ప్రతీకాత్మక చిత్రం
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌కు చెందిన సీపతి అభిలాష్ (25) అనే సీఏ విద్యార్థి.. ఆన్‌లైన్ రమ్మీకి బానిసయ్యాడు. అప్పులు చేసి మరీ ఆడాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. గత ఏడాది డిసెంబర్ 29న విషం తాగి చనిపోయాడు.
హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్ ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టాడు. మొదట్లో కొంత లాభం రావడంతో తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులు, అప్పులు చేసినవి కలిపి ఏడు లక్షలు పెట్టి ఆడాడు. సొమ్మంతా పోగొట్టుకున్నాడు. డబ్బు లన్నీ తిరిగి సాధించాలని మళ్లీ 8 లక్షలు అప్పులు చేశాడు. ఈ సొమ్ము కూడా పోవడంతో.. ఆందోళనకు గురై గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీపై నిషేధాన్ని తొలగించుకునేందుకు ముంబై గేమ్ మాఫియా రంగంలోకి దిగింది. పేకాట, ఆన్‌లైన్ గేమింగ్‌లను బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో.. ఆన్‌లైన్ రమ్మీకి సడలింపు ఇచ్చేలా చేయాలని ఓ కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్‌తో సంప్రదింపులు జరిపింది. దీనికి ఆ ఇద్దరు కీలక వ్యక్తులు అంగీకరించారని.. కొన్నికోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని, అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేసిన సదరు ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారి.. అనుకున్న ‘పని’ సాధించలేకపోయారు. ఈలోగా విషయం పెద్దలకు తెలియడంతో.. చీవాట్లు పెట్టారని తెలిసింది. ఇప్పుడీ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది.
రాష్ట్రంలో పేకాట, ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధం
టీఆర్‌ఎస్ సర్కారు 2016లోనే రాష్ట్రంలో పేకాటను నిషేధించింది. దానితోపాటు ఇంటర్నెట్‌లో ఆడే ‘ఆన్‌లైన్ రమ్మీ’, ఇతర ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఆటలపైనా నిషేధం విధించింది. పేకాటతోపాటు యువతను వ్యసనాలకు గురిచేసే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నిర్ణయంపై మహిళలతోపాటు అన్నివర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆన్‌లైన్ పేకాట వందలు, వేల కోట్ల వ్యాపారం కావడంతో.. ముంబై వేదికగా ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, యాప్‌లను నిర్వహిస్తున్న మాఫియా సంస్థలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో ఆన్‌లైన్ పేకాటకు అనుమతి వచ్చేలా చేయాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను సంప్రదించాయి.
రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నాలు
ఆన్‌లైన్ రమ్మీ మాఫియా ‘ఆఫర్’కు లొంగిపోయిన ఒక కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్.. ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో సదరు సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఒప్పందం కుదుర్చుకున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అడ్వాన్స్‌గా కొన్నికోట్ల మొత్తాన్ని తీసుకున్నారని వెల్లడించాయి. ఇది జరిగి రెండు, మూడు నెలలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. దీనితో రమ్మీ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి రంగంలోకి దిగి సదరు ప్రజాప్రతినిధిని, సీనియర్ అధికారిని నిలదీశారని.. వారం, పది రోజుల్లో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారని సమాచారం.
ఈ పది రోజుల గడువు తీరినా స్పందన లేకపోవడంతో అడ్వాన్స్ తిరిగివ్వాలని ఒత్తిడి పెంచారని.. ఈ క్రమంలో విషయం మరో కీలక ప్రజాప్రతినిధి ద్వారా ప్రభుత్వ పెద్దలకు చేరిపోయిందని తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని, మాఫియాకు డ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. సదరు వ్యక్తులు మధ్యవర్తుల ద్వారా అడ్వాన్స్ సొమ్ము తిరిగి ముంబై మాఫియాకు తిరిగి పంపారని తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా.. స్పందించలేదు.
నిషేధమున్నా.. ఏటా వేల కోట్ల దందా
రాష్ట్రంలో ఆన్‌లైన్ పేకాటపై నిషేధం ఉండటంతో.. గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ స్టోర్ వంటివాటిలో సదరు యాప్స్ అందుబాటులో ఉండవు. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సైట్ల ద్వారా సదరు ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు ప్రచారం చేస్తూ.. లింకులు పెడతాయి. ఆ లింక్స్‌ను షేర్ చేస్తే పాయింట్లో, నగదో రివార్డు ఇస్తామని ఆశపెడ్తాయి. అలా ఒకరి నుంచి ఒకరికి లింకులు షేర్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇలా 12లక్షల మందికి పైగా సదరు యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్నట్టు కేంద్ర నిఘా సంస్థలు గతంలోనే కేంద్ర హోంశాఖకు నివేదికలు ఇచ్చాయి. వీటిద్వారా ఏటా రూ.2 వేల కోట్లకుగా దందా సాగుతోందని అంచనా వేశాయి. 2018లో తెలంగాణ నుంచి రూ.1,200 కోట్ల మేర ఆన్‌లైన్ యాప్స్‌లో దందా సాగిందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఫేక్ లొకేషన్‌తో జిమ్మిక్కులు
ఆన్‌లైన్ రమ్మీ యాప్‌లు మొబైల్‌ఫోన్ల లొకేషన్ డేటాను తీసుకుంటాయి. రాష్ట్రంలో అధికారికంగా నిషేధం ఉండటంతో ఇక్కడి మొబైల్ లొకేషన్ ఉంటే గేమ్ ఆడటానికి వీలుకాదని చూపిస్తాయి. అయితే ఆన్‌లైన్ గేమ్ మాఫియా సంస్థలు ఫోన్లలో ఫేక్ జీపీఎస్ లొకేషన్ చూపించే యాప్స్‌ను షేర్ చేస్తున్నాయి. వీటిసాయంతో ఆన్‌లైన్ రమ్మీ ఆడేవారు ఫోన్‌లో అసలు జీపీఎస్ లొకేషన్‌ను డిసేబుల్ చేసి.. ఫేక్ జీపీఎస్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నట్టు లొకేషన్ పెడుతూ.. ఆన్‌లైన్ పేకాట ఆడుతున్నారు.
ఏమిటీ ఆన్‌లైన్ రమ్మీ వ్యవహారం?
పేకాట క్లబ్బుల్లో, బయటా ‘మూడు ముక్కలాట, రమ్మీ’ ఆడినట్టుగానే.. ఆన్‌లైన్‌లోనూ డబ్బులు పెట్టి ఆడేందుకు కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొన్ని నియంత్రణలను పెట్టింది. అందుకు అనుగుణంగా ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ప్రత్యేక యాప్‌లను రూపొందించి దందా చేస్తున్నాయి. ఆన్‌లైన్ పేకాట, గ్యాంబ్లింగ్‌ను తమ రాష్ట్రాల్లో అనుమతించాలా, నిషేధించాలా అన్ని నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్ పేకాటను నిషేధించాయి.
మొదట్లో ‘ఎర’ వేసి..
ఆన్‌లైన్ పేకాట ఆడేవారు సదరు వెబ్‌సైట్/యాప్‌లకు బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానించి.. డబ్బులను వాటిలోకి బదిలీ చేసుకుంటారు. ఆ డబ్బులతో పేకాడుతారు. గెలిచినవారికి డబ్బులు ఇవ్వడం, ఓడిపోతే కట్ చేయడం జరుగుతాయి. సర్వీస్‌చార్జీల పేరిట కొంత మొత్తాన్ని మినహాయించుకుంటాయి. అయితే ఈ ఆన్‌లైన్ గేమ్స్‌లో చాలా వరకు మోసమే. వీటిలో ఆడటం మొదలుపెట్టినవారికి కొద్దిరోజులు కావాలనే డబ్బులు గెలుచుకున్నట్టు చూపిస్తారని.. వారు ఆన్‌లైన్ పేకాటకు బానిసలయ్యాక ఉన్న డబ్బంతా ఊడ్చేస్తాయని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో చాలా మంది లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. అవన్నీ పోగొట్టుకుని అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు ఎన్నో నమోదవుతున్నాయి.
మంచిర్యాల జిల్లా హాజిపూర్‌కు చెందిన చిందం పోశెట్టి.. ఆన్‌లైన్ రమ్మీకి అలవాటుపడ్డాడు. మొదట్లో కొంత డబ్బులు రావడంతో.. తర్వాత అప్పులు చేసి మరీ ఆడాడు. డబ్బులన్నీ పోవడంతో ఆవేదనలో మునిగిపోయాడు. ఈ ఏడాది జనవరి 27న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment