లాక్‌డౌన్ రోజుల్లో కృష్ణా జిల్లా నూజివీడులో ఓ బ్యాంకు ఉద్యోగి రూ.కోటికి పైగా మోసానికి పాల్పడ్డాడు. అంత పెద్ద మొత్తం ఆయన ఏం చేశారని ఆరా తీసిన పోలీసులు విస్తుపోయారు. ఆయన ఏకంగా రెండు నెలల్లో రూ.కోటికిపైగా ఆన్‌లైన్ రమ్మీ ఆడి ఓడిపోయారు. విజయనగరంలో ఓ వ్యాపారి పెద్ద ఎత్తున రుణాలు చేసి పరారయ్యాడు. ఆయన షాపు, ఇళ్లు అమ్మినా సరే అప్పులు తీరలేదు. ఆ వ్యాపారి అప్పులన్నీ కూడా ఆన్‌లైన్ రమ్మీ ఆడటానికే అని తెలిసి ఆ కుటుంబం లబోదిబోమంది.
ఆన్‌లైన్ రమ్మీ మాయాజాలం అంటే అదే మరి. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. దేశంలో కోట్లాది మందిని ఆన్‌లైన్ రమ్మీ భూతం కమ్మేస్తోంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల చిన్ని తెరలపై ఆడే ఈ 13 ముక్కల పేకాట వ్యసనం ఎందరో బతుకులను పల్టీ కొట్టిస్తోంది. అటువైపు ఆడుతోంది ఎవరో తెలియని ఈ మాయాజూదంలో ఇటువైపు ఆటగాళ్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి.
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తాయి. ‘ఆన్‌లైన్ రమ్మీ ఆడండి... ఒక్క ఆటతో లక్షాధికారి కండి’ అన్న రీతిలో ప్రకటనలు ఇస్తున్నారు. ఓసారి ఆడి చూద్దాం.. అని పలువురు ఆకర్షితులవుతున్నారు. ముందే బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
► మొదట కొన్ని ఆటలు గెలిచినట్టే ఉంటుంది. ఆ తర్వాత నుంచి వరుసగా ఓడిపోతుంటారు. అవతల ఎవరో వ్యక్తి ఇంత గెలిచారు.. అంత గెలిచారు.. అని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. దాంతో తామెందుకు గెలవలేం అని భావిస్తూ ఉన్న డబ్బులతోపాటు అప్పటికప్పుడు అప్పులు చేసి మరీ ఆడి కుదేలవుతున్నారు.
మళ్లీ చేరడంలోనే మాయాజాలం
ప్రత్యక్షంగా ఆడే రమ్మీ ఆటలో ఒకరు అవుట్ అయిపోతే మళ్లీ పందెం కాసి ఆటలో కలవచ్చు. అలా ఎవరు కలుస్తారో ఆడేవాళ్లకు తెలుస్తుంది. కానీ ఆన్‌లైన్ రమ్మీలో అక్కడే మతలబు ఉంటోంది. ప్రతి ఆటలో ఒకరో ఇద్దరో త్వరగా అవుట్ అయిపోయి మళ్లీ కలుస్తారు. అక్కడ ఎవరు కలుస్తారో తెలీదు. చివరికి ఆలా కలిసిన వారే ఆట గెలుస్తుంటారు.
► కొన్ని సార్లు ఒకరే ఒకటి కంటే ఎక్కువ ఆటల్లో ఒకేసారి కలిసి ఆడుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయని కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
► అసలు అటువైపు మనుషులే ఉండరని, కంప్యూటర్లే ఆడతాయని.. అంతా ఆన్‌లైన్‌లో మాయాజాలంతో బురిడీ కొటిస్తారని సైబర్ నిపుణులు చెబుతుండటం గమనార్హం.
రాష్ట్రాల వారీగా నిషేధమే మార్గం
► ‘గేమ్ ఆఫ్ స్కిల్స్’ పేరిట ఆన్‌లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ముంబయి, బెంగళూరు తదతర కేంద్రాల నుంచి దేశమంతటా ఆన్‌లైన్ రమ్మీ నిర్వహణ సంస్థలు జోరుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి.
► కావాలని ఆడి మోసపోతుండటంతో బాధితుల నుంచి అధికారికంగా ఫిర్యాదులు తక్కువగా ఉంటున్నాయి. సాంకేతికంగా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో మోసాలను పోలీసులు నిరూపించడం కష్టసాధ్యమవుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కానీ రాష్ట్రాలు తమ పరిధిలో ఆన్‌లైన్ రమ్మీని నిషేధించడానికి అవకాశం ఉంది.
► కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్ రమ్మీని నిషేధించాయి. ఆన్‌లైన్ రమ్మీ నియంత్రణ విధివిధానాలను రూపొందించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి
సూచించింది.
► సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలు ఆన్‌లైన్ రమ్మీకి అధికారికంగా ఆనుమతి ఇచ్చాయి. మిగిలిన రాష్ట్రాలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. అంటే ఆ రాష్ట్రాల్లో అనుమతి ఉన్నట్టుగానే పరిగణిస్తున్నారు.
నిషేధిస్తే కట్టడి ఇలా..
► నిషేధించిన రాష్ట్రాల్లోని వారిని ఆన్‌లైన్ రమ్మీ సంస్థలు ఆడించకూడదు. ఆటగాళ్ల ఐపీ అడ్రస్ చూస్తే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో తెలుస్తుంది. నిషేధిత రాష్ట్రాల వారు ఉంటే వారిని ఆటకు ఆనుమతించకూడదు.
► నిషేధం లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మోసం చేశారని నిరూపించడం కష్టం.
► నిషేధం విధిస్తే ఆన్‌లైన్ సంస్థలు ఆ రాష్ట్రాల వారిని అసలు ఆడించనే కూడదు. ఆడించినట్టు తెలిస్తే కేసు నమోదు చేయవచ్చు. ఆన్‌లైన్ రమ్మీ నిర్వహణ సంస్థ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అక్కడికి వెళ్లి మరీ కేసు దర్యాప్తు చేసి దోషులను శిక్షించవచ్చు.
ఏటా రూ.7,500 కోట్లు హుష్‌కాకీ
► ఆన్‌లైన్ గేమింగ్ ఫెడరేషన్ వివరాల ప్రకారం దేశంలో 20కి పైగా సంస్థలు ఆన్‌లైన్ రమ్మీ యాప్‌లు నిర్వహిస్తున్నాయి. 2020 జనవరి నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం దేశంలో ఆన్‌లైన్ రమ్మీలో ఏటా రూ.7,500 కోట్లు చేతులు మారుతున్నాయి. రమ్మీ సంస్థలు అధికారికంగా దాదాపు రూ.2,500 కోట్లు తమ ఆదాయంగా చూపిస్తున్నాయి.
► మరి మిగిలిన రూ.5 వేల కోట్లు ఎటు వెళ్తున్నాయని సైబర్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆ మొత్తం ఆన్‌లైన్ రమ్మీలో గెలిచిన వారికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్న 30 కోట్ల మందిలో కనీసం ఒక శాతం మంది అధికారిక ఖాతాలు, ఆదాయ పన్ను వివరాల్లో అయినా ఆ మొత్తం కనిపించాలి కదా అన్నదే సైబర్ నిపుణుల సందేహం.
► తాము ఓడిపోయాం.. అవతల ఎవరో గెలిచారు అని ఆడిన వాళ్లు భావిస్తూ ఉంటారు. అవతల గెలిచిన వారు ఎవరూ ఉండరని, కొన్ని సంస్థలే కంప్యూటర్ల ద్వారానో.. తమ మనుషుల ద్వారానో ఆడిస్తూ మోసానికి పాల్పడుతూ ఆ రూ.5 వేల కోట్లు కొల్లగొడుతున్నాయన్నది సైబర్ నిపుణుల సందేహం.
స్వీయ నియంత్రణ, పెద్దల పర్యవేక్షణే మార్గం
ఆన్‌లైన్ రమ్మీ వ్యసనానికి బానిస కాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమ పరిష్కార మార్గం. ఒకసారి ఆ ఆటకు అలవాటు పడితే బయట పడటం చాలా కష్టం. కాబట్టి ఒక్కసారి కూడా ఆడాలని ప్రయత్నించకూడదు. ఆన్‌లైన్ ఆటల సందర్భంగా తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. ఈ దిశగా పిల్లలకు అవగాహన కల్పించాలి. వ్యసనపరులకు కౌన్సెలింగ్ ఇప్పించాలి.
– పీవీ సునీల్ కుమార్, సీఐడీ అదనపు డీజీ
Comments
Please login to add a commentAdd a comment