High interest rates
-
తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసం
ప్రీలాంచ్, సాఫ్ట్ లాంచ్ పేర్లతో స్థిరాస్తి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను మోసం చేస్తున్న రియల్టీ సంస్థలు..తాజాగా బై బ్యాక్ స్కీమ్‌కు తెరలేపాయి. ముందస్తుగా కొంత మేర కంపెనీలో డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా అధికంగా వడ్డీ చెల్లించడంతో పాటు కొంత స్థలం లీజు డీడ్ చేసిస్తామని మోసం చేయడం ఈ స్కీమ్ స్కామ్. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 120 మంది బాధితుల నుంచి రూ.24 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేశారు. స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా, యాడ్ అవెన్యూస్ కంపెనీలకు చెందిన నలుగురు ప్రతినిధులను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. డీసీపీ కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన బైర చంద్రశేఖర్, విజయవాడకు చెందిన వేములపల్లి జాన్వీ, రెడ్డిపల్లి కృష్ణ చైతన్య, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన గరిమెల్ల వెంకట అఖిల్ నలుగురు కలిసి డైరెక్టర్లుగా పేర్కొంటూ కూకట్‌పల్లిలోని మంజీరా ట్రినిటీ మాల్లో స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా, యాడ్ అవెన్యూస్ పేర్లతో రెండు స్థిరాస్తి సంస్థలను ఏర్పాటు చేశారు. నెలకు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ కస్టమర్లకు, పెట్టుబడిదారులకు ఆశ పెట్టారు. రూ.17 లక్షలు డిపాజిట్ చేస్తే వంద నెలల పాటు ప్రతీ నెలా రూ.20 వేల వడ్డీ చెల్లిస్తామని, అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని తిరుమలగిరిలో 267 గజాల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ భూమిలో శాండల్‌వుడ్ చెట్లను పెంచుతామని, 13–15 ఏళ్ల తర్వాత ఈ చెట్లను విక్రయించగా వచ్చిన సొమ్ములో 50 శాతం లాభాలను కూడా అందిస్తామని ఆశ పెట్టారు.బాధితులను నమ్మించేందుకు లీజు డీడ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ), చెక్‌లను అందించారు. కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత చెల్లించడం మానేశారు. వడ్డీలు చెల్లించకపోవడంతో కస్టమర్లు ఆఫీసుకు రావడం మొదలుపెట్టారు. దీంతో నిందితులు కూకట్పల్లి నుంచి జూబ్లీహిల్స్‌కు కార్యాలయాన్ని మార్చి, తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు కార్యాలయ జాడను బాధితులు పట్టేయడం, చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేయడంతో నిందితులు రాత్రికి రాత్రే ఆఫీసుకు తాళం వేసి పరారయ్యారు. దీంతో కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన అల్లం నాగరాజు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 కింద కేసులు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ఇదీ చదవండి: ‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’కష్టపడి పొదుపు చేయాలకున్న సొమ్మును ఇలా ఎలాంటి నియంత్రణ ఆధ్వర్యంలోలేని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మోసపోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే ఈక్విటీ మార్కెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఈటీఎఫ్..వంటివి ఎంచుకోవాలని చెబుతున్నారు. ప్రధానంగా ఎలాంటి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని లేని కంపెనీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. -
‘కాసా’ నుంచి ‘టర్మ్’కు డిపాజిటర్ల చూపు! బ్యాంకుల లాభాలపై ప్రభావం
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ– కాసా) డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బ్యాంకు వినియోగదారులు వేగంగా టర్మ్ డిపాజిట్ల వైపునకు మారిపోతున్నారు. కాసాలో అతి తక్కువ వడ్డీరేటు, టర్మ్ డిపాజిట్లలో కొంత మెరుగైన వడ్డీరేటు ఈ పరిస్థితికి కారణమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ– ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విడుదల చేసిన సర్వే (17వ రౌండ్) ఒకటి పేర్కొంది. ఈ పరిస్థితి బ్యాంకుల లాభాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణుల అభిప్రాయం. కాసా అంటే బ్యాంకులు సమీకరించే తక్కువ వడ్డీరేటు డిపాజిట్లు. అధిక మొత్తంలో తక్కువ వడ్డీ వ్యయాల డిపాజిట్లు ఒక బ్యాంకుకు ఉన్నాయంటే ఆ బ్యాంకుకు మెరుగైన మార్జిన్లు ఉంటాయని అర్థం. సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రసాయనాలు వంటి రంగాలు నిరంతర వృద్ధిని సాధిస్తున్నందున, ఆయా రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్స్, ఐరన్, స్టీల్ రంగాల్లో కూడా గత ఆరు నెలల్లో వేగవంతమైన దీర్ఘకాలిక రుణాల పంపిణీ జరిగింది. మౌలిక రంగాన్ని పరిశీలిస్తే, 16వ రౌండ్ సర్వేలో 57 శాతం మంది ఈ రంగంలో రుణ వృద్ధి ఉందని పేర్కొంటే, ప్రస్తుత 17వ రౌండ్లో ఈ సంఖ్య 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో నాన్–ఫుడ్ ఇండస్ట్రీలో భారీ రుణ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఆరు నెలల్లో తమ మొండిబకాయిలు తగ్గాయని సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 75 శాతం మంది తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో మొండిబకాయిలు 3 నుంచి 4 శాతం వరకే ఉంటాయని బ్యాంకర్లలో మెజారిటీ విశ్వసిస్తున్నారు. సుస్థిర దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయంతో కూడిన రుణ వృద్ధి, పటిష్ట ఆర్థిక పునరుద్ధరణ యంత్రాంగం, మొండిబకాయిలకు అధిక నిధులు కేటాయింపు (పొవిజనింగ్), భారీ రైట్–ఆఫ్ (పుస్తకాల నుంచి మొండి పద్దుల రద్దు) వంటి అంశాలు రానున్న ఆరు నెలల్లో బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుదలకు కారణం. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
యూరప్ ఎకనమిక్ అవుట్‌లుక్ అధ్వాన్నం
ఫ్రాంక్ఫర్ట్: యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం, వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. తీవ్ర ద్రవ్యోల్బణంతో వినియోగదారులు వ్యయాలకు సుముఖత చూపడం లేదని, అధిక వడ్డీ రేట్లు పెట్టుబడికి అవసరమైన రుణాన్ని పరిమితం చేస్తున్నాయని యూరోపియన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం, ఈయూ ప్రాంతంలో మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వడ్డీరేట్లు మరింత పెంచాలా? వద్దా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా ప్రకటన ప్రకారం, 2023లో యూరో కరెన్సీ వినియోగిస్తున్న 20 దేశాల వృద్ధి రేటు క్రితం అంచనా 1.1 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గించడం జరిగింది. వచ్చే ఏడాది విషయంలో ఈ రేటు అంచనా 1.6 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. 27 దేశాల ఈయూ విషయంలో ఈ రేటును 2023కు సంబంధించి 1 శాతం నుంచి 0.8 శాతానికి, 2024లో 1.7 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గించడం జరిగింది. రష్యా–యుక్రేయిన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా నుంచి క్రూడ్ దిగుమతులపై ఆంక్షలు యూరోపియన్ యూనియన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. -
ఆహార పరిశ్రమపై కమోడిటీ ధరల ప్రభావం
కోల్‌కతా: అధిక కమోడిటీ ధరలు, అధిక వడ్డీ రేట్ల ప్రభావం ఆహార పరిశ్రమ (ఫుడ్)పై గణనీయంగా పడినట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. దీర్ఘకాలంలో ఈ అంశాల ప్రభావం అధికంగా ఉంటుందని 2022–23 వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ విధమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి సాయపడినట్టు వివరించింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆహార పరిశ్రమ ఎదుర్కొన్న పెద్ద సవాలు.. ముడి పదార్థాలైన గోధుమలు, పాలు, పంచదార, పామాయిల్, ముడి చమురు ధరలు పెరిగిపోవడం వల్ల ఎదురైన ద్రవ్యోల్బణమే’’అని పేర్కొంది. బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రధానంగా బిస్కట్లు, కేక్‌లు, రస్్క, బ్రెడ్, చాక్లెట్ల విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, దేశీయంగా డిమాండ్ పరిస్థితులు ఎంతో ఆశావహంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పరిస్థితులు అన్నవి 2023–24లో ప్రధానంగా దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. సరైన వర్షపాతంపైనే గ్రామీణాభివృద్ధి, ఆహార ధరలు ఆధారపడి ఉంటాయి’’అని బ్రిటానియా తన నివేదికలో తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించామని, కొత్త భౌగోళిక ప్రాంతాల్లోకి విస్తరించామని ప్రకటించింది. బ్రాండ్ బలోపేతం, కొత్త ఉత్పత్తుల విడుదలపై దృష్టి సారించనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యం, అమెరికా, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, సార్క్ దేశాలపై దృష్టి సారించనున్నట్టు ప్రకటించింది. -
అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం.. తక్కువ కాలపరిమితి.. ఎక్కువ వడ్డీ!
తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నవారి కోసం ఐడీబీఐ బ్యాంక్ అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. 375 రోజుల కాలపరిమితితో కొత్త ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జూలై 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ ఎఫ్డీ పథకంపై సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును ఐడీబీఐ అందిస్తోంది. ‘అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ’ ప్రోగ్రాంలో భాగంగా ఈ కొత్త పథకాన్ని ఐడీబీఐ ప్రారంభించింది. కాగా ఇదే ప్రోగ్రాం కింద 444 రోజుల కాలపరిమితితో ఓ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఇదివరకే ప్రవేశపెట్టింది. ఈ రెండు ఎఫ్డీ పథకాలు ఆగస్టు 15 వరకు చెల్లుబాటులో ఉంటాయని ఐడీబీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి ➤ ‘ఎస్బీఐ యోనో’ను ఇక ఏ బ్యాంక్ కస్టమర్ అయినా వాడొచ్చు.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ! ప్రస్తుతం ఉన్న 444 రోజుల వ్యవధి ఎఫ్డీ పథకానికి సంబంధించి కాలబుల్ (మెచ్యూరిటీ కంటే ముందే విరమించుకోవడం) ఆప్షన్‌పై గరిష్టంగా 7.65 శాతం, నాన్-కాల్ ఎంపిక కింద గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. -
రూ.21 కోట్లు కొల్లగొట్టేశారు.. కుటుంబ సభ్యుల నిర్వాకం..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కుటుంబ సభ్యులనే డైరెక్టర్లుగా నియమించుకుని అధిక వడ్డీల ఆశ చూపి అమాయకులను బురిడీ కొట్టించి న కాకినాడ కార్తికేయ బిల్డింగ్ సొసైటీ గుట్టురట్టు అయ్యింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో అక్రమార్కుల ఆస్తులను సీజ్‌చేసి వేలం వేసేందుకు మార్గం సుగమమైంది. తద్వారా సొసైటీ బాధితులకు ప్రభు త్వం నుంచి భరోసా లభించింది. కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన కార్తికేయ బిల్డింగ్ సొసై టీ డిపాజిటర్లకు మెచ్యూరిటీ సొమ్ములు ఇవ్వకుండా బోర్డు తిప్పేసిన వ్యవహారాన్ని ‘కొంప ముంచిన కార్తికేయ’.. శీర్షికన ‘సాక్షి’ గత ఏప్రిల్ 2న వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ‘కార్తికేయ’లో జరిగిన రూ.కోట్ల కుంభకోణంపై ప్రత్యేక దృష్టిపెట్టి సహకార శాఖ ద్వారా విచారణ జరిపించింది. ఆ శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సహకార శాఖ ద్వారా వివిధ కోణాల్లో విచారణ జరిపించింది. కార్తికేయ బిల్డింగ్ సొసైటీ ఆర్థిక కుంభకోణం విలువ రూ.21.58 కోట్లుగా లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిక సిద్ధంచేసింది. అధిక వడ్డీల ఆశచూపి.. అధిక వడ్డీలు ఇస్తామంటూ 300 మంది డిపాజిటర్లను నమ్మించి సుమారు రూ.19.40 కోట్ల వరకు సొసైటీ వారి నుంచి సేకరించింది. ఈ మొత్తానికి ఇవ్వాల్సిన వడ్డీయే రూ.2.05 కోట్లకు పైగా ఉంది. డిపాజిట్ల మొత్తంలో రూ.10 కోట్లను సొసైటీ ఖాతాలో ఎక్కడా నమోదు చేయకుండానే నొక్కేశారని తేలింది. అలాగే, అసలు రుణాలేమీ ఇవ్వకుండానే ఇచి్చనట్లుగా 361 మంది బినామీ పేర్లతో రూ.5.36 కోట్లు స్వాహా చేశారు. ఇందుకు వడ్డీ రూ.2 కోట్లు వచ్చినట్లుగా రికార్డుల్లో చూపించారు. అంతేకాక.. రుణాలివ్వగా వాటి నుంచి వచ్చిన వడ్డీ రూ.1.65 కోట్లు అసలు సొసైటీలో జమచేయకుండానే వాటినీ దారి మళ్లించేశారు. ఈ వడ్డీ సొమ్ములో ఒక్కపైసా కూడా సొసైటీ నగదు పుస్తకంలో లేకపోవడం చూసి సహకార శాఖ అధికారులు విస్తుపోయారు. పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం వంటి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందనే ముందుచూపుతో రిటైరైన ఉద్యోగులు, చిరుద్యోగులు, సన్న, చిన్నకారు రైతులు ‘కార్తికేయ’లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ.2.56 కోట్లను కూడా మాయం చేసేసి డిపాజిటర్ల నోట మట్టికొట్టారు. కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా.. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా సహకార అ«ధికారి బొర్రా కనక దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ రిజి్రస్టార్ ఎన్విఎస్ఎస్ దుర్గాప్రసాద్ విచారణ జరిపి కుంభకోణాన్ని నిర్థారించారు. బిల్డింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అప్పటి ప్రెసిడెంట్ కోడి వీరవెంకట సత్యనారాయణ తన భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు వెంకటేశ్, శంకర్‌ను డైరెక్టర్లుగా నియమించుకుని ప్రజల సొమ్మును దిగమింగారు. వీరితో పాటు చేపూరి గంగరాజు, బాలం విజయకుమార్, గ్రంథి వీరేంద్ర, టేకి త్రినా«థ్ పుష్పరాజ్యం, అంజుమ్ సుల్తానా, దొమరసింగు సింహాద్రిరావు, ఇరుసుమల్ల పార్వతి, ముసినాడ సాంబశివరావు, సొసైటీ మేనేజర్ మీర్ అమీర్‌హుస్సేన్, అకౌంటెంట్ కోన కనకమహాలక్ష్మి కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడినట్లుగా తేలింది. ప్రభుత్వ చొరవతో ఆస్తులు సీజ్.. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించడంతో కోడి వీరవెంకట సత్యనారాయణ పేరుతో ఉన్న మూడు విలువైన ఆస్తులను సీజ్‌చేశారు. ఇందులో కాకినాడ వాకలపూడిలోని 1,400 చదర పు గజాలు ఖాళీ స్థలం, కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద ఉన్న బిల్డింగ్ సొసైటీ భవనంతోపాటు మరో ఇల్లు సీజ్ చేశా రు. వీటి విలువ రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటాయి. త్వరలో వీటిని వేలం వేసి ఆ సొమ్ముతో డిపాజిటర్లకు ప్రభుత్వం న్యాయం చేయనుంది. చదవండి: ఇదే నాకు మొదటి పెళ్లి... నాకు మందు, సిగరేట్లు కావాలి బాధ్యులపై క్రిమినల్ కేసులు.. కుంభకోణానికి పాల్పడ్డ కోడి వీరవెంకట సత్యనారాయణ సహా 14 మందిపై జిల్లా సహకార అధికారి బొర్రా దుర్గాప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. కాకినాడ టూటౌన్ ఇన్స్పెక్టర్ బి. నాగేశ్వర్‌నాయక్ వీరిపై ఐపీసీ 120బి, 420, 406, 408, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ కొనసాగిస్తోందని దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. -
వేషం మార్చి.. పేరు మార్చి.. జనాన్ని ఏమార్చి! రూ.10 కోట్ల వరకూ..
సాక్షి, పుట్టపర్తి: మహా మాయగాడి బండారం బయట పడింది. ఊరికో పేరు మార్చుకుంటూ చెలామణి అవుతూ అమాయకులను మోసం చేస్తోంది.. ఒక్కడే అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త చిన్న ఓబులేసు అధిక వడ్డీ ఆశ చూపి ఇప్పటికే పలు చోట్ల జనాలను నిలువునా మోసం చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఒక్కో చోట ఒక్కో పేరుతో చెలామణి అవుతుండటంతో ప్రజలు పసిగట్టలేకపోయారు. రోజుల వ్యవధిలోనే రూ.లక్షకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి కొన్ని రోజుల పాటు ఠంఛన్‌గా సొమ్ము చెల్లించేవాడు. ఆ తర్వాత ఉడాయిస్తాడు. ఇప్పటికే నంద్యాల జిల్లా అవుకు, అనంతపురం జిల్లా కణేకల్లు, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపించారు. ఆ తర్వాత బెయిల్‌పై వచ్చి ఊరు మార్చి.. కొత్త పేరుతో దందా కొనసాగిస్తున్నాడు. గత రెండేళ్లలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డట్టు తేలింది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మనోహర్‌రెడ్డి పేరుతో రూ.1.7 కోట్లతో పరారయినట్లు బాధితులు ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ భాస్కర్‌రెడ్డిగా.. ఇక్కడ మనోహర్రెడ్డిగా.. గతేడాది మేలో నంద్యాల జిల్లా అవుకులో భాస్కర్‌రెడ్డిగా పరిచయమయ్యాడు. అక్కడే ఓ షాపు అద్దెకు తీసుకుని వంటనూనె, చక్కెర, సిగరెట్ల వ్యాపారం చేస్తానని నమ్మబలికాడు. స్టాక్ కోసం పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు కావాలని, రూ.లక్ష తనకిస్తే రోజుకు రూ.5 వేల చొప్పున వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అధిక వడ్డీకి ఆశపడి చాలామంది అతనికి డబ్బులిచ్చారు. అక్కడ సుమారు రూ.3 కోట్ల వరకూ వసూలు చేసుకుని పరారయ్యాడు. అవుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలించి గాలివీడులో పట్టుకుని జైలుకు పంపారు. అవుకు కేసు నుంచి బయటికొచ్చాక శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి మకాం మార్చాడు. అక్కడ షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మబలికాడు. అధిక వడ్డీ ఇస్తానని కొన్ని రోజుల పాటు నమ్మించాడు. రూ.లక్షకు రోజుకు రూ.వెయ్యి ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.1.7 కోట్లు వసూలయ్యాక పరార్ అవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అంతకుముందు అనంతపురం జిల్లా కణేకల్లు.. ఆత్మకూరులో కూడా అధిక వడ్డీ ఆశ చూపి కొందరితో డబ్బులు వసూలు చేసి పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. మొదట్లో జులపాలు.. ఆ తర్వాత గుండు రైల్వే కమ్మీలు చోరీ చేసిన కేసులో కూడా బెస్త చిన్న ఓబులేసే నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు గాలించి అరెస్టు చేసి జైలుకు పంపినా.. ఆ తర్వాత అనంతపురంలోని నాయక్ అనే ఓ లాయర్‌ను అడ్డు పెట్టుకుని సులువుగా బయటికొచ్చేస్తున్నాడు. చిన్న ఓబులేసు పేర్లు మార్చుకున్నట్లే వేషం కూడా మార్చేస్తాడు. మొదట్లో జులపాల జుట్టుతో ఖద్దర్ చొక్కా వేసి.. చేతికి ఉంగరాలు, మెడలో బంగారు చైన్లు వేసుకుని దర్జాగా తిరుగుతాడు. డబ్బులున్న వారితో టచ్‌లోకి వెళ్లి అధిక వడ్డీ ఆశ చూపి లూఠీ చేసి పరారవుతాడు. ఆ తర్వాత విహార యాత్రలకు వెళ్లి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు. పోలీసులకు పట్టుబడే సమయానికి గుండుతో ఉంటాడు. నిత్యం డ్రెస్ కోడ్, బాడీ లాంగ్వేజ్ మార్చి విందు, వినోదాల్లో మునిగితేలుతుండాడు. విహార యాత్రల్లో ఉండగానే లాయర్లతో టచ్‌లోకి వెళ్లి.. కేసులకు సంబంధించి లాబీయింగ్ చేస్తాడని సమాచారం. -
డిసెంబర్ క్వార్టర్లో మాంద్యంలోకి యూరప్ దేశాలు
ఫ్రాంక్ఫర్ట్: ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్‌లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది. -
భారత్ వృద్ధి రేటు అంచనాకు మూడీస్ రెండవ కోత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణమని పేర్కొంది. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్ 2023–24 నివేదికలో మూడీస్ పేర్కొంది. 2024లోనే వెలుగు రేఖలు... 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని అవుట్‌లుక్ పేర్కొంది. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయని మూడీస్ అంచనావేసింది. 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని పేర్కొంటూ, 2023లో జీ–20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణిస్తుందని తెలిపింది. క్రితం 2.1 శాతం క్షీణ అంచనాలు తగ్గడం కొంత ఊరట. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థి క, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి న మోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. -
హౌసింగ్ బూమ్..! రేట్లు పెరిగినా తగ్గేదెలే!
న్యూఢిల్లీ: అధిక వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోలు డిమాండ్‌కు అవరోధం కాదని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అధ్యయన నివేదిక తెలిపింది. రుణ కాల వ్యవధిలో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం సహజమేనన్న విషయమై వారికి అవగాహన ఉంటుందని పేర్కొంది. రెండేళ్లుగా వడ్డీ రేట్ల పరంగా ఎటువంటి మార్పుల్లేని విషయం తెలిసిందే. కానీ, ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా మొత్తం 1.4 శాతం మేర రేట్లను పెంచడంతో.. బ్యాంకులు సైతం రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో బీవోబీ పరిశోధన నివేదిక ఇళ్ల డిమాండ్, వడ్డీ రేట్లపై దృష్టి సారించడం గమనించాలి. ‘భారత్‌లో గృహ రుణాల తీరు’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. కరోనా తర్వాత దేశంలో గృహ రుణ రంగం బలంగా నిలబడినట్టు తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే గృహ రుణాల్లో మంచి వృద్ధి కనిపించడాన్ని ప్రస్తావించింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రకటించిన మద్దతు చర్యలు, దీనికితోడు ప్రాపర్టీల ధరలు తగ్గడం, తక్కువ వడ్డీ రేట్లు మార్కెట్‌కు కలిసొచ్చినట్టు వివరించింది. గృహ రుణాలకు డిమాండ్ ఆర్థిక కార్యకలాపాలు సాధారణంగా మారిపోవడం, వృద్ధి పుంజుకోవడం, గృహాలకు డిమాండ్‌ను గణనీయంగా పెంచనున్నట్టు ఈ నివేదికను రూపొందించిన బీవోబీ ఆర్థికవేత్త అదితి గుప్తా పేర్కొన్నారు. ఈ సానుకూలతలు మద్దతుగా గృహ రుణాలకు మరింత డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ‘‘అధిక వడ్డీ రేట్లు కొద్ది మంది రుణ గ్రహీతలకు అవరోధం కావచ్చు. కానీ, ఇళ్లకు నెలకొన్న బలమైన డిమాండ్ దీన్ని అధిగమిస్తుంది. పైగా వ్యక్తిగత గృహ కొనుగోలుదారులు వడ్డీ రేట్ల ఆటుపోట్లపై అవగాహనతో ఉంటారు. కనుక అధిక రేట్లు వారి కొనుగోళ్లకు అవరోధం కాబోవు’’అని అదితి గుప్తా వివరించారు. జీడీపీలో పెరిగిన వాటాయే నిదర్శనం గడిచిన పదేళ్ల కాలంలో జీడీపీలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల గృహ రుణాల రేషియో పెరగడం గృహ రుణాలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనమని ఈ నివేదిక గుర్తు చేసింది. 2010–2011లో జీడీపీలో గృహ రుణాల రేషియో 6.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి అది 9.5 శాతానికి పెరిగినట్టు తెలిపింది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీలో గృహ రుణాల రేషియో 9.8 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి రియల్ ఎస్టేట్ బలంగా కోలుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల రేషియో జీడీపీలో 11.2 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ‘‘2020–11 నాటికి రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 2020–21 నాటికి రూ.15 లక్షల కోట్లకు పెరిగింది. ఏటా 14.3 శాతం వృద్ధి నమోదైంది. గృహ రుణాల మార్కెట్లో ఇప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీటి వాటా 61.2 శాతంగా ఉంది. 2022లో హౌసింగ్ బూమ్..! పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు ఇళ్ల ధరలు పెరిగాయి. గృహ రుణాల రేట్లు కూడా పెరుగుతున్నాయి. అయినా సరే 2022లో ఇళ్ల విక్రయాలు కరోనా ముందు నాటిని మించి నమోదవుతాయని పరిశ్రమ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు.. కరోనా ముందు సంవత్సరం 2019లో నమోదైన 2.62 లక్షల యూనిట్లను మించుతాయని అంచనాతో ఉంది. డీమోనిటైజేషన్, రెరా, జీఎస్టీ, కరోనా మహమ్మారి కారణంగా గడిచిన ఆరేళ్లుగా ఈ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. అయితే, రెరా చట్టం కారణంగా కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడినట్టు గృహ కొనుగోలుదారుల మండలి ఎఫ్‌పీసీఈ అంటోంది అన్ని ప్రధాన రియల్ ఎస్టేట్ లిస్టెడ్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరానికి బుకింగ్‌ల పరంగా మంచి గణాంకాలను నమోదు చేయగా, 2022–23లోనూ మెరుగైన విక్రయాలు, బుకింగ్‌ల పట్ల ఆశాభావంతో ఉంది. అయితే, ఆర్బీఐ రెపో రేటును 1.4 శాతం మేర పెంచడం, బ్యాంకులు ఈ మొత్తాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేయడంతో స్వల్ప కాలంలో ఇళ్ల విక్రయాలపై ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇళ్ల ధరల పెరుగుదల ప్రభావం కూడా స్వల్పకాలంలో ఉండొచ్చని అంగీకరించింది. జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సుమారు 5 శాతం మేర పెరగడం గమనార్హం. పండుగల జోష్ అయితే పండుగల సీజన్ నుంచి ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంచనాలతో ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సైతం ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు ఏడు ప్రధాన పట్టణాల్లో (ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె) 2019లో నమోదైన 2,61,358 యూనిట్లను మించుతాయని అంచనా వేసింది. అయితే 2014లో నమోదైన గరిష్ట విక్రయాలు 3.43 లక్షల యూనిట్ల కంటే తక్కువే ఉండొచ్చని పేర్కొంది. దేశ హౌసింగ్ పరిశ్రమ నిర్మాణాత్మక అప్‌సైకిల్ ఆరంభంలో ఉందని మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఎండీ, సీఈవో అభిషేక్ లోధా తెలిపారు. వచ్చే 10–20 ఏళ్ల కాలానికి వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు. -
వడ్డీ ఎక్కువైనా లోన్ యాప్స్ నుంచి రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రెడిట్ హిస్టరీ చూడకుండానే లోన్ యాప్స్ రుణం అందిస్తున్నాయి. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నిముషాల్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి. లోన్ యాప్స్ ద్వారా రుణం పొందితే అధిక వడ్డీ చెల్లించాల్సిందే. ఈ విషయం తెలిసి కూడా కస్టమర్లు వీటినే ఎంచుకుంటున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇటీవలి కాలంలో లోన్ యాప్స్ మోసాలు, వేధింపులు మితిమీరాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 2 లక్షల పైచిలుకు మంది పాలుపంచుకున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళలు ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది 21–30 ఏళ్ల వయసువారే. ఇవీ సర్వే ముఖ్యాంశాలు.. లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందనే విషయం తమకు తెలుసు అని సర్వేలో పాల్గొన్న వారిలో 1,40,387 (70 శాతం) మంది తెలిపారు. లోన్ ఇస్తామంటూ వచ్చే కాల్స్, సందేశాలను 86,796 (43 శాతం) మంది అందుకున్నారు. సర్వేలో పాల్గొన్నవారుగానీ వారి సన్నిహితులు, బంధువుల్లో లోన్ యాప్స్ ద్వారా రుణం పొందినవారు 1,02,106 (51 శాతం) ఉన్నారు. తాముగానీ, తమకు తెలిసినవారిలో లోన్ యాప్స్ బాధితులూ ఉన్నారని 1,34,607 మంది (67 శాతం) వెల్లడించారు. ఈ స్థాయిలో బాధితులు ఉన్నప్పటికీ సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదని 79 శాతం మంది చెప్పడం గమనార్హం. -
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో... డిపాజిట్ భద్రమేనా?
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్.. ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి విశ్వసనీయమైన సాధనం. సమీపంలోని బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకోవడం, అవసరం ఏర్పడినప్పుడు వెళ్లి తీసుకోవడం సౌకర్యాన్నిచ్చే అంశం. బ్యాంకులో డిపాజిట్ అయితే ఎక్కడికీ పోదు? అన్న నమ్మకం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఎఫ్డీలపై అధిక వడ్డీ రేటును కొన్ని బ్యాంకులు ఆఫర్ చేయడం గమనించే ఉంటారు. ఈ విషయంలో వాణిజ్య బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) కొంచెం అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. మరి అధిక రాబడి కోసం ఈ సాధనాలను ఎంపిక చేసుకోవడం ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్న రావచ్చు. అలాగని, అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయంటే ఏదో సందేహించాల్సిందే? అని భావించడం కూడా సరికాదు. ఎందుకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయన్నది ఇక్కడ గమనించాలి. ఆర్బీఐ నియంత్రణల పరిధిలో పనిచేసే బ్యాంకులు ఏవైనా, వాటిల్లో డిపాజిట్ చేసే విషయంలో సందేహించక్కర్లేదు. డిపాజిట్‌పై ఇన్సూరెన్స్ అమల్లో ఉందా? అన్నది విచారించుకోవాలి. అంతేకాదు, డిపాజిట్‌కు ముందు ముఖ్యమైన అంశాలు కొన్నింటిని విశ్లేషించుకోవాలి. అప్పుడే రాబడితోపాటు, భరోసా ఉండేలా చూసుకోవచ్చు. రిస్క్–రాబడి.. చాలా వరకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు) ఏడాది కాల ఎఫ్డీలపై 7–7.25% రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు కంటే కనీసం ఒక శాతం ఎక్కువ. వడ్డీ రేటు వ్యత్యాసం అన్నది ఎస్ఎఫ్బీలు, ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య 1.5–2% వరకు ఉంది. అందుకే కొందరు ఇన్వెస్టర్లకు ఎస్ఎఫ్బీలు ఆఫర్ చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ రేటు ఆకర్షణీయంగా అనిపించొచ్చు. రేటు ఆకర్షణీయంగానే ఉన్నా, భద్రత విషయంలో సందేహంతో వెనుకాడాల్సిన అవసరం లేదు. అన్ని ఇతర షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మాదిరే, ఎస్ఎఫ్బీలు సైతం ఆర్బీఐ నియంత్రణల పరిధిలోనే పనిచేస్తాయి. కనుక ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి కూడా.. రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కవరేజీ ఉంటుంది. పెద్ద వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఎస్‌ఎఫ్‌బీల వ్యాపార నమూనా అధిక రిస్క్ తో ఉంటుంది. అందుకనే అవి డిపాజిట్లపై కాస్తంత అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఎస్ఎఫ్బీలు తమ మొత్తం రుణాల్లో 75 శాతాన్ని ప్రాధాన్య రంగాలకు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయం, ఎస్ఎంఎంఈలు ప్రాధాన్య రంగాల కిందకు వస్తాయి. అలాగే, ఎస్‌ఎఫ్‌బీల రుణ పుస్తకంలో 50 శాతం రుణాలు.. ఒక్కోటీ రూ.25 లక్షలు, అంతకులోపే ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. దీని కారణంగా ఎస్‌ఎఫ్‌బీల రుణాల్లో అన్సెక్యూర్డ్ రుణాలు 50–75 శాతం వరకు ఉంటాయి. కానీ, పెద్ద వాణిజ్య బ్యాంకుల్లో అన్సెక్యూర్డ్ రుణాలు మొత్తం రుణాల్లో 30 శాతం కంటే తక్కువే ఉంటాయి. ఎటువంటి హామీ/తనఖా లేని రుణాలు అన్సెక్యూర్డ్ కిందకు వస్తాయి. అందుకనే ఎస్‌ఎఫ్‌బీల వ్యాపారంలో రిస్క్ ఎక్కువ. కనుక ఎస్ఎఫ్బీలు రుణాల రిస్క్‌ను బ్యాలన్స్ చేసుకునేందుకు.. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే 1.5–2.5% అధిక రేటుపై రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణ రేటు 6.9 % నుంచి మొదలవుతోంది. అదే ఎస్ఎఫ్బీల్లో ఈ రేటు 8.5% నుంచి ఉంటోంది. ఇలా రుణాలపై అధిక రేటును ఎస్ఎఫ్బీలు వసూలు చేస్తుంటాయి. డిపాజిట్లపై మెరుగైన రేటును ఆఫర్ చేయడానికి ఇది కూడా ఒక కారణమే. ఇక ఎస్ఎఫ్బీలు మొదలై 5–6 ఏళ్లే అవుతోంది. కనుక డిపాజిట్ల సమీకరణ దశలోనే అవి ఇంకా ఉన్నాయి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం, అధిక డిపాజిట్ బేస్ వచ్చే వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ రేటును ఆఫర్ చేయడం సహజంగానే చూడాలి. ఎంత వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు..? మీకు సమీపంలోని ఎస్ఎఫ్బీ శాఖకు వెళ్లి డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ సంస్థలు ఇంకా పూర్తి స్థాయి టెక్నాలజీ వనరులను సమకూర్చుకోలేదు. కనుక నేరుగా వెళ్లి ఎఫ్డీ చేసుకోవడం మంచిదే. అత్యవసరాల్లో తిరిగి డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవడం ఆలస్యం కాకుండా ఉంటుంది. ఇక ఎంత మొత్తం వరకు డిపాజిట్ చేసుకోవచ్చు? అన్న సందేహం రావచ్చు. ఒక వ్యక్తి తన పొదుపు నిధులు మొత్తాన్ని ఒకే బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకోవడం సూచనీయం కాదు. పైగా ఎస్ఎఫ్బీలో డిపాజిట్ చేసుకోవడానికి ముందు బ్యాంకు కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయో? ఒక అంచనాకు రావాలి. నమ్మకం ఏర్పడిన తర్వాతే డిపాజిట్‌కు వెళ్లాలి. అధిక రాబడుల కోసం మిగులు నిధుల వరకే డిపాజిట్‌కు పరిమితం కావాలి. డిపాజిట్ మొత్తానికి భద్రత కోరుకునేట్టు అయితే.. అప్పుడు ఒక బ్యాంకు పరిధిలోలో రూ.5 లక్షలకు మించి డిపాజిట్ చేయవద్దు. ఎందుకంటే డీఐసీజీసీ కింద బ్యాంకు సంక్షోభం పాలైతే ఒక బ్యాంకు పరిధిలో ఒక డిపాజిట్ దారుకు గరిష్టంగా వచ్చేది రూ.5 లక్షలకే పరిమితం. అందుకుని రూ.5 లక్షల చొప్పున వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్చేసుకోవాలి. దీర్ఘకాలానికి కాకుండా 1–3 ఏళ్ల వరకు డిపాజిట్ చేసుకుని, కాల వ్యవధి ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకోవడం మంచిది. ఆయా అంశాలపై ఒక నిర్ణయానికి ముందు వీటిపై సమగ్ర సమచారం పొందాలి. నిపుణులను సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకు ఎంపిక ఎలా? స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే వాటి అధికారిక వెబ్ సైట్ల నుంచి గణాంకాలు పొందొచ్చు. బ్యాంకు సామర్థ్యం ఏపాటిదో అవగాహన తెచ్చుకునేందుకు వాటి స్థూల మొండిబాకీలు (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్–ఎన్పీఏలు) ఏ స్థాయిలో ఉన్నాయి? బ్యాంకు రుణ పుస్తకం, డిపాజిట్ల బేస్ గత మూడేళ్ల కాలంతో పోలిస్తే, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉందన్నది చూడాలి. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు మెరుగుపడ్డాయా లేక క్షీణించాయా? గమనించాలి. ఎస్ఎఫ్బీలు చిన్న గా (పరిమాణం పరంగా) ఉన్నందున వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే అవి అధిక వృద్ధిని నమోదు చేయగలవు. రుణాలు, డిపాజిట్లలో 25–35% వరకు, నికర వడ్డీ ఆదాయంలో 20–25% వృద్ధి ఉందంటే సానుకూలంగా చూడొచ్చు. ఎస్‌ఎఫ్‌బీలలో ఏయూ ఎస్ఎఫ్బీ మినహా మిగిలినవి సూక్ష్మ రుణ కార్యకలాపాలనే ఎక్కు వగా నిర్వహిస్తున్నాయి. దీంతో కరోనా సమయంలో వీటికి ఎక్కువ షాక్‌లు తగిలాయి. వాటి ఎన్పీఏలు ఐదేళ్ల సగటును మించి పోయాయి. వ్యాపార కార్యకలాపాలు తిరిగి గాడిన పడిన తర్వాత ఇవి తగ్గుముఖం పట్టడం సహజం. ఎస్ఎఫ్బీలు అన్నీ కూడా తగినన్ని నిధులతో ఉన్నందున ఆందోళన అనవసరం. -
తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని కట్టేసి కొట్టారు!
కొమరాడ: అధిక వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపి గ్రామస్తుల నుంచి భారీగా అప్పులు చేసింది. ఆ సొమ్ముతో జల్సాలు చేసింది. చివరకు అప్పులు తీర్చలేనంటూ చేతులెత్తేయడంతో బాధితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రచ్చబండ వద్ద తాడుతో కట్టేసి కొట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని సివిని గ్రామానికి చెందిన శోభ గత కొన్ని రోజులుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. అధికంగా వడ్డీలు ఇస్తానంటూ గ్రామస్తుల నుంచి సుమారుగా రూ.1.40 కోట్ల మేర అప్పుచేసింది. డబ్బు తిరిగివ్వాలంటూ వారంతా అడిగేసరికి చేతులెత్తేసింది. దీంతో ఏప్రిల్ 7న కొమరాడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం కొంత మంది బాధిత మహిళలు, గ్రామస్తులు కలిసి ఆమెను రామమందిరం వద్ద ఉన్న రచ్చబండ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆమెను విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ ప్రయోగమూర్తి చెప్పారు. -
అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది!
All About Kisan Vikas Patra Saving Scheme: పోస్టాఫీస్‌కు చెందిన సేవింగ్ స్కీమ్‌లలో కిసాన్ వికాస్ పత్ర పథకం ఒకటి. ఈ సేవింగ్ స్కీమ్‌లో మీ సొమ్మును మదుపుచేశారంటే (బ్యాంకు కంటే) 124 నెలల్లో అది రెట్టింపవుతుంది. అంతేకాకుండా మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకులు దివాలా తీస్తే కేవలం 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. ఐతే పోస్టాఫీసులో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.. వడ్డీ రేటు పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకం 6.9 శాతం వడ్డీ అందిస్తుంది. ప్రతీ యేటా వడ్డీని కలుపుతారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ వడ్డీ వర్తిస్తుంది. ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు ఈ పోస్టాఫీసు పథకంలో కనీసం రూ. 1000లతో ఖాతా తెరవాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అంటే రూ.1000ల నుంచి ఎంతైన మదుపు చేయవచ్చు. ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు? కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించిన అకౌంట్లో ముగ్గురు సభ్యులవరకు జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. పదేళ్ల వయసున్న మైనర్లు కూడా తమ పేరు మీద నేరుగా ఖాతా తెరవొచ్చు. మెచ్యురిటీ పీరియడ్ సమర్పించిన తేదీ నుండి 124 నెలలు (10 సంవత్సరాల 4 నెలలు) ఉంటుంది. ఖాతా బదిలీ చేసే సందర్భాలు ►ఈ పథకం కింది సందర్భాలలో మాత్రమే వ్యక్తి నుండి వ్యక్తికి ఖాతా బదిలీ చేస్తుంది.. ►ఖాతాదారు మరణిస్తే, నామినీ లేదా చట్టపరమైన వారసుడికి ఖాతా బదిలీ చేయబడుతుంది. ►ఖాతాదారుడు మరణిస్తే, ఖాతాను జాయింట్ హోల్డర్‌కు బదిలీ చేయవచ్చు. ►కోర్టు ఆదేశాల మేరకు ఖాతా బదిలీ చేయవచ్చు. ►అంతేకాకుండా ఖాతాను ఏదైనా అధికారి వద్ద తనఖా పెట్టవచ్చు. చదవండి: ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో.. -
నడ్డి విరిచిన అధిక వడ్డీ ఆశ
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సత్యనారాయణపేటలో నివాసముంటున్న విజయలక్ష్మి చిట్టీలు నిర్వహించేది. హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్లతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది నుంచి అధిక వడ్డీ ఆశ చూపి అప్పుల రూపంలో తీసుకుంది. ఈ డబ్బుతో ఫైనాన్స్ కంపెనీ నడుపుతోంది. రూ.50 కోట్లు పోగయ్యాక ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. దీంతో తాము మోసపోయామని బాధితులు టూటౌన్ పోలీసుస్టేషన్ సీఐ మన్సూరుద్దీన్‌కు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 మంది ఫిర్యాదులు అందజేశారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఫిర్యాదులు అందాయి. విజయలక్ష్మి భర్త చనిపోయాడని, ఆమెకు కుమారుడు అశోక్‌కుమార్ ఉన్నాడని బాధితులు తెలిపారు. కొడుకుతో కలిసే ఆమె ఈ మోసాలకు పాల్పడిందన్నారు. విజయలక్ష్మి కుటుంబం ఎక్కడి నుంచో వచ్చి హిందూపురంలో సెటిల్ అయ్యారని చెప్పారు. హిందూపురానికి వచ్చిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఈ వ్యవహారంపై విచారణ చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
జబర్దస్త్‌గా వడ్డీ వసూలు !
సాక్షి, జగిత్యాల: పంట రుణాల రెన్యూవల్ కోసం బ్యాంకులకు వెళ్తున్న రైతులు వడ్డీ చెల్లించాలనే బ్యాంకర్ల మాటలతో లబోదిబోమంటున్నారు.గతేడాది వరకు సహకార సంఘాల ద్వారా పొందిన రుణాలకు వడ్డీ వసూలు చేయలేదు. ప్రస్తుతం సహకార సంఘాలు, బ్యాంకులు అనే తేడా లేకుండా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. రైతులు తీసుకుంటున్న రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇందులో కేంద్రం వాటా 3 శాతం మాఫీ చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 4 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇలా జగిత్యాల జిల్లాలోని రైతుల నుంచి దాదాపుగా రూ.40కోట్లు వసూలు చేశాయి. రుణంపై ఏడు శాతం వడ్డీ రైతులు సహకార సంఘాల ద్వారా తీసుకుంటున్న రుణాలకు బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఏటా క్రమం తప్పకుండా పంట రుణాలు చెల్లించే రైతులకు ప్రభుత్వాలు బాసటగా నిలిచేందుకు వడ్డీ చెల్లించేందుకు గతంలో ముందుకొచ్చాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించాయి. ప్రస్తుతం పంటల ప్రారంభ సీజన్ కావడంతో కొందరు రైతులు కొత్తగా రుణాల కోసం, మరికొందరు రెన్యూవల్ కోసం బ్యాంకులు వెళ్తున్నారు. అయితే కేంద్రం చెల్లించే 3 శాతం మాఫీ పోనూ.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 4 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. వడ్డీ చెల్లించకుంటే రుణం రెన్యూవల్‌కు ససేమిరా అంటున్నాయి. ప్రభుత్వం చెల్లించకనే తిప్పలు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 4 శాతం వడ్డీని సకాలంలో చెల్లించకనే బ్యాంకులు రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. రెండు, మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వడ్డీ బకాయిలు రావడం లేదని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్క ఏడాదికే దాదాపుగా రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉందని చెబుతున్నారు. ఈక్రమంలో ఉన్నతాధికారుల నుంచి వడ్డీ వసూలు చేయాలనే ఆదేశాలు వస్తున్నట్లు మేనేజర్లు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏటా రూ.43 కోట్లు వడ్డీ చెల్లిస్తున్న రైతులు జిల్లాలో గతేడాది 1,91,795 మంది రైతులకు 1,35,514 మంది పంట రుణం తీసుకున్నారు. జిల్లాలోని 19 బ్యాంకులు రూ.1,055 కోట్ల పంట రుణం ఇచ్చాయి. జిల్లా రైతులే దాదాపు రూ.40–43 కోట్ల వడ్డీని గతేడాది బ్యాంకులకు చెల్లించారు. రెండు, మూడేళ్లుగా రైతులు చెల్లిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ వడ్డీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమకాలేదు. మళ్లీ ఈ ఏడాది కూడా రుణం చెల్లిస్తామని బ్యాంకుకు వెళ్తే వడ్డీని వసూలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా సహకార సంఘాలు, లీడ్‌బ్యాంక్ ఆంధ్రాబ్యాంకు రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4 శాతం వడ్డీని వసూలు చేయలేదు. కానీ ప్రస్తుతం ఆ బ్యాంకులు సైతం ఇతర బ్యాంకుల మాదిరిగానే నాలుగు శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. -
అధిక వడ్డీరేట్లు వ్యాపారాలకు విఘాతం
వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: అధిక వడ్డీరేట్లనేవి పరిశ్రమలు, చిన్న వ్యాపారాల వృద్ధికి ప్రతికూలంగా మారుతున్నాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయా సంస్థలపై అధిక రుణ సమీకరణ భారం పడుతోందన్నారు. దీన్ని తాను ఆర్థిక శాఖ, ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇప్పటికే పార్టీలో మరో సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి ఆర్బీఐ గవర్నర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండడం, సెప్టెంబర్ 4తో రాజన్ పదవీకాలం ముగుస్తుండడం, మరో విడతకు ఆయన సిద్ధమవటం వంటి పరిణామాల నేపథ్యంలో నిర్మల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్స్పెక్టర్ రాజ్ వ్యవస్థ ఇంకా భారత్‌లో కొనసాగుతోందన్న రాజన్ వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. అయితే వ్యాపార వాతావరణం మెరుగుపడటానికి తగిన చర్యల్ని కేంద్రం తీసుకుంటుందన్నారు. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. -
కష్టాల్లో ‘డ్వాక్రా’
నారు పోసిన వాడు నీళ్లు పొయ్యకుండా పోతాడా! అనేది సామెత. అంటే పుట్టుక ఇచ్చిన దేవుడు జీవించడానికి ఏదో మార్గం చూపిస్తాడనేది అర్థం. డ్వాక్రా సంఘాల విషయంలో అది తిరగబడింది. సంఘాల ఏర్పాటుకు బీజం వేసిన సీఎం చంద్రబాబు పదేళ్ల తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చాక ఉసురు తీశారు. ఎన్నికల వేళ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట మార్చారు. హామీ మేరకు రూ.పది వేలు కూడా ఇవ్వకుండా నామం పెట్టారు. అప్పులకు తోడు వడ్డీ భారం పెరిగింది. మళ్లీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ సంఘాలపై చీకట్లు అలుముకున్నాయి. సొంత జిల్లాలోనే డ్వాక్రా సంఘాల నుంచి సీఎం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది జిల్లాలోని 43,837 గ్రూపులకు రూ.1,177 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. కాగా బ్యాంకు లు ఇప్పటివరకు కేవలం 12,652 సంఘాలకు రూ.475 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చే శాయి. ఇంకా 31 వేల గ్రూపులకు రుణాలు చెల్లించాల్సి ఉన్నా బ్యాంకులు ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో మొత్తం 62 వేల డ్వాక్రా గ్రూపులు ఉండగా, 58,602 గ్రూపులు బ్యాంకుల లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా జిల్లాలో 89 శాతం గ్రూపులు రూ.100 కోట్లు కడుతున్నాయి. 11 శాతం మాత్రమే బ్యాంకు లావాదేవీలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు రుణమాఫీ హామీతో చాలా గ్రూపులు ఎన్నికల అనంతరం బ్యాంకులకు రుణాలు సక్రమంగా చెల్లించలేదు. దీంతో వడ్డీలు పెరి గా యి. నిబంధనల మేరకు మూడు నెలలపాటు బకాయిలు చెల్లించకపోతే అధిక వడ్డీలు పడడమే కాక వడ్డీలేని రుణానికి అర్హత కోల్పోతారు. దీంతో చాలా గ్రూపులు ఇదే పరిస్థితినెదుర్కొంటున్నాయి. చంద్రబాబు రుణమాఫీ హామీని తుంగలో తొక్కడంతో డ్వాక్రా గ్రూపుల అప్పులు పెరిగాయి. జిల్లా వ్యా ప్తంగా 10,484 గ్రూపులకు సంబంధించి రూ.58 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండగా రూ.7,436 గ్రూపులు 3 నెలలుగా రూ.147 కోట్లను కట్టలేని పరిస్థితిలో బ్యాంకులకు చెల్లించడం నిలిపివేశాయి. బ్యాంకులు సకాలం లో రుణాలు మంజూరు చేయలేదు. బలవంతపు రుణవసూళ్లు రుణమాఫీ సంగతి దేవుడెరుగు. ముందు డ్వాక్రా రుణాలను తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు డ్వాక్రా రుణాలను బలవంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పైగా పాతబకాయిలకు సంబంధించి రీపేమెంట్ చేయకపోతే అధిక వడ్డీలు వసూలు చేయాల్సి వస్తుందని, బకాయిలు చెల్లించకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదని తేల్చి చెబుత్నున్నారు. సకాలంలో తిరిగి చెల్లించకపోతే రూ.5 లక్షలకు నెలకు రూ.5 వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సందేనంటూ బెదిరిం పులకు సైతం దిగారు . జిల్లాలో 62 వేల డ్వాక్రా సంఘాల్లో దాదాపు 7.80 లక్షల మంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. 2013-14లో రూ.1387 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో రూ.147 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. గడువులోపు చెల్లించక నిలిచిపోయిన బకాయిలు మరో రూ. 58 కోట్లు ఉన్నారుు. మొత్తంగా ఈ ఏడాది ప్రారంభం నాటికే ఇచ్చిన రూ. 1200 కోట్లు బకాయిలు ఉండగా, బలవంతపు వసూళ్ల పుణ్యమాని ఇప్పటికే 89 శాతం వసూలు చేశారు. రూ. పది వేలు ఏదీ? మరో వైపు అక్కాచెల్లెళ్లకు ఖర్చుల కోసం ఒక్కో సభ్యురాలికి రూ. 10 వేలు ఉచితంగా ఇస్తానని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదే పదే చెప్పారు. కానీ పైసా విదల్చలేదు. జిల్లాలోని 7.80 లక్షలసభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల వంతున మొత్తం రూ.780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా చంద్రబాబు మాటలు నమ్మి పోసపోయామంటూ మహిళలు వాపోతున్నారు. -
మందగమనం నుంచి భారత్ బయటకు
న్యూఢిల్లీ: పాతికేళ్లలో ఎప్పుడూ చూడనంత తీవ్ర మందగమన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడుతోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణ సంస్థ- ఓఈసీడీ ఆర్థిక సర్వే ఒకటి తెలిపింది. అయితే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట 8 శాతం వృద్ధిని నమోదుచేసుకోడానికి తాజా ఆర్థిక సంస్కరణల అమలు కీలకమని కూడా ఆర్థిక సహకార, అభివృద్ధి సంఘం వ్యాఖ్యానించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, బలహీనమైన పెట్టుబడుల నేపథ్యంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఐదు శాతం దిగువున నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) కాలంలో ఈ రేటు 5.7 శాతంగా నమోదయ్యింది. వృద్ధి అంచనాల పెంపు 2015-16లో 6.6 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని సంస్థ తన తాజా అంచనాల్లో ప్రకటించింది. ఈ మేరకు గత అంచనాలను 5.7 శాతం నుంచి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.4 శాతం నమోదవుతుందని తెలిపింది. 2016-17 నాటికి 6.8 శాతానికి ఈ రేటు చేరుతుందని పేర్కొన్న ఓఈసీడీ, 8 శాతం వృద్ధికి చేరడానికి మరికొన్ని చర్యలను సూచించింది. ఇందులో సామాజిక, భౌతిక మౌలిక రంగానికి సబ్సిడీల వ్యయాన్ని బదలాయించడం, పన్ను సంస్కరణలు, మౌలిక రంగానికి అధిక నిధులు అందేలా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు, ఉపాధి కల్పనలో వ్యవస్థీకృత అడ్డంకుల తగ్గింపునకు కృషి... ఈ దిశలో కార్మిక సంస్కరణలు వంటి చర్యలు అవసరమని తెలిపింది. -
‘భవిత గోల్డ్’ కుచ్చుటోపీ
భీమవరం అర్బన్ : అధిక వడ్డీలు ఇస్తామని ప్రకటనలు గుప్పించి డిపాజిట్ల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసిన భవిత గోల్డ్ ఫార్మ్స్, ఎస్టేట్స్ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఖాతాదారులు, ఏజెంట్లు శనివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంకు చెందిన గోలి శ్రీనివాస్ ఈ సంస్థ పేరిట ఖాతాదారుల నుంచి రూ.80 లక్షలు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టినట్టు బాధితులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గోలి శ్రీనివాస్ స్థానిక రెస్ట్‌హౌస్ రోడ్డులోని ఐఎన్జీ వైశ్యాబ్యాంక్ ఎదుట 2012 మే నెలలో భవిత గోల్డ్ ఫార్మ్స్, ఎస్టేట్స్ లిమిటెడ్ పేరిట కార్యాలయూన్ని ఏర్పాటు చేశారు. విజయవాడలో ప్రధాన కార్యాలయం ఉందని, ఏలూరు, రాజమండ్రి, మలికిపురంలలో బ్రాంచిలు ఏర్పాటు చేసినట్టు ప్రకటనలు ఇచ్చారు. తమ సంస్థలో డిపాజిట్లు చేయిస్తే ఎక్కువ కమీషన్ ఇస్తామని భీమవరంలో సుమారు 80 మందిని ఏజెంట్లుగా నియమించారు. ఏడాదిలోనే ఇక్కడ రూ.80 లక్షలను డిపాజిట్లుగా సేకరించారని బాధితులు చెబుతున్నారు. విజయవాడలో కార్పొరేట్ హం గులతో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఆ సంస్థ వలలో చిక్కుకున్నామని ఏజెంట్లు చెప్పారు. విజయవాడ, భీమవరంతోపాటు ఏలూరు, రాజమండ్రి, మల్కిపురంలలో సుమారు రూ.2 కోట్ల వరకూ డిపాజిట్లు సేకరించారని తెలిపారు. డిపాజిట్ల మెచ్యూరిటీ గడువు పూర్తికావడంతో ఆ మొత్తాలను తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగామని, సంస్థ సిబ్బంది సొమ్ము ఇవ్వకుండా వాయిదాలు వేయడంతో ఇటీవల సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగామని పలువురు ఖాతాదారులు చెప్పారు. సంస్థ యజమాని గోలి శ్రీనివాసరావు వచ్చి త్వరలోనే సొమ్ము ఇస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించామన్నారు. ఆ తరువాత పంగిడిగూడెంలో ఉంటున్న అతని వద్దకు వెళ్లగా ఏలూరులోని కార్యాలయూనికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పారన్నారు. అక్కడకు వెళ్లగా మీరెవరో నాకు తెలియదని, ఏంచేసుకుంటారో చేసుకోండని చెప్పారని వాపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించామని వివరిం చారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, డిపాజిట్ సొమ్ములు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరారు. నమ్మించి నట్టేట ముంచారు అధిక వడ్డీ ఇస్తామని మమ్మల్ని నట్టేట ముంచారు. ఏడాదిలో రూ.18 వేలు కడితే వడ్డీతో కలిపి రూ.19,500 ఇస్తానని చెప్పారు. ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రి ఖర్చులకైనా డబ్బు ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదు. పోలీసులే మాకు న్యాయం జరిగేలా చూడాలి. - తోట శ్రీను, డిపాజిట్‌దారుడు ఖాతాదారులకు ఏం చెప్పాలి సరైన ఉద్యోగం లేక ఆ సంస్థలో ఏజెంట్‌గా చేరాను. వందకు పైగా ఖాతాదారులతో డిపాజిట్లు కట్టించాను. ఇప్పుడు సంస్థను మూసివేశారు. ఇప్పటివరకు నేను చేర్పించిన ఖాతాదారులకు సంస్థ రూ.15 లక్షలు ఇవ్వాలి. వాళ్లంతా నా ఇంటికి వచ్చి అడుగుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. - ఎంకే పాషా, ఏజెంట్