మహిళలు, విద్యార్థులు నాశనమవుతున్నారు
- ఆన్‌లైన్ రమ్మీపై హైకోర్టుకు నివేదించిన సర్కారు
- గ్యాంబ్లింగ్‌తో కంపెనీలు
- కోట్లు వెనకేసుకొంటున్నాయి
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ రమ్మీ నిర్వహిస్తున్న కంపెనీలు గ్యాంబ్లింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు వెనకేస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ గత ఏడాది రూ.623 కోట్లను తమ ఆదాయంగా చూపిందని వివరించింది. ఆన్‌లైన్ రమ్మీ ఓ వ్యసనంగా మారిందని, మహిళలు, విద్యార్థులు దీని బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపింది.
అంతేకాక ఆత్మహత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయని, దీనికి సంబంధించి తమకు ఫిర్యాదులు కూడా అందాయంది. ఈ నేపథ్యంలోనే తాము ఆన్‌లైన్ రమ్మీని తెలంగాణలో నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామంది. రమ్మీ నైపుణ్య క్రీడ అయినప్పటికీ, నేర కోణంలో చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని నివేదించింది. తెలంగాణలో ఆన్‌లైన్ రమ్మీని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ పలు కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి.
కార్డులు కలపడంలో మోసాలు...
ఈ వ్యాజ్యాల్లో సోమవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు ప్రారంభించారు. ఆన్‌లైన్ రమ్మీ కంపెనీలు తమ సంస్థకు చెందిన ఉద్యోగులనే ఓ బృందంలో సభ్యులుగా చేర్చి, వారి చేత ఆడిస్తాయని తెలిపారు. కార్టులు కలిపి, పంచే సమయంలో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మోసానికి పాల్పడుతున్నాయన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు ముడిపడి ఉంటుందని, అయితే ఈ సందర్భంగా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఎటువంటి యంత్రాంగం లేదని తెలిపారు. 24 గంటలూ ఆట అందుబాటులో ఉండటంతో మహిళలు, విద్యార్థులు ఆకర్షితులవుతున్నారన్నారు. వాదనల నిమిత్తం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.