అధిక వడ్డీ పేరుతో పెట్టుబడుల సేకరణ
120 మంది నుంచి రూ.24 కోట్లు వసూలు
నలుగుర్ని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
ప్రీలాంచ్, సాఫ్ట్ లాంచ్ పేర్లతో స్థిరాస్తి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను మోసం చేస్తున్న రియల్టీ సంస్థలు..తాజాగా బై బ్యాక్ స్కీమ్‌కు తెరలేపాయి. ముందస్తుగా కొంత మేర కంపెనీలో డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా అధికంగా వడ్డీ చెల్లించడంతో పాటు కొంత స్థలం లీజు డీడ్ చేసిస్తామని మోసం చేయడం ఈ స్కీమ్ స్కామ్. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 120 మంది బాధితుల నుంచి రూ.24 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేశారు. స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్‌ఫ్రా, యాడ్ అవెన్యూస్ కంపెనీలకు చెందిన నలుగురు ప్రతినిధులను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. డీసీపీ కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన బైర చంద్రశేఖర్, విజయవాడకు చెందిన వేములపల్లి జాన్వీ, రెడ్డిపల్లి కృష్ణ చైతన్య, ఎన్‌టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన గరిమెల్ల వెంకట అఖిల్ నలుగురు కలిసి డైరెక్టర్లుగా పేర్కొంటూ కూకట్‌పల్లిలోని మంజీరా ట్రినిటీ మాల్‌లో స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్‌ఫ్రా, యాడ్ అవెన్యూస్ పేర్లతో రెండు స్థిరాస్తి సంస్థలను ఏర్పాటు చేశారు. నెలకు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ కస్టమర్లకు, పెట్టుబడిదారులకు ఆశ పెట్టారు. రూ.17 లక్షలు డిపాజిట్ చేస్తే వంద నెలల పాటు ప్రతీ నెలా రూ.20 వేల వడ్డీ చెల్లిస్తామని, అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని తిరుమలగిరిలో 267 గజాల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ భూమిలో శాండల్‌వుడ్ చెట్లను పెంచుతామని, 13–15 ఏళ్ల తర్వాత ఈ చెట్లను విక్రయించగా వచ్చిన సొమ్ములో 50 శాతం లాభాలను కూడా అందిస్తామని ఆశ పెట్టారు.
బాధితులను నమ్మించేందుకు లీజు డీడ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ), చెక్‌లను అందించారు. కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత చెల్లించడం మానేశారు. వడ్డీలు చెల్లించకపోవడంతో కస్టమర్లు ఆఫీసుకు రావడం మొదలుపెట్టారు. దీంతో నిందితులు కూకట్‌పల్లి నుంచి జూబ్లీహిల్స్‌కు కార్యాలయాన్ని మార్చి, తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు కార్యాలయ జాడను బాధితులు పట్టేయడం, చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేయడంతో నిందితులు రాత్రికి రాత్రే ఆఫీసుకు తాళం వేసి పరారయ్యారు. దీంతో కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన అల్లం నాగరాజు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–1999 కింద కేసులు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’
కష్టపడి పొదుపు చేయాలకున్న సొమ్మును ఇలా ఎలాంటి నియంత్రణ ఆధ్వర్యంలోలేని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మోసపోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే ఈక్విటీ మార్కెట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఈటీఎఫ్..వంటివి ఎంచుకోవాలని చెబుతున్నారు. ప్రధానంగా ఎలాంటి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని లేని కంపెనీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment