duplicate pass books
-
ఓట్ల కోసం బోగస్ పట్టాలు
జయపురం : జయపురంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోంది. ఎన్నికలలో నెగ్గేందుకు అధికార పార్టీ రాజకీయ నేతలు ఎటువంటి నేరాలకైనా వెనుకాడడంలేదని జయపురం ఎంఎల్ ఏ, విధానసభలో కాంగ్రెస్ చీఫ్‌విప్ తారాప్రసాద్ బాహిణీపతి ధ్వజమెత్తారు. జయపురంలోని నివాస గృహంలో గల పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాలను ప్రజలకు అందజేసి మోసగించారని ఆరోపించారు. కేవలం జయపురం సమితిలో 10 వేల మందికి బోగస్ భూమి పట్టాలను అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి అందజేశారని, పట్టాలు పొందిన లబ్ధిదారులు జయపురం తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఇచ్చిన పట్టాల భూములు అందజేయాలని అడుగగా అసలు ఆ పట్టాలు తాము ఎవరకీ ఇవ్వలేదని, ఆ పట్టాల వివరాలు తమ కార్యాలయం రికార్డులలో లేవని స్పస్టం చేయడంతో లబ్ధిదారులు కంగుతిన్నారని ఆయన వెల్లడించారు. 2011 పంచాయతీ ఎన్నికల సమయంలోను, 2014 విధానసభ ఎన్నికల సమయంలోను బోగస్ పట్టాలను ఆనాటి మాజీమంత్రి ప్రజలకు పంచారని ఆరోపించారు. బయటపడిన 10 వేల పట్టాలు ఇంతవరకు 10 వేల బోగస్ పట్టాలు బయటపడ్డాయని ఇంకా అనేకం బయటపడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలలో లబ్ధిపొందేందుకు బోగస్ భూమి పట్టాలతో ప్రజలను ప్రలోభపరిచారని ఎద్దేవా చేశారు. కేవలం జయపురం సమితిలోనే కాదని జయపురం నియోజకవర్గంలో అంతర్భాగమైన బొరిగుమ్మ సమితిలో కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు బోగస్ భూమి పట్టాలు పంచి ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. జయపురం విధానసభ నియోజకవర్గంలో దాదాపు 25 వేల మందికి బోగస్ భూమిపట్టాలు పంచారని ధ్వజమెత్తారు. అనేక పట్టాలపై తహసీల్దార్ సంతకాలు లేవని, అలాగే పట్టాలపై తేదీలు కూడా లేవంటూ కొన్ని పట్టాలను విలేకరులకు చూపించారు. బాధితులకు పట్టాలు అందజేయాలి ఈ వ్యవహారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి తెలిసే జరిగిందా? లేదా పట్టాలు పంచిన వారు బోగస్ పట్టాలు ముద్రించి ప్రజలను మోసగించారా? అన్నది తేలాలని అందుచేత ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి బోగస్ పట్టాలు పంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపోయిన లబ్ధిదారులకు వెంటనే భూములు, స్థలాలు సమకూర్చి అసలైన పట్టాలు అందజేయాలని కోరారు. జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాల సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత నిందితులను అరెస్టు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాందోళన చేపట్టి జయపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. దర్యాప్తు జరిపి నిందితలను అరెస్టు చేయకపోతే బోగస్ పట్టాలు ప్రజలకు పంచి మోసగించిన వారిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెడతామని, అలాగే రాజధానిలో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎంఎల్ఏ తారాప్రసాద్ విలేకరుల సమావేశం పూర్తిచేసిన తరువాత పలువురు గ్రామీణ ప్రజలు బోగస్ భూమి పట్టాలతో వచ్చి తాము మోసపోయినట్లు వాపోయారు. బోగస్ పట్టాలు ప్రజలు పంచిన నేత మాజీ మంత్రి రవినారాయణ నందో అని ఆయన పరోక్షంగా తారాప్రసాద్ బాహిణీపతి ఆరోపించారు. పట్టాలు పంచిన సమయంలో ఉన్న తహసీల్దార్ సిబ్బంది ఇతర నేతలు కూడా నిందితులేనని స్పష్టం చేశారు. సమావేశంలో జయపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ మíహంతి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి నిహార్ బిశాయి పాల్గొన్నారు. -
నకి‘లీలలు’..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒకేరీతిన నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకుల్లో వ్యవసాయానికి పంట రుణాలు తీసుకున్న సంఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఇటు పోలీసులు.. అటు బ్యాంకు అధికారులు అప్రమత్తమై విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులు విచారించేందుకు ఆయా జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి, నిందితులపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో కొందరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. కీలకమైన వ్యక్తులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ప్రాంతాల్లో కొందరు ముఠాలుగా ఏర్పడి.. పలువురిని మభ్యపెట్టి రుణం ఇప్పిస్తామని చెప్పి.. నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి వాటిని బ్యాంకులో సమర్పించి పంట రుణాలు పొందారు. ఈ ఏడాది జూలై 27న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలకు చెందిన నకిలీ పాస్ పుస్తకాలతో కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రెవెన్యూ, పోలీసుశాఖల టాస్క్‌ఫోర్స్ దీనిపై నిగ్గుతేల్చేందుకు పోలీస్, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 873 అకౌంట్లకు.. 731 మంది అక్రమ రుణాలు పొందినట్టు విచారణలో తేలింది. 142 మంది రెండు, మూడు బ్యాంకుల్లో అక్రమ రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. రూ.8.90 కోట్ల కుంభకోణం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేల్చారు. మహబూబ్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో గతేడాది మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 69 మంది రైతులకు మునిమోక్షం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే ఏజెంట్ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి.. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.63.79 లక్షల రుణాలు ఇప్పించారు. ఇక సిద్దిపేట జిల్లాలో నాలుగేళ్ల క్రితం నకిలీ పాస్‌పుస్తకాలతో చిన్నకోడూరు మండలం చెందలాపూర్, చెల్కలపల్లిలో నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు నకిలీ పాస్‌పుస్తకాలు తయారీదారులపై, వాటిమీద రుణాలు తీసుకున్న వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. రుణాలను రికవరీ కూడా చేయించారు. అలాగే, వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో నకిలీ పాస్ పుస్తకాలతో కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు తీసుకున్నట్లు తేలింది. 240 పాస్ పుస్తకాలు తయారు చేసి బ్యాంకుల్లో రూ.కోటికి పైగా పంటరుణాలు తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 7 వేల నకిలీ పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పాస్ పుస్తకాలతో జోగులాంబ గద్వాల జిల్లాతోపాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొనసాగుతున్న అరెస్ట్‌లు ఈ నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్, పోలీస్‌లు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నకిలీ పాస్‌పుస్తకాల అంశంలో కీలక సూత్రధారులు పట్టుపడాల్సి ఉంది. ఖమ్మంలో నకిలీ పాస్‌పుస్తకాల వ్యవహారంలో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు అటెండర్, ఇద్దరు వీఆర్వోలు, ఓ వీఆర్ఏతోసహా 34 మందిని అరెస్ట్ చేశారు. 11 మందిని రెండు దఫాలుగా కోర్టు అనుమతితో మళ్లీ విచారణ చేశారు. 60 రోజుల నుంచి నిందితులు జైలు జీవితం గడుపుతున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వ్యవహారంలో బ్యాంకు మేనేజర్ మధుసూదన్ పాత్ర ఉన్నట్లు విచారణలో బయటపడింది. దీనిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే 71 మందిని నిందితులుగా గుర్తించారు. అసలు సూత్రధారి అయిన శ్రీనివాస్ పట్టుబడితే దోషుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. గద్వాల జిల్లాలో 17 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిశీలిస్తే.. ఏ జిల్లాకు ఆ జిల్లాలో జరిగిందా.. లేకపోతే అన్ని జిల్లాల్లో జరిగిన వ్యవహారాల్లో ఎవరైనా కీలకమైన వ్యక్తులు వెనుకుండి నడిపించారా? అనే కోణంలో విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చే వీలుంది. -
ఫోర్జరీలతో టోకరా
దొరవారిసత్రం : నకిలీ పాసుపుస్తకాలతో లక్షల రుణాలు స్వాహా చేసిన ఫోర్జరీ రాయుళ్ల బాగోతమిది. వీఆర్వో నుంచి తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ చివరకు ఆర్డీఓ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి దొంగ పాస్‌పుస్తకాలు సృష్టించారు. దాంతో పాటు బ్యాంకక్కు అవసరమైన నోడ్యూస్ సర్టిఫికెట్ కూడా ఫోర్జరీ చేసి లక్ష, రెండు లక్షలు కాదు ఏకంగా రూ.2 కోట్ల పంట రుణాలు స్వాహా చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్‌పుస్తకాలపై రుణం తీసుకున్న వందలమంది దొంగ రైతులు అందరూ దొరవారిసత్రం మండలం తనియాలి రెవెన్యూ గ్రూపు పరిధిలోని కమ్మకండ్రిగ, కొత్తకండ్రిగ, వేటగిరిపాలెం, తనియాలి గ్రామాలకు చెందినవారే కావడం గమనార్హం. దొంగ పాస్‌పుస్తకాలను సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణ ప్రాంతంలోని కార్పొరేషన్, యూనియన్, ఐఓబీ, సిండికేట్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో దొంగ డాక్యుమెంట్లు పెట్టి రుణాలు పొందారు. ఈతంతు సుమారు ఏడాది నుంచి జరుగుతూనే ఉంది. కొన్ని బ్యాంకుల్లో అయితే రుణాలను రీషెడ్యూల్ కూడా చేసి మళ్లీ పంట రుణాలను అక్రమార్కులు దర్జాగా పొంది ఉన్నారు. తనియాలి రెవెన్యూ పరిధిలో లేని సర్వే నంబర్లను కూడా ఫోర్జరీదారులు సృష్టించారు. సెంటు భూమి లేనివారిపై కూడా నకిలీ పాస్‌పుస్తకాలు చేసి అక్రమార్కులు (ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేలు) లక్షలు స్వాహా చేశారు. తనియాలి రెవెన్యూ పరిధిలో సుమారు 700 ఎకరాల పట్టా భూమి ఉండగా, ఫోర్జరీదారులు ఒకరి భూమిని మరో పేరుతో కూడా దొంగ పాస్‌పుస్తకాలు చేయించి రుణాలు పొందారు. ఈ విషయం అసలు పట్టాదారులకు తెలిసి వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చివరికి కాలువ పొరంబోకు భూములు సర్వే నంబర్లు 180,181 కూడా పాస్ పుస్తకాలు చేసి రుణాలు తీసుకున్నారు. బీడీ జయకుమార్ సంతకంతో.. వెలుగులోకి వచ్చిన నకిలీ పాస్‌పుస్తకాలు అన్నీ అప్పట్లో స్థానిక ఎమ్మార్వోగా పనిచేసి పదవీ విరమణ చేసిన బీడీ జయకువ ూర్, మృతిచెందిన వీఏఓ సుందరరామిరెడ్డి పేరుతో బయటపడ్డాయి. ఎలాంటి అనుమానం లేకుండా నకిలీ పాస్‌పుస్తకాలపై యూనిక్ నంబర్లు కూడా వేశారు. 2004, 2006ల్లో పాస్‌పుస్తకాలు పొందినట్లు పక్కగా ప్లాన్ చేసి వివిధ బ్యాంకుల్లో రూ.లక్షల పంట రుణాలను కొల్లగొట్టారు. తనియాలి ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ విషయం కీలపాత్ర పోషిస్తునట్లు తెలుస్తుంది. భూములు లేనివారిపై దొంగ పాస్‌పుస్తకాలు చేయడం, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, కొంత నకిలీ రైతులకు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. * కానీ వాస్తవంగా అయితే 2001 డిసెంబర్ 30కి వీఏఓల పాలన రద్దు చేసి 2002 నుంచి 2007 వరకు గ్రామ పంచాయతీ సచివాలయ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఈపాస్పుస్తకాలన్నీ ఫోర్జరీ అని తేలిపోతుంది. రెవెన్యూ వారి సహకారంతోనే ‘1-బీ’ మార్పు నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసిన్పటికి 1-బీలో మాత్రం భూమి చెందిన వారి పేరుతో ఉంటుంది. కానీ స్థానికంగా రెవెన్యూ వారి సహకారంతోనే ఏకంగా 1-బీలో పేరును కూడా మార్పు చేసి అక్రమార్కులకు సహకరించినట్లు విశ్వనీయంగా తెలుస్తుంది. ఇప్పటికైన జిల్లా ఉన్నతస్థాయి అధికారులు స్పందించందే దొంగ పాస్పుస్తకాలుపై చర్యలు తీసుకోందే అసలు అక్రమదారులు బయటపడరు. మాదృష్టికి రాలేదు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న విషయం మా దృష్టికి రాలేదు. భూమిపై హక్కు ఉన్నవారికి 1-బీ ఇస్తాం. దాన్ని మార్చలేము. అయినా దీనిపై కూడా విచారిస్తాం. నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకున్న వారిపై ఇందుకు సాయపడ్డ వారిపై కూడా చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. -తహశీల్దార్ శ్రీనివాసులు -
డూప్లికేటుగాళ్లు
సాక్షి, ఖమ్మం: అటవీ భూముల్లో పోడు నరికి వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రభుత్వం హక్కులు కల్పించింది. 2006 డిసెంబర్ నాటికి గిరిజనుల ఆధీనంలో ఉన్న అటవీ భూములకు సంబంధించిన అర్హులను గుర్తించారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకునే సుమారు 30 వేల మంది గిరిజన రైతులకు దాదాపు 2.10 లక్షల ఎకరాల అటవీ భూములపై శాశ్వత హక్కులు కల్పించారు. ఇంకా వేలాది మంది తమకు హక్కు కల్పించాలంటూ ఆయా మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు 2010 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆసరాగా చేసుకున్న ఓ ముఠా అక్రమ సంపాదనే ధ్యేయంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామంటూ గిరిజనులను నమ్మించింది. ఏజెన్సీ మండలాల్లో ఒక్కో రైతు నుంచి ఎకరానికి రూ.10 వేలు వసూలు చేసింది. ‘ఈ పాస్ పుస్తకాలుంటే బ్యాంకుల్లో రుణాలు వస్తాయి.. ప్రభుత్వం విద్యుత్, బోర్లకు రుణాలిస్తుంది..’ అని మాయమాటలు చెప్పింది. పట్టాలు వస్తాయని గిరిజన గూడేల్లో ఒకరిని చూసి మరొకరు ఇలా వందలాది మంది గిరిజన రైతులు ఈ ముఠాకు డబ్బులు ముట్ట జెప్పారు. చాలా మంది రైతులు రూ.2, నుంచి రూ.5కు వడ్డీకి తెచ్చి మరీ ఇచ్చారు. ఇదే అదనుగా భావించిన ముఠా రైతుల నుంచి అందినకాడికి దండుకుంది. రూ.లక్షల్లో కూడబెట్టుకుంది. జూలూరుపాడు, ఏన్కూరు, ఇల్లెందు, టేకులపల్లి, మండలాల్లో ఈ ముఠా సభ్యులు చాలా మంది రైతులను మోసం చేశారు. బయట పడిందిలా.. గత ఏడాది ఏన్కూరు మండలంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకం బయట పడింది. అయితే అక్కడ ఉన్న అధికారులు.. ఆ ముఠా సభ్యులు కుమ్మక్కై ఈ వ్యవహారం బయటపడకుండా సదరు రైతుకు డబ్బులు ఇప్పించినట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని ముఠా మరోసారి జూలువిదిల్చింది. జూలూరుపాడు మండలం వినోభానగర్, ఏన్కూరు మండలం అక్కినాపురంతండా, నాచారం, కేశుపల్లి, ఇమామ్‌నగర్ గ్రామాల్లోని గిరిజన రైతులకు నకిలీ పాస్ పుస్తకాలు అంటగట్టింది. వినోభానగర్‌కు చెందిన భూక్యా ఉమ పంట రుణం కోసం బ్యాంకుకు వెళ్లడంతో అసలు విషయం బయట పడింది. ‘ఇది నకిలీపాస్ పుస్తకం.. రుణం ఇవ్వటం కుదరదు’ అని బ్యాంకు అధికారులు చెప్పడంతో మోసపోయినట్లు వారు గ్రహించారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లినా అక్కడ కూడా తాము ఈ పట్టాదారు పుస్తకాలు ఇవ్వలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె ఆశలు అడియాశలయ్యాయి. గిరిజనులకు సదరు ముఠా సభ్యులు ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు ఒరిజనల్ వాటిని పోలి ఉండటం గమనార్హం. తహశీల్దార కార్యాలయాల్లోని ఉద్యోగుల సహకారం లేనిదే ఇంత పకడ్బందీగా పుస్తకాలు తయారు చేయటం కుదరదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ముఠా సభ్యులు వారు వసూలు చేసిన డబ్బులో కొంత తహశీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందికి అప్పజెప్పి ఖాళీ పాసు పుస్తకాలను తీసుకుంటున్నట్లు సమాచారం. వీటిపై తహశీల్దార్, ఐటీడీఏ అధికారుల పోర్జరీ సంతకాలు చేసి యథేచ్ఛగా గిరిజనులకు అసలువే అంటూ ఇస్తున్నారు. ఉమకు 2013లో జారీ అయినట్లుగా ఉన్న నకిలీ పట్టాదారు పాసు పుస్తకంలోనూ తహశీల్దార్, ఐటీడీఏ ఫారెస్టు అధికారుల నకిలీ సంతకాలు, ముద్రలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈ ముఠాకు తహశీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందే సహకరిస్తున్నారని తెలుస్తోంది. -
నకిలీ పాస్‌పుస్తకాలు సూత్రధారుల అరెస్టు
=పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు =ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం =నకిలీ రైతులు, మీసేవా నిర్వాహకులపై కేసులు కోడూరు, న్యూస్‌లైన్ : నకిలీ పాస్‌పుస్తకాలు, మీసేవ పత్రాల తయారీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అవనిగడ్డ సీఐ జీవీ రమణమూర్తి బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. కోడూరులోని అలంకార్ స్టూడియో యజమాని కాలిశెట్టి శ్రీనివాసరావు, మందపాకలకు చెందిన గరికిపాటి కన్నారావు, కోడూరుకు చెందిన సాయికృష్ణ స్టూడియో యజమాని అద్దంకి కృష్ణ నకిలీ పాస్‌పుస్తకాలు, అడంగల్ కాపీలు తయారుచేస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. శ్రీనివాసరావు తన స్టూడియోలోని ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా పలు భూముల పట్టాదార్ పాస్‌పుస్తకాలు, మీసేవలో లభించే అడంగల్ కాపీలు, ఆర్వోఆర్లు, ఈసీలు నకిలీవి సృష్టించి కన్నారావు ద్వారా పలువురు రైతులకు పంట రుణపత్రాలు అందించారని చెప్పారు. అద్దంకి కృష్ణ విజయవాడ వెళ్లి పాస్‌పుస్తకాలు ముద్రించి తీసుకొచ్చేవాడని వివరించారు. నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం... కోడూరులోని ఆంధ్రాబ్యాంకులో ఇటీవల వచ్చిన మేనేజర్ కొత్త కావడంతో, బ్యాంకులో ఫీల్డు ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటం, ఆ సమయంలోనే సమైక్యాంధ్ర ఉద్యమంలో రెవెన్యూ అధికారులు సమ్మెలో ఉండటంతో నకిలీ పత్రాలతో 40 మంది రైతులు బ్యాంకు నుంచి సులువుగా రూ.33 లక్షల 76 వేలు రుణం పొందినట్లు సీఐ వివరించారు. పత్రాలు అనుమానాస్పదంగా ఉండటంతో బ్యాంకు మేనేజర్ స్థానిక తహశీల్దార్ డీవీఎస్ యల్లారావుతో తనిఖీ చేయించగా అవి నకిలీవని బయటపడిందని తెలిపారు. దీంతో గత నెల 31న 40 మంది రైతులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఇటీవల నలుగురు రైతులను అరెస్టు చేసి, వారినుంచి సేకరించిన సమాచారం ప్రకారం నకిలీ పత్రాల తయారీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన జిరాక్స్ మిషన్, స్కానర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్లను అలంకార్ స్టూడియోలో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో 36 మంది రైతులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. మొవ్వ, అవనిగడ్డ నుంచి పత్రాలు.. నిందితులు అవనిగడ్డ, మొవ్వ తదితర మీసేవా కేంద్రాల నుంచి 13 ఒరిజనల్ ఖాళీ పత్రాలు సంపాదించి వాటిని జిరాక్స్ తీసి నకిలీకి పాల్పడ్డారని సీఐ తెలిపారు. వీటిని ఉపయోగించుకొని రైతులు ఒక్కొక్కరు రూ.12 వేల నుంచి 90 వేల వరకు రుణాలు పొందినట్లు చెప్పారు. వారి నుంచి నిందితులు రూ.2 వేల నుంచి 10 వేల చొప్పున కమీషన్ రూపంలో పొందారని తెలిపారు. ఒరిజినల్ పత్రాలు అందించిన మీ సేవా కేంద్ర నిర్వాహకులు, అక్రమంగా రుణాలు పొందిన రైతులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎస్సై బి.శ్రీనివాసరావు, ఏఎస్సైలు బి.సంతోషరావు, నాగేంద్రుడు సమావేశంలో పాల్గొన్నారు. -
కేరాఫ్ కోడూరు!
చల్లపల్లి, న్యూస్‌లైన్ : పొలం ఉండీ పాస్ పుస్తకం కావాలంటే ఎంత లేదన్నా రెండు నెలల సమయం కావాలి.. అలాంటిది సెంటు భూమి లేకపోయినా ఫర్వాలేదు పైసలిస్తేచాలు రెండు రోజుల్లో పాస్‌పుస్తకాలు మీ చేతిలో ఉండాలంటే కోడూరు వెళ్లండి.. నకిలీ పాస్‌పుస్తకాలు పుట్టించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాకు కోడూరు కేంద్రంగా పనిచేస్తుండటమే దీనికి కారణం. రైతుల సర్వే నంబర్లు సేకరించి... కొంతమంది రైతుల సర్వే నంబర్లను సేకరించి వాటి ద్వారా కోరుకున్న ప్రాంతంలో ఎంత కావాలంటే అంత పొలానికి నకిలీ పాస్‌పుస్తకాలను ఇక్కడ విక్రయిస్తున్నట్టు సమాచారం. మీసేవా కేంద్రాలకు, తహశీల్దార్ కార్యాలయానికి సంబంధం లేకుండా ఈ ముఠా నకిలీ పుస్తకాలను రూపొందించి విక్రయిస్తున్నట్టు తెలిసింది. పంట పొలాలు లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందాలనుకునేవారి ఆశను ఈ ముఠా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. పాస్ పుస్తకం కావాలంటే గతంలో ఆ ప్రాంతంలో సేకరించిన సర్వే నంబర్లు కొన్నింటితో ఈ పుస్తకాలు తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కో పాస్ పుస్తకాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. వీటితో పాటు నకిలీ అడంగల్ కాపీలను ఈ ముఠా విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఒక్కో అడంగల్‌కు రూ.400 నుంచి రూ.500 తీసుకుంటున్నట్టు సమాచారం. వీటితో పలు బ్యాంకుల్లో అక్రమంగా రుణాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. రూ.30 లక్షల అక్రమ రుణాలు... కోడూరులోని ఓ బ్యాంకులో ఓ రైతు రుణం పొందేందుకు వెళ్లగా ఈ అక్రమ పాస్బుక్ల బాగోతం బయటపడినట్టు తెలిసింది. అప్పటికే ఆ సర్వే నంబర్‌తో మరొకరు నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు పొందారనే విషయం తెలియడంతో ఆ రైతు విస్తుపోయారు. ఈ విధంగా సదరు బ్యాంకు నుంచి రూ.30 లక్షల వరకు అక్రమంగా రుణాలు పొందినట్టు తెలిసింది. సిబ్బంది కూడా కమీషన్లకు కక్కుర్తిపడి వారికి సహకరిస్తున్నట్టు సమాచారం. విషయం వెలుగులోకి రావడంతో బ్యాంకు అధికారులు సోమవారం రెవెన్యూ అధికారులతో మాట్లాడి వివరాలు తీసుకున్నట్టు తెలిసింది. ఇతర ప్రాంతాల్లోనూ... కోడూరుతో పాటు మొవ్వ, పామర్రు మండలాల్లోని పలు బ్యాంకుల్లోనూ ఈ ప్రాంత వాసులు అక్రమ రుణాలు పొందినట్టు సమాచారం. గత ఏడాది ఇలా అక్రమ పాస్బుక్ల ద్వారా రుణాలు పొందిన విషయం బయటకు రాగా ఇప్పటి వరకు వారి నుంచి రుణాలు రికవరీ చేసిన దాఖలాలు లేవు. సామాన్య రైతులకు రుణాలు ఇవ్వాలంటే సవాలక్ష ప్రశ్నలు సంధించే బ్యాంకు అధికారులు నకిలీ పుస్తకాలకు ఎలా రుణాలిస్తున్నారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వారంటున్నారు.