Oecd Economic Survey
-
వృద్ధి రేటు 6.9 శాతం
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను మరో అంతర్జాతీయ సంస్థ ఓఈసీడీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.9 శాతంగా కొనసాగించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య’ (ఓఈసీడీ) సానుకూలంగా స్పందించింది. కాకపోతే ఆర్బీఐ అంచనా అయిన 7.2 శాతానికంటే ఓఈసీడీ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ‘‘వెలుపలి (అంతర్జాతీయ) డిమాండ్ మృదువుగా ఉండడం వల్లే భారత జీడీపీ వృద్ధి 2021–22లో ఉన్న 8.7 శాతం నుంచి, 2022–23లో సుమారు 7 శాతానికి తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నాం. ఇది 2023–24కు 5.75 శాతంగా ఉండొచ్చు. అయినా కానీ బలహీన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ మాత్రం వృద్ధి అన్నది వేగవంతమైనదే అవుతుంది’’అని ఓఈసీడీ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. జూన్ నాటి నివేదికలోనూ ఓఈసీడీ భారత వృద్ధి అంచనాలను 6.9 శాతంగా పెర్కొనడం గమనార్హం. యుద్ధం వల్లే సమస్యలు.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తన వృద్ధి జోరును కోల్పోయినట్టు ఓఈసీడీ పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ వృద్ధి రేటును కిందకు తోసేసిందని, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగేందుకు దారితీసిందని తన తాజా నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. ఈ ఏడాదికి అంతర్జాతీయ వృద్ధి రేటు 3 శాతంగా ఉంటుందని, 2023కు ఇది 2.2 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు వేసిన అంచనాలకు ఇది తక్కువ కావడం గమనించాలి. 2023 సంవత్సరానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందన్నది ఓఈసీడీ పూర్వపు అంచనా. చైనా ఆర్థిక వ్యవస్థ సైతం ప్రతికూలతలు చూస్తోందంటూ.. 2022 సంవత్సరానికి 3.2 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. 2020 కరోనా సంక్షోభ సంవత్సరాన్ని మినహాయిస్తే 1970 తర్వాత చైనాకు ఇది అత్యంత తక్కువ రేటు అవుతుందని పేర్కొంది. జీ20 దేశాల్లో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 8.2%గాను, 2023లో 6.6 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. భారత్కు సంబంధించి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. -
ప్రపంచ ఎకానమీకి వైరస్ ముప్పు!
ప్యారిస్: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కోవిడ్19 (కరోనా వైరస్) కారణంగా ఈ త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా మందగించనుంది. దాదాపు దశాబ్దకాలం నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత త్రైమాసికాలవారీగా చూస్తే వృద్ధి మందగించనుండటం ఇదే తొలిసారి. వైరస్ ప్రభావాలపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) రూపొందించిన ప్రత్యేక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2020లో ప్రపంచ దేశాల వృద్ధి రేటు సుమారు అరశాతం నెమ్మదించి 2.4 శాతానికి పరిమితం కావొచ్చని.. ఒకవేళ వైరస్ తీవ్రత పెరిగిన పక్షంలో ఇది 1.5 శాతానికి కూడా పడిపోవచ్చని ఓఈసీడీ పేర్కొంది. ‘అంతర్జాతీయంగా వృద్ధి అవకాశాలు అంతంతమాత్రంగాను, అనిశ్చితిలోనూ ఉన్నట్లు కనిపిస్తోంది’ అని వివరించింది. చివరిసారిగా 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు .. త్రైమాసికాలవారీగా వృద్ధి మందగించింది. పూర్తి సంవత్సరంపరంగా చూస్తే 2009లో వృద్ధి రేటు క్షీణించింది. గతంలో కన్నా తీవ్రం.. గతంలో వచ్చిన వైరస్ల కన్నా ప్రస్తుత కరోనా వైరస్ ప్రభావాలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని ఓఈసీడీ హెచ్చరించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో మరొకటి మరింతగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. ‘ ప్రపంచ ఉత్పత్తి, వాణిజ్యం, పర్యాటకం, కమోడిటీ మార్కెట్లలో చైనా పెద్ద పాత్ర పోషిస్తోంది. చైనాలో వైరస్ ధాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలకు సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వ్యాపార సంస్థల లాభాలకు గండి పడనుంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఉత్పత్తి పడిపోవడంతో ప్రధానంగా ఆసియాపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అలాగే చైనాపై ఆధారపడిన ఇతర దేశాల కంపెనీలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి’ అని ఓఈసీడీ పేర్కొంది. భారత్ అంచనాలు కట్..: కరోనా వైరస్ రిస్క్ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 5.1 శాతానికి కుదించినట్లు ఓఈసీడీ తెలిపింది. గతంలో ఇది 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక మార్కెట్లు, పర్యాటక రంగం, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు మొదలైన అంశాల వల్ల జీ20 దేశాల వృద్ధి రేటు మందగించవచ్చని తెలిపింది. వృద్ధి రేటును 4.9 శాతానికి తగ్గించిన ఫిచ్ న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు 2019–20 ఆర్థిక సంవత్సరానికి 5.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 4.9 శాతానికి తగ్గిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ సోమవారం ప్రకటించింది. దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, కరోనా వైరస్ కారణంగా సరఫరా పరంగా అడ్డంకులతో తయారీ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను కూడా గతంలో వేసిన 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది. ‘‘కోవిడ్ వైరస్ చైనాలో ప్రబలిన కారణంగా ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ సరఫరా చైన్లో ఏర్పడిన ఇబ్బందులు భారత ఎగుమతి ఆధారిత తయారీ రంగంపై ప్రభావం చూపిస్తుందన్న అంచనాలే తాజా సవరణకు నేపథ్యం’’అని ఫిచ్ వివరించింది. -
దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి: ఓఈసీడీ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక సంక్షోభం (2008–09) తర్వాత అత్యంత కనిష్టస్థాయిలో ఆర్థిక వృద్ధి ఈ ఏడాదిలోనే నమోదు కానుందని ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ’ (ఓఈసీడీ) తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి గతేడాది 3.6 శాతం నుంచి ఈ ఏడాది 2.9 శాతానికి పడిపోతుందని, 2020లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారత్లో 2019లో వృద్ధి రేటు 5.9 శాతంగా, 2020లో 6.3 శాతంగా ఉంటుందన్న అంచనాలకు వచ్చింది. 2018లో 6.8 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు అంతర్జాతీయ వృద్ధిని దశాబ్దంలోనే కనిష్ట స్థాయికి నెట్టిందని అభివర్ణించింది. -
మందగమనం నుంచి భారత్ బయటకు
న్యూఢిల్లీ: పాతికేళ్లలో ఎప్పుడూ చూడనంత తీవ్ర మందగమన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడుతోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణ సంస్థ- ఓఈసీడీ ఆర్థిక సర్వే ఒకటి తెలిపింది. అయితే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట 8 శాతం వృద్ధిని నమోదుచేసుకోడానికి తాజా ఆర్థిక సంస్కరణల అమలు కీలకమని కూడా ఆర్థిక సహకార, అభివృద్ధి సంఘం వ్యాఖ్యానించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, బలహీనమైన పెట్టుబడుల నేపథ్యంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఐదు శాతం దిగువున నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) కాలంలో ఈ రేటు 5.7 శాతంగా నమోదయ్యింది. వృద్ధి అంచనాల పెంపు 2015-16లో 6.6 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని సంస్థ తన తాజా అంచనాల్లో ప్రకటించింది. ఈ మేరకు గత అంచనాలను 5.7 శాతం నుంచి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.4 శాతం నమోదవుతుందని తెలిపింది. 2016-17 నాటికి 6.8 శాతానికి ఈ రేటు చేరుతుందని పేర్కొన్న ఓఈసీడీ, 8 శాతం వృద్ధికి చేరడానికి మరికొన్ని చర్యలను సూచించింది. ఇందులో సామాజిక, భౌతిక మౌలిక రంగానికి సబ్సిడీల వ్యయాన్ని బదలాయించడం, పన్ను సంస్కరణలు, మౌలిక రంగానికి అధిక నిధులు అందేలా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు, ఉపాధి కల్పనలో వ్యవస్థీకృత అడ్డంకుల తగ్గింపునకు కృషి... ఈ దిశలో కార్మిక సంస్కరణలు వంటి చర్యలు అవసరమని తెలిపింది.