
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(చెన్నై): ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి రూ. 20 లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనలిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మనలి అరింజర్ అన్నా వీధికి చెందిన నాగరాజన్ (37) ఇళ్లకు పెయింటింగ్ పనులు చేయించే కాంట్రాక్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగరాజన్ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని తపించేవాడు, కానీ కొన్ని నెలలుగా నాగరాజన్ ఆన్‌లైన్ రమ్మికి బానిసయ్యాడు.
భార్య, బంధువులు చెప్పినా వినేవాడుకాదు. ఈ క్రమంలో రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాడు. తీవ్ర మనస్తాపం చెందిన నాగరాజన్ గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటిలో ఉరి వేసుకున్నాడు. గమనించిన భార్య వరలక్ష్మి హుటాహుటిన చెన్నై స్టాన్లీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు అతని ఇంట్లో తనిఖీ చేయగా ఓ ఉత్తరం కనిపించింది. తాను రమ్మి ఆడి రూ. 20 లక్షలు పోగొట్టుకున్నానని.. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment