India Gdp
-
తేడా స్పష్టంగా కనబడుతోంది కానీ...
‘తేడా సుస్పష్టం’ అంటూ మన ప్రధాని మోదీ పేరిట సోషల్ మీడియాలో ఒక గణాంక విన్యాసం జరుగుతోంది. దాని ప్రకారంగా మోదీ ‘విజయాలు’ అనే శీర్షిక కింద 2014 నాటికీ, అంటే మోదీ అధికారం చేపట్టిన నాటికీ, నేటికీ (2024) ఈ పదేళ్లలో దేశం ఎంతగా ‘పురోగమించిందో’ చెబుతూ కొన్ని గణాంకాలను విడుదల చేశారు. ఇక్కడి ప్రశ్న ఈ గణాంకాల వాస్తవికత గురించినది కాదు. కొన్ని విషయాలలో సందేహాలూ, అవాస్తవాలూ ఉన్నా వాటిల్లోని సింహభాగం నిజమే కావచ్చు. కాకుంటే ప్రశ్నల్లా 2014–2024 నడుమ కాలంలోని ఈ సోకాల్డ్ విజయాలలో మోదీ గారి పాలన ప్రభావం ఎంత? మోదీ ప్రధానిగా ఉన్నా లేకున్నా వీటిలోని కొన్ని వాటికవే జరిగి ఉండేవి కావా?ప్రధానిగా నరేంద్ర మోదీ పదేళ్ల పాలన ‘విజయ గాథ’ అంటూ ప్రచారం చేస్తున్న వాటిల్లో ఒక్కో గణాంకాన్ని పరిశీలిద్దాం. మొదటగా ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ (జీడీపీ) చూద్దాం. భారత జీడీపీ 2014 నాటికి 1.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. అది 2024 నాటికి 3.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అది నిజమే. రెట్టింపయ్యింది. ఇక్కడ గమనించ వలసింది, భారత జీడీపీ 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని చేరేందుకు 1947 నుంచీ 2010 వరకూ అంటే, 63 సంవత్సరాలు పట్టింది. అక్కడి నుంచి 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవడం కేవలం ఏడేళ్లు,అంటే 2017 నాటికి జరిగింది. ఆ స్థితి నుంచి 2020 నాటికి ఈ గణాంకం 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అంటే, కేవలం 2017–20 మధ్యన మూడేళ్లలో మరో లక్ష కోట్ల డాలర్ల మేర దేశ జీడీపీకి జతకూడింది. ఇటువంటి పరిణామం, అన్ని రంగాలలోనూ జరిగేదే. ఉదా హరణకు, సాంకేతిక పురోగతినే తీసుకుంటే 300 ఏళ్ల క్రితం ఆవిరి యంత్రాన్ని కనుగొన్నారు. తరువాతి 100 సంవత్సరాల కాలంలో మరింత సాంకేతిక పురోగతి జరిగింది. ఈ మొత్తం కాలంతో సరితూగగల సాంకేతిక పురోగమనం, ఆ తరువాతి 50 ఏళ్ల కాలంలోనే జరిగింది. దీనంతటినీ తలదన్ని తరువాతి 2–3 దశాబ్దాల కాలంలోనే, పెద్ద గంతులలో సాంకేతిక పరిజ్ఞానం పురోగమించింది. ప్రస్తుతం చూసుకుంటే ప్రతి 5 సంవత్సరాలు లేకుంటే అంతకంటే తక్కువ కాలంలో కూడా సాంకేతిక రంగంలో ఊహించనలవి కాని మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి, ఒక వస్తువు లేదా అంశం దాని ఆరంభ స్థానం నుంచి దూరంగా వెడుతున్న కొద్దీ దాని ప్రయాణ వేగం మరింతగా పుంజుకుంటుందన్నది సహజ సూత్రం. అదే సహజ సూత్రం ప్రకారంగా మన ఆర్థిక వ్యవస్థ కూడా ఎదిగిందన్నది పై గణాంకాలను చూస్తే అర్థం అవుతుంది. కాబట్టి, ఇదంతా అత్యంత సాధారణ పరిణామ క్రమం. దీనిలో మోదీ జోడించిన అదనపు శక్తి యుక్తులూ ఏమీ లేవన్నది నిజం! మించి, స్వయంగా మోదీ గారి వాగ్దానాల ప్రకారంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవలసివుంది. ఇప్పటికే 2024 అక్టోబర్ మాసంలో వున్నాం. అంటే, మరో 6 నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది. ఈలోగా, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక స్థాయిని చేరుకోగలమా? లేదనేదే జవాబు. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారమే, భారత్ 2027–28 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించగలదు. అదీ కథ! నిజానికి దేశ ఆర్థిక పురోగతికి మోదీ విధానాలైన పెద్ద నోట్ల రద్దు, అవకతవక జీఎస్టీ వినాశకరంగా పరిణమించాయి. ఈ అవాంతరాలు లేకుంటే సాధారణ స్థితిలోనే మన జీడీపీ బహుశా 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని చేరి ఉండేది!గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్నుఆ ప్రచారం ప్రకారం, రెండవ గణాంకం ప్రపంచంలో భారత దేశ ర్యాంకు గురించినది. 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో వున్న మన ర్యాంకు (జీడీపీ పరంగా) ప్రస్తుతం 5వ స్థానానికి చేరింది. దీనిలోనూ, అనేక తిరకాసులు ఉన్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ప్రపంచంలోని ధనిక దేశాల అన్నింటి స్థితిగతులూ దిగజారి పోతున్నాయి. ఫలితంగా, వాటి జీడీపీలు దిగజారుతున్నాయి. కాగా, ఈ ఆర్థిక సంక్షోభం భారత్‌ను అంతగా ప్రభావితం చేయలేదు. దేశంలోని జాతీయ బ్యాంకులు రుణాల మంజూరులో, పాశ్చాత్య దేశాల బ్యాంకుల్లా దురాశకు పోకుండా హేతుబద్ధంగా, క్రమబద్ధంగా వ్యవ హరించడం దీనికి ఒక ప్రధాన కారణం. అప్పటికే దేశంలో అమలులో వున్న జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజల కొనుగోలు శక్తిని కాపాడింది. మరి ఈ స్థితిలో జీడీపీ పరంగా మనం వున్న చోటునే మిగిలిపోయినా, లేకుంటే సాధారణ సరళ రేఖలో సాదాగానే ముందుకు పురోగమించినా ఇతర దేశాలతో పోలిస్తే మన ర్యాంకు మెరుగుపడి తీరుతుంది. ఇటువంటి స్థితి గురించే, రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ‘(మన దేశ ఆర్థిక స్థితి) గుడ్డి వాళ్ళ రాజ్యంలో, ఒంటి కన్ను రాజును పోలి వుంది’ అని వ్యాఖ్యానించారు.ఇక మూడవ గణాంకం, ఎగుమతులకు సంబంధించినది. దీని ప్రకారంగా 2014లో 200 బిలియన్ డాలర్లుగా ఉన్న మన ఎగుమతులు 2024 నాటికి 700 బిలియన్ డాలర్లను దాటాయి. ఇది నిజం. కానీ, పూర్తి నిజం కాదు. వాస్తవంలో, నేడు మన ఎగుమతుల పెరుగుదల వేగం దిగజారుతోంది. అనేక మాసాల పాటు, ఎగు మతుల గణాంకాలు పతనాన్ని సూచించాయి. తగిన స్థాయిలో ఎగుమతులు లేక దేశంలోని వస్త్రాలు, బంగారు ఆభరణాలు వంటి ప్రధాన ఉపాధి కల్పనా రంగాలలో ఉద్యోగాలు పోతున్నాయి. పారి శ్రామిక ఉత్పత్తి రంగాలకు ప్రోత్సాహం పేరిట 14 రంగాలకు అందిస్తోన్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కేవలం 2–3 రంగాల లోనే విజయవంతం అవుతున్నాయి. నిజానికి, ఒక దేశం తాలూకు వాణిజ్య సమతుల్యత లేదా లోటు అనేది అటు ఎగుమతులు, ఇటు దిగుమతులు రెండింటికీ సంబంధించిన అంశం. ఎగుమతి, దిగుమ తుల మధ్య సమతుల్యత లేకుంటే, అంటే, మన ఎగుమతుల కంటే, దిగుమతుల స్థాయే అధికంగా ఉంటే, అది వాణిజ్య లోటుకు దారి తీస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితి అదే. ఇక తరువాతి గణాంకం, దేశంలోని మెట్రో నగరాల గురించినది. 2014 లోని 5 మెట్రో నగరాల నుంచి నేడు మనం 20 మెట్రో నగరాల స్థాయికి ఎదిగామంటూ ఈ ప్రచారపత్రం చెబుతోంది. ఈ అంశంలో కూడా గమనించవలసింది, ప్రపంచ వ్యాప్తంగా నగరీకరణ నేడు వేగం పుంజుకుందనేది. మన దేశంలో 2023 నాటికి నగర జనాభా కేవలం 36.36% గానే ఉంది. ప్రపంచ స్థాయిలో చూస్తే 56% జనాభా నగర ప్రాంతాలలో ఉంది. బీజేపీ పాలనలో నగర ప్రాంత జనాభా పెరుగు దల వేగం బహుశా అధికంగా ఉంటే ఉండి ఉండవచ్చు. కానీ, ఈ పెరుగుదల వెనుక గ్రామీణ ప్రాంతాలనూ, రైతాంగాన్నీ నిర్లక్ష్యం చేయడం వంటి ప్రతికూల ధోరణులు కూడా దాగి ఉన్నాయి. గణాంకాల గారడీఇక తరువాతి గణాంకం, వివాదాస్పదమైన 2014లో కేవలం 40%గానే ఉన్న దేశంలోని విద్యుత్ ఉన్న గ్రామాల సంఖ్య 2024లో 95 శాతానికి పెరిగిందన్నది. దీనికి సంబంధించి ఒకే అంశాన్ని ప్రస్తావించదలిచాను. ద్రౌపదీ ముర్ము గ్రామానికి కూడా 2022లో ఆమె రాష్ట్ర పతి అయ్యేనాటికి సరైన విద్యుత్ వసతి లేదు. తరువాతి కీలక గణాంకం హైవేలకు సంబంధించినది. దీని ప్రకారంగా 2014లో 25,700 కిలోమీటర్ల పొడవున్న జాతీయ హైవేలు 2024 నాటికి 53,700 కిలో మీటర్లకు పెరిగాయి. మోదీ మంత్రివర్గంలో తన వంతు పాత్రను సాధ్యమైనంత సమర్థవంతంగా నిర్వహించిన, రోడ్లు రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ సమర్థతను అంతగా శంకించలేను.మరో గణాంకం యూనికార్న్‌లకు సంబంధించినది. అంటే, వంద కోట్ల డాలర్ల స్థాయిని చేరుకున్న అంకుర సంస్థల గురించినది. దేశంలో 2014లో ఒకే ఒక్క యూనికార్న్ ఉంటే, అది 2024 నాటికి 114కు పెరిగింది. మంచిదే. కానీ, దేశంలోని వేలాది స్టార్టప్‌లలో ఈ విజయవంతమైన యూనికార్న్‌లు కొద్దిపాటివే. నిజానికి పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు విఫలం అవుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, దేశంలోని అంకుర సంస్థలలో 90% మేర మొదటి ఐదేళ్ల కాలంలోనే మూతపడిపోతున్నాయి. స్థూలంగా మోదీ విజయగాథ ప్రచారం గురించి చెప్పాలంటే, ‘తేడా స్పష్టంగా’ కనబడుతూనే ఉంది. ఆ తేడా కనికట్టులో ఉంది. గణాంకాల గారడీలో ఉంది.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
రియల్ బూమ్!
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో రెండు దశాబ్దాల పాటు భారీ బూమ్‌ను చూడనుంది. 2021 చివరికి 0.2 ట్రిలియన్ డాలర్లు (రూ.16.6 లక్షల కోట్లు సుమారు)గా ఉన్న మార్కెట్.. 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 830 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని క్రెడాయ్, కొలియర్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఇళ్లకు బలమైన డిమాండ్ కొనసాగుతోందని, మందగమన సంకేతాలు లేవని క్రెడాయ్ స్పష్టం చేసింది. ‘‘2021 నాటికి 0.2 ట్రిలియన్ డాలర్లతో భారత జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగ వాటా 6–8 శాతం మధ్య ఉంది. గణనీయంగా పెరిగి 2031 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 2047 నాటికి 3 నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ఇది కనీస అంచనా మాత్రమే. వాస్తవానికి 5–7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఆశావహంగా చూస్తే 7–10 ట్రిలియన్ డాలర్లకు సైతం చేరుకునే అవకాశాలున్నాయి. అప్పటికి భారత జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 14–20 శాతం మధ్య ఉంటుంది’’ అని క్రెడాయ్, కొలియర్స్ ఇండియా నివేదిక తన అంచనాలను విడుదల చేసింది. అన్ని రియల్ ఎస్టేట్ విభాగాల్లోనూ స్థిరీకరణకు తోడు సంస్థల పాత్ర పెరుగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆఫీస్, నివాస రియల్ ఎస్టేట్‌తోపాటు, డేటా సెంటర్లు, వృద్ధుల ప్రత్యేక నివాసాల వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లో బలమైన వృద్ధిని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. చిన్న పట్టణాలకూ విస్తరణ.. రియల్ ఎస్టేట్ వృద్ధి పెద్ద పట్టణాలను దాటి చిన్న పట్టణాలకూ చేరుకుంటుందని క్రెడాయ్–కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ‘‘వేగవంతమైన పట్టణీకరణ, మధ్య వయసు జనాభా పెరుగుతుండడం, టెక్నాలజీ పరంగా పురోగతితో కొత్త తరం వృద్ధి, వైవిధ్య దశకంలోకి అడుగు పెట్టాం’’అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. 2047 నాటికి భారత జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే నివసించనున్నట్టు అంచనా వేశారు. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, రిటైల్ వసతులకు ఊహించనంత డిమాండ్ ఏర్పడనున్నట్టు తెలిపారు.జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ అవసరం రియల్టీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ ప్రయోజనం కలి్పంచాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ డిమాండ్ చేశారు. అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. చివరిగా 2017లో రూ.45 లక్షల వరకు ధరల్లోని వాటిని అందుబాటు ధరల ఇళ్లుగా పేర్కొనడం గమనార్హం. ఈ వృద్ధి నాన్‌స్టాప్!ఇళ్లకు డిమాండ్ బలంగా కొన సాగుతోందని, మందగమన సంకేతాల్లేవని క్రెడాయ్ స్పష్టం చే సింది. క్రెడాయ్ నాట్కాన్ సదస్సు సోమవారం ఢిల్లీలో మొదలైంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది. డిమాండ్‌కు తగ్గ ఇళ్ల సరఫరా అవసరం ఉందని క్రెడాయ్ తెలిపింది. ఏదైనా ఓ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు తగ్గడం అన్నది, కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం వల్లేనని పేర్కొంది. కరోనా విపత్తు తర్వాత ఇళ్లకు మొదలైన డిమాండ్ ఇప్పటికీ బలంగానే ఉన్నట్టు వివరించింది. డిమాండ్‌కు తగ్గ నిల్వలు లేవని ప్రెస్టీజ్ గ్రూప్ సీఎండీ, క్రెడాయ్ మాజీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ రజాక్ తెలిపారు. -
2024 వృద్ధి 6.8 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ 2024 క్యాలెండర్ ఇయర్ వృద్ధి అంచనాను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను 6.8 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ‘‘అంచనాల కంటే బలమైన’’ ఆర్థిక గణాంకాలు తమ తాజా అంచనా పెంపునకు కారణంగా పేర్కొంది. జీ20 దేశాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించింది. 2025లో దేశ వృద్ధి రేటును 6.4 శాతంగా రేటింగ్ దిగ్గజం పేర్కొంది. 2023లో దేశ ఎకానమీ ఊహించినదానికన్నా అధికంగా మంచి పురోగతిని సాధించినట్లు తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, పటిష్ట తయారీ కార్యకలాపాలు 2023లో భారత్ బలమైన వృద్ధి ఫలితాలకు దోహదపడ్డాయని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. -
ICRA: డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6 శాతం
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (2023 అక్టోబర్–డిసెంబర్) 6 శాతానికి తగ్గుతుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2023జూలై–సెపె్టంబర్)లో 7.6 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవసాయం, పరిశ్రమల పనితీరు స్తబ్దుగా ఉన్నట్టు తెలిపింది. పారిశ్రామిక రంగంలో వృద్ధి తగ్గుముఖం పట్టడానికి గతంలో బేస్ ప్రభావం అధికంగా ఉండడానికితోడు, అమ్మకాల పరిమాణం తగ్గడాన్ని ప్రస్తావించింది.. భారత ప్రభుత్వం, 25 రాష్ట్రాల వ్యయాలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 0.2 శాతం మేర తగ్గడం జీవీఏ వృద్ధిని వెనక్కి లాగడానికి కారణాల్లో ఒకటిగా పేర్కొంది. ‘‘పారిశ్రామిక రంగంలో అమ్మకాల పరిమాణం తగ్గడం, పెట్టుబడులపైనా కొంత స్తబ్దత, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం, రుతుపవనాలు అసాధారణం ఉండడం వంటివి జీడీపీ వృద్ధిని 2023–24లో మూడో త్రైమాసికంలో 6 శాతానికి తగ్గిస్తాయి’’అని వివరించింది. ఇక సేవల రంగానికి సంబంధించి జీవీఏ (స్థూల అదనపు విలువ) మాత్రం 2023–24లో రెండో త్రైమాసికంలో ఉన్న 5.8 శాతం నుంచి మూడో త్రైమాసికంలో 6.5 శాతానికి వృద్ధి చెందుతుందని ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. -
2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రగామిగా ఉన్న భారత్ 2024లో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందనున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అసోచామ్ ఈ రోజు (గురువారం) ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రైల్వేలు, విమానయానం, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీతో సహా నిర్మాణం, ఆతిథ్యం, మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో పెట్టుబడులు పెరగడానికి దారితీసే బలమైన వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో 2024లో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అసోచామ్ వెల్లడించింది. 2023 జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయం మాత్రమే కాకుండా తయారీ పరంగా బూస్టర్ షాట్లతో GDP ఊహించిన దానికంటే వేగంగా 7.6 శాతం వృద్ధి చెందడంతో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత పెరుగుతుందని, మెరుగైన అవకాశాలు లభిస్తాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ 'దీపక్ సూద్' అన్నారు. ఇదీ చదవండి: ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి? భారతదేశ GDP వృద్ధి జూలై-సెప్టెంబర్‌లో చైనా కంటే ఎక్కువైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆర్థిక, నిర్మాణ, హోటళ్లు, ఏవియేషన్, ఆటో, ఎలక్ట్రానిక్స్ వంటి తయారీ రంగాల ఆధ్వర్యంలో దేశీయ కంపెనీల పనితీరు మరింత మెరుగుపడనుందని అసోచామ్ సెక్రటరీ అభిప్రాయపడ్డారు. -
భారత్ వృద్ధి స్పీడ్ 6.4 శాతం
న్యూఢిల్లీ: భారత్ 2023–24 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ భారీగా 40 బేసిస్ పాయింట్లు (0.4%) పెంచింది. దీనితో ఈ అంచనా 6 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ పటిష్టంగా ఉన్నాయని తన తాజా ఎకనమిక్ అవుట్‌లుక్ ఫర్ ఆసియా పసిఫిక్ నివేదికలో పేర్కొంది. తమ అంచనాల అప్‌గ్రేడ్‌కు ఈ అంశాలు కారణాలుగా వివరించింది. అయితే 2024–25 అంచనాలను మాత్రం క్రితం 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్అండ్పీ పేర్కొంది. అధిక బేస్ ఎఫెక్ట్, గ్లోబల్ వృద్ధిపై బలహీన అంచనాలు, వడ్డీరేట్ల పెంపు ప్రతికూలతలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి తీరుపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఏడీబీ, ఫిచ్ అంచనాలకన్నా (6.3 శాతం) ఎస్అండ్పీ తాజా అంచనాలు కొంచెం అధికంగా ఉండడం గమనార్హం. 2023 మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7.2 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. కాగా, భారత్‌తో పాటు ఇండోనేíÙయా, మలే షియా, ఫిలిప్పైన్స్‌లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని ఎస్అండ్పీ నివేదిక పేర్కొంది. -
3.5 లక్షల కోట్ల డాలర్లు.. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డ్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లను దాటిందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో జీ–20 దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంచనాలనూ వ్యక్తం చేసింది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణ విషయంలో కొంత వెనుకబాటుకు గురయ్యే వీలుందని అంచనా వేసింది. సంస్కరణల అమల్లో వేగం లేకపోవడం, బ్యూరోక్రసీ నిర్ణయాల్లో నెమ్మది వంటి అంశాలు తమ ఈ అంచనాలకు కారణంగా పేర్కొంది. అమెరికా కేంద్రంగా పనిచేసే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనాల్లో ముఖ్యాంశాలు... బ్యూరోక్రసీ స్థాయిలో లైసెన్సులను పొందడంలో ఆలస్యం జరగవచ్చు. ఈ నేపథ్యంలో వ్యాపారాలు నెలకొల్పడం, ఇందుకు సంబంధించి ఆమోద ప్రక్రియలో నెమ్మది చోటుచేసుకునే వీలుంది. ప్రాజెక్టుల అమలూ ఆలస్యం కావచ్చు. ఆయా అంశాలు దేశానికి ఎఫ్‌డీఐ ఆకర్షణను కొంత తగ్గించవచ్చు. అదే సమయంలో ఈ విషయంలో ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఉంటుంది. పెద్ద సంఖ్యలో యువత, విద్యావంతులైన శ్రామికశక్తి, చిన్న కుటుంబాల పెరుగుదల, పట్టణీకరణ వంటి అంశాలు దేశంలో సిమెంట్, గృహ నిర్మాణం, కొత్త కార్ల కోసం డిమాండ్‌ను పెంచుతుంది. ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం.. ఉక్కు, సిమెంట్ రంగాలకు కలిసి వచ్చే అంశం. కాలుష్యం కట్టడికి, పునరుత్పాదకత రంగానికి దేశం ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనీయాంశం. ఇది పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తయారీ, మౌలిక రంగాలకు సంబంధించిన డిమాండ్ వచ్చే దశాబ్ద కాలంలో వార్షికంగా 3 నుంచి 12 శాతం మేర నమోదుకావచ్చు. అయతే 2030 నాటికి భారతదేశ సామర్థ్యం చైనా కంటే చాలా వెనుకబడే ఉంటుంది. ఎకానమీ పటిష్టంగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ, కీలక తయారీ, మౌలిక రంగాల్లో పెట్టుబడులు బలహీనంగానే కొనసాగే వీలుంది. ఎకానమీ సంస్కరణల విషయంలో పరిమితులు, విధాన నిర్ణయాల్లో అమలు వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు. భూసేకరణ నిర్ణయాల్లో ఆమోదాలు, నియంత్రణా పరమైన క్లియరెన్స్‌లు, లైసెన్సులు పొందడం, వ్యాపారాలను స్థాపించడం వంటి వాటి కోసం ఎంత సమయం అవసరమో ఖచ్చితంగా తెలియకపోవడం భారత్ విధాన పరమైన అంశాల్లో ప్రధాన లోపం. ఇది ప్రాజెక్టుల అమల్లో తీవ్ర జాప్యాలకు కారణం అవుతోంది. ఆయా అంశాలతో పాటు ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వేగంలేకపోవడం విదేశీ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది. అవినీతిని తగ్గించడానికి, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి, పన్నుల వసూళ్లు బేస్ పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అయితే వీటిలోనూ అవరోధాలు కనబడుతున్నాయి. కార్మిక చట్టాల్లో సౌలభ్యాన్ని పెంపొందించడం, వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను విస్తరించడం, తయారీ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంసహా గత కొన్ని సంవత్సరాలుగా పలు రంగాల పురోగతికి చేపట్టిన చర్యలు పటిష్టవంతంగా అమలు జరిగితే అది దేశ పటిష్ట అధిక ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా.. -
6.5–7.1 శాతం వృద్ధి సాధ్యమే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022– 23) భారత్ జీడీపీ 6.5 శాతం నుంచి 7.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయింట్ ఇండియా అంచనా వేసింది. ‘‘ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా అధిక స్థాయిల్లోనే ఉంటూ విధానకర్తలకు సవాలుగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆర్బీఐ 1.9 శాతం రెపో రేటు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట పరిమితికి పైనే 9 నెలలుగా కొనసాగుతోంది. డాలర్ బలపడడంతో దిగుమతుల బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఏడాది ముగింపు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మాంద్యం తలెత్తవచ్చు. దీంతో పరిస్థితులు ప్రతికూలంగా మారొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం భారత్ వృద్ధి కారకాలపై చూపించడం మొదలైంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తుకు సంబంధించి స్థిరమైన అంచనాలు వేయడం కష్టమే’’అని డెలాయిట్ ఇండియా తన నివేదికలో వివరించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారత్ జీడీపీ 5.5–6.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. సవాళ్లు ఉన్నాయ్.. ‘‘పండుగల సీజన్ వినియోగ రంగానికి తగినంత ప్రోత్సాహాన్నిస్తుందని అంచనా వేశాం. కానీ, ఇది ఇంకా స్థిరమైన పునరుద్ధరణను చూపించలేదు. పరిశ్రమలో, తయారీ రంగంలో రుణాల వృద్ధి చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. దీంతో ప్రైవేటు రంగంలో మూలధన పెట్టుబడులకు ఎంతో సానుకూల అవకాశాలున్నాయి. స్థిరమైన పెట్టుబడులకు సుస్థిరమైన డిమాండ్ అవసరం. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతున్న తరుణంలో ఎగుమతులు, ప్రభుత్వ తోడ్పాటు అన్నవి వృద్ధికి కావాల్సినంత మద్దతును ఇవ్వలేవు. ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు, కరెన్సీ విలువ క్షీణత రూపంలో వృద్ధి క్షీణించే రిస్క్‌లు సైతం ఉన్నాయి’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి మజుందార్ తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు 2023 మధ్య నాటికి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు డెలాయిట్ తెలిపింది. ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టి, కంపెనీల ముడి సరుకుల ధరలు సైతం దిగొస్తాయని, ఫలితంగా దేశీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు క్షీణిస్తాయని పేర్కొంది. -
ఐఎంఎఫ్ అంచనాలకు మించి భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలు 6.8 శాతం మించి నమోదవుతుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు తమ విశ్వాసానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ వరుసగా రెండోసారి తగ్గించింది. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను ఈ నెల మొదట్లో మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఈ నేపథ్యం అనంత నాగేశ్వరన్ సోమవారం చేసిన ఒక ప్రకటనలో తన తాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► భారతదేశ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బహుశా ఒక కీలక మైలురాయిని దాటింది. ఇది పటిష్ట ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతోపాటు అధిక వృద్ధికి కూడా దోహదపడే అంశం. ► ఆర్థిక, ద్రవ్య విధానలు సాధారణంగా ఒకదానికి మరోటి అనుసంధానమై ఉంటాయి. ఒకదానికొకటి సమతుల్యత కలిగి ఉంటాయి. ► దేశీయ రుణం– జీడీపీ నిష్పత్తి విషయంలో ఆందోళన లేదు. అసెట్ మానిటైజేషన్ (నిరర్ధక ఆస్తుల నుంచి ఆర్థిక ప్రయోజనం) ఈ నిష్పత్తి మరింత తగ్గుతుంది. క్రెడిట్ రేటింగ్ పెరుగుదల విషయంలోనూ ఇది సానుకూల అంశం. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, తయారీ, నిర్మాణంసహా అన్ని కీలక రంగాలూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి. -
వృద్ధి రేటు 6.9 శాతం
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను మరో అంతర్జాతీయ సంస్థ ఓఈసీడీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.9 శాతంగా కొనసాగించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య’ (ఓఈసీడీ) సానుకూలంగా స్పందించింది. కాకపోతే ఆర్బీఐ అంచనా అయిన 7.2 శాతానికంటే ఓఈసీడీ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ‘‘వెలుపలి (అంతర్జాతీయ) డిమాండ్ మృదువుగా ఉండడం వల్లే భారత జీడీపీ వృద్ధి 2021–22లో ఉన్న 8.7 శాతం నుంచి, 2022–23లో సుమారు 7 శాతానికి తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నాం. ఇది 2023–24కు 5.75 శాతంగా ఉండొచ్చు. అయినా కానీ బలహీన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ మాత్రం వృద్ధి అన్నది వేగవంతమైనదే అవుతుంది’’అని ఓఈసీడీ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. జూన్ నాటి నివేదికలోనూ ఓఈసీడీ భారత వృద్ధి అంచనాలను 6.9 శాతంగా పెర్కొనడం గమనార్హం. యుద్ధం వల్లే సమస్యలు.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తన వృద్ధి జోరును కోల్పోయినట్టు ఓఈసీడీ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ వృద్ధి రేటును కిందకు తోసేసిందని, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగేందుకు దారితీసిందని తన తాజా నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. ఈ ఏడాదికి అంతర్జాతీయ వృద్ధి రేటు 3 శాతంగా ఉంటుందని, 2023కు ఇది 2.2 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు వేసిన అంచనాలకు ఇది తక్కువ కావడం గమనించాలి. 2023 సంవత్సరానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందన్నది ఓఈసీడీ పూర్వపు అంచనా. చైనా ఆర్థిక వ్యవస్థ సైతం ప్రతికూలతలు చూస్తోందంటూ.. 2022 సంవత్సరానికి 3.2 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. 2020 కరోనా సంక్షోభ సంవత్సరాన్ని మినహాయిస్తే 1970 తర్వాత చైనాకు ఇది అత్యంత తక్కువ రేటు అవుతుందని పేర్కొంది. జీ20 దేశాల్లో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 8.2%గాను, 2023లో 6.6 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. భారత్‌కు సంబంధించి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. -
భారత్‌పై వరల్డ్ బ్యాంక్ కీలక అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని నిరోధించేందుకు భారత్ కీలక సంస్కరణలను కొనసాగించాలని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ విధ్వంసంతో దక్షిణాసియా తీవ్ర మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని, 2020లో ఈ ప్రాంత వృద్ధి 7.7 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. ఇక దక్షిణాసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మార్చితో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.6 శాతం క్షీణిస్తుందని పేర్కొంది. అయితే 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ తిరిగి పుంజుకుని 5.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 నియంత్రణలు 2022 నాటికి పూర్తిగా తొలగిపోతాయని అంచనా వేసింది. ఇక కోవిడ్-19 ప్రభావంతో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో భారత ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటాయని పేర్కొంది. చదవండి : కోవిడ్-19 : ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుంది..? భారత్‌లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా పరిస్థితి మరింత దిగజారిందని ప్రపంచ బ్యాంక్, దక్షిణాసియా ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమర్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడే కోవిడ్-19 విరుచుకుపడిందని అయితే సత్వర సమగ్ర చర్యలతో భారత్ ఈ విపత్తును అధిగమించవచ్చన్నారు. భారత్ దూరదృష్టితో కూడిన సంస్కరణలను చేపట్టిన ఫలితంగా పేదరికంపై సాధించిన విజయాలను సంరక్షించుకోగలుగుతోందని ప్రపంచ బ్యాంక్‌లో భారత్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ పేర్కొన్నారు. భారత్‌లో సామాజిక భద్రతా చట్టాలకు తీసుకువచ్చిన సవరణలతో గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో సాయం పొందని వర్గాలు ఇప్పుడు ఆయా పథకాలు, కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్నాయని ఆయన వెల్లడించారు. -
వృద్ధి 5.1 శాతం మించదు
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘‘పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు, బ్యాంకింగ్ రుణ వృద్ధి, పన్ను వసూళ్లు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక స్వల్పకాలిక సూచీలన్నీ బలహీన ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. అయితే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) 4.75 శాతం వృద్ధి రేటు నమోదయితే, చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) మాత్రం వృద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది’’ అని క్రిసిల్ నివేదిక పేర్కొంది. వస్తు, సేవల పన్ను, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్, దివాలా చట్టం వంటివి ఆర్థిక వ్యవస్థపై ఇంకా కొంత ప్రతికూలతను చూపుతున్నాయని, ఆయా అంశాల అమలు, సర్దుబాట్లలో బాలారిష్టాలు తొలగిపోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల బలహీనత వంటి పరిస్థితులను చూస్తుంటే డిమాండ్ పూర్తిగా కిందకు జారిన పరిస్థితులు స్పష్టమవుతున్నాయని వివరించింది. ఈ నివేదిక నేపథ్యం చూస్తే... ► ఆర్థిక సంవత్సరం మొత్తంలో కేవలం వృద్ధి 4.7 శాతంగానే ఉంటుందని నోమురా అంచనా. ► శుక్రవారం వెలువడిన క్యూ2 ఫలితాల్లో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. ► ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష గురువారం జరగనున్న నేపథ్యంలో క్రిసిల్ తాజా నివేదిక వెలువడింది. అక్టోబర్‌లో జరిగిన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ 2019–20 వృద్ధి రేటును 7 శాతం నుంచి 6.1 శాతానికి కుదించింది. శుక్రవారంనాటి గణాంకాల నేపథ్యంలో.. వృద్ధిపై ఆర్బీఐ భవిష్యత్ అంచనా చూడాల్సి ఉంది. సమీప భవిష్యత్తులో బలహీనమే: డీఅండ్‌బీ అమెరికా ఆర్థిక గణాంకాల ప్రచురణ సంస్థ– డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) మరో నివేదికను విడుదల చేస్తూ, సమీప భవిష్యత్తులో భారత్ ఆర్థిక వృద్ధి బలహీనంగానే ఉంటుందని విశ్లేషించింది. ఊహించినదానికన్నా మందగమనం కొంత ఎక్కువకాలమే కొనసాగే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది. ఇటీవల వచ్చిన వరదలు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను దెబ్బతీసిందని పేర్కొంది. నవంబర్‌లో ‘తయారీ’ కొంచెం బెటర్ : పీఎంఐ కాగా, తయారీ రంగం నవంబర్‌లో కొంత మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) సర్వే పేర్కొంది. సూచీ 51.2గా నమోదయిందని పేర్కొంది. అక్టోబర్‌లో ఈ సూచీ రెండేళ్ల కనిష్ట స్థాయి 50.6గా ఉంది. అయితే పీఎంఐ 50కు ఎగువన ఉన్నంతవరకూ దానిని వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సర్వే ప్రకారం.. నవంబర్‌లో కొన్ని కంపెనీలు కొత్త ఆర్డర్లు పొందగలిగితే, మరికొన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నాయి. -
ఈ ఏడాది భారత్ వృద్ధిరేటు 4.7 శాతమే..
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థికాభివృద్ధి (జీడీపీ) రేటు అంచనాల కోత విషయంలో ఇప్పుడు ఇక ప్రపంచబ్యాంక్ వంతు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) వృద్ధి రేటు కేవలం 4.7 శాతమేనని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను తమ తాజా ‘భారత్ వృద్ధి అప్డేట్’ నివేదిక కుదించినట్లు బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా వ్యవహారాలు) మార్టిన్ రామ్ ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.2 శాతం ఉంటుందన్నది బ్యాంక్ తాజా అంచనా అని కూడా వెల్లడించారు. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతం. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాల్లో అరశాతం కుదింపు జరిగిందన్నమాట. కారణం ఇదీ... 2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ 5 శాతం వృద్ధి సాధించింది. గడచిన దశాబ్ద కాలంలో వృద్ధి సగటు 8 శాతం. భారత్ వృద్ధి 2013-14లో బలహీనం కావడానికి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వ్యవస్థ (4.4 శాతం వృద్ధి) పేలవ పనితీరు కారణమని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. దీనికితోడు తదుపరి రెండు నెలల్లో అంటే జూలై- ఆగస్టు నెలల్లో బిజినెస్ సెంటిమెంట్‌లో పూర్తి ప్రతికూల ధోరణి నెలకొందని వివరించింది. కొన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలోనూ వృద్ధి రేటుపై అధిక వడ్డీరేట్ల భారం పడే అవకాశం ఉందని వివరించింది. ఇక మొత్తం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదల, అధిక స్థాయిల్లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్), ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- చేసే వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ఒత్తిడులు ఆర్థిక వ్యవస్థ సత్వర రికవరీకి అడ్డంకిగా మారుతున్నట్లు వరల్డ్ బ్యాంక్ సీనియర్ కంట్రీ ఎకనమిస్ట్ డీనిస్ మద్విదేవ్ పేర్కొన్నారు. సానుకూల అంశాలు... ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో భారత్ ఆర్థిక వ్యవస్థకు కొంత కలిసి వచ్చే అంశాలను ప్రపంచబ్యాంక్ నివేదిక వివరించింది. కోర్ గ్రూప్ ద్రవ్యోల్బణం (ఆహార వస్తువులు, ఇంధనం లైట్ విభాగం మినహా మిగిలిన విభాగాల టోకు ధరల సూచీ- ప్రధానంగా తయారీ రంగం) దిగిరావడం, వ్యవసాయ రంగంలో భారీ దిగుబడులు, రూపాయి బలహీనత ద్వారా ఎగుమతుల విభాగంలో లభించే ప్రయోజనాలు, విదేశీ కరెన్సీలలో రూపాయి మారకపు విలువ స్థిరత్వం వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. సాగు ప్రాంతం 5 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో వృద్ధి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2012-13లో ఈ రంగం వృద్ధి 1.9 శాతం అయితే, 2013-14లో ఈ రేటు 3.4 శాతానికి చేరే అవకాశం ఉందని రామ్ వివరించారు. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్లేషించారు. పారిశ్రామిక రంగం కొంత మెరుగుపడ్డంతోపాటు, ఎగుమతుల పెరుగుదల, కొత్త ప్రాజెక్టుల అమలు వంటి అంశాలు పరిస్థితులను మెరుగుపరచవచ్చని వివరించారు. గడచిన కొన్ని వారాలుగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతోందని సైతం పేర్కొన్నారు. సంస్కరణల విషయంలోనూ ఇదే సానుకూల ధోరణి ఉందన్నారు. డీబీఎస్ ఇండియా అంచనా 5 శాతంఙఞ్చటకాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు దాదాపు ఐదు శాతంగా ఉంటుందని డీబీఎస్ ఇండియా తన తాజా నివేదికలో అంచనా వేసింది. 3.8 శాతం-5 శాతం శ్రేణిలో ఈ రేటు ఉంటుందన్నది తమ అంచనా అని సంస్థ జీఎం, సీఈఓ సంజీవ్ భాసిన్ పేర్కొన్నారు. మందగమనం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని పేర్కొంటూ, అందువల్ల వృద్ధిపై తక్కువ శ్రేణిలో ఖచ్చితమైన అంచనాలను చెప్పడం కూడా కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. -
భారత్ వృద్ధి అంచనాలకు ఐఎంఎఫ్ భారీ కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి 2013లో కేవలం 3.75 శాతమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. క్రితం అంచనాలు (ఏప్రిల్‌లో) 5.7 శాతం నుంచీ ఐఎంఎఫ్ ఈ మేరకు కుదించింది. బలహీన డిమాండ్, తయారీ, సేవల రంగాల పేలవ పనితీరు అంచనాల కోతకు కారణమని తన తాజా వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ నివేదికలో సంస్థ మంగళవారం పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి కఠిన ద్రవ్య విధానం అనుసరించాల్సి రావాల్సిన దేశాల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ విశ్లేషించింది. ఈ పరిస్థితి వల్ల డిమాండ్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది 5 శాతం కాగా వచ్చే ఏడాది అంటే 2014లో వృద్ధిరేటు అంచనాను సైతం ఇంతక్రితం 6.2 శాతం నుంచి 5 శాతానికి కుదించింది. సరఫరాల సమస్య కొంత కుదుటపడ్డం, ఎగుమతులు మెరుగుపడ్డం వల్ల 2013కన్నా 2014లో వృద్ధి కొంత మెరుగుపడవచ్చని (3.75 శాతం నుంచి 5 శాతానికి) వివరించింది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ నివేదిక విడుదలయ్యింది. -
నేడు వాషింగ్టన్కు చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం మంగళవారం వాషింగ్టన్ బయలుదేరి వెళుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో పాల్గొనడం ఈ అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, కోటా సంస్కరణల వంటి అంశాలపై ఈ సమావేశాలు చర్చించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 16న చిదంబరం భారత్‌కు తిరిగి వస్తారు. 11వ తేదీ నుంచీ 13వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరిగే అగ్రస్థాయి సంస్థల వార్షిక సమావేశాల్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారామ్సహా ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.