ఆన్‌లైన్ ‘ఆటలూ’ సాగవు!
∙ నెట్‌లో పేకాటపై సర్కారు కన్నెర్ర
∙ గేమింగ్ యాక్ట్‌కు సవరణలు తెస్తూ ఆర్డినెన్స్
∙ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం
సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గడిచిన కొన్నేళ్లుగా పేకాటపై ఉక్కుపాదం మోపుతోంది. ఫలితంగా పేకాట క్లబ్బులు మూతపడ్డాయి. అక్కడక్కడా నిర్వహిస్తున్న పేకాట శిబిరాలనూ పోలీసులు వదిలిపెట్టట్లేదు. దీంతో ఇటీవల కాలంలో అనేక మంది ఆన్‌లైన్ రమ్మీకి అలవాటు పడుతున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో గేమింగ్ యాక్ట్ సవరణకు సంబంధించి కీలక ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర పడింది. ఆకర్షణీయమైన ప్రకటనలతో ఆన్‌లైన్ రమ్మీని నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు లెక్కకుమించి ఉంటున్నాయి. వీటికి బానిసలుగా మారిన వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. సర్వర్లను రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసుకుంటున్న ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరు కొత్తవారిని ఆకర్షించేందుకు తొలినాళ్లల్లో కొంత నగదు గెల్చుకునేలా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి పూర్తిగా బానిసయ్యాడని గుర్తించిన తర్వాత ప్రోగ్రామింగ్ మార్చడం ద్వారా తమకే లాభాలు వచ్చేలా మార్పుచేర్పులు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2014లో అప్పటికే అమలులో ఉన్న గేమింగ్ యాక్ట్‌ను స్వీకరించింది. 1974 నాటి ‘ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్’ ఆధారంగానే ఇప్పటికీ పేకాటపై చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో ఇంటర్‌నెట్ విస్తరణ, మార్పుచేర్పుల నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ పేకాట విస్తరించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గేమింగ్ యాక్ట్‌కు సవరణలు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా ఆన్‌లైన్‌లో పేకాట ఆడుతూ చిక్కిన వారిపై నేరం నిరూపణైతే రూ.5 వేల జరిమానా, ఏడాది జైలు శిక్షకు ఆస్కారం ఉండేలా ఆర్డినెన్స్ తేనున్నారు. ఇది అమలులోకి వస్తే ఆన్‌లైన్ గాంబ్లింగ్ సర్వీసులను అందించే వెబ్‌సైట్లను నిషేధించే అధికారం పోలీసులకు వస్తుంది.
ఇంటర్‌నెట్ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ఆయా వెబ్‌సైట్లు వినియోగిస్తున్న వారి వివరాలు తెలుసుకోవడానికి వాటితో లింక్ చేసి ఉన్న బ్యాంకు ఖాతాలు, క్రెడిట్/డెబిట్‌కార్డుల వివరాలు గుర్తించేందుకు ఆస్కారం ఏర్పడనుంది. వీటి ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండనుంది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆయా వెబ్‌సైట్లు రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమం కానుంది. ఇంటర్‌నెట్ సేవలను అందించే సంస్థలకు లేఖలు రాయడం ద్వారా పోలీసులు అధికారికంగా గాంబ్లింగ్ సైట్లు రాష్ట్రంలో ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఏర్పడనుంది.