బోగస్ పట్టాల బాధిత లబ్ధిదారులతో ఎంఎల్‌ఏ
జయపురం : జయపురంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోంది. ఎన్నికలలో నెగ్గేందుకు అధికార పార్టీ రాజకీయ నేతలు ఎటువంటి నేరాలకైనా వెనుకాడడంలేదని జయపురం ఎంఎల్ ఏ, విధానసభలో కాంగ్రెస్ చీఫ్‌విప్ తారాప్రసాద్ బాహిణీపతి ధ్వజమెత్తారు. జయపురంలోని నివాస గృహంలో గల పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాలను ప్రజలకు అందజేసి మోసగించారని ఆరోపించారు. కేవలం జయపురం సమితిలో 10 వేల మందికి బోగస్ భూమి పట్టాలను అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి అందజేశారని, పట్టాలు పొందిన లబ్ధిదారులు జయపురం తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఇచ్చిన పట్టాల భూములు అందజేయాలని అడుగగా అసలు ఆ పట్టాలు తాము ఎవరకీ ఇవ్వలేదని, ఆ పట్టాల వివరాలు తమ కార్యాలయం రికార్డులలో లేవని స్పస్టం చేయడంతో లబ్ధిదారులు కంగుతిన్నారని ఆయన వెల్లడించారు. 2011 పంచాయతీ ఎన్నికల సమయంలోను, 2014 విధానసభ ఎన్నికల సమయంలోను బోగస్ పట్టాలను ఆనాటి మాజీమంత్రి ప్రజలకు పంచారని ఆరోపించారు.
బయటపడిన 10 వేల పట్టాలు
ఇంతవరకు 10 వేల బోగస్ పట్టాలు బయటపడ్డాయని ఇంకా అనేకం బయటపడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలలో లబ్ధిపొందేందుకు బోగస్ భూమి పట్టాలతో ప్రజలను ప్రలోభపరిచారని ఎద్దేవా చేశారు. కేవలం జయపురం సమితిలోనే కాదని జయపురం నియోజకవర్గంలో అంతర్భాగమైన బొరిగుమ్మ సమితిలో కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు బోగస్ భూమి పట్టాలు పంచి ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. జయపురం విధానసభ నియోజకవర్గంలో దాదాపు 25 వేల మందికి బోగస్ భూమిపట్టాలు పంచారని ధ్వజమెత్తారు. అనేక పట్టాలపై తహసీల్దార్ సంతకాలు లేవని, అలాగే పట్టాలపై తేదీలు కూడా లేవంటూ కొన్ని పట్టాలను విలేకరులకు చూపించారు.
బాధితులకు పట్టాలు అందజేయాలి
ఈ వ్యవహారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి తెలిసే జరిగిందా? లేదా పట్టాలు పంచిన వారు బోగస్ పట్టాలు ముద్రించి ప్రజలను మోసగించారా? అన్నది తేలాలని అందుచేత ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి బోగస్ పట్టాలు పంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపోయిన లబ్ధిదారులకు వెంటనే భూములు, స్థలాలు సమకూర్చి అసలైన పట్టాలు అందజేయాలని కోరారు. జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాల సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత నిందితులను అరెస్టు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాందోళన చేపట్టి జయపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు.
దర్యాప్తు జరిపి నిందితలను అరెస్టు చేయకపోతే బోగస్ పట్టాలు ప్రజలకు పంచి మోసగించిన వారిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెడతామని, అలాగే రాజధానిలో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎంఎల్‌ఏ తారాప్రసాద్ విలేకరుల సమావేశం పూర్తిచేసిన తరువాత పలువురు గ్రామీణ ప్రజలు బోగస్ భూమి పట్టాలతో వచ్చి తాము మోసపోయినట్లు వాపోయారు. బోగస్ పట్టాలు ప్రజలు పంచిన నేత మాజీ మంత్రి రవినారాయణ నందో అని ఆయన పరోక్షంగా తారాప్రసాద్ బాహిణీపతి ఆరోపించారు. పట్టాలు పంచిన సమయంలో ఉన్న తహసీల్దార్ సిబ్బంది ఇతర నేతలు కూడా నిందితులేనని స్పష్టం చేశారు. సమావేశంలో జయపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ మíహంతి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి నిహార్ బిశాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment