అధిక వడ్డీరేట్లు వ్యాపారాలకు విఘాతం
వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: అధిక వడ్డీరేట్లనేవి పరిశ్రమలు, చిన్న వ్యాపారాల వృద్ధికి ప్రతికూలంగా మారుతున్నాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయా సంస్థలపై అధిక రుణ సమీకరణ భారం పడుతోందన్నారు. దీన్ని తాను ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇప్పటికే పార్టీలో మరో సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి ఆర్‌బీఐ గవర్నర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండడం, సెప్టెంబర్ 4తో రాజన్ పదవీకాలం ముగుస్తుండడం, మరో విడతకు ఆయన సిద్ధమవటం వంటి పరిణామాల నేపథ్యంలో నిర్మల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇన్‌స్పెక్టర్ రాజ్ వ్యవస్థ ఇంకా భారత్‌లో కొనసాగుతోందన్న రాజన్ వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. అయితే వ్యాపార వాతావరణం మెరుగుపడటానికి తగిన చర్యల్ని కేంద్రం తీసుకుంటుందన్నారు. సెప్టెంబర్ 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు.