సాక్షి, జగిత్యాల: పంట రుణాల రెన్యూవల్ కోసం బ్యాంకులకు వెళ్తున్న రైతులు వడ్డీ చెల్లించాలనే బ్యాంకర్ల మాటలతో లబోదిబోమంటున్నారు.గతేడాది వరకు సహకార సంఘాల ద్వారా పొందిన రుణాలకు వడ్డీ వసూలు చేయలేదు. ప్రస్తుతం సహకార సంఘాలు, బ్యాంకులు అనే తేడా లేకుండా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. రైతులు తీసుకుంటున్న రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇందులో కేంద్రం వాటా 3 శాతం మాఫీ చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 4 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇలా జగిత్యాల జిల్లాలోని రైతుల నుంచి దాదాపుగా రూ.40కోట్లు వసూలు చేశాయి.
రుణంపై ఏడు శాతం వడ్డీ
రైతులు సహకార సంఘాల ద్వారా తీసుకుంటున్న రుణాలకు బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఏటా క్రమం తప్పకుండా పంట రుణాలు చెల్లించే రైతులకు ప్రభుత్వాలు బాసటగా నిలిచేందుకు వడ్డీ చెల్లించేందుకు గతంలో ముందుకొచ్చాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించాయి. ప్రస్తుతం పంటల ప్రారంభ సీజన్ కావడంతో కొందరు రైతులు కొత్తగా రుణాల కోసం, మరికొందరు రెన్యూవల్ కోసం బ్యాంకులు వెళ్తున్నారు. అయితే కేంద్రం చెల్లించే 3 శాతం మాఫీ పోనూ.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 4 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. వడ్డీ చెల్లించకుంటే రుణం రెన్యూవల్‌కు ససేమిరా అంటున్నాయి.
ప్రభుత్వం చెల్లించకనే తిప్పలు
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 4 శాతం వడ్డీని సకాలంలో చెల్లించకనే బ్యాంకులు రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. రెండు, మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వడ్డీ బకాయిలు రావడం లేదని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్క ఏడాదికే దాదాపుగా రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉందని చెబుతున్నారు. ఈక్రమంలో ఉన్నతాధికారుల నుంచి వడ్డీ వసూలు చేయాలనే ఆదేశాలు వస్తున్నట్లు మేనేజర్‌లు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఏటా రూ.43 కోట్లు వడ్డీ చెల్లిస్తున్న రైతులు
జిల్లాలో గతేడాది 1,91,795 మంది రైతులకు 1,35,514 మంది పంట రుణం తీసుకున్నారు. జిల్లాలోని 19 బ్యాంకులు రూ.1,055 కోట్ల పంట రుణం ఇచ్చాయి. జిల్లా రైతులే దాదాపు రూ.40–43 కోట్ల వడ్డీని గతేడాది బ్యాంకులకు చెల్లించారు. రెండు, మూడేళ్లుగా రైతులు చెల్లిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ వడ్డీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమకాలేదు. మళ్లీ ఈ ఏడాది కూడా రుణం చెల్లిస్తామని బ్యాంకుకు వెళ్తే వడ్డీని వసూలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా సహకార సంఘాలు, లీడ్‌బ్యాంక్ ఆంధ్రాబ్యాంకు రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4 శాతం వడ్డీని వసూలు చేయలేదు. కానీ ప్రస్తుతం ఆ బ్యాంకులు సైతం ఇతర బ్యాంకుల మాదిరిగానే నాలుగు శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment