచోటకి వస్తాయి. కనీసం 15 ఎకరాల విస్తీర్ణంలో అన్నీ ఒకేచోట ఏర్పాటు కాబోతున్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్‌గా ఏర్పాటు చేస్తే అన్ని కార్యాలయాలు ఒకే చోట కనిపిస్తాయి. వీటికోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేచోట ఉండేలా గొప్ప వ్యవస్థను తీసుకొస్తున్నాం. ప్రజల విజ్ఞప్తి మేరకు కొన్ని మార్పుచేర్పులు చేశాం. తొలుత నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేశాం. ఇందులో కూడా 12 నియోజకవర్గాల్లో మండలాలను కొద్దిగా విభజించి కొన్ని మండలాలను ఒక జిల్లాలో, కొన్ని మండలాలను మరొక జిలాలోనూ ప్రజల ఆకాంక్షల మేరకు చేయాల్సి వచ్చింది. 
కార్యక్రమంలో రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, ఆర్‌ అండ్‌ బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మారుతున్న ప్రపంచంతో పాటు..
మారుతున్న ప్రపంచంతో పాటు ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు మనం మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులున్నాయి. బ్రిటీషర్ల హయాంలో గమనిస్తే జిల్లా కలెక్టర్లు అంటే జిల్లా రెవెన్యూ కలెక్ట్‌ చేసే వారు అని భావించే రోజులవి. ఇప్పుడు రెవెన్యూ వసూలు వారి విధుల్లో ఒకటి మాత్రమే. వారంతా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని సక్రమంగా అమలు చేసే ప్రతినిధులుగా నిలుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సమన్వయం చేస్తూ పర్యవేక్షించే బాధ్యత ఈరోజు కలెక్టర్ల భుజస్కందాలపైనే ఉంది. 

ఒక గొప్ప చరిత్రలో భాగస్వాములమవుతున్నాం. జిల్లా అభివృద్ధికి, ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు చేరవేసేందుకు నిబద్ధతతో పనిచేస్తా.  -బాపట్ల జిల్లా కలెక్టర్‌ కె.విజయ 

తిరుపతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఆస్కారముంది. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా.  మెరైన్‌ డెవలప్‌మెంట్‌ చేసి జిల్లాను ముందుకు తీసుకెళతాం. – తిరుపతి కలెక్టర్‌కె.వెంకట రమణారెడ్డి  

గిరిజనులతో మమేకమై వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తా. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలు వారి సమస్యలను అధికారుల దృష్టికి త్వరగా తీసుకువచ్చే అవకాశమేర్పడింది.  – అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ 

► గిరిజనులతో మమేకమవుతాం...
ఈ రోజు మా అందరికీ ఎంతో మంచిరోజు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు పేరుతో నూతన జిల్లా ఏర్పాటు చేయడం, ఈ జిల్లాకు మొదటి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు గర్వకారణం. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించారు. జిల్లాలో పని చేయటాన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుంటా. గిరిజనులతో మమేకమై వారి జీవన విధానాన్ని మరింతగా మెరుగుపరిచేలా కృషిచేస్తా. పరిపాలనా వికేంద్రీకరణ వలన ప్రజలకు మరింతగా చేరువయ్యే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు వలన ప్రజలు వారి సమస్యలను అధికారుల దృష్టికి త్వరితగతిన తెచ్చే అవకాశం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ప్రతి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. – సుమిత్‌ కుమార్, జిల్లా కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా (వారంలో రెండు రోజులు రంపచోడవరంలో ఉండాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా కలెక్టర్‌కు సూచించారు

 పథకాలను చేరవేయడంలో నిబద్ధతతో పనిచేస్తాం
కొత్త జిల్లాకు కలెక్టర్‌గా అవకాశం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నా. థ్యాంక్యూ సార్‌. ఒక చరిత్రలో భాగస్వామినయ్యానని భావిస్తున్నా. బాపట్ల జిల్లా అభివృద్ధి కోసం కృషిచేస్తా. మేం చిత్తశుద్దితో పనిచేసి మీ కలలను నిజం చేస్తాం. ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో నిబద్ధతతో పనిచేస్తాం. మీ ఆలోచనలకు ప్రతిరూపంగా జిల్లా అభివృద్ధి్దలో భాగస్వాములవుతాం. – కె.విజయ, కలెక్టర్, బాపట్ల జిల్లా

 మెరైన్‌ డెవలప్‌మెంట్‌తో ముందుకు..
ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావటాన్ని గౌరవంగా భావిస్తున్నాం. తిరుపతి జిల్లాలో మహిళల శాతం ఎక్కవగా ఉంది. దీనివల్ల అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఉండడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఆర్ధికాభివృద్ధికి అవకాశం ఉంది. స్ధానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరించి జిల్లా అభివృద్ధికి పాటుపడతాం. మా జిల్లా ద్వారా రాయలసీమకు సముద్ర తీరం అందుబాటులోకి వచ్చింది. మెరైన్‌ డెవలప్‌మెంట్‌ చేసి జిల్లాను ముందుకు తీసుకెళతాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, బాధ్యతలను నెరవేరుస్తాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వారి సమస్యలను ఎక్కడికక్కడే తీరుస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మరింతగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. ప్రజల సమస్యలను  పరిష్కరించేలా నిబద్ధతతో పనిచేస్తాం. కొత్త జిల్లాను అభివృద్ధి బాటలో నడిపేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాం. – కె.వెంకట రమణారెడ్డి, కలెక్టర్, తిరుపతి జిల్లా

► మంచిపేరు తెస్తాం..
మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి, పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకొస్తాం. – పరమేశ్వరరెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement