మందగమనం నుంచి భారత్ బయటకు
న్యూఢిల్లీ: పాతికేళ్లలో ఎప్పుడూ చూడనంత తీవ్ర మందగమన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడుతోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణ సంస్థ- ఓఈసీడీ ఆర్థిక సర్వే ఒకటి తెలిపింది. అయితే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట 8 శాతం వృద్ధిని నమోదుచేసుకోడానికి తాజా ఆర్థిక సంస్కరణల అమలు కీలకమని కూడా ఆర్థిక సహకార, అభివృద్ధి సంఘం వ్యాఖ్యానించింది.
ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, బలహీనమైన పెట్టుబడుల నేపథ్యంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఐదు శాతం దిగువున నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) కాలంలో ఈ రేటు 5.7 శాతంగా నమోదయ్యింది.
వృద్ధి అంచనాల పెంపు
2015-16లో 6.6 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని సంస్థ తన తాజా అంచనాల్లో ప్రకటించింది. ఈ మేరకు గత అంచనాలను 5.7 శాతం నుంచి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.4 శాతం నమోదవుతుందని తెలిపింది. 2016-17 నాటికి 6.8 శాతానికి ఈ రేటు చేరుతుందని పేర్కొన్న ఓఈసీడీ, 8 శాతం వృద్ధికి చేరడానికి మరికొన్ని చర్యలను సూచించింది. ఇందులో సామాజిక, భౌతిక మౌలిక రంగానికి సబ్సిడీల వ్యయాన్ని బదలాయించడం, పన్ను సంస్కరణలు, మౌలిక రంగానికి అధిక నిధులు అందేలా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు, ఉపాధి కల్పనలో వ్యవస్థీకృత అడ్డంకుల తగ్గింపునకు కృషి... ఈ దిశలో కార్మిక సంస్కరణలు వంటి చర్యలు అవసరమని తెలిపింది.