స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో... డిపాజిట్‌ భద్రమేనా? | Deposits safe are not safe in small finance banks | Sakshi
Sakshi News home page

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో... డిపాజిట్‌ భద్రమేనా?

Published Mon, Aug 1 2022 5:14 AM | Last Updated on Mon, Aug 1 2022 5:14 AM

Deposits safe are not safe in small finance banks - Sakshi

బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి విశ్వసనీయమైన సాధనం. సమీపంలోని బ్యాంకు శాఖలో డిపాజిట్‌ చేసుకోవడం, అవసరం ఏర్పడినప్పుడు వెళ్లి తీసుకోవడం సౌకర్యాన్నిచ్చే అంశం. బ్యాంకులో డిపాజిట్‌ అయితే ఎక్కడికీ పోదు? అన్న నమ్మకం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేటును కొన్ని బ్యాంకులు ఆఫర్‌ చేయడం గమనించే ఉంటారు.

ఈ విషయంలో వాణిజ్య బ్యాంకుల కంటే  స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ) కొంచెం అధిక రేటును ఆఫర్‌ చేస్తుంటాయి. మరి అధిక రాబడి కోసం ఈ సాధనాలను ఎంపిక చేసుకోవడం ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్న రావచ్చు. అలాగని, అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయంటే ఏదో సందేహించాల్సిందే? అని భావించడం కూడా సరికాదు.

ఎందుకు అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయన్నది ఇక్కడ గమనించాలి. ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలో పనిచేసే బ్యాంకులు ఏవైనా, వాటిల్లో డిపాజిట్‌ చేసే విషయంలో సందేహించక్కర్లేదు. డిపాజిట్‌పై ఇన్సూరెన్స్‌ అమల్లో ఉందా? అన్నది విచారించుకోవాలి. అంతేకాదు, డిపాజిట్‌కు ముందు ముఖ్యమైన అంశాలు కొన్నింటిని విశ్లేషించుకోవాలి. అప్పుడే రాబడితోపాటు, భరోసా ఉండేలా చూసుకోవచ్చు.

రిస్క్‌–రాబడి..
చాలా వరకు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీలు) ఏడాది కాల ఎఫ్‌డీలపై 7–7.25% రాబడిని ఆఫర్‌ చేస్తున్నాయి. పెద్ద బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు కంటే కనీసం ఒక శాతం ఎక్కువ. వడ్డీ రేటు వ్యత్యాసం అన్నది ఎస్‌ఎఫ్‌బీలు, ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య 1.5–2% వరకు ఉంది. అందుకే కొందరు ఇన్వెస్టర్లకు ఎస్‌ఎఫ్‌బీలు ఆఫర్‌ చేస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేటు ఆకర్షణీయంగా అనిపించొచ్చు.

రేటు ఆకర్షణీయంగానే ఉన్నా, భద్రత విషయంలో సందేహంతో వెనుకాడాల్సిన అవసరం లేదు. అన్ని ఇతర షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల మాదిరే, ఎస్‌ఎఫ్‌బీలు సైతం ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోనే పనిచేస్తాయి. కనుక ఈ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారికి కూడా.. రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) కవరేజీ ఉంటుంది. పెద్ద వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఎస్‌ఎఫ్‌బీల వ్యాపార నమూనా అధిక రిస్క్‌ తో ఉంటుంది.

అందుకనే అవి డిపాజిట్లపై కాస్తంత అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంటాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఎస్‌ఎఫ్‌బీలు తమ మొత్తం రుణాల్లో 75 శాతాన్ని ప్రాధాన్య రంగాలకు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయం, ఎస్‌ఎంఎంఈలు ప్రాధాన్య రంగాల కిందకు వస్తాయి. అలాగే, ఎస్‌ఎఫ్‌బీల రుణ పుస్తకంలో 50 శాతం రుణాలు.. ఒక్కోటీ రూ.25 లక్షలు, అంతకులోపే ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. దీని కారణంగా ఎస్‌ఎఫ్‌బీల రుణాల్లో అన్‌సెక్యూర్డ్‌ రుణాలు 50–75 శాతం వరకు ఉంటాయి.

కానీ, పెద్ద వాణిజ్య బ్యాంకుల్లో అన్‌సెక్యూర్డ్‌ రుణాలు మొత్తం రుణాల్లో 30 శాతం కంటే తక్కువే ఉంటాయి. ఎటువంటి హామీ/తనఖా లేని రుణాలు అన్‌సెక్యూర్డ్‌ కిందకు వస్తాయి. అందుకనే ఎస్‌ఎఫ్‌బీల వ్యాపారంలో రిస్క్‌ ఎక్కువ. కనుక ఎస్‌ఎఫ్‌బీలు రుణాల రిస్క్‌ను బ్యాలన్స్‌ చేసుకునేందుకు.. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే 1.5–2.5% అధిక రేటుపై రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఉదాహరణకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గృహ రుణ రేటు 6.9 % నుంచి మొదలవుతోంది.

అదే ఎస్‌ఎఫ్‌బీల్లో ఈ రేటు 8.5% నుంచి ఉంటోంది. ఇలా రుణాలపై అధిక రేటును ఎస్‌ఎఫ్‌బీలు వసూలు చేస్తుంటాయి. డిపాజిట్‌లపై మెరుగైన రేటును ఆఫర్‌ చేయడానికి ఇది కూడా ఒక కారణమే. ఇక ఎస్‌ఎఫ్‌బీలు మొదలై 5–6 ఏళ్లే అవుతోంది. కనుక డిపాజిట్ల సమీకరణ దశలోనే అవి ఇంకా ఉన్నాయి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం, అధిక డిపాజిట్‌ బేస్‌ వచ్చే వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ రేటును ఆఫర్‌ చేయడం సహజంగానే చూడాలి.

ఎంత వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు..?
మీకు సమీపంలోని ఎస్‌ఎఫ్‌బీ శాఖకు వెళ్లి డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఈ సంస్థలు ఇంకా పూర్తి స్థాయి టెక్నాలజీ వనరులను సమకూర్చుకోలేదు. కనుక నేరుగా వెళ్లి ఎఫ్‌డీ చేసుకోవడం మంచిదే. అత్యవసరాల్లో తిరిగి డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవడం ఆలస్యం కాకుండా ఉంటుంది. ఇక ఎంత మొత్తం వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు? అన్న సందేహం రావచ్చు. ఒక వ్యక్తి తన పొదుపు నిధులు మొత్తాన్ని ఒకే బ్యాంకు శాఖలో డిపాజిట్‌ చేసుకోవడం సూచనీయం కాదు.

పైగా ఎస్‌ఎఫ్‌బీలో డిపాజిట్‌ చేసుకోవడానికి ముందు బ్యాంకు కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయో? ఒక అంచనాకు రావాలి. నమ్మకం ఏర్పడిన తర్వాతే డిపాజిట్‌కు వెళ్లాలి. అధిక రాబడుల కోసం మిగులు నిధుల వరకే డిపాజిట్‌కు పరిమితం కావాలి. డిపాజిట్‌ మొత్తానికి భద్రత కోరుకునేట్టు అయితే.. అప్పుడు ఒక బ్యాంకు పరిధిలోలో రూ.5 లక్షలకు మించి డిపాజిట్‌ చేయవద్దు.

ఎందుకంటే డీఐసీజీసీ కింద బ్యాంకు సంక్షోభం పాలైతే ఒక బ్యాంకు పరిధిలో ఒక డిపాజిట్‌ దారుకు గరిష్టంగా వచ్చేది రూ.5 లక్షలకే పరిమితం. అందుకుని రూ.5 లక్షల చొప్పున వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్‌చేసుకోవాలి. దీర్ఘకాలానికి కాకుండా 1–3 ఏళ్ల వరకు డిపాజిట్‌ చేసుకుని, కాల వ్యవధి ముగిసిన తర్వాత రెన్యువల్‌ చేసుకోవడం మంచిది. ఆయా అంశాలపై ఒక నిర్ణయానికి ముందు వీటిపై సమగ్ర సమచారం పొందాలి. నిపుణులను సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాలి.

బ్యాంకు ఎంపిక ఎలా?
స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే వాటి అధికారిక వెబ్‌ సైట్ల నుంచి గణాంకాలు పొందొచ్చు. బ్యాంకు సామర్థ్యం ఏపాటిదో అవగాహన తెచ్చుకునేందుకు వాటి స్థూల మొండిబాకీలు (నాన్‌ పెర్‌ఫార్మింగ్‌ అసెట్స్‌–ఎన్‌పీఏలు) ఏ స్థాయిలో ఉన్నాయి? బ్యాంకు రుణ పుస్తకం, డిపాజిట్ల బేస్‌ గత మూడేళ్ల కాలంతో పోలిస్తే, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉందన్నది చూడాలి. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్‌లు మెరుగుపడ్డాయా లేక క్షీణించాయా? గమనించాలి.

ఎస్‌ఎఫ్‌బీలు చిన్న గా (పరిమాణం పరంగా) ఉన్నందున వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే అవి అధిక వృద్ధిని నమోదు చేయగలవు. రుణాలు, డిపాజిట్లలో 25–35% వరకు, నికర వడ్డీ ఆదాయంలో 20–25% వృద్ధి ఉందంటే సానుకూలంగా చూడొచ్చు. ఎస్‌ఎఫ్‌బీలలో ఏయూ ఎస్‌ఎఫ్‌బీ మినహా మిగిలినవి సూక్ష్మ రుణ కార్యకలాపాలనే ఎక్కు వగా నిర్వహిస్తున్నాయి. దీంతో కరోనా సమయంలో వీటికి ఎక్కువ షాక్‌లు తగిలాయి. వాటి ఎన్‌పీఏలు ఐదేళ్ల సగటును మించి పోయాయి. వ్యాపార కార్యకలాపాలు తిరిగి గాడిన పడిన తర్వాత ఇవి తగ్గుముఖం పట్టడం సహజం. ఎస్‌ఎఫ్‌బీలు అన్నీ కూడా తగినన్ని నిధులతో ఉన్నందున ఆందోళన అనవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement