సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి పిల్
నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కే.. దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ
ఎన్‌డీడీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు
ఆ నెయ్యిని 100 శాతం వాడలేదని ఈవో ‘ద ప్రింట్’ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు
తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు
నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు?
టీటీడీ తిరస్కరించిన నెయ్యి.. ఎన్‌డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం.. కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటనలు చేస్తున్నారు ‘సుప్రీం’ పర్యవేక్షణలో కమిటీని నియమించండి ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ సుబ్రమణియన్‌స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్ధించారు.
ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్‌గా) వాదనలు వినిపించనున్నారు. ఏ నివేదిక ఆధారంగా అయితే రాద్దాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో... ఆ నివేదిక రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? ఆ నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను కోర్టు తేల్చాల్సిన అవసరం ఉందని స్వామి తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు.
ఈ ప్రశ్నలపై కమిటీ దృష్టి సారించాలి...
‘21.06.2024న టీటీడీ ఈవో మంచి నాణ్యమైన నెయ్యితో శాంపిల్ లడ్డూలు తయారు చేయాలని దేవస్థానం కార్మీకులకు చెప్పారు. 17.7.2024న ల్యాబ్‌కు నెయ్యి నమూనాలు ఇచ్చారు. నెయ్యి నాణ్యతపై ల్యాబ్ ఇచ్చిన నివేదికను చూస్తే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై కమిటీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎన్‌డీడీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు.
అయితే ఆ నెయ్యిని 100 శాతం వాడలేదని ఈవో ‘ద ప్రింట్’ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు? టీటీడీ తిరస్కరించిన నెయ్యి.. ఎన్‌డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? నివేదిక విషయంలో రాజకీయ జోక్యం ఏదైనా ఉందా?’ అనే అంశాలను స్వామి తన పిటిషన్‌లో ప్రస్తావించారు.
నాణ్యత ఉన్న నెయ్యి ట్యాంకర్లకే అనుమతి...
‘ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌పీవో) ప్రకారం నెయ్యి వాహన ట్యాంకర్ రాగానే అధికారులు నమూనాలను సేకరించి మౌలిక పరీక్షలు నిర్వహిస్తారు. టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నాణ్యతకు అనుగుణంగా ఆ నెయ్యి నమూనాలు ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలితేనే ఆ నెయ్యిని శ్రీవారి లడ్డూతో సహా అన్ని ప్రసాదాల్లో వినియోగించేందుకు వాడతారు. పరీక్షల్లో విఫలమైన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. ఇందులో ఎలాంటి రాజీ ఉండదు.
దశాబ్దాలుగా ఈ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. అందువల్ల కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారన్నది అవాస్తవం. ‘ద ప్రింట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ ఈవో ఆ నెయ్యిని 100 శాతం ఉపయోగించలేదని స్పష్టంగా చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా లడ్డూ విషయంలో తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు భక్తులను తీవ్రంగా ప్రభావితం చేశాయి’ అని స్వామి నివేదించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు...
‘కొందరు వ్యక్తులు ఓ చిన్న కాగితంలోని కొంత సమాచారాన్ని పట్టుకుని దాని ఆధారంగా రాజకీయ ప్రకటనలు చేశారు. వాస్తవానికి దేని ఆధారంగా అయితే వారు రాజకీయ ప్రకటనలు చేశారో అది ప్రజా బాహుళ్యంలో లేదు. దీనిపై తీవ్ర రాజకీయ ప్రతిఘటన మొదలైంది. వెంకటేశ్వరస్వామిని కొలిచే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అతి సున్నితమైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకు చేసి దానిపై రాద్దాంతం మొదలుపెట్టారు.
ఆ సమాచారాన్ని బహిర్గతం చేసిన వ్యక్తులు అలా చేయడానికి ముందు దాన్ని టీటీడీ యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి వాస్తవాలను నిర్దారించుకోవాల్సింది. అలా చేయకుండా రాజకీయ ప్రయోజనం కోసం ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని స్వామి తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్ధించారు.
- సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి పిల్
స్వతంత్ర విచారణ జరిపించండి
సుప్రీంకోర్టును కోరిన ఎంపీ వైవీ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సోమవారం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి తరఫున∙సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్‌పై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అందులో కోరారు. ఆ నివేదికలో పేర్కొన్న నెయ్యిని ఎక్కడ నుంచి సేకరించారన్న దానిపై కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అభ్యర్ధించారు.
లడ్డూపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ వ్యవహారాన్ని ప్రచారం చేయడం గానీ, ప్రచురించడం గానీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంలో సీఎం చంద్రబాబు, పలువురు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment