
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో ఇవాళ(మంగళవారం) అమరావతి కేసు విచారణ జరగనుంది. అమరావతి కేసుతోపాటు రాష్ట్ర విభజన కేసులను విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. ఈ మేరకు జస్టిస్ జోసెఫ్, జిస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుల్ని విచారించనుంది.
కాగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం తమ పిటిషన్‌లో కోరింది.
ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టం చేసిన విషయాలు..
► రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదు. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం.
► తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంటుంది.
► ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు.
► రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను ఏపీ హైకోర్టు పట్టించుకోలేదు.
► రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి.
► 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం. అదే రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది.
► రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం.
► వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది.
ఇదీ చదవండి: హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?: సుప్రీం కోర్టు
Comments
Please login to add a commentAdd a comment