=పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
=ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
=నకిలీ రైతులు, మీసేవా నిర్వాహకులపై కేసులు
కోడూరు, న్యూస్‌లైన్ : నకిలీ పాస్‌పుస్తకాలు, మీసేవ పత్రాల తయారీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అవనిగడ్డ సీఐ జీవీ రమణమూర్తి బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. కోడూరులోని అలంకార్ స్టూడియో యజమాని కాలిశెట్టి శ్రీనివాసరావు, మందపాకలకు చెందిన గరికిపాటి కన్నారావు, కోడూరుకు చెందిన సాయికృష్ణ స్టూడియో యజమాని అద్దంకి కృష్ణ నకిలీ పాస్‌పుస్తకాలు, అడంగల్ కాపీలు తయారుచేస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు.
శ్రీనివాసరావు తన స్టూడియోలోని ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా పలు భూముల పట్టాదార్ పాస్‌పుస్తకాలు, మీసేవలో లభించే అడంగల్ కాపీలు, ఆర్వోఆర్‌లు, ఈసీలు నకిలీవి సృష్టించి కన్నారావు ద్వారా పలువురు రైతులకు పంట రుణపత్రాలు అందించారని చెప్పారు. అద్దంకి కృష్ణ విజయవాడ వెళ్లి పాస్‌పుస్తకాలు ముద్రించి తీసుకొచ్చేవాడని వివరించారు.
నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం...
కోడూరులోని ఆంధ్రాబ్యాంకులో ఇటీవల వచ్చిన మేనేజర్ కొత్త కావడంతో, బ్యాంకులో ఫీల్డు ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటం, ఆ సమయంలోనే సమైక్యాంధ్ర ఉద్యమంలో రెవెన్యూ అధికారులు సమ్మెలో ఉండటంతో నకిలీ పత్రాలతో 40 మంది రైతులు బ్యాంకు నుంచి సులువుగా రూ.33 లక్షల 76 వేలు రుణం పొందినట్లు సీఐ వివరించారు. పత్రాలు అనుమానాస్పదంగా ఉండటంతో బ్యాంకు మేనేజర్ స్థానిక తహశీల్దార్ డీవీఎస్ యల్లారావుతో తనిఖీ చేయించగా అవి నకిలీవని బయటపడిందని తెలిపారు.
దీంతో గత నెల 31న 40 మంది రైతులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఇటీవల నలుగురు రైతులను అరెస్టు చేసి, వారినుంచి సేకరించిన సమాచారం ప్రకారం నకిలీ పత్రాల తయారీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన జిరాక్స్ మిషన్, స్కానర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్‌లను అలంకార్ స్టూడియోలో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో 36 మంది రైతులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు.
మొవ్వ, అవనిగడ్డ నుంచి పత్రాలు..
నిందితులు అవనిగడ్డ, మొవ్వ తదితర మీసేవా కేంద్రాల నుంచి 13 ఒరిజనల్ ఖాళీ పత్రాలు సంపాదించి వాటిని జిరాక్స్ తీసి నకిలీకి పాల్పడ్డారని సీఐ తెలిపారు. వీటిని ఉపయోగించుకొని రైతులు ఒక్కొక్కరు రూ.12 వేల నుంచి 90 వేల వరకు రుణాలు పొందినట్లు చెప్పారు. వారి నుంచి నిందితులు రూ.2 వేల నుంచి 10 వేల చొప్పున కమీషన్ రూపంలో పొందారని తెలిపారు. ఒరిజినల్ పత్రాలు అందించిన మీ సేవా కేంద్ర నిర్వాహకులు, అక్రమంగా రుణాలు పొందిన రైతులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎస్సై బి.శ్రీనివాసరావు, ఏఎస్సైలు బి.సంతోషరావు, నాగేంద్రుడు సమావేశంలో పాల్గొన్నారు.
నకిలీ పాస్‌పుస్తకాలు సూత్రధారుల అరెస్టు
Published Thu, Nov 14 2013 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement