రియల్‌ బూమ్‌! | Indian real estate to grow to 10 trillion Dollers market by 2047 | Sakshi
Sakshi News home page

రియల్‌ బూమ్‌!

Published Tue, Sep 24 2024 5:38 AM | Last Updated on Tue, Sep 24 2024 8:02 AM

Indian real estate to grow to 10 trillion Dollers market by 2047

2047 నాటికి రియల్టీ మార్కెట్‌ @ రూ.830 లక్షల కోట్లు 

2021 చివరికి రూ.16.6 లక్షల కోట్లు

ఆర్థిక వృద్ధి, పట్టణీకరణతో డిమాండ్‌

క్రెడాయ్, కొలియర్స్‌ ఇండియా నివేదిక  

న్యూఢిల్లీ: దేశ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మరో రెండు దశాబ్దాల పాటు భారీ బూమ్‌ను చూడనుంది. 2021 చివరికి 0.2 ట్రిలియన్‌ డాలర్లు (రూ.16.6 లక్షల కోట్లు సుమారు)గా ఉన్న మార్కెట్‌.. 2047 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ. 830 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని క్రెడాయ్, కొలియర్స్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఇళ్లకు బలమైన డిమాండ్‌ కొనసాగుతోందని, మందగమన సంకేతాలు లేవని క్రెడాయ్‌ స్పష్టం చేసింది. 

‘‘2021 నాటికి 0.2 ట్రిలియన్‌ డాలర్లతో భారత జీడీపీలో రియల్‌ ఎస్టేట్‌ రంగ వాటా 6–8 శాతం మధ్య ఉంది. గణనీయంగా పెరిగి 2031 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. 2047 నాటికి 3 నుంచి 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చు. ఇది కనీస అంచనా మాత్రమే. వాస్తవానికి 5–7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. ఆశావహంగా చూస్తే 7–10 ట్రిలియన్‌ డాలర్లకు సైతం చేరుకునే అవకాశాలున్నాయి.

 అప్పటికి భారత జీడీపీలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా 14–20 శాతం మధ్య ఉంటుంది’’ అని క్రెడాయ్, కొలియర్స్‌ ఇండియా నివేదిక తన అంచనాలను విడుదల చేసింది. అన్ని రియల్‌ ఎస్టేట్‌ విభాగాల్లోనూ స్థిరీకరణకు తోడు సంస్థల పాత్ర పెరుగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆఫీస్, నివాస రియల్‌ ఎస్టేట్‌తోపాటు, డేటా సెంటర్లు, వృద్ధుల ప్రత్యేక నివాసాల వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లో బలమైన వృద్ధిని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. 

చిన్న పట్టణాలకూ విస్తరణ..  
రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి పెద్ద పట్టణాలను దాటి చిన్న పట్టణాలకూ చేరుకుంటుందని క్రెడాయ్‌–కొలియర్స్‌ ఇండియా నివేదిక తెలిపింది. ‘‘వేగవంతమైన పట్టణీకరణ, మధ్య వయసు జనాభా పెరుగుతుండడం, టెక్నాలజీ పరంగా పురోగతితో కొత్త తరం వృద్ధి, వైవిధ్య దశకంలోకి అడుగు పెట్టాం’’అని క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ తెలిపారు. 2047 నాటికి భారత జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే నివసించనున్నట్టు అంచనా వేశారు. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, రిటైల్‌ వసతులకు ఊహించనంత డిమాండ్‌ ఏర్పడనున్నట్టు తెలిపారు.

జీఎస్‌టీ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ అవసరం 
రియల్టీ రంగానికి జీఎస్‌టీ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ ప్రయోజనం కలి్పంచాలని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ డిమాండ్‌ చేశారు. అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. చివరిగా 2017లో రూ.45 లక్షల వరకు ధరల్లోని వాటిని అందుబాటు ధరల ఇళ్లుగా పేర్కొనడం గమనార్హం.   

ఈ వృద్ధి నాన్‌స్టాప్‌!
ఇళ్లకు డిమాండ్‌ బలంగా కొన సాగుతోందని, మందగమన సంకేతాల్లేవని క్రెడాయ్‌ స్పష్టం చే సింది. క్రెడాయ్‌ నాట్కాన్‌ సదస్సు సోమవారం ఢిల్లీలో మొదలైంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది. డిమాండ్‌కు తగ్గ ఇళ్ల సరఫరా అవసరం ఉందని   క్రెడాయ్‌ తెలిపింది. ఏదైనా ఓ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు తగ్గడం అన్నది, కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం వల్లేనని పేర్కొంది. కరోనా విపత్తు తర్వాత ఇళ్లకు మొదలైన డిమాండ్‌ ఇప్పటికీ బలంగానే ఉన్నట్టు వివరించింది. డిమాండ్‌కు తగ్గ నిల్వలు లేవని ప్రెస్టీజ్‌ గ్రూప్‌ సీఎండీ, క్రెడాయ్‌ మాజీ ప్రెసిడెంట్‌ ఇర్ఫాన్‌ రజాక్‌  తెలిపారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement