సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒకేరీతిన నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకుల్లో వ్యవసాయానికి పంట రుణాలు తీసుకున్న సంఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఇటు పోలీసులు.. అటు బ్యాంకు అధికారులు అప్రమత్తమై విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులు విచారించేందుకు ఆయా జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి, నిందితులపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో కొందరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. కీలకమైన వ్యక్తులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ప్రాంతాల్లో కొందరు ముఠాలుగా ఏర్పడి.. పలువురిని మభ్యపెట్టి రుణం ఇప్పిస్తామని చెప్పి.. నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి వాటిని బ్యాంకులో సమర్పించి పంట రుణాలు పొందారు. ఈ ఏడాది జూలై 27న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలకు చెందిన నకిలీ పాస్ పుస్తకాలతో కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
రెవెన్యూ, పోలీసుశాఖల టాస్క్‌ఫోర్స్
దీనిపై నిగ్గుతేల్చేందుకు పోలీస్, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 873 అకౌంట్లకు.. 731 మంది అక్రమ రుణాలు పొందినట్టు విచారణలో తేలింది. 142 మంది రెండు, మూడు బ్యాంకుల్లో అక్రమ రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. రూ.8.90 కోట్ల కుంభకోణం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేల్చారు.
మహబూబ్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో గతేడాది మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 69 మంది రైతులకు మునిమోక్షం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే ఏజెంట్ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి.. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.63.79 లక్షల రుణాలు ఇప్పించారు. ఇక సిద్దిపేట జిల్లాలో నాలుగేళ్ల క్రితం నకిలీ పాస్‌పుస్తకాలతో చిన్నకోడూరు మండలం చెందలాపూర్, చెల్కలపల్లిలో నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకున్నారు.
రెవెన్యూ అధికారులు నకిలీ పాస్‌పుస్తకాలు తయారీదారులపై, వాటిమీద రుణాలు తీసుకున్న వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. రుణాలను రికవరీ కూడా చేయించారు. అలాగే, వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో నకిలీ పాస్ పుస్తకాలతో కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు తీసుకున్నట్లు తేలింది. 240 పాస్ పుస్తకాలు తయారు చేసి బ్యాంకుల్లో రూ.కోటికి పైగా పంటరుణాలు తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 7 వేల నకిలీ పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పాస్ పుస్తకాలతో జోగులాంబ గద్వాల జిల్లాతోపాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కొనసాగుతున్న అరెస్ట్‌లు
ఈ నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్, పోలీస్‌లు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నకిలీ పాస్‌పుస్తకాల అంశంలో కీలక సూత్రధారులు పట్టుపడాల్సి ఉంది. ఖమ్మంలో నకిలీ పాస్‌పుస్తకాల వ్యవహారంలో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు అటెండర్, ఇద్దరు వీఆర్వోలు, ఓ వీఆర్‌ఏతోసహా 34 మందిని అరెస్ట్ చేశారు. 11 మందిని రెండు దఫాలుగా కోర్టు అనుమతితో మళ్లీ విచారణ చేశారు.
60 రోజుల నుంచి నిందితులు జైలు జీవితం గడుపుతున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వ్యవహారంలో బ్యాంకు మేనేజర్ మధుసూదన్ పాత్ర ఉన్నట్లు విచారణలో బయటపడింది. దీనిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే 71 మందిని నిందితులుగా గుర్తించారు. అసలు సూత్రధారి అయిన శ్రీనివాస్ పట్టుబడితే దోషుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. గద్వాల జిల్లాలో 17 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిశీలిస్తే.. ఏ జిల్లాకు ఆ జిల్లాలో జరిగిందా.. లేకపోతే అన్ని జిల్లాల్లో జరిగిన వ్యవహారాల్లో ఎవరైనా కీలకమైన వ్యక్తులు వెనుకుండి నడిపించారా? అనే కోణంలో విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment