న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను మరో అంతర్జాతీయ సంస్థ ఓఈసీడీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.9 శాతంగా కొనసాగించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య’ (ఓఈసీడీ) సానుకూలంగా స్పందించింది. కాకపోతే ఆర్‌బీఐ అంచనా అయిన 7.2 శాతానికంటే ఓఈసీడీ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ‘‘వెలుపలి (అంతర్జాతీయ) డిమాండ్ మృదువుగా ఉండడం వల్లే భారత జీడీపీ వృద్ధి 2021–22లో ఉన్న 8.7 శాతం నుంచి, 2022–23లో సుమారు 7 శాతానికి తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నాం. ఇది 2023–24కు 5.75 శాతంగా ఉండొచ్చు. అయినా కానీ బలహీన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ మాత్రం వృద్ధి అన్నది వేగవంతమైనదే అవుతుంది’’అని ఓఈసీడీ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. జూన్ నాటి నివేదికలోనూ ఓఈసీడీ భారత వృద్ధి అంచనాలను 6.9 శాతంగా పెర్కొనడం గమనార్హం.
యుద్ధం వల్లే సమస్యలు..
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తన వృద్ధి జోరును కోల్పోయినట్టు ఓఈసీడీ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ వృద్ధి రేటును కిందకు తోసేసిందని, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగేందుకు దారితీసిందని తన తాజా నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. ఈ ఏడాదికి అంతర్జాతీయ వృద్ధి రేటు 3 శాతంగా ఉంటుందని, 2023కు ఇది 2.2 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు వేసిన అంచనాలకు ఇది తక్కువ కావడం గమనించాలి. 2023 సంవత్సరానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందన్నది ఓఈసీడీ పూర్వపు అంచనా. చైనా ఆర్థిక వ్యవస్థ సైతం ప్రతికూలతలు చూస్తోందంటూ.. 2022 సంవత్సరానికి 3.2 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. 2020 కరోనా సంక్షోభ సంవత్సరాన్ని మినహాయిస్తే 1970 తర్వాత చైనాకు ఇది అత్యంత తక్కువ రేటు అవుతుందని పేర్కొంది. జీ20 దేశాల్లో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 8.2%గాను, 2023లో 6.6 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. భారత్‌కు సంబంధించి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని పేర్కొంది.
వృద్ధి రేటు 6.9 శాతం
Published Tue, Sep 27 2022 6:15 AM | Last Updated on Tue, Sep 27 2022 6:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment